Thursday, March 22, 2018

thumbnail

శ్రీ శంకర భగవత్పాదుల విరచిత సౌందర్యలహరి

శ్రీ శంకర భగవత్పాదుల విరచిత సౌందర్యలహరి
మంత్రాల పూర్ణచంద్రరావు 


గం గణపతయే నమః 
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
గురుఃబ్రహ్మ  గురుఃవిష్ణు - గురుఃదేవో మహేశ్వరః
గురుఃసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువేనమః

శారదా శారదాంభోజ
వదనా వదనాంబుజే !
సర్వదా సర్వదాస్మాకం
సన్నిధిః సన్నిధిం క్రియాత్ ll

మాలా సుధాకుంభ విభోధముద్రా
విద్యా విరాజత్కర వారిజాతామ్
అపారకారుణ్య సుధాంబురాశిం
శ్రీ శారదాంబాం ప్రణతోస్మినిత్యం‌ ll 

నమస్తే శారదా దేవీ
కాశ్మీరపురవాసిని !
త్వాం మహం ప్రార్ధయే నిత్యం
విద్యాదానం చ దేహి మే ll

సదాశివ సమారంభాం - శంకరాచార్య మధ్యమామ్ I

అస్మదాచార్యపర్యంతాం - వందే గురుపరంపరామ్IIశ్లోII 1.  శివశ్శక్త్యా  యుక్తో యది భవతి శక్తః  ప్రభవితుం 

           న  చేదేవం దేవో న ఖలు కుశలః  స్పందితుమపి I

           అత స్త్వామారాధ్యాం  హరి హర విరించాదిభిరపి 

           ప్రణంతుం స్తోతుం  వా కధ మక్రుతపుణ్యః  ప్రభవతిII

తా;    అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమ శివుడు అధినాయకుడు అగుచున్నాడు, అట్లు కాని నాడు ఆ దేవ దేవుడు  సమర్ధుడు కాదు.అందువలననే హరి హర బ్రహ్మాదులచే పొగడబడుచున్న నిన్ను పూజించుటకు గానీ పొగడుటకు గానీ పుణ్యము చేయనివాడు ఎట్లు సమర్ధుడు అగును.

శ్లో II 2. తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం

           విరించిః సంచిన్వన్ విరచయతి  లోకానవికలమ్I

           వాహ త్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

           హరః సంక్షుద్య్తెనం భజతి బసితోద్ధూళనవిధిమ్II

తా;   అమ్మా ! బ్రహ్మ దేవుడు నీయొక్క పాదములందు కలిగి ఉన్న అణుమాత్రము అయిన ధూళినే గ్రహించి సకల లోకములను సృష్టి చేయుచున్నాడు, ఆ సూక్ష్మ కణమునే సహస్ర శిరములతో విష్ణు మూర్తి అతి కష్టముగా మోయు చున్నాడు,శివుడు దానినే భస్మము చేయుచూ భస్మధారణము చేయుచున్నాడు కదా !

శ్లోII 3. అవిద్యానా మంత స్తిమిరమిహిరద్వీపనగరీl

          జడానాం చైతన్య స్తబకమకరందస్రుతిఝరీl

          దరిద్రాణాం చింతా మణిగుణనికా జన్మజలధౌ

         నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతిll

తా ll అమ్మా !నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది, మంద బుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది,దరిద్రముతో ఉన్న వానికి చింతామణుల హారము వంటిదియు,సంసార సముద్రమున మునిగిన వానికి వరాహావతారము అగు  విష్ణు మూర్తి  యొక్క కోర వంటిది కదా !

శ్లోll 4 త్వదన్యః పాణిభ్యా-మభయవరదో దైవతగణ

         స్త్వమేకా నైవాసి-ప్రకటితవరాభీత్యభినయా

         భయాత్త్రాతుం దాతుం-ఫలమపి చ వాంఛాసమధికం

         శరణ్యే లోకానాం-తవ హి చరణావేవ నిపుణౌll 

తా; అమ్మా ! లోకములకు దిక్కు అయిన తల్లీ మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు , అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే నీ పాదములే,  కోరక ముందే కోరికలు తీర్చి భయములు పోగొట్టును కదా !


శ్లోll 5.హరి స్త్వా మారాధ్య ప్రణత జనసౌభాగ్య జననీం

         పురా నారీ భూత్వా పురరిపు మపి క్షోభ మనయత్

        స్మరో పి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా

        మునీనా మప్యంతః ప్రభవతి  హి మోహాయ మహతామ్ll

తా ; అమ్మా ! లోకములకు సౌభాగ్య ప్రదురాలవు అయిన నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారము ఎత్తి పరమ శివుని కూడా ప్రభావితము చేసెను కదా , అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్ట సఖుడే కాక మునుల మనస్సులు కూడా మోహ పెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు  కదా ! 

