సౌందర్యలహరి - 4 - అచ్చంగా తెలుగు
 సౌందర్యలహరి - 4
మంత్రాల పూర్ణచంద్రరావు 

వందే వందారు  మందారం  ఇందిరా నందకందలం
 అమందానంద  సందోహం  బంధురం  సింధూరాననం
  
శ్లో: 41. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం l
ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమజ్జిగ దిదమ్ ll

తా: అమ్మా ! నీ యొక్క మూలాధార చక్రమునందు సమయ అను పేరు గల కళతో లాస్య రూపమయిన తొమ్మిది రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనందభైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదను.దగ్ధమయిన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయు ఉద్దేశ్యముతో కలసిన ఈ ఆనందభైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును కదా ! 

శ్లో: 42.గతై ర్మాణిక్యతం గగన మణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః l
స నీడేయచ్ఛాయాచ్ఛురణ శబలం చంద్రశకలం
ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ll

అమ్మా! మంచు పర్వత రాజ పుత్రికా ! నవ రత్నముల తత్వమును పొందిన సూర్యులచే కూర్చబడిన చక్కగా రత్నములు పొదుగబడి బంగారముతో చేయబడిన నీ కిరీటమును ఏ సాధకుడు కీర్తించుచున్నాడో అతడు కిరీటము యొక్క కుదుళ్ళ యందు బిగింపబడిన రత్నముల యొక్క కాంతులతో చిత్ర విచిత్రముగా మెరయుచున్న చంద్ర రేఖను చూచి ఇంద్రుని ధనుస్సు అని ఎలా తలచకుండా ఉండును, తలచును కదా !


శ్లో:43.ధునోతు ధ్వాంతం న స్తులితదలితేందీవరవనం
ఘనస్నిగ్ధంశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివేl
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్మన్యే బలమథన వాటీ విటపినామ్ ll

తా: అమ్మా ! అప్పుడే వికసించిన నల్లకలువలెను,నల్లని మేఘముల వలె దట్టముగా  ఉండి సుకుమారమయి ఉన్న నీ కేశముల ముడి మా అజ్ఞానము అనబడు చీకటిని పారద్రోలును.వాటినుండి వెలువడు సువాసనలను పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా !

  
శ్లో: 44. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ
పరీవాహ స్రోతః సరణిరివ సీమంత సరణిఃl
వహంతీ సిందూరం ప్రబల కబరీ భార తిమిర
ద్విషాం బృందైర్బందీ కృతమివ నవీనార్కకిరణమ్ll

తా: అమ్మా ! నీ యొక్క ముఖ సొందర్యము అనబడే ప్రవాహమునుండి ప్రవహించు నీ పాపిట నున్న,  ఉదయపు సూర్యుని కిరణముల వలె వెలుగొందుచున్న సింధూరము మాకు యోగ క్షేమములు  కలిగించును కదా !

శ్లో: 45. అరాలైః స్వాభావ్యా దలికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిమ్ l
దరస్మేరే యస్మిన్ దశన రుచికింజల్క రుచిరే
సుగంధౌ మాద్యన్తి స్మరదహన చక్షుర్మధు లిహఃll

తా: అమ్మా ! వంకర స్వభావముకలిగి,నల్ల తుమ్మెదల కాంతి వంటి కాంతి కలిగిన ముంగురులచే చుట్టుకొన్న నీ వదనము తామరపూవును హేళన చేయు చున్నది. చిరునవ్వు కలిగిన నీ పంటి అందములతో నిండి,  సువాసన కలదియు అయిన ఆ ముఖమును మన్మధుని సంహరించిన ఆ శివుని నేత్రములు అనెడి తుమ్మెదలు మొహపడుచున్నవి కదా !


