జర్నీ ఆఫ్ ఏ టీచర్ -4 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ -4
చెన్నూరి సుదర్శన్

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)
విజయకుమార్ మాష్టారు వద్ద సెలవు తీసుకొని బయలుదేరాను.
హృదయం భారంగా ఉంది. పదే, పదే రోజీ  ప్రతిబింబం నా కళ్ళముందు కదలాడుతోంది.

నేను కత్తెర వీధిలో ఉంటున్నాను. రిక్షా పిలిచి ఎక్కాను. అక్కడ రిక్షాలు బలేగా ఉంటాయి. చాలా సౌకర్యం కూడాను.. అందులో కూర్చుంటే గుర్రంపై  కూర్చున్నట్లే ఫీలవుతాం.

“నమస్కారం మాష్టారూ..” అంటూ ఒక విద్యార్థి అభివాదంతో తలెత్తి చూసాను. అతడు సైకిలు దిగి చెప్పులు పక్కకు విడిచి వినయంగా నమస్కరిస్తున్నాడు. నేనూ ప్రతినమస్కారం చేసాను.

అక్కడ మాష్టారంటే ఎనలేని గౌరవం. పేరంట్స్ సైతం స్టాఫ్ రూంలోకి  రావాలంటే జంకేవారు. కాళ్ళ జోళ్ళు బయట  విడిచి వచ్చేవారు.

అలా మన ప్రాంతంలో చూసి ఎరగం.

***

ఆ సవత్సరం మా మ్యాథ్స్ డిపార్టుమెంట్ అందరికీ రాజమండ్రికి పేపర్ వాల్యూయేషన్ క్యాంపులో కోడింగ్ ఆఫీసర్స్ గా అప్పాయింట్‍మెంట్ ఆర్డర్స్ వచ్చాయి.

అప్పట్లో  ఒక ప్రాంతపు  పబ్లిక్ పరీక్షల విద్యార్థుల సమాధాన పత్రాలు మరో ప్రాంతానికి పంపించే వారు. అయితే అవి ఏ కాలేజీకి చెందినవో తెలియకుండా ఉండేందుకు కోడింగ్ చేసే వారు.

సమాధాన పత్రంలో రెండు భాగాలుంటాయి. పై భాగంలో విద్యార్థి హాల్ టిక్కట్ నంబరు కాలేజీ స్టాంపు..

తేది మొదలగు అంశాలుంటాయి. కింది భాగంలో కేవలం సమాధానాలు మాత్రమే ఉంటాయి.

కోడింగ్ ఆఫీసర్స్ సదరు విద్యార్థి హాల్ టిక్కట్ నంబరుకు కేటాయించిన మరో నంబరు కోడింగ్ మెషీన్ ద్వారా సమాధాన పత్రం లోని రెండు భాగాలలో ముద్రించి పైభాగాన్ని చించి వేరు చేయాలి. అలా వేరు చేసిన ప్రతి పదిహేను పేపర్లను ఒక బండిల్‍గా కడతారు. అవి వాల్యూయేషన్‍కు వెళ్తాయి. పై భాగాలను ఒక కవర్లో పెట్టి సీల్ చేయాలి.

డీ-కోడ్ చేసినప్పుడు విద్యార్థుల మార్కులు నమోదై ఫలితాలు.. మార్కుల పట్టికలు తయారవుతాయి.

ఈ ప్రక్రియ కొంచెం క్లిష్టతరమైంది.. కాని ఎంతో బాధ్యతాయుతమైంది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తలకిందులయ్యే  ప్రమాదముంది.

నాకది ప్రథమ అనుభవం. చాలా జాగ్రత్తగా నా అనుమానాలను నివృతి చేసుకుంటూ కోడింగ్ చేస్తున్నాను.

ప్రతీ రోజు ఐదుగంటల వ్యవధిలో రెండువందల యాబై పేపర్లు కోడింగ్ చేయాల్సి ఉంటుంది అనేపథ్యంలో నా ముందు  కూర్చున్న ఒక హిందీ మేడం ఆడుతూ, పాడుతూన్నట్లుగా  వేగంగా.. కోడింగ్ చేస్తోంది.. అ వేగం చూసి ఆశ్చర్యపడే వాణ్ణి.