శ్లోll 6. ధనుఃపౌష్పం  మౌర్వీ మధుకర మయీ పంచ విశిఖాః

వసంన్తః  సామంతో మలయ మరు దాయోధనరథః

తథాప్యేకః సర్వం హిమగిరి సుతే కామాపి కృపా

మపాంగాత్తేలబ్ధ్వా-  జగదిద మనంగో విజయతేll

తా ; అమ్మా ! హిమవత్పర్వత రాజ పుత్రీ , పూవులతో కూడిన విల్లు, తుమ్మెదల తో చేయబడిన నారి, అయిదు బాణములు, జడత్వము కలవాడునూ,మలయ మారుతమే యుద్ధ రధముగా గల  మన్మధుడు సైతము నీ కడగంటి చూపు వలన ఈ జగత్తునే జయించు చున్నాడు కదా ! 

శ్లో ll 7. క్వణత్కాంచీదామా - కరికలభకుంభస్తననతా

పరీక్షీణా  మధ్యే - పరిణతశరచ్చంద్రవదనాl

ధను ర్బాణాన్  పాశం - సృణి మపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః - పురమథితురాహోపురుషికాll

తా; మిల  మిల మెరయుచున్న మణుల గజ్జెల మొలనూలు కలిగిన,గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగిన నడుము ఉన్నట్లు కనపడుతున్నదియు, సన్నని నడుము కలిగి, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు,చెరకుగడ విల్లునూ,పూవుటమ్మును, అంకుశమును,పాశమును ధరించు చున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు గాక . 

శ్లో ll 8. సుధాసింధో  ర్మధ్యే - సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపో - పవనవతి  చింతామణి గృహేl

శివాకారే మంచే - పరమశివపర్యంకనిలయామ్

భజంతి త్వాం  ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ll

తా ; అమ్మా ! అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రతనాల దీవి యందు కల్ప వృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మిచబడిన గృహము నందు శివుని రూపముగా గల మంచమున పరమ శివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించు చున్నారు. 

శ్లో ll 9. మహీం  మూలాధారే - కమపి మణిపూరే హుతవహం

స్థితం  స్వాధిష్టానే - హృది మరుత మాకాశ ముపరిl

మనోపి భ్రూమధ్యే - సకలమపి భిత్వా కులపథం

సహస్రారే పద్మే - సహ రహసి  పత్యా  విహరసేll

తా ; అమ్మా ! పృథ్వి తత్వముగా మూలాధార చక్రమున, జల తత్వమున మణిపూర చక్రమున,అగ్ని తత్వమున స్వాధిష్టానమున,వాయు తత్వముతో అనాహత చక్రమున, ఆకాశ తత్వముగా విశుద్ద చక్రమున,ఆజ్ఞా చక్రమున మనస్తత్వము గా ఉండి ఆ పైన సుషుమ్నా మార్గము గుండా సహస్రారము చేరి పతి యగు పరమేశ్వరునితో కలసి విహరించు చున్నావు .

శ్లో ll 10. సుధాధారాసారై - శ్చరణయుగళాంతర్విగళితైః

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసా

అవాప్య త్వాం  భూమిం - భుజగనిభ మధ్యుష్టవలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి  కులకుండే కుహరిణి ll 

తా ; అమ్మా ! పాద పద్మముల మధ్యనుండి ప్రవహించిన అమృత ధారా వర్షముతో డెబ్బది రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమ్రుతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమయిన సర్ప రూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలినీ శక్తివయి నిద్రించు చున్నావు.
***


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

3 Comments

avatar

హృదయపూర్వకమైన సదుద్దేశ్యం ఎల్లప్పుడూ సత్ఫలితాలనే ఇస్తుంది అండి..చక్కగా వ్రాస్తున్నారు.అమ్మ ఆశీస్సులకు తోడుగా మా అందరి ఆదరణ తప్పక ఉంటుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపొండి..శుభాభినందనలు,.

Reply Delete
avatar

చాలా బాగుంది పూర్ణయ్య🙏💐

Reply Delete
avatar

అద్భుతంగా ఉంది సర్ చాలా సులభంగా అర్థమయ్యేలాగా వివరించారు

Reply Delete


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information