పిపాసి -పుస్తక సమీక్ష - అచ్చంగా తెలుగు

పిపాసి -పుస్తక సమీక్ష 
భావరాజు పద్మిని 

కొందరికి కళ అభ్యసిస్తే వస్తుంది. కాని కొందరికి స్వాభావికంగా అబ్బుతుంది. మంచి శైలి కొందరికి రాసినకొద్దీ వస్తుంది. కాని కొందరికి అలవోకగా అలవడుతుంది. ఇలా అలవడిన సహజ రచయత –కిరణ్ కుమార్ సత్యవోలు గారు.
వారు రాసిన నవల ‘పిపాసి’ నిజానికి రెండు నవలల సంకలనం. పిపాసి, వైకుంఠపాళి అనే రెండు నవలలు ఇందులో ఉన్నాయి. వీటిలో వైకుంఠపాళి నవల స్వాతి వారపత్రికలో లక్ష రూపాయిల బహుమతి పొందిన థ్రిల్లర్, రొమాంటిక్ నవల. ఈ రెండు నవలలు విభిన్న నేపధ్యాలు కల రచనలైనా, వీటిలో నవరసాలు తొణికిసలాడతాయి.
“నన్ను అను పడతాను. నా అక్షరాన్ని అనకు. నా ఆత్మ అక్షరం. నా అంతరాత్మ అక్షరం. నా ఊపిరి అక్షరం. నా గుండె చప్పుడు అక్షరం. నా ఆనందం అక్షరం. నా అలసట అక్షరం. నా ఆణువణువూ అక్షరం. నా జీవితం అక్షరం. ఆఖరికి నువ్వు తినే అన్నం కూడా ఆ అక్షరం నుంచి వచ్చినదే.” – అంటారు సినీకవి మహాదేవ పిపాసి నవలలో. ఈ మాటల్లో రచయతకు అక్షరాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రతిబింబిస్తుంది.
“జీతాలు బాగుంటాయన్న పేరుకే కాని జీవితాశయాలు నేరవేరవు నాన్నా”- గుండెల్లో గూడు కట్టుకున్న ఆశయాన్ని తెలియజేసే ఈ మాటలు కళాకారుడి తపనను తెలియజేస్తాయి.
“బూడిద కానిది ఏముంది చెప్పు లోకంలో”... కధలో, హాస్యంలో తత్వాన్ని మేళవించిన ఈ తీరు అద్భుతంగా అనిపిస్తుంది.
“ప్రతి మనిషి జీవితంలో కొన్ని ప్రదేశాలు, కొంతమంది వ్యక్తులు కనిపించకూడదని, వినిపించకూడదని కోరుకుంటాడు. కానీ జీవితం మాత్రం ఎప్పుడూ పుండు మీద కాకి పొడిచినట్టు ప్రతిసారి ఏదో రకంగా గతాన్ని గుర్తు చేసి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.” – ఎంత గొప్ప జీవిత సత్యమో కదా !
“భూమి పరిభ్రమణం చెందుతూ కాలాన్ని నెట్టేస్తుంది. కాని ఈ ప్రేమ ఆ కాలాన్ని వెనక్కి లాగేసి, మనసనే చెరసాలలో జీవిత ఖైదీని చేసి, బాధిస్తుంది.”
“నీవు నా ప్రేమను కోల్పోయావు, నేను నా జీవితాన్నే కోల్పోయాను.
కళ్ళతో చూస్తూ ఉండిపోవాలనుకున్నాను. కన్నీరులా జారిపోయావు.
సుతిమెత్తని నా హృదయాన్ని గాయపరచి నవ్వుకున్నావు. కాని, నీకు తెలియదు, నీ నవ్వే నాకు ఆనందమని.”
 “ఇద్దరు విడిపోవడం అంటే అర్ధం ఎవరికి వారు విడిగా దూరంగా బతకడం కాదు సార్, ఒకరి జ్ఞాపకాల్లో మరొకరు లేకుండా పోవడం. అప్పటివరకు దాన్ని విడిపోవడం అనరు.”
పరిపక్వమైన అనుభూతితో, పరిణితితో  రాసే మాటలివి. ఇటువంటి ఆణిముత్యాల లాంటి మాటలు ఈ నవలలో ప్రతి పేజీలో కనిపిస్తాయి. కళాకారుడి తృష్ణ, తపస్సు, వేదన, ఆనందం, అన్నీ పిపాసి నవలలో ప్రతిబింబిస్తాయి.
వైకుంఠపాళి నవల ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఆచారాల పేరుతో జరిగే అరాచకాలను తెలుపుతుంది. అడుగడుగునా ఉత్కంఠత రేపుతూ కొనసాగుతుంది. భయం చెలియలి కట్ట దాటితే... అది తెగింపు అవుతుంది. ఆ దశకు ఏదైనా వచ్చాకా ఇక ఆ భయానికి కారకులు సమసిపోవాల్సిందే. అణగదొక్కిన వారు అంతం కావలసిందే. ఇదే జరుగుతుంది ఈ నవలలో.
విభిన్న నేపధ్యాలతో సాగే ఈ రెండు నవలలు ‘పిపాసి’ పుస్తకంలో మీకు అందుబాటులో ఉన్నాయి.
పుస్తకం వెల:200
ప్రతులకు సంప్రదించండి: flipcart.com, kingie.com, vmrgbooks.com
Vasireddy publications – 9000528717.

***


No comments:

Post a Comment

Pages