ఒక రోజు హిందీ మేడం సమాధాన పత్రపైభాగాలు వేరు చేసి టేబుల్‍పై పేర్చింది. అవి కాస్తా గాలికి కొట్టుకు పోయాయి. అన్నీ ఎదురుకొచ్చి చూసే సరికి అందులో కోడింగ్ నంబర్లు లేవు. సమాధాన పత్రాల్లోనూ కోడింగ్ నంబర్లు లేవు. మరిప్పుడు ఏ సమాధానపత్రానికి ఏ పైభాగమో..! ఎలా తెలియాలి?.. చించిన పైభాగంలో కేవలం విద్యార్థి చేతిరాత కలిగిన హాల్ టిక్కట్టు నంబరు మాత్రమే ఉంటుందాయె.

మేడంకు చిరుచెమటలు పోశాయి. హాల్లోని వారందరం నోరు తెరచి చూడసాగాం. ఆవార్త కాస్తా క్యాంపు ఆఫీసరుకు చేరింది.

మేడంను క్యాంపు నుండి సస్పెండ్ చేస్తూ ఆమె పేపర్లను హ్యాండోవర్ చేసుకున్నాడు.

ఆడీపాడిన ఆమె కళ్ళల్లో ఆరిపోని కన్నీటి ధారలు. ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంది. కాని విద్యార్థుల భవిష్యత్తు..? కోడింగ్ నంబర్లు.. ఎలా వేయాలి? తల పట్టుకున్నాడు క్యాంప్ ఆఫీసర్.

ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేసాడు. బోర్డు స్పందించింది. 

ఒక చేతి రాత పరిశీలక నిపుణుణ్ణి పంపించింది. అతడు సమస్యను పరిష్కరించాడు.

***

“ఇలా ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మొత్తం పరీక్షల విభాగానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో.. ఆలోచించండి”        

స్టాఫ్ అంతా ఊపిరి బిగబట్టి వినసాగింది.

సూర్య ప్రకాష్ వాటర్ బాటిల్ లోని కొన్ని మంచి నీళ్ళు తాగి మళ్ళీ చెప్పడమారంభించాడు..

***

1985 జులై ఆరంభంలో అదే జిల్లా లోని అనాసబండ  జూనియర్ కాలేజీకి నన్ను బదిలీ చేసారు. డిగ్రీ కాలేజీలలో నుండి జూనియర్ కాలేజీలను వేరు చేసి అందులో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లనందరినీ బదిలీ చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులతో నేను అనాసబండకు  వెళ్ళాల్సి వచ్చింది.

రెండు సంవత్సరాల బోధనానుభావంతోబాటు  విజయ కుమార్ మాష్టారు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన

మెళకువలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇదివరలా నేను లెక్కలు చేసుకొన్న పేపర్లను తీసుకెళ్లాల్సిన అగత్యం తప్పింది.

నా మొదటి క్లాసుతో పిల్లలు సమ్మోహితులయ్యారు.

నా క్లాసు  కాగానే పిల్లలకు లఘుశంక విరామ సమయం..

కాలేజీ ప్రహరీ గోడకు ఆనించి తాటాకులు కప్పిన గుడిసెలో తాతయ్య అల్లం టీ బలేరుచిగా చేస్తాడు.

స్టాఫంతా కలిసి  బయలు దేరాం.

ఇద్దరు వ్యక్తులు  మాకెదురయ్యారు. వారిని చూడగానే మా ఫిజిక్స్ లెక్చరర్ దిక్కులు పెక్కుటిల్లేలా నవ్వసాగాడు. మాతో బయలుదేరిన మిగతా లెక్చరర్లూ అతడితో శ్రుతి కలిపారు.

నేను బిత్తర పోయాను. అర్థంగాక నా ఎర్రిమోహాన్ని చూసి మరింత నవ్వ సాగారు. నాకొకింత కోపం వచ్చింది. నా ముఖంలోని మార్పును చూసి నవ్వడమాపారు.    

“మాష్టారూ.. విషయం తెలిస్తే మీరూ నవ్వుతారు..” అంటూ వారిని పరిచయం చేయసాగాడు మా ఫిజిక్స్ లెక్చరర్. “వీరు కంజీర జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్.. వీరేమో ఫిజిక్స్..” అని నా వంక చూపెడ్తూ..  “మా కాలేజీలో కొత్తగా జాయినయిన మ్యాథ్స్ లెక్చరర్ సూర్యప్రకాష్” అన్నాడు.

అందరం కరచాలనం చేసుకున్నాం.

మరి నవ్విన కారణమేమిటో.. అన్నట్లుగా చూసాను.

