శ్రీధరమాధురి - 52 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 52

Share This
శ్రీధరమాధురి - 52
(నేడు మతం పేరుతొ జరుగుతున్న వింత పోకడలపై పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )


నియంత్రణ కోసం మొదలుపెట్టిన నమ్మకాల వ్యవస్థ కంటే, వివిధ అంశాల పట్ల ఒకరి అనుభవంతో ఉదయించిన నమ్మకాల వ్యవస్థ మెరుగైనది.

మతం ఎన్నడూ భయాన్ని కలిగించదు.కొంతమంది మత పెద్దలని అనబడేవారు దేవుడి పేరుతో, మతం పేరుతొ ఎన్నో కధలను అల్లి, వారి స్వంత పద్ధతిలో భయాన్ని తయారు చేసారు. వారు నటిస్తున్నారు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. చెడు తన పనిలో తానుంది. మతం అంటే జీవితానికి ఆలంబనగా నిలిచేది. అది మీరు ఆనందమయ జీవితాన్ని గడుపుతూ దైవాన్ని చేరేందుకు దోహదపడుతుంది.

మతం ఎల్లప్పుడూ పవిత్రమైనదే. కాని కొంతమంది మత ప్రచారకులు, వారి స్వార్ధం కోసం, మీరు అపరాధ భావనకు గురయ్యేలా చేస్తారు.దైవమే కర్త. మీరు ఏ పనికీ కర్త కానే కాలేరు. మీరు తెలివితేటలతో దీవించబడితే, అవి ఆయన తెలివితేటలే. మీరు జ్ఞానంతో దీవించబడితే, అది ఆయన జ్ఞానమే. మీరు ధనవంతులైనా, బీదవారైనా, అహంకారపూరితులైనా, ప్రతీదీ ఆయనదే, వాటి యజమాని మీరు కాదు. ఆయన యొక్క పెద్ద ప్రణాళికలో మీరొక చిన్న భాగం కావాలని ఆయన కోరుకున్నారు. ఆయన పట్ల నమ్మకాన్ని కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని అచంచలమైన విశ్వాసంతో దీవించుగాక. అదే మార్గం, అదే అసలైన దారి.

నేడు మతం ఇంకా బ్రతికి ఉందంటే, ఆ మత సంరక్షకులు వడ్డించిన ఆశల వల్లనే. మతం అంటే భక్తి, ఇది పూర్తిగా భగవంతుడిపై ఉన్న బేషరతైన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మతం సమాజంలోని అన్ని వర్గాలను ఐక్యం చేసి, పేదలను గురించి, అవసరంలో ఉన్నవారిని గురించి శ్రద్ధ తీసుకోగల నిస్వార్ధమైన సమాజ స్థాపనకు కృషి చెయ్యాలి. ఆశలనేవి ఎక్కువగా స్వార్ధాన్ని రేపుతాయి, భవిష్యత్తును గురించి అన్ని విధాల ఆకాంక్షలను కలిగిస్తాయి. అందుకే మత సంరక్షకులు, విశ్వాసంలోనూ, ప్రార్ధనల్లోనూ, దైవంపట్ల, ఇతర ప్రాణుల పట్ల ప్రేమను కలిగించడంలోనూ ఎటువంటి షరతులూ ఉండకపోవడమనే విధానాన్ని తీసుకుని రావాలి. ఆశలు ఆకాంక్షలను రేపుతాయి, వీటిని గమనించుకోవాల్సిన అవసరం ఉంది.

అంతా మతంపై ప్రసంగాలు ఇస్తారు.
అంతా మతం గురించి మాట్లాడతారు.
కాని, ఈ మాట్లాడే వారందరూ...
నిజంగా మతం పట్ల భక్తిని కలిగి ఉండరు.

మతం అనేది మిమ్మల్ని అపరాధ భావనకు గురి చెయ్యకూడదు. ఒకవేళ అది మీకు అపరాధ భావనను కలిగిస్తే, అది మతమే కాదు. మతం అంటే దైవంపట్ల స్వచ్చమైన భక్తి. ఇది శాంతిని కలిగిస్తుంది.