శ్లో: 46. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలమ్l
విపర్యాసన్యాసాదుభయ మపి సంభూయ చ మిధః
సుధాలేప స్యూతిః పరిణమతి రాకాహిమకరఃll

తా: అమ్మా ! లావణ్య మయిన వెన్నెల కాంతిచే నిర్మలమయిన నీ లలాటము యొక్క కొసలను రెండవ చంద్ర ఖండముగా నే భావింతును,ప్రధమ ఖండము నీ కిరీటమునందు ఉన్నది. రెండిటినీ కలిపి చూసిన అమృత పూత కలిగిన పౌర్ణమి నాటి  చంద్రునిగా  పరిగణించు చున్నవి . కదా !

శ్లో:47. బ్రువౌ భుగ్నే కించి ద్భువన భయ భంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచి భ్యాం ధృతగుణమ్l
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతరముమేll

తా: అమ్మా ! భువనమును భయముల నుండి పోగొట్టు ఓ పార్వతీ దేవీ,  కొంచెముగా వంగిన నీ కనుబొమ్మలు తుమ్మెదల గుంపు అల్లెత్రాడు వలె వరుసకట్టి  కుడిచేతితో పట్టుకుని ముంజేయి కప్పినట్టి రతీదేవి భర్త అయిన మన్మధుని విల్లుని తలపిస్తున్నాయి. విల్లు వలె భాసిస్తున్నాయి.  కదా !

శ్లో: 48. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయాl
తృతీయా తే దృష్టి ర్దరదలిత హేమాంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయో రంతర చరీమ్ll

తా: అమ్మా ! నీ యొక్క కుడి కన్ను సూర్య స్వరూపము కలది అగుట చేత పగలును, ఎడమ కన్ను చంద్రుని స్వరూపమగుట చేత రాత్రి ని కలిగించు చున్నవి. కొంచెముగా వికసించిన బంగారు కమలము వంటి నీ మూడవ కన్ను ఉదయ సంధ్య, సాయంత్ర సంధ్యలను కలుగ జేయు చున్నవి, కదా !

శ్లో: 49. విశాలా కల్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయైః
కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికాl
అవన్తీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతేll

తా:  అమ్మా ! నీ చూపు విశాలమయి విశాల అను పేరు గల నగరముగానూ.మంగళ కరమై కళ్యాణి అను నగరముగానూ,చక్కని కాంతి కలిగి నల్లకలువలతో పోల్చుటకు వీలుకాని దయి అయోధ్య అను నగరముగానూ,కరుణారస ధారలకు అనువై ధారా నగరముగానూ,  అతి మధురమై మధుర గానూ, లోపల వైశాల్యము కలదై భోగవతి నామముగల నగరముగానూ,కోరి వచ్చిన వారిని రక్షించు అవంతి అను నామము కలదై ఇలా అనేక నగరములతో కూడి విజయ నగరమై వర్తించు చున్నది కదా !

 శ్లో: 50. కవీనాం సందర్భస్త బక మకరం దైక రసికం
కటాక్షవ్యా క్షేప భ్రమర కలభౌ కర్ణయుగలమ్l
అముంచన్తౌ దృష్ట్యా తవ నవరసాస్వాదతర ళౌ
అసూయాసంసర్గా దళికనయనం కించి దరుణమ్ll

తా: అమ్మా ! కవీంద్రుల రచనల యందున్న రచనల యొక్క పూదేనెను ఆస్వాదించుటకు ఇష్టము కలిగి, కర్ణములను విడువక నవ రసాస్వాదమునందు ఆసక్తి కలిగి ఉన్న గండు తుమ్మెదల జంటను చూచి నీ ఫాల నేత్రము అసూయతో ఎర్రబడినది కదా!

శ్లో: 51. శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీl
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ
సఖీషుస్మేరా తేమయి జనని దృష్టిః సకరుణాll

తా: అమ్మా ! నీ చూపు పరమ శివుని యందు శృంగార రసముతో తడుపబడి, ఆయనకు ప్రేమ కలదిగా యుండెను.ఇతరుల దృష్టి వికారము యందు  ఏవగింపు కలదియు, సవతి అయిన గంగా దేవి యందు రోషముతో కూడి ఉన్నది. మన్మధుని దగ్ధము చేసిన ఫాల నేత్రమున ఆశ్చర్యము కలదియు,ఆయన ఆభరణములు అయిన పాముల యందు భయము కలదియు,ఎర్రని కలువల యందు  సొందర్య రసము కలిగి ఉన్నది.చెలికత్తెల యందు చిరు నవ్వు కలిగి హాస్యముగా ఉన్నది. నిన్ను స్తుతి చేయు నా వంటి భక్తుల యందు కరుణ రసము కలిగి ఉన్నది . కదా !  

శ్లో: 52. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాంభేత్తుశ్చిత్త ప్రశమరస విద్రావణఫలేI
ఇమేనేత్రే గోత్రాధర పతికులోత్తంసకలికే
తవాకర్ణా కృష్ణస్మర శరవిలాసం కలయతఃll

తా:అమ్మా! మంచు పర్వత రాజు అయిన హిమవంతుని వంశమునకు మకుటాయమైన తల్లీ , నా యొక్క కనులకు నీ కనులు చెవులను అంటి ఉండి  ఆ కను రెప్పల వెంట్రుకలు బాణములకు రెండు వైపులా కట్టబడు ఈకల వలె ఉండి పరమ శివుని నిరాశను పోగొట్టి శృంగార రసోద్పాదన  చేయునట్లుగా కనబడు చున్నవి. మరియు  చెవుల వరకు లాగబడి మన్మధ బాణముల యొక్క  సౌందర్యమును కలిగించు చున్నవి కదా !

శ్లో:53. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయమిద మీశానదయితేl
పునః స్రష్టుందేవాన్ ద్రుహిణ హరిరుద్రా నుపరతాన్
రజఃసత్త్వం భిభ్రత్తమ ఇతిగుణానాంత్రయమివll

తా: అమ్మా ! ఓ ఈశ్వరుని ప్రియురాలా ! నీ మూడు నేత్రములు అర్ధ వలయాకారముగా  సౌందర్యము కొఱకై తీర్చి దిద్దిన కాటుక  తెలుపు,ఎరుపు, నలుపు అను మూడు విభిన్న రంగులు గలదై నీ యందు లీనమైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను మరల ఈ బ్రహ్మాండమును తాకుటకు సత్వ రజస్తమో గుణములుగా ప్రకాశించు చున్నది కదా ! 

శ్లో: 54. పవిత్రీ కర్తుంనః పశుపతి పరాధీనహృదయే
దయా మిత్రైర్నేత్రె రరుణధవళ శ్యామరుచిభిఃl
నదః శోణోగంగా తపన తనయేతి ధ్రువమముం
త్రయాణాం తీర్థానా ముపనయసి సంభేదమనఘంll

తా: అమ్మా ! అజ్ఞానులయిన ప్రాణులను కాపాడు పరమ శివుని యందు మనస్సు కల ఓ పార్వతీ దేవీ ! మమ్ములను పునీతులుగా చేయుటకు కరుణా రసములును ఎరుపు నలుపు తెలుపు అను వర్ణములు కలిగిన శోణ భద్ర, తెల్లని గంగానది,నల్లని యమునా నది అను మూడు నదులను తెచ్చుచున్నావు. ఇది నిజము. కదా !

శ్లో: 55. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతిజగతీ
తవేత్యాహుః సంతోధరణి ధరరాజన్య తనయేl
త్వదున్మేషా జ్జాతం జగదిద మశేషం ప్రళయతః
పరిత్రాతుం శంకే పరిహృతని మేషా స్తవదృశఃll

తా: అమ్మా ! ఓ పర్వత రాజ పుత్రీ ! నీ కను రెప్పలు మూయుటవలన ఈ జగత్తు నాశనమును, తెరచుటవలన  ఉద్భవము జరుగును అని పెద్దలు చెపుదురు.  అందువలననే నీ కను రెప్పలు తెరచినప్పుడు ఉద్భవించిన ఈ జగత్తును కాపాడుటకు నీ కనులు నిర్నిమేషములయి ఉన్నవని తలచెదను .
(సశేషం )

No comments:

Post a Comment

Pages