బ్రిటీష్ ప్రభుత్వాన్నిగడగడ లాడించిన యోధులు -రాజ్ గురు,సుఖ్ దేవ్ లు - అచ్చంగా తెలుగు

బ్రిటీష్ ప్రభుత్వాన్నిగడగడ లాడించిన యోధులు -రాజ్ గురు,సుఖ్ దేవ్ లు

Share This
బ్రిటీష్ ప్రభుత్వాన్నిగడగడ లాడించిన యోధులు -రాజ్ గురు,సుఖ్ దేవ్ లు
అంబడిపూడి శ్యామసుందర రావు  

దాదాపు 87  ఏళ్ల క్రితము అంటే 23 మార్చ్ 1931 న భగత్ సింగ్ ,రాజ్ గురు సుఖ్ దేవ్ లు  జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ లాహోర్ జైలులో చెదరని చిరునవ్వుతో అఖుంటిత దేశ భక్తితో వురి తాడును ముద్దాడి దేశము కోసము ప్రాణాలు అర్పించిన మహానుభావులు.  లాహోర్ కుట్ర కేసులో వారికి బ్రిటిష్ ప్రభుత్వము ఉరి శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వము  మీద పోరాడిన యోధులుగా ఈ ముగ్గురు చరిత్ర కెక్కినా స్వాతంత్రము తరువాత భగత్ సింగ్ కు దక్కిన కీర్తి మిగిలిన ఇద్దరికీ ఎందుకనో దక్కలేదు భగత్ సింగ్ కీర్తి వీరి కీర్తి ప్రతిష్టలకు గ్రహణము పట్టినట్లు అయింది ఒక రకముగా చెప్పాలంటే భరత జాతి ఈ విప్లవ యోధులను మర్చిపోయినట్లే ఊరువాడా భగత్ సింగ్ విగ్రహాలు ఉన్నాయిగాని రాజ్ గురు సుఖ్ దేవ్ ల విగ్రహాలు ఎక్కడా కనిపించవు. వారు ముగ్గురు బలిదానం చేసిన రోజు మార్చ్ 23 కాబట్టి ఆ రోజున భగత్ సింగ్ తో పాటు మిగిలిన ఇద్దరు అమర వీరులను స్మరించు కుంటూ వారి జీవిత విశేషాలను తెలుసుకుందాము వారిని జాతి మరచిపోకూడదు ఎందుకంటే బ్రిటిష్ వలస రాజ్య ఆధిపత్యాన్ని ఎదిరించి ఆకాశములో తోకచుక్కలల్లే మెరిసి మాయమైపోయిన దేశభక్తులు 
సుఖ్ దేవ్ థాపర్ :- లుధియానాలోని నౌఘర మొహల్లాలో రామ్ లాల్ థాపర్ రెల్లి దేవి దంపతులకు 15 మే,1907న సుఖ్ దేవ్ థాపర్ జన్మించాడు తండ్రి చనిపోవటం వల్ల మేనమామ లాలా ఆచిన్త్ రామ్ వద్ద పెరిగాడు. బాల్యములోనే బ్రిటిష్ వారి దురాగతాలను వారి పరిపాలనలో భారతీయుల ఇక్కట్లను గమనించేవాడు.లాహోర్ నేషనల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రపంచదేశాలతో జరిగే విప్లవాలను అధ్యయనము చేస్తూ ఉండేవాడు లాలా లజపతి రాయ్ స్థాపించిన ఈ కాలేజిలోనే మొదటిసారిగా సుఖ్ దేవ్ భగత్ సింగ్ ను కలిసాడు. వీరిద్దరూ లాలా లజపతి రాయ్ విప్లవాత్నక భావాల వల్ల, ప్రొఫెసర్ జై చంద్ విద్యలంకార్ ఉపన్యాసాల వల్ల దేశము పట్ల వల్లమాలిన ప్రేమను దేశ భక్తిని పెంపొందించు కున్నారు.వీరిద్దరు "నౌజవాన్ భారత్ సభ"ను స్థాపించి యువకులను జేర్చుకొని వారిలో దేశ భక్తిని పెంపొందించి వారందరు స్వాతంత్ర పోరాటములో పాల్గొనేటట్లు ప్రేరేపించారు అంతే కాకుండా యువకులలో సాంఘిక దురాచారాలైన కులతత్వము, అంటరాని తనము మొదలైనవి రూపు మాపటానికి కృషి చేసేవారు. 
