ఊరే నా కుటుంబం - అచ్చంగా తెలుగు
ఊరే నా కుటుంబం
ప్రతాప సుబ్బారాయుడు 

రాత్రి పది గంటలు.
భయంకరమైన వేగంతో వెడుతున్న ట్రైన్ ఎక్కడా ఆగకుండా ఇలాగే వెళితే, రేపుదయానికల్లా సుధాకర్ ని కలుస్తాను. మళ్లీ రేపు సాయంత్రానికల్లా అక్కడ్నుంచి బయల్దేరాలి.
నా విషయానికి వస్తే, నా పేరు రాజనాథ్. వయసు రిటైర్మెంట్ కు ఇంకా ఆర్నెళ్లు. రిటైరయ్యక హాయైన జీవితం ఎలా గడపాలన్న ప్రణాళికలు వేసుకోవాల్సిన తరుణంలో, పనిచేస్తున్నకంపెనీ రెండేళ్ల నుంచి ఆర్థిక ఒడిదుడుకుల్లో అతలాకుతలమవుతోంది. నెల జీతాలు అందుకోవడం అపురూపమవుతున్న పరిస్థితుల్లో ఏం చేయలో దిక్కుతోచడం లేదు. మా ఆవిడకి దీర్ఘకాలిక అనారోగ్యం. డాక్టర్లకీ, మందులకీ నెలకింతని పెద్దమొత్తం కావాలి. సమస్యలు ఒక్కో వైపు నుంచి చెక్ చెబుతుంటే మా అమ్మాయికి రక్తకణాలు వృద్ధి చెందని బోన్ మారో వ్యాధి వచ్చింది. ఒక్కసారిగా నా జీవితాన్ని అమావాస్య చుట్టుముట్టినట్టనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మనిషనేవాడు ‘బాధ్యతల్నుంచి పారిపోవాలి, లేదా ఈ లోకం నుంచి నిష్క్రమించాలి’ అని ఆలోచిస్తాడు.  బాధ్యతల్నుంచి పారిపోలేను, ఎందుకంటే అవి మధుర బంధనాలు. తెంచుకోలేను. జీవితాన్నీ ముగించుకోలేను. ఇప్పుడు నేను ఊరెళుతున్నానంటే ఎవరినుంచో ఆర్థిక సహాయాన్ని అర్థించడానికనుకుంటే పొరబడ్డట్టే. కేవలం సుధాకర్ తో నాలుగు మాటలు మాట్లాడడానికి వెళుతున్నాను. అలా అని సుధాకర్ నాలుగు సాంత్వన మాటలు చెప్పి మనసును మైమరపించే స్వామీజీ కాదు. ఆర్థిక సహాయం చేసే తెలిసిన రాజకీయ నాయకుడు, మరో పెద్ద మనిషీ కాడు. కేవలం నా చిన్ననాటి స్నేహితుడు. ఊళ్లో ఉన్నంత కాలం ఎందుకో వాడినే గమనించే వాడిని. మాది ఉన్నత కుటుంబం. కష్టమన్నది తెలియదు. నేను కాలేజీ చదువు కోసం పట్నం వచ్చి, ఉద్యోగం సపాదించుకుని, పెళ్లి చేసుకుని పిల్ల చదువుతో రోజుల్ని ఇప్పటిదాకా చీకూ చింతా లేకుండా చాలా యాంత్రికంగా గడిపేశాను. 
