శ్రీ మద్భగవద్గీత - 23 - అచ్చంగా తెలుగు
శ్రీ మద్భగవద్గీత - 23
9 వ అధ్యాయం - రాజ విద్యా రాజ గుహ్య యోగము
                                                                             రెడ్లం రాజగోపాలరావు

ప్రకృతిం స్వామవష్టభ్యవిసృజామి పునః పునః
భూతగ్రామమిమంకృత్స్నమవశం ప్రకృతేర్వ శాత్
- 8 వ శ్లోకం

మాయకు ఆధీనమైయుండుట వలన అస్వతంత్రమైనట్టి ఈ సమస్త ప్రాణి సముదాయమును మరల మరల సృష్టించుచున్నాను. జీవుడు ప్రకృతికివశమైనవాడు. దేవుడు ప్రకృతి(మాయను) స్వాధీనపరుచుకున్నవాడు. ఎంతవరకు కర్మయుండునో , వాసనలుండునో అంతవరకు జన్మతప్పదు. కనుక అజ్ఞానవసులై న జీవులను మరల మరల సృష్టించుచున్నానని భగవానుడు పలుకుచున్నాడు. ఈ జనన మరణరూప మాయాబంధమును తొలగించుకొనదలచినవారు పరమాత్మను పూర్ణశరణాగతి నొంది ఆశ్రయించి ప్రకృతిని, మనస్సును జయించవలెను. బంధవిముక్తికిదియేయుపాయము. అధ్యాత్మజ్ఞానము సంపాదించి పరమాత్మయొక్క అనుగ్రహమును పొంది, మాయను జయించుట ద్వారా జనులు సంసారబంధ విముక్తిని పొందవలసియున్నారు.
రంగుల రాట్నముపై ఎక్కిన మనుజులు వివశులై తిరుగులాగున, మాయాచక్రమధిష్టించిన జీవులు ప్రకృతికి వశులై అస్వతంత్రులై సంసారమున తిరుగాడుచున్నారు. రంగులరాట్నమునాపవలెననిన, దానిని త్రిప్పువానినాశ్రయించవలెను. అట్లే మాయాచక్రమును త్రిప్పు పరమాత్మనాశ్రయించినచో జీవులకు ముక్తి లభించును.

సతతం కీర్తయన్తోమాంయతన్తశ్చదృఢవ్రతాః
నమస్యన్తశ్చమాంభక్త్యానిత్యయుక్తా ఉపాసతే
- 14 వ శ్లోకం

మనన శీలురగు సాధకులు పరమాత్మను అనన్య మనస్సుతో వింతురనిపై శ్లోకమున చెప్పబడినది.సర్వకాల సర్వావస్తలయందునూ వారు భగవంతుని స్మరించుచుందురు కీర్తించుచుందురు. సతతమ్ అని చెప్పినందువలన ఏదియో ఒక సమయమున కాదనియు నిరంతరము కీర్తించుచుందురనియుదెలియు చున్నది.
వారు భగవత్ప్రాప్తికై సదాప్రయత్నించుచుందురు. ఇంద్రియ నిగ్రహాదులను అభ్యసించుచుందురు. ప్రయత్నములేనిదే ప్రాపంచిక వస్తువులే సిద్ధింపకయుండ ఇక దైవవస్తువుకై వేరుగా చెప్పవలెనా ? వారు చేయునది సామాన్యప్రయత్నముకాదు దృఢవ్రతమునవలంబించి గొప్పపట్టుదలతో పరమార్ధ సాధనమునుగావింతురు.
బహుజన్మార్జిత పాపవాసనలతో మలిన సంస్కారములతో గూడి మదించియున్న మనస్సును లొంగదీయవలెననిన సాధకుడు కొన్ని వ్రతములను తప్పక శీలించవలసియుండును. ఉపవాసవ్రతము, మౌనవ్రతము, జపవ్రతము, ధ్యానవ్రతము, బ్రహ్మచర్యవ్రతము మొదలుగునవి. దుర్భలులై ఆ వ్రతములను మధ్య మధ్య భంగమొనర్చరాదు. వ్రతములందు నియమములందు, పరమార్థనిష్టయందు ఇట్టి దృఢత్వములేనందువల్లనే అనేకులు ఈ మార్గమున ప్రవేశించియు, బలవత్తరమగుమాయచే పరాజితులై వెనకకు మరలిపోవుచున్నారు. మాయ భయంకర శత్రువు. అది సామాన్యాయుధములకులొంగదు. ఈ శరీరమెప్పడు రాలిపోవునో కావున దృఢవ్రతముయను దివ్యాస్త్రముచే దానినోడించవలెను. వారు చేయువందనముగాని, ధ్యానముగాని, పూజగాని, నిర్మల భక్తితోగూడియుండునని తెలియుచున్నది. భగవంతుని ధ్యానించువారు పెక్కురుండవచ్చును గాని భక్తితో ధ్యానించువారు చాలా అరుదు. నిరంతరదైవ స్మరణము, దృఢవ్రతత్వము భక్తితో కూడిన నిరంతర ధ్యానము భగవత్సాక్షారమునకు మార్గములని ఈ శ్లోకము ద్వారా తెలియుచున్నది. ముముక్షువులట్టియాచరణణు శీలించి దైవీ ప్రకృతి గలవారై ప్రయత్నించినచో బ్రహ్మసాయుజ్యమును శీఘ్రముగా పొందగలరు.

