నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)-ఊబిలోని మనిషి - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)-ఊబిలోని మనిషి

Share This
నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)-ఊబిలోని మనిషి   
శారదాప్రసాద్

అవి నేను 4 వ ఫారం చదువుతున్న రోజులు.చిన్నప్పుడు నేను బాగా సన్నగా, పొడుగ్గా ఉండేవాడిని.నా సహ విద్యార్థుల్లో ఒకరిద్దరు కొద్దిగా ఎక్కువ వయసు, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకడు-పాపిరెడ్డి,రెండవ వాడు-రాఘవరావు.పాపిరెడ్డి అప్పుడే యవ్వనపు తొలిమెట్లను దాటినట్లుగా అనిపించేవాడు.ఒక ఉపాధ్యాయిని పాఠం చెబుతుంటే,అది వినకుండా ఆమె వంకే అదో  రకంగా చూస్తుండేవాడు. నాలుగు,అయిదు సంవత్సరాల క్రితమే అతను మరణించాడు.ఇక రెండవ వాడైన  రాఘవరావు మా ఇంటి దగ్గరే ఉండేవాడు. బాగా బలిష్టంగా ఉండేవాడు.స్కూల్ లో నా వెనక బెంచ్ లోనే కూర్చునేవాడు.కాపీ కొట్టటంలో వాడు అఖండుడు. నేను వ్రాసినవి పొల్లుపోకుండా యధాతధంగా కాపీ కొట్టేవాడు.జులాయి తిరుగుళ్ళు,జూదాలు వాడి హాబీలు.ఇంట్లో కూడా వాడి మీద పట్టు తప్పింది.బలహీనుడు బలవంతుడి స్నేహాన్ని కోరుకోవడంలో చాలా కారణాలు ఉండొచ్చు!ముఖ్యంగా వాడి అండ చూసి ,మన జోలికి ఎవరూ రారని అప్పటి నా అభిప్రాయం.అయితే రాఘవరావులో కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయి.అకారణంగా ఇతరుల మీద కక్ష పెట్టుకుంటాడు వాడు.పాపిరెడ్డికి కూడా చదువు మీద శ్రద్ధ తక్కువే!రాఘవరావుకు ,పాపిరెడ్డికి శత్రుత్వం ఉండేది.ఇద్దరు బలవంతుల మధ్య ఉండే స్పర్ధే అది.రాఘవరావు కన్నా అన్నిట్లో పాపిరెడ్డిదే పై చేయిగా ఉండేది. రాఘవరావు నావన్నీ కాపీ కొట్టటం పాపిరెడ్డి పసికట్టాడు.వెంటనే వాడు నాకు వాడికి ఏమీ చూపించవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.వాడిచ్చిన వార్నింగ్ నన్ను కలవరపాటుకు గురిచేసింది.అయినా బలవంతుడైన పాపిరెడ్డి చెప్పినట్లు వినటం మినహా నాకు వేరే మార్గం కనిపించలేదు.అలా రాఘవరావుకు నేను వ్రాసినవి చూపించటం మానేసాను.ఆ కారణంగా రాఘవరావు నా మీద కక్ష పెంచుకున్నాడు.అకారణంగా ఆపదలలో చిక్కుకోవటంలో కూడా కొంతవరకు మన తప్పిదాలే కారణం.మొదట్లోనే రాఘవరావుతో స్నేహం చేయకుండా ఉంటే బాగుండేదేమో!తొందరగా స్నేహాలు చేయటం,చేసిన స్నేహాలను వదులుకోలేక పోవటం నా బలహీనతలు.అలా ఒక పది రోజులు గడిచాయి.వాడికి నా మీద కోపం పెరిగిందే కానీ తగ్గటం లేదు.ఒక రోజు సాయంత్రం వాడు మా ఇంటికి వచ్చి నాతో మంచిగా, బాగా మాట్లాడాడు.వాడు అన్నీ మరచిపోయాడని  నేనూ భావించాను.ఆడుకుంటానికి వెళ్లుదాం రమ్మని బయటకు సైకిల్ మీద తీసుకొని వెళ్ళాడు. వాడు ఎక్కడికి తీసుకొని వెళుతున్నాడో నాకు అర్ధం కావటంలేదు.కొంతదూరం వెళ్లిన తర్వాత వాడు ఒక బురదగుంటలోని ఊబిలోకి నన్ను తోసాడు.నేను ఊబిలో పడి బయటకు రాలేక హాహాకారాలు చేస్తున్నాను.రక్షించమని వాడిని వేడుకున్నాను.కాపీ కొట్టటానికి మళ్ళీ సహాయం చేస్తానని మాటిచ్చాను.వాడు వెంటనే ఊబిలోకి ఒక తాడు వేసి ,దాన్ని పట్టుకొనమని చెప్పి దాని రెండవ చివర ఒక చెట్టుకు కట్టి ,తాడును పట్టి లాగి నన్ను బయటకు తీసాడు.వాడిలో ఆ దుర్బుద్ధి ఉండబట్టే, వచ్చేటప్పుడు తాడును కూడా తెచ్చుకున్నాడేమో!బయటకు వచ్చిన నన్ను ఒక బావి దగ్గరకు తీసుకొనిపోయి ఒళ్లంతా నీళ్లుపోసి కడిగి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు.ఆ తర్వాత చాలా రోజులు నిద్రలో కూడా ఆ సంఘటనే గుర్తుకొచ్చి భయపడేవాడిని.