మా ఫిజిక్స్ లెక్చరర్ మళ్ళీ నవ్వుతూ “మాష్టారూ.. డిగ్రీ కాలేజీల్లో నుండి జూనియర్ కాలేజీలను వేరు చేసారు గాని వసతులు సమకూర్చ లేదు ప్రభుత్వం. వసతులేం ఖర్మ.. అసలు వీళ్ళ కాలేజీకి భవనమే లేదు. ఆ ఊళ్ళో ఉన్న ఒక్క స్కూల్ భవనంలో ఉదయం ప్రైమరీ సెక్షన్.. మద్యాహ్నం హైస్కూల్ సెక్షన్లు నడుస్తున్నాయి”

“అయితే వీరి కాలేజీ..” అమాయకంగా అడిగాను.

“అందుకే మరి.. మేమంతా నవ్వేది.. చచ్చీచెడి స్కూల్ హెడ్మాస్టర్ ఒక చిన్న గది ఇచ్చాడు. అందులో ఒక టేబుల్.. దానికొక పక్క ప్రిన్సిపల్ మరో పక్క రికార్డ్ అసిస్టెంట్ కూర్చుంటారు. బంట్రోతు బయట బండ మీద కూర్చుంటాడు” అంటూ మళ్ళీ నవ్వడం మొదలు పెట్టాడు. 

“లెక్చరర్లంతా బస్సులో ఆఊరికి వెళ్లేసరికి  అటెండర్ హాజరు రిజిస్టరందిస్తాడు. బస్సులోనే సంతకాలుకానిచ్చేసి అదే బస్సులో సింపుల్ పెండ్యూలంలా  తిరుగు ప్రయాణం.. ఇదీ సంగతి”

నేను ఆశ్చర్య పోయాను.

“అదేంటి మాష్టారూ.. విడ్డూరంగా వుందే.. మరి పిల్లలు..?” అడిగాను.

“పిల్లల హాజరు.. ఆటోమేటిగ్గా పడిపోద్ది.. జీతభత్యాలూ అటోమేటిక్..”

“పాఠాలూ.. పరీక్షలు..”

“దేవుడెరుగు.. ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేస్తామని ఊరి సర్పంచ్ అంటున్నాడు.. దాని కోసమే ఎదురు చూస్తున్నాం..” అంటూ కంజీర కాలేజీ మ్యాథ్స్ లెక్చరర్ నింపాదిగా చెబ్తుంటే   అంతా కలిసి తాత గుడిసె వైపు దారి తీసాం.

టీ ఆస్వాదిస్తూ నేను కంజీర కాలేజీ గురించే అలోచించ సాగాను. ప్రభుత్వం ఎందుకంత హడావుడి పడింది.. పిల్లల భవిష్యత్తు..?

అలా నలుగురి ముందు లెక్చరర్లు అభాసుపాలుగావటం నాకు నచ్చలేదు. సున్నితంగా నాలుగు మాటలు చెప్పాలనిపించింది.

కంజీర మ్యాథ్స్ మాష్టారు వంక చూస్తూ..“మాష్టారూ.. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాటచెబుతాను” అంటూ నెమ్మదిగా కదిలించాను.

చెప్పండి ఫరవాలేదు అన్నట్లుగా నా వైపు చూసారంతా..

“ముందుగా మన వృత్తికి న్యాయం చేస్తున్నామా ఆలోచించండి. జీతాలు తీసుకొని ఎంజాయ్ చేయడం న్యాయం కాదు.

 ప్రభుత్వమంటే ఎవరు? మనమే.. మన నిర్ణయానుసారమే కాలేజీలు వేరు పడ్డాయి. ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పడే వరకు మనం సహకరించాలి. చెట్టు కింద పాఠాలు చెప్పలేమా? ఊళ్ళో చెట్లే కరువా?.. చెప్పాలనే మనసుండాలి కాని మార్గం దొరక్కపోదు.. విద్యార్థులకు ఎంత అన్యాయం చేస్తున్నామో..! ఆలోచించండి..” అంటూ టీ తాగడం పూర్తి చేసి కదిలాను. వారి ముఖం నాకు చూడబుద్ధి కాలేదు.. చదువెక్కువ సంస్కారం తక్కువ.. చదువు సంస్కారానికి  గీటురాయి అనుకునే కాలం పోయింది. అని మనసు కుత కుతలాడింది. వెనుతిరిగి చూడకుండా స్టాఫ్‍రూంకు పరుగుతీసాను. వారి ముఖాల్లోని రియాక్షన్ ఊహించుకుంటూ..

వారం రోజులు తిరక్కముందే నాకు మునిపల్లి జూనియర్ కాలేజీకి బదిలీ అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి. నేను శ్రీకొండ కాలేజీలో జాయినయిన రోజు నాగమణి మ్యాథ్స్ మేడం నేను పరస్పర బదిలీ ఒప్పందంపై సంతకం చేసిన ఫలితమది.

