"నా ప్రేయసి ప్రశ్న"
వాసం నాగరాజు 

నువు నాలో భాగమని
నువు నా సర్వమని
నీ తెలివి అమోఘమని
నిన్నెంతో ప్రేమించాను

ఆకలేస్తుందంటే
నన్ను చీల్చి నా సారంతో
భోజనం చెసుకోమన్నాను

నిలువ నీడకావాలంటే
ప్రళయాలనైనా తట్టుకుని
నిలిచే భవనమైనాను

అవసరాలు పెరిగాయంటే
నా సంపదంతా వెతికి
తీసుకోమని
నిలువుదోపిడీ ఇచ్చుకున్నాను

పచ్చగా వెలిగే నాకు
కాంక్రీటు రంగుపులిమావు
సహజవర్ణాల నామేనికి
కృత్రిమ చిత్రాలు వేసావు

నేనేమీ అడగకుండా
విశవాయువులు
నామీద వదులుతున్నావు
కల్మశాలతో నన్ను కడుగుతున్నావు
పచ్చదనాల స్థానంలో
ప్లాస్టిక్ పరుస్తున్నావు
నీ ఇంటి మలినాలు
నాకు తినిపిస్తున్నావు

నిన్నెంత ప్రేమించాను
నన్ను బదులుగా ప్రేమిస్తావనేగా

కాని నువ్వేం చేస్తున్నావు?

***

1 comments:

  1. నా కవితను ప్రచురణకి స్వీకరించి నన్ను ప్రోత్సహించిన సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు

    ReplyDelete

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top