జ్ఞానయజ్ఞేన చాప్యన్యేయజన్తోమాముపాసతే
ఏకత్వేనపృధక్వేన బహుదా విశ్వతో ముఖమ్
- 15 వ శ్లోకం

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేమి బిగియ పట్టవలము
పట్టు విడుట కన్న పడిచచ్చుటామేలు

నదులన్నియు ఏ విధముగా ప్రవహించిననూ చివరకు సముద్రమున సంగమించవలసినదే అట్లే ఆధ్యాత్మ మార్గమున భిన్న భిన్నరీతుల భగవంతుని సేవించిననూ గట్టిగా, దృఢముగా ప్రయత్నించినవారు తుట్టతుదకు ఆ భగవద్రూప లక్ష్యమునుచేరగలరు. లక్ష్యమందు ఏకాగ్రత, భక్తి తప్పకయుండవలెను. 
"బ్రహ్మ సత్యం, జగన్మిధ్యా జీవోబ్రహ్మైవనాపరః"బ్రహ్మ మొక్కటే సత్యము, దృశ్యజగత్తంతయులేనిది. జీవుడు వాస్తవముగ బ్రహ్మమేకాని అన్యుడు కాదు అను నిశ్చయము గలిగియుండుటయే జ్ఞానయజ్ఞమునాచరించుటయగును సర్వము(విశ్వమంతయు) ఒకే భగవత్స్వరూపమనియు, ఆ స్వరూపము తన ఆత్మకంటే అన్యముకాదనియు ప్రతివారును ఒకప్పుడు తెలిసికొనియే ముక్తి నొందవలసియుండును. ఇదియే జ్ఞానయజ్ఞము.

అనన్యాశ్చింతయన్తోమాంయేజనాః పర్యుపాసతే
తేషాంనిత్యాభియుక్తానాం యోగక్షేమంవహామ్యహమ్
- 22 వ శ్లోకం
ఈ శ్లోకము గీతలో చాలా ముఖ్యమైనది.
బాహ్యచింతలలో మనస్సునుజేరనీయక భగవంతుని చింతనలోనే సర్వకాల సర్వావస్థలయందు గడుపుచున్న భక్తునియోగక్షేమములను భగవానుడే స్వయముగా చూచుచున్నాడు. తమప్రియభక్తులయెడ భగవానునికెంత ప్రేమయో చిన్ని సంఘటనల ద్వారా తెలిసికొందము. రాజసూయ యాగము జరుగు సందర్భమున పర్యవేక్షణ అంతయూ శ్రీ కృష్ణ పరమాత్మకే ధర్మరాజు అప్పగించినాడు. ఘటనా ఘటన సమర్ధుడగు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ అన్నిపనులు పురమాయించి, చివరగా యజ్ఞానికి హాజరైన భక్త జనులు తిని విడిచిన ఎంగిలి విస్తరాకులు తీసి శుభ్రపరచే కార్యాన్ని తాను తీసుకున్నాడు. ఈ సంఘటన ద్వారా భక్తులపై భగవంతునికున్న ప్రీతివాత్యల్యాన్ని మనం గమనించవచ్చు.
ఒక పర్యాయము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రియ భక్తుని కుమార్తెకు పుట్టపర్తిలో పెళ్ళి, బాబా వారే స్వయంగా పర్యవేక్షించి జరిపించినారు. ఆ సందర్భంలో అకస్మాత్తుగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. మరలా కొన్ని నిముషాల వ్యవధిలో విధ్యుత్తు పునరుద్దరించబడింది. మండు వేసవి కారణంగా అందరూ ఉక్కపోతతో ఇబ్బందిపడినారు. స్టేజిపైన వధూవరులు, అతిధులతో కలిసియున్న స్వామి, అంతరాయము తరువాత మరలా విధ్యుత్తు వచ్చుసరికి స్వామి స్వయంగా అతిధులకు విసురుతున్న సంఘటన పెళ్ళికి హాజరైన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిష్కామసేవ భగవంతునికి చాలా ప్రీతిపాత్రమైనది.
అనన్య భక్తుడుకావలెనే గాని వానిబాగోగులను నేనే చూచుకొందును, అని భగవానుడు సెలవిచ్చెను. అట్టివాడు ఏ కొండగుహయందున్ననూ, అరణ్యమధ్యమందున్ననూ భగవానుడు వాని యోగక్షేమములను చూచుచుందును. మహా భక్తుల యొక్క చరిత్రలు పరికించినచో ఈ శ్లోకమందలి సత్యము తెలియగలదు. ఇచట "యేజనాః" అని చెప్పినందువల్ల ఎవరైననూ సరే జాతి మత కుల బేధము లేక భగవద్క్రుపకు ప్రీతిపాత్రులు కాగలరని స్పష్టమగుచున్నది. దానికి తగ్గ అర్హత కలిగియుండవలెను. ఆంజనేయస్వామి మృగజాతిలో జన్మించిననూ అనన్య భక్తిచే భగవదనుగ్రహమునకు పాత్రుడాయెను. మానవులమైన మన విషయము వేరుగా చెప్పవలెనా ఏ కొద్ది సేపో చింతించక, నిరంతర చింతన, భక్తి కలిగియున్నవారి యోగక్షేమములు భగవంతుడు ఎల్లప్పుడు కాపాడుచుండును.

ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
09482013801

No comments:

Post a Comment

Pages