శ్రీరంగనాథ క్షేత్రాలు - 1 - అచ్చంగా తెలుగు

శ్రీరంగనాథ క్షేత్రాలు - 1

Share This
శ్రీరంగనాథ క్షేత్రాలు - 1
శ్రీరామభట్ల ఆదిత్య 

దక్షిణభారత దేశంలోని ప్రముఖ నదుల్లో కావేరి నది ఒకటి. కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి కొండల్లోని తలకావేరిలో పుట్టి ఎన్నో పుణ్యక్షేత్రాలలో ప్రవహించి తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోకి  ప్రవేశిస్తుంది కావేరి నది. అలా 765 కిలోమీటర్లు ప్రవహించిన నది చివరకు నాగపట్టణం జిల్లా పూంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
అయితే విశేషం ఏమిటంటే కావేరి నదిలో సహజసిద్ధంగా మూడు పెద్ద ద్వీపాలు ఏర్పడ్డాయి. ఆ మూడు ద్వీపాల్లో శ్రీమహావిష్ణువు శ్రీరంగనాథుని రూపంలో వెలిసాడు. ఈ మూడు క్షేత్రాలను ఆదిరంగ, మధ్యరంగ మరియు అంత్యరంగ క్షేత్రాలుగా పిలుస్తారు. అవే
1) ఆదిరంగ క్షేత్రం - కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్న శ్రీరంగపట్నం.
2) మధ్యరంగ క్షేత్రం - కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్న శివనసముద్ర.
3) అంత్యరంగ క్షేత్రం - తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం.

రంగనాథుడు పాలకడలిలోని శేషతల్పముపై పడుకొని రంగనాయకీ (లక్ష్మీ దేవి) సమేతంగా మనకు ఈ మూడు క్షేత్రాలలో కనిపిస్తాడు. భూదేవి మరియు నీళాదేవి సమేతుడై కూడా దర్శనమిస్తాడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీమహావిష్ణువు యొక్క రంగనాథ స్వరూపానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
రంగ అంటే బ్రహ్మాండం అని సృష్టి అని జగము అని లేదా వేదిక (మనుషులను పుట్టించి జీవితం అనే నాటకము ఆడించే వేదిక) అని కూడా చెప్పవచ్చు, ఆ వేదికకి, జగత్తుకు, బ్రహ్మాండానికి నాథుడే రంగనాథుడు. అలాగే 'సభాపతి'గా పిలువబడే నటరాజస్వామి కూడా. జగత్తు అనే సభకు నాయకుడు ఆయన. ఇక్కడ మనకు శివకేశవ, రంగనాథ నటరాజుల అభేదం కనిపిస్తుంది.
తమిళ సంప్రదాయంలో ఇవే కాకుండా మనకు పంచరంగ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందుకే రంగనాథుడికీ కావేరీనదికి అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆదిరంగ క్షేత్రమైన శ్రీరంగపట్నం మైసూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. హైదర్ ఆలీ, టప్పు సుల్తాన్ ఇంకా వొడయార్ రాజ వంశీయులచే కొలువబడింది ఈ ఆలయం.
ప్రకృతిఒడిలో సుందర వనాల నడుమ కావేరి నది శివనసముద్ర దగ్గర లోయలోకి దూకుతుంది, దీన్నే శివనసముద్ర జలపాతంగా పిలుస్తారు. ఈ ప్రాంతం ఎంతోమంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇంత అందమైన ప్రదేశంలో కొలువైనాడు మధ్యరంగడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరానికి ఉపనగరమైన శ్రీరంగంలో కావేరి, కొల్లిడం(కావేరి రెండో పాయ పేరు) నదుల మధ్యన ఏర్పడిన ద్వీపంలో పంచభూతలింగాలలో 'జల'లింగమైన జంబుకేశ్వరుడితో పాటుగా కొలువైనాడు అంత్యరంగడు.
ఈ మూడు ద్వీపాల్లో కొలువైన మూడు రంగనాథ క్షేత్రాల గురించి ముందు ముందు తెలుసుకుందాం...... సశేషం....

No comments:

Post a Comment

Pages