Monday, April 23, 2018

thumbnail

శ్రీవసుదేవనందన శతకము - వెల్లాల రంగయ కవి

శ్రీవసుదేవనందన శతకము - వెల్లాల రంగయ కవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం

వెల్లాల రంగయ్య కవి సుబ్బమ్మ ఆదినారుల కుమారుడు. ఈతని గురువు మన్నవ లక్ష్మణార్యుడు. ఈ కవి ఏకులము వాడో, నివాసము ఎక్కడో ఏకాలమునాటి వాడో తెలియచేయి విషయములు ఈశతకమున మనకు కనపడవు. ఈకవి ఈతర రచనల గురించి కూడా ఎటువంటి సమాచారము లభించుటలేదు.
ఈ కవి తనను గురించి శతకాంతమున ఈ విధం గా చెప్పికొనినాడు.
ఉ. ఆగమవేద్య దీనసుజనాశ్రిత మన్నవలక్ష్మణార్య వి
ద్యాగురువర్యశిష్యుఁడ గదాగ్రజ సుబ్బమ యాదినార్లకున్
శ్రీగుణశీలపుత్రుఁడను శ్రీధవ రంగయనామధేయుఁడన్
బాగుగఁ గొల్చెదన్ మనుపు భర్గనుతా వసుదేవనందనా. 

శతక పరిచయం
వసుదేవనందన శతకం భక్తిరస ప్రధానమైన శతకము. ఈశతకము ఊత్పలమాల వృత్తములో రచించబడి 108 పద్యములు కలిగి ఉన్నది. ఈ విషయం కవి స్వయముగానే శతకాంత పద్యములో క్రింది విధంగా చెప్పినాడు.
ఉ. పూనికతోడఁ జేసితిని పూర్తిగ నుత్పలవృత్తమాలికన్
దీనిధరించి నాదుమది దీనతఁబాపి విముక్తినీయవే
దీనదయాళు కృష్ణ జగతీధవ మాధవయంచు వేఁడెద
న్శౌనకనారదాదిముని సన్నుత శ్రీవసుదేవనందనా

ఈశతకములోని ప్రతి పద్యమునందునా శ్రీకృష్ణుని దివ్యలీలలు మనోహరముగా వర్ణింపబడినవి. కృష్ణుని శృంగారలీలకు తనశతకమున ఈకవి మనిమానువర్ణనమే కావించుటచే కృష్ణభక్తులకు ఈశతకము సర్వదా పఠనయోగ్యముగా ఉన్నది.
ఈశతకమునందు వ్యాకరణదోషములు లేవనియే చెప్పవచ్చును. ధార నిరర్గళముగా మనోహరముగా ఉన్నది. అంత్యప్రాసపద్యములు సమాసజటిలపద్యములు ఈశతకమునకు మకుటాయమానముగ ఉండి చదువరులకు ఆహ్లాగమును కలిగించుచుండును. కవిత మృదుమధురము. మొదటి పద్యములలో చక్కని సమాస భూఇష్టమగు నంత్యనియమములు కలవు. చాలావరకు ఈపద్యములలోని అంశములు పురాణకథలే కనుక శతకమున అనుకరణాలు లేవనియే చెప్పవచును. శ్రీరామ ప్రాముఖ్యముగల శ్రీదాశరథీశతకమువలెనే ఇది కృష్ణా ప్రాముఖ్యముగల భక్తిరస శతకము. 
మచ్చునకు కొన్ని పద్యాలను చూద్దాము.
ఉ. శ్రీకలితోరువక్ష సరసీజదళాక్ష సమస్తలోకర
క్షకరణైకదీక్ష యళికాక్షఋభుక్షవిపక్షశిక్ష గో
పీకమనీయమందిరనవీనపయోదధిచౌర్యదక్ష ల
క్ష్మీకరసత్కటాక్షనతశీలవసూ వసుదేవనందనా

ఉ. రందదరిప్రభంగ ఖగరాజవిరాజతురంగ భక్త హృ
త్సంగ భవాంధకారసముదగ్రపతంగ సురారిపద్మమా
తంగ విదర్భజాహృదయతామరసభ్రమమాణభృంగ స
ర్వంగ కరీంద్రతాపపరిభంగ హరీ వసుదేవనందన

శతకములోని పన్నెండవ పద్యమునుండి ఈ కవి దశావతారవర్ణనము చేసియున్నాడు. వాని నుండి కొన్ని పద్యములు
ఉ. ఆదిని సోమకుండు చతురాననవేదచయంబుఁ దెచ్చి యు
న్మాదత నంబుధిం జొరఁగ మాధవవానిఝుషంబవై సురా
హ్లాద వధించి వేదనిచయంబును బ్రహ్మకు నిచ్చినట్టి యో
వేదవేషణామనుపవే శఠునన్ వసుదేవనందనా