వీరిద్దరు వివిధ రాజకీయనాయకులను పిలిపించి వారిచే స్వాతంత్రము యొక్క ఆవశ్యకతను,బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకముగా ఉపన్యాసాలు ఇప్పించి యువతను ప్రభావితము చేసేవారు.ఈ రకమైన పనుల వల్ల వారిద్దరు జాతీయ స్థాయి నాయకులుగా గుర్తింపు పొందారు. హిందుస్తాన్ సోషియలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్ సభ్యుడిగా సుఖ్ దేవ్ పంజాబ్ ఇతర ఉత్తర దేశ ప్రాంతాలలో విప్లవ సంఘాలను ప్రారంబింప చేశాడు ఈ చర్యలన్నింటి ఉద్దేశ్యము భారత మాత ను బ్రిటిష్ వారి కబంద హస్తాల నుండి విముక్తి కలిగించటమే  వివిధ రకాల విప్లవ కార్యకలాపాలలో  పాల్గొన్నప్పటికీ అయన అమిత ధైర్యముతో పాల్గొన్న లాహోర్ కుట్ర కేస్ వల్ల సుఖ్ దేవ్ ను భారతీయుల హృదయాల లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు 
శివరామ్ రాజ్ గురు:-మహారాష్ట్రలోని పూనే జిల్లా ఖేద్ లో మధ్య తరగతికి కుటుంబములో 24 ఆగస్టు,1908న శివరాం హరి రాజ్ గురు జన్మించాడు.సుఖ్ దేవ్ లాగానే బాల్యము నుండి బ్రిటిష్ వారి దమన నీతిని అరాచకాలను దగ్గరగా గమనిస్తూ ఉండే వాడు.ఈ అనుభవాలు అతనిలో భారతదేశ స్వాతంత్రానికి పోరాడే విప్లవ యోధులతో కలిసి పని చేయాలన్నబలమైన కోరికను అభివృద్ధి చేశాయి. చంద్రశేఖర ఆజాద్ యొక్క ఉద్రేకపూరితమైన ఉపన్యాసాల వల్ల ప్రేరితుడై "హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ"లో చేరాడు. రాజ్ గురు మంచి మల్లయద్ద ప్రవీణుడు, సంస్కృత పండితుడు. ఒకే రకమైన విప్లవ భావజాలము కలిగిన వాళ్ళు అవటం వల్ల భగత్ సింగ్ సుఖ్ దేవ్ లతో స్నేహము  కుదిరి  ఈ త్రయము వారి విప్లవాత్మక చర్యలతో బ్రిటిష్ ప్రభుత్వానికి దడ పుట్టించి నిద్ర లేకుండా చేశారు. 
ఫిబ్రవరి 1928 లో సైమన్ కమిషన్ భారత దేశములో కొన్ని రాజ్యాంగ సవరణలు చేయటానికి ఇండియా వచ్చింది. ఆ కమీషన్ లో ఏ ఒక్క భారతీయుడు లేకపోవటము చాలా మంది భారతీయులకు అవమానకరంగాను, నిరాశ గానూ  తోచింది  ఈ నిరసన ఉద్యమాలలో ప్రముఖ నాయకుడు లాలా లజపతి రాయ్ పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్ లో తీవ్రముగా గాయపడి ప్రాణాలను కోల్పోయాడు దేశము అధికముగా ప్రేమించే వారి నాయకుడు లాలా లజపతి రాయ్ మరణానికి  ప్రతీకార చర్య జరపాలని ఈ ముగ్గురు నిశ్చయించుకున్నారు ఫలితముగా ఈ విప్లవ యోధుల త్రయము లాఠీ ఛార్జ్ కి కారణభూతుడైన పోలీస్ సూపరిండెంట్ జాన్ సాండర్స్ అనే అధికారిని హత్య చేశారు వెనువెంటనే భగత్ సింగ్ అతని అనుచరుడు బతుకేశ్వర్ దత్,  సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల కరపత్రాలను వెదజల్లి రెండు బాంబులను విసిరి ప్రతీకారము తీర్చుకుని , వారు ప్రభుత్వానికి లొంగిపోయారు బ్రిటిష్ ప్రభుత్వము ఈ రెండు కేసులను కలిపి లాహోర్ కుట్ర కేస్ గా అభియోగాలు మోపి హిందుస్తాన్  సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ యువ నాయకులను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు
చివరి రెండు సంవత్సరాలలో వీరు ముగ్గురు జైళ్లలో ఉండి స్వాతంత్ర పోరాటంలో భారతీయులు  మరువలేని న్యాయపోరాటం సాగించారు. కోర్టులను వారు సాధనాలుగా ఎన్నుకొని వారి విప్లవ భావాలను ప్రజలలో వ్యాప్తి చెందేటట్లు చేయగలిగారు అంతే  కాకుండా జైళ్లలో రాజకీయ ఖైదీలు పడే అవస్థలను ప్రపంచానికి తెలియ జేయటము లో సఫలమైనారు. వీరి బలమైన జాతీయవాదం,వీరి త్యాగాలు చాలా మంది యువకులను స్వాతంత్ర ఉద్యమములో చురుకుగా పాల్గొనేటట్లు చేసింది. భగత్ సింగ్ సుఖ్ దేవ్,రాజ్ గురు లను మార్చ్ 23,1931 న ఉరి తీసినప్పుడు వారికి ఘనమైన నివాళులర్పించటానికి భారత దేశములోని వివిధ ప్రాంతాలలో వేలమంది యువకులు ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి గుమికూడారు. వీరి దేహాలకు సట్లెజ్ నది ఒడ్డున గల పంజాబ్ రాష్ట్రములోని హుస్సేనీవాలా (ప్రస్తుతము పాకిస్తానులో  ఉంది)  లో అంత్యక్రియలు ఘనముగా జరిగినాయి. ఉరి తీసేటప్పుడు భగత్ సింగ్ ,సుఖ్ దేవ్ థాపర్ ల వయస్సు 23 ఏళ్లు ,రాజ్ గురు వయస్సు 22ఏళ్ళు.
 అమోఘమైన దేశ భక్తి వారి బలిదానం వెలకట్టలేనిది కానీ  ఉరి తీయబడ్డాక రాజ్ గురు సుఖ్ దేవ్ ల కుటుంబాలు వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవటానికి చాలా కష్ట పడ వలసివచ్చింది వారి కుటుంబీకులు వారి పూర్వికులనుండి వచ్చిన ఆస్తిని కాపాడుకోవటానికి కుడా వారికి ప్రభుత్వాల తరుఫున(స్వాతంత్రము తరువాత) ఏ విధమైన సహాయ సహకారాలు అందలేదు వారి  ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు ప్రభుత్వమూ లోని పెద్దలు  మాటలలో వారి త్యాగాలను పొగడటం  వరకే పరిమితము చేశారు మన నాయకులు స్వాతంత్రము తరువాత నిజముగా త్యాగాలు బలిదానాలు చేసిన సుబాష్  చంద్ర బోస్, భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రముఖులెందరో నేటి తరానికి తెలియకుండా కనుమరుగు అవటానికి కారణమవుతు  అర్హత లేని నాయకులు అందలమెక్కి నిజమైన నాయకులకు అన్యాయము చేశారు. ఇది ప్రస్తుత భారత దేశ పరిస్థితి. 
***

No comments:

Post a Comment

Pages