అదేమిటోవాడి జీవితం  మొత్తం అల్లకల్లోల సముద్రంలో నావలా ఉండేది. వాడికొచ్చినన్ని సమస్యలు ఎవరికీ రావు. వాడి తండ్రి ఓ కౌలు రైతు. ఇల్లంతా ఏరోజుకారోజు అన్నట్టుగా ఉండేది. చిన్నప్పుడే వాడి తల్లి  చనిపోయింది. తండ్రి, తను చేసిన అప్పులు తీర్చడానికి మరో పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరంలోపే వ్యవసాయ క(న)ష్టాలకి కృంగి, కృశించి పురుగుల మందు  తాగి చనిపోయాడు. మారుతల్లి ఆస్తి అమ్ముకుని తన ఊరెళ్లి పోయింది. దాంతో వాడి బాధలు పెనం మీంచి పొయ్యిలోకి పడ్డట్టయ్యాయి. తినడానికి తిండికి, కట్టుకోవడానికి బట్టకీ ముఖం వాచిపోయాడు. ఊళ్లోవాళ్లు జాలేసి పెట్టింది తినేవాడు. ఇచ్చిన పని చేసేవాడు. గుళ్లోనో, దొరికిన పంచనో పడుకునేవాడు. అలా అలా ఆ గంతకి ఊళ్లోనే దాదాపు అదే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న జాబిల్లనే బొంతనిచ్చి పెళ్లి చేశారు ఊరివాళ్లు. తర్వాత వాడు వాడి ఒడిదుడుకుల సంసార జీవితం. వాణ్ని గురించిన విషయాలు కర్ణాకర్ణిగా తెలుసుకోవడమే తప్ప కలుసుకోబోవడం ఇదే! కామాలు, ఫుల్ స్టాఫ్ లు లేకుండా కష్టాలే జీవితంగా గడిపిన వాడి దగ్గర నుంచి కాస్త గుండె నిబ్బరం తెచ్చుకుందామని వెళుతున్నాను.
నేను ముందుగా ఊళ్లోని మా ఇంటికెళ్లాను. అక్కడ నన్ను ఊహించని అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు. చాన్నళ్లకొచ్చిన నన్నుచూసి  కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో కాస్త సేదదీరి సుధాకర్ని కలవడానికెళ్లాను. చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల పళ్లచెట్లు, పూల మొక్కలు మధ్యలో ఒక కుటీరంలాంటి దాంట్లో వాడూ వాడి పెళ్ళాం ఉంటున్నారు. నా రాకకి ఎంతో సంతోషించాడు. 
నేను బాధతో ఉద్విజ్ఞతతో ఏకరువు పెట్టినదంతా సావధానంగా విన్నాడు. నేను మాట్లాడుతున్నంతసేపూ ఊరివారు ఎవరో ఒకరు వస్తున్నారు, వాడితో సంప్రదింపులు, చర్చలూ జరుపుతున్నారు.
నా గోడు వెళ్లబోసుకోవడం పూర్తయ్యాక..వాడు నాతో-
"నీ బాధ పెద్ద బాధేం కాదు. సిటీలో మంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవాళ కాకపోతే రేపు  మీ అమ్మాయి కోలుకుంటుంది. కాని అలాంటి వ్యాధులతో ఇక్కడ తల్లడిల్లుతున్నవాళ్లెంతోమంది. ఒక్కో ఇంటికీ ఒక్కో సమస్య. చిన్నప్పట్నుంచీ బాధల సమ్మెటపోట్లు పడి పడీ నేనెంతో రాటుదేలాను. డబ్బు.. సమస్య ఎంత మాత్రం కాదు. ఎప్పటికైనా మనిషికి సాయంగా నిలిచేది మరో మనిషే కాని, డబ్బూ ఐశ్వర్యం కాదు.  ఒకప్పుడు ఒకళ్ల కష్ట సుఖాల్లో మరొకరు భాగం, బాధ్యత పంచుకుంటూ ఉమ్మడి కుటుంబాలతో, ఊళ్లో ఎంత ఆనందంగా ఉండేవాళ్లు? తర్వాత డబ్బుమీద ఆశతో, వ్యామోహంతో ఉద్యోగాల పేరుతో పట్నాలకీ, ఇతర దేశాలకి వలసపోతూ చిన్న కుటుంబాలేర్పరచుకుని, చిన్న చిన్న సమస్యలకు కూడా కుమిలిపోతున్నారు. నా అనే తోడొకరు లేకపోతే అంతే మరి. కష్టాన్నిఎదుర్కోవాలంటే సంఘటిత శక్తి ముఖ్యం. అది నా వాళ్లు అనే చుట్టాలు, మా వాళ్లూ అనే ఊరివాళ్ల  నుంచే వస్తుంది. నాకంటే అమ్మానాన్నల ప్రేమ దక్కలేదు. ఆలనాపాలనా లేదు. కాని నీకేం తక్కువైంది?. ఊళ్లో నీ మీద బెంగతో కుమిలిపోతున్న మీ అమ్మానాన్నల్ని ఇక్కడకొచ్చి ఎన్నిసార్లు చూశావు? పాపం వాళ్లెంతగా నీ కోసం పరితపిస్తున్నారో, ఎక్కడో ఉండే నీకు తెలియకపోవచ్చు. ఇక్కడే ఉండి అనుక్షణం చూస్తున్న మాకు తెలుసు. ఇప్పుడు మీ అమ్మాయి మీద బెంగతో ఇక్కడికి వచ్చావు. మీ తల్లిదండ్రులదీ నీ మీద అదే ప్రేమ. అభిమానం. ఏ జీవికీ లేని మనో పరిణతి మనిషికి భగవంతుడిచ్చాడు. ఎందుకో తెలుసా? అందరూ ఒకటిగా మెసలి ఒకరుకొకరు బాసటగా నిలుస్తారని. ప్రకృతిని, సమస్త జీవరాశుల్ని సమాదరిస్తారని. జరుగుతోన్నదేమిటి? అంతటా ఎవరికి వారే యమునాతీరే అన్న చందం. దీనికి అంతం ఎప్పుడు? అందుకే నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఊరంతటినీ ఒకటిగా కలిపాను. బహుశా బాధల్లో పెరిగాను కాబట్టే అలా చేసుంటాను. లేకపోతే నేను కూడా స్వార్థంగా..సరే సరే అవసారార్థం వచ్చిన నిన్ను దెప్పిపొడవడానికి కాదు ఇవన్నీ చెప్పడం. నీకొకటి చెప్పనా! ఇప్పుడు ఈ ఊరే ఒక ఇల్లు. ఊరివాళ్లు కుటుంబ సభ్యులు. పిల్లాజెల్లా ముసలీముతకా ఎవరికి ఏ బాధ, భయం కలిగినా అది ఊరందరం పంచుకుంటాం. ఓదార్చుకుంటాం. తీర్చుకుంటాం. నువ్వు ఈ ఊరి వాడివే. మేమంతా అక్కడికి వచ్చి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడే పూచీ మాది. అయితే ఒక షరతు నువ్వు రిటైరయ్యాక మాలో ఒకడిగా, మా వాడిగా ఉండాలి, సరేనా?" అన్నాడు.
అప్పటికే కన్నీళ్లతో నిండిన మోముని ఊపాను. నా జీవితం, కుటుంబం అని చుట్టుపక్కల ఎవరితో సంబంధ బంధవ్యాలు లేకుండా ఇంతకాలం స్వార్థంగా గడిపిన నాకిప్పుడు సిగ్గేస్తోంది.
ఊరివాళ్లిచ్చిన మనోస్థైర్యంతో మా అమ్మాయి గండం గట్టెక్కింది. అనుకున్న ప్రకారం పెట్టేబేడా సర్దుకుని ఊరికి బయల్దేరాం.
ఉమ్మడికుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం మనకు తెలుసు, అయితే చిన్న కుటుంబాలని ఊరుకుటుంబం చేసిన గొప్పదనం సుధాకర్ దే! మనిషి కష్టాలకి సమాధానం ఒకరికొకరు తోడుగా నిలవడమే! 
*****

No comments:

Post a Comment

Pages