ఉ. భూమినిఁ జంకఁ బెట్టుకొనిపోయిన దైత్య్ని హేమనేత్రునిన్
భీమముతోడఁ జంపి పృథివీస్థలిఁ గొమ్మున నెత్తినట్టి యో
తామరసాక్ష యాదికిటి తాపసవందిత యోమురాంతకా
కామునిఁ గన్నతండ్రి ననుఁ గావు దయన్ వసుదేవనందనా

ఉ. తాటకఁగూల్చి శంకరునిధర్మముఁ ద్రుంచి ధరాసుతాకళా
పాటవమందియింద్రజుని భండనమందు వధించి వానరు
ల్కోటులుగూడ రావణు సకూటముఁ జంపిన రామ బ్రోవు నీ
చాటునం గింకరుండ నను శౌరి హరీ వసుదేవనందనా

శ్రీకృష్ణుని బాల్యలీలా వినోదాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన ఈ పద్యాలను చూడండి.
ఉ. అసురభామఁ బూతన జనంతకగంసుఁడు వంపనం దస
ద్భాసురగేహమందుఁ దనపాలచనుం గుడిపింప దానిమాం
సాసువులన్నియుం గుడిచి యాసురి వేగమె జంపినట్టి యో
శ్రీసనకాదివందిత విరించినుతా వసుదేవనందనా

ఉ. పిన్నతనంబునందు మఱివీథులనాడుచుండ నమ్మతో
మన్నుదినెన్ జనార్ధనుఁడు మాధవుఁడంచు వచింప నర్భకుల్
మన్ను నదేలతింటి విటు మాధవయన్న చరాచరాండసం
పన్న జగంబుఁజూపవే స్వవక్త్రమునన్ వసుదేవనందనా

ఇదేవిధంగా అష్టమహిషుల వివాహ సందర్భాలు, పారిజాతాపహరణ విషయము, పౌండ్రకవాదుదేవుని వధ మొదలైన అంశాలు కూడా ఈశతకంలో అత్యంత మనోహరంగా చిత్రీకరించినాడు. మగధ రాజైన జరాసంధుని వధ గురించిన ఈ పద్యం చూడండి.
ఉ. నీవును భీమపార్థులును నెమ్మది భూసురవేషమూని యా
భూవిభునాజ్ఞచే మగధభూవిభునిన్ రణభిక్ష వేఁడి యా
కావరపోతుమాగధుని గయ్యమునన్ వధియింపఁజేసితౌ
దేవదయానిధి గుణనిధి మృదుధీ వసుదేవనందనా

ఇదేవిధంగా శిశుపాల వధ, ఖాండవ దహనము, కుచేల వృత్తాంతము, వృకాసురవధ మొదలైనవి కూడా ఈశతకంలో మనకు కనిపిస్తాయి. కృష్ణరాయబారము, ఆపైన కౌరవపాండవ యుద్ధసమయమున భగవద్గీత బోధ సైందవ వధ, మొదలైన భారత భాగవత పురాణ ఘట్టాలు ఈ శతకంలో అనేకం మనము చూడవచ్చును. అశ్వత్థామ బ్రహ్మాస్త్రము నుండి ఉత్తర గర్భములోని శిశువును కాపాడిన ఘట్టం ఎంతమనోహరంగా చిత్రీకరించారో చూడండి.
ఉ. ద్రౌణి యపాండవంబుగను బ్రహ్మాశిరంబను నస్త్రమేయఁగాఁ
బ్రాణభయంబుగాఁ గవియ బాండవరక్షణఁ జేసియున్ గదా
పాణివియై తదస్త్రపరిబాధితు నార్తుని నుత్తరోదరుం
ద్రాణనఁ జేసినట్టి సువుథాన హరీ వసుదేవనందనా

ఒక మనోహరమైనట్టు పద్యం 
ఉ. కుంజరునేలి కుంజరునిఁ గూలిచి వానరునేలి వానరున్
భంజనఁజేసి యండజునిబండియు నండజుఁ జెండియున్ ధరన్
రంజనఁజేసియున్ ధరనురాళులవానకుఁ గేలనెత్తియున్
సంజయు నేలినట్టి గుణసాంద్ర హరీ వసుదేవనందనా

ఇటువంటి మరెన్నో మధురమైన పద్యాలు మనకు ఈశతకంలో కోకొల్లలుగా లభిస్తాయి. అత్యంత భక్తిరసమయమైన ఈ శతకం అందరూ చదవవసినది. మీరుకూడా చదవండి. మీమిత్రులచే చదివించండి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information