స్కూల్ లో వాడు నన్ను ఒక బానిసగా చేసుకున్నాడు.ఈ విషయం పాపిరెడ్డికి చెబుదామనుకుంటే,మళ్ళీ రాఘవరావు ఏ ఆపదలో ముంచుతాడోనని భయం.అలా భయంతోనే వాడితో నా స్నేహం(?) కొనసాగింది!తర్వాత రోజుల్లో వాడు SSLC తప్పాడు.తర్వాత మిలిటరీలో చేరాడు. ఆ తర్వాత నేను చదువు పూర్తి చేసుకొని బ్యాంకులో ఉద్యోగంలో చేరాను.అలా రాఘవరావు నా జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోయాడని భావించాను.వాడు మిలిటరీలో నుంచి బయటకు వచ్చాడు.నా అడ్రస్ కనుక్కొని నన్ను ఒకసారి చూడటానికి వచ్చాడు. ఇప్పుడు వాడికి మందు అలవాటు కూడా ఏర్పడింది.పైగా ఇవన్నీ మిలిటరీలో మామూలే అన్నాడు.వాడు స్టేట్ బ్యాంకు లో సెక్యూరిటీ గార్డ్ గా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ద్వారా ఉద్యగంలో ex-servicemen కోటాలో చేరాడు.వాడికి ఇంకా పెళ్లి కాలేదు .ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు.కానీ వాడిని గురించి విచారించిన వాళ్ళు ,పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రావటం లేదు.బ్యాంకులో నా స్నేహితుడు ఒకతను ఉండేవాడు.చాలా బీద వాళ్ళు.వాడికి తల్లి తండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు.వాళ్లకు ఆస్తి పాస్తులు లేవు. కుటుంబానికంతటికీ వాడే ఆధారం. వాడికి పెళ్లి కావలసిన ఇద్దరు చెల్లెళ్లు  ఉన్నారు.వాళ్లకు వయసు దాటుతుంది.తగిన సంబంధాలు రావటం లేదు.వాళ్ళు పెద్దగా చదువుకోలేదు కూడా. వాళ్లకు ఎవరో రాఘవరావు సంబంధం గురించి చెప్పారట.బ్యాంకులో ఉద్యోగం,మిలిటరీ పెన్షన్ కలిపి తగినంత ధనాన్ని సంపాదిస్తున్నాడని వాళ్ళు తలచారేమో! అమ్మాయి కూడా హాయిగా ఉంటుందని అనుకొనివుండొచ్చు.పెళ్లి చూపుల్లో రాఘవరావు, బ్యాంకులోని నా మిత్రుడితో మాట్లాడుతూ నా ప్రస్తావన తీసుకొని వచ్చాడట!నేను తెలుసని నా స్నేహితుడు చెప్పాడట!ఆడపెళ్లి  వాళ్ళు  వాడిని గురించి నన్ను విచారించటానికి వచ్చారు.చిన్నప్పటి క్రోధం ,మద మాత్సర్యాలు ఇప్పుడు తొలగిపోయి ఉంటాయని భావించి ,వాడిని గురించి మంచిగానే చెప్పాను.పెళ్లి అయింది. పెళ్ళికి నేను కూడా తెనాలి వెళ్లాను. పెళ్ళైన తర్వాత వాడు నాగార్జునసాగర్ లో కాపురం పెట్టాడు.బ్యాంకులోని నా మిత్రుడు నాతో  మాట్లాడటం ఎందుకో పూర్తిగా మానేసాడు. గుచ్చి,గుచ్చి కారణాన్ని అడిగితే, సంసారంలో రాఘవరావు పెట్టే శారీరక,మానసిక బాధలను తట్టుకోలేక వాడి చెల్లెలు ఆత్మహత్య చేసుకుందట!అయితే నా స్నేహితుడు మాత్రం రాఘవరావే హత్యచేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రించాడని చెప్పాడు.ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ అమ్మాయిని వాడు హింసించేవాడని చెప్పారట!ఆ తర్వాత రాఘవరావు నాకు ఇప్పటివరకు కూడా కనపడలేదు.కచ్చితంగా వాడే తప్పుచేసి ఉంటాడని నా మనసు చెప్పింది. ఊబిలోంచి నన్ను కాపాడిన వాడే మరొక స్త్రీని మరణకూపంలోకి నెడుతాడని నేనెన్నటికీ భావించలేదు.నన్ను కాపాడంలో కూడా వాడి స్వార్ధం ఉన్న సంగతి నేను మరచిపోవటం నా  తప్పేమో!ఆ బాధ(ల) ఊబిలో నుంచి నేను బయటపడటానికి చాలా రోజులు పట్టింది.మనిషి ప్రవ్రుత్తి తొందరగా మారదు.జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న కొంతమంది సంస్కారుల ప్రవృత్తిలో మార్పు వస్తుంది.ఆ మార్పు బాధ్యతలు పెరగటం వలన కావచ్చు కూడా! మరికొన్ని ముచ్చట్లు మరోసారి!

***

1 comment:

  1. మీ ఊబిలోని మనిషి కథానిక బావుంది.

    ReplyDelete

Pages