నా మనసు  ఎగిరి గంతులు వేసింది. క్షణం సేపు చిన్న పిల్లాడినై పోయాను.

స్టాఫ్ అభినందనలు తెలిపింది.

హైదరాబాదుకు చేరువౌతున్నాననే ఆనందం.. నాకారాత్రి నిద్ర రాకుండా చేసింది.  

           అమరునాడే నా స్థానంలో చేరడానికి నాగమణి మ్యాథ్స్  మేడం బదిలీ ఉత్తర్వుల కాపీ తీసుకొని వచ్చింది. మనిషి నిరాడంబరంగా  వుంది. ఈ కాలంలో అలా సింపుల్‍గా వుండటం చూడముచ్చటేసింది.

నన్ను చూడగానే “అన్నయ్యా..” అంటూ బావురుమంటూ ఏడ్చింది. నేను గాబరా పడ్డాను.

“నిజంగా నా పాలిట దేవుడు మీరు. నేను ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను.. నాకు  మళ్ళీ మా ఊరు చూసే భాగ్యం కలుగుతుందనుకోలేదు.. నేను చచ్చి పుట్టానన్నయ్యా..” అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది.

నేను ఉపశమన వాక్యాలు పలికాను. “నేనూ మా ప్రాంతానికి వెళ్తున్నాను.. నాకూ సంతోషంగానే ఉందమ్మా..” అంటూ టీ తాగడానికి తాతయ్య గుడిసెకు వెళ్ళాం.

టీ తాగుతూ  అసలు విషయం చెప్పడం మొదలు పెట్టింది నాగమణి.

“మాష్టారూ.. మీ మూలాన నేను నరక కూపం నుండి బయట పడ్డాను. నా జన్మాంతం మీకు ఋణపడి ఉంటాను” అంది.

నాకు అర్థం గాక ఏం జరిగినదన్నట్లు ముఖం పెట్టాను. నాకూ కాస్తభయమేసింది. ఆ నరక కూపంలో నేను అడుగు పెట్టబోతున్నాను కదా..! అనుకున్నాను.

            నా ముఖ కవళికలు చదువుతూ..

“మాష్టారూ.. మీరు మగవారు.. మీమ్మల్నేమీ ఇబ్బంది పెట్టరు. నేను ఆడదాన్ని పైగా పరాయి ప్రాంతం.. నన్ను అన్ని రకాలుగా హింసించారు అక్కడి స్టాఫ్” అంటూ విషయానికొచ్చింది.

“మునిపల్లి పచ్చిపల్లెటూరు. ఆ ఊళ్లోనే నాకు ఒక గది ఇప్పించాడు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్. అద్దె చెల్లించాల్సిన పని లేదు. రాజకీయ నాయకులెవరైనా వస్తే విడిది చేసే భవనమిది.  భయమేమీ లేదు నిశ్చింతగా ఉండొచ్చని భరోసా ఇచ్చాడు..

ఎలాగూ ఊళ్లోనే ఉంటున్నావు కదా..లైబ్రరీ ఇంచార్జ్ కూడా తీసుకోవాలి తప్పదంటూ నాకు అంటగట్టాడు”టీ తాగడం పూర్తి చేసింది. ఖాళీ గ్లాసు బల్లపై పెడ్తూ..

“మాష్టారూ నన్ను హింసించిన వాళ్లకు పుట్టగతులుండవు. కుళ్ళి, కుళ్ళి  కృశించి చచ్చి నరకానికి పోతారు” అంటూ శపించ సాగింది. ఆమె ఆవేదన భరించలేకుండా ఉంది.

“అసలేం జరిగిందమ్మా”ఉండబట్ట లేక అడిగాను.

“ఆడది ఒంటరిగా మనలేదు మాష్టారూ.. కాని ఏం చెయ్యను?.. మానాన్న రిటైర్డ్ ఉద్యోగి మంచంపై నుండి లేవలేడు. ఆయనకు సపర్యలు చేయాల్సింది మా అమ్మే.. మేమిద్దరం ఆడపిల్లలం మాకొక అన్నయ్య. మా అక్కయ్య స్కూల్ టీచర్. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె పెళ్ళైతే గాని నా పెళ్లి గురించి ఆలోచించలేను.

మా అన్నయ్య ఇల్లరికం వెళ్ళాడు. మమ్మల్ని మర్చిపోయాడు” అంటూ కంటతడి పెