శివం -39 - అచ్చంగా తెలుగు

శివం -39 
శివమ్మ కధ -14
రాజ కార్తీక్ 

(శివమ్మ కోరిక మేరకు పసి బాలుని వలె  మారిపోయాను నేను. అందరూ ఈ మధుర  ఘట్టం చూసి పులికించి పోతున్నారు. )

నేను ఆకాశవాణిగా ఇలా అన్నాను, "అమ్మ ! నువ్వు కోరుకున్నది ఇదేగా ..బిడ్డలు లేరని బాధ పడ్డావ్, నన్ను నీ బిడ్డలా చూసి ,కట్టిపడేసావ్, అమ్మ !నువ్వు నా మీద చూపించిన ప్రేమకి నిజ్జంగా నీకు నేను బిడ్డను అయ్యాను. నన్ను పసిబిడ్డలా సాకలని కదా నీ ఆశ ..." అన్నాను.
కాని మా అమ్మ అవి ఏవీ వినట్లేదు. తన చూపు ప్రేమ శ్రద్ద అంతా పసి రూపం లో ఉన్న నా మీద మాత్రమే !
విష్ణు దేవుడు "పసి బాలుడే కానీ, ఏమి ఈ బాలుడి ముగ్ధ మనోహర రూపం ?ఎంత ముద్దు వస్తున్నాడు ఈ బాలుడు? ఎంతటివారికైనా ముద్దాడాలి అనిపిస్తుంది ", అన్నాడు.
బ్రహ్మ దేవుడు "ఆహా ! ఏమి ఈ  ఆనందం. పుట్టుక లేని మహాదేవుడు ఏంటి ఈ ఇప్పుడీ పుట్టిన బాలుని వలె మారడమేంటి ?"అన్నాడు.
సరస్వతి, లక్ష్మి మాతలు "ఇటువంటి బాలుని కి తల్లి కావాలని ఏ తల్లికి మాత్రం ఉండదు ?"అన్నారు.
విష్ణు దేవుడు "అదీ సరే కానీ, ఈయన ఏంటి? బాలుడుగా  మారినా అవే  జటలు అదే వేషం , సోదరి పార్వతి ....." అడిగాడు సందేహంగా చూస్తూ.
లక్ష్మి మాత "శివాని దేవి, పసి శివుని చూసి ఇంకా మైమరుపు లో ఉంది. "అంది.
మా అమ్మ మాత్రం నన్ను తేరిపారా చూసుకుంటూనే ఉంది.
నంది "అమ్మ, ఒకసారి మహాదేవుడిని  నేను ఎత్తుకుంటాను " అనడిగాడు.
మా అమ్మ మాత్రం "నేను ఇవ్వను" అని అన్నట్లు చూస్తోంది.
కానీ మా అమ్మకి  నేను ఒక మహదేవుడనన్న స్పృహ  పోయింది. తను నన్ను ఒక సాధారణ బిడ్డ లాగా చూస్తోంది.
నేను ఉండి ఉండి ఒకసారి ఏడిచాను .....అంతే ..
శివమ్మ "ఏమైంది నాన్న ! ఎందుకు  ఏడుస్తున్నావ్."...అంటూ "చిన్నయ్య ఏడవకు మా బుజ్జి బంగారు తండ్రి కదా. నువ్వు అలా  ఏడిస్తే ఈ తల్లి మనసు ఏమి అయిపోతుంది ...నవ్వు కన్నా తండ్రివి " అంది ఓదారుస్తూ.
శివమ్మ తన పొత్తిళ్ళలో పైకి ఎత్తి, నన్ను (శిశువును) వింత సైగలతో ఆడుతుంది.
నేను వెంటనే ఏడుపు ఆపాను.
తను సైగ మల్లి చేయలేదు. నేను వెంటనే ఏడ్చాను.
మళ్ళీ హాస్యంగా సైగలు చెయ్యసాగింది. నేను నవ్వసాగింది.
నా  నవ్వు చూసి, మా అమ్మ ఎంతో ఆనందపడుతుంది. నేను ఎలా నవ్వుతున్నానంటే అందరూ చూసి ఒక పండగ చేసుకుంటున్నారు..
నేను బాలుని వలె ఉన్నా కదా. వచ్చీరాని  సైగలతో మా అమ్మ ని దగ్గరకు  రమ్మన్నాను.
మా అమ్మ తన మొహం నా దగ్గరకు తెచ్చి,  "వొంటి నాన్న "అంది.
నేను వెంటనే మా అమ్మ కు బుగ్గ మీద వచ్చి రాని ముద్దు పెట్టాను. అంతే
శివమ్మ "నా బంగారు తండ్రి, ఎప్పుడు నువ్విలా నవ్వుతూ ఉండాలి "అని ముద్దాడుతోంది.
విష్ణు దేవుడు,  బ్రహ్మ దేవుడు "ఎంత మంచి ముద్దు? పాయసం కన్నా ఈ ముద్దు ఇంకా బాగు౦టుంది. " అన్నారు.
మాతలు  అందరు "అత్యంత అపురూపమైన దృశ్యం. ఈ తల్లి పడుతున్న సంబరం మాకు ఏనాడూ కలుగుతుందో " అన్నారు.

విష్ణు దేవుడు చమత్కారంగా "మీ సంగతి ఏమో కానీ నేను మాత్రం అవతారాలు ఎత్తి కచితంగా ఇలాంటి అపురూపమైన అనుభవం పొoదుతాను", అన్నాడు.

మా అమ్మ నాతో ఆడుకుంటున్న సన్నివేశం మీరు చూడలేదు కాని, చూసి ఉంటె.."ఈ జన్మకి సరిపడా అనుభూతి పొందే వారు "
అక్కడ ఉన్న నంది, భ్రుంగి, నాగరాజు కూడా "మహాదేవుడు పాయసం పెట్టగా  తిన్నాం. మరి వారు శిశు రూపంలో ఉన్నారు కనుక, వారు పెట్టే ముద్దు కావాలి కదా" అన్నారు.
పార్వతి మాత " భక్తుల కోసం ఏమైనా చేస్తావ్  స్వామి "అంది.
ఉండి ఉండి మళ్ళీ ఎవరో గిల్లినట్టు ఏడ్చాను నేను.
విష్ణు, బ్రహ్మ  దేవులు, మాతలు అందరు "ఏమైంది ఏమైంది "అని కంగారుగా చూస్తున్నారు.    నంది. భ్రుంగి, నాగరాజు కూడా కంగారు పడ్డారు.
శివమ్మ "ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావ్ " అనడిగింది.
గుక్క పట్టి ఏడ్చాను ..బిగ్గరగా ఏడ్చాను ..
నా ఏడుపు చూసి అందరు దిగులు పడ్డారు. పార్వతి మాత ఐతే కన్నీరు పెట్టుకుంది.
ఏమైంది అని ఒకటే ఆందోళన అందరిలో.
(సశేషం)


No comments:

Post a Comment

Pages