మతం అన్నది మిమ్మల్ని అపరాధ భావనకు గురి చెయ్యదు.  మీరు అపరాధ భావనతో ఉంటే, అందులోంచి బయట పడేందుకు సహాయం చేస్తుంది. కొంతమంది మతాధిపతులని పిలవబడేవారు, మిమ్మల్ని అపరాధ భావనకు గురి చేస్తారు. వెంటనే మీకు ప్రమాద ఘంటికలు వినిపించాలి. అటువంటి దయ్యాలను విడనాడే ధైర్యాన్ని కలిగి ఉండండి, కాని మీ దైవాన్ని, మతాన్ని విడనాడకండి.

కొంతమంది మతాన్ని వాడి మీలో భయాన్ని కలిగిస్తారు. వారికి తలొగ్గకండి. భయపడకండి. అటువంటి వారికి తగినంత దూరంలో ఉండండి. మతం అనేది జీవితానికి ఊతమిస్తుంది, జీవితాన్ని ముగింపచెయ్యదు. మతం అనేది భవిష్యత్తు పట్ల ఆశను కలిగించడం మాత్రమే కాదు, ప్రస్తుతం కోసం కూడా పని చేస్తుంది.

మతం అనేది హృదయానికి సంబంధించినది, మెదడుకు దానితో ఏమీ పనిలేదు.  

దురదృష్టవశాత్తూ , నేడు మతానికి తర్కం, బుద్ధి అనే అంటువ్యాధులు పట్టుకున్నాయి. మతంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. హ హ హ... వీరు నిజంగా విదూషకులే.

మతమనే క్షేత్రంలో చాలా మంది మేధావులైన పండితులు దురహంకారంతో ఉండడం నిజంగా శోచనీయం. వారి మేధస్సును చూసి, వారు గర్విస్తూ ఉంటారు. అటువంటి పండితులకు తగినంత దూరంలో ఉండండి. వారు మతం పేరుతో మీ భావాలను దెబ్బ తియ్యగలరు. వేదాల గురించిన వారి భాష్యాలు, మీ సాధారణ జీవనంలో మిమ్మల్ని అపరాధ భావనకు గురయ్యే లక్ష్యంతో తయారు చేసినవి. అందుకే అప్రమత్తంగా ఉండండి.

మీ వ్యక్తిగతమైన కోరికలను, లేక లౌకికమైన వాంఛలను తీర్చలేదన్న నెపంతో మీరు మీ మతం పట్ల విశ్వాసాన్ని కోల్పోతున్నట్లయితే, మీరు దారి తప్పి, కపటపు చెడు శక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లే. మతం అనేది మీ లౌకికమైన కోరికలకు, చపలమైన ఆలోచనలకు అతీతమైనది. మతం అనేది అధికంగా దైవాన్ని, ఆయన చర్యలను పూర్తిగా అంగీకరించడం గురించి ఉంటుంది.మీరు కర్త కాదని, కర్తృత్వం అనేదొక భ్రమని అది గుర్తించేలా చేస్తుంది. దైవం అనేది అలౌకికమైన అంశం. ఆ అంశాన్ని మీరు లౌకికమైన కోరికలు, లక్ష్యాలతో ముడి పెడుతుంటే, మీరు దైవాన్ని ఒక ఆర్ధిక వ్యాపార వేత్తగా భావిస్తున్నట్లు. మీరు ప్రార్ధిస్తున్నారు కనుక, మీ కోరికలను ఆయన తీర్చాలని ఆశిస్తున్నారు. ఇది చాలా అనుచితమైనది. మీ స్వీయ మతం యొక్క సిద్ధాంతాలు, భావనల ద్వారా దైవం మీ ఆత్మకు సంతుష్టిని కలిగిస్తారు. 
***

No comments:

Post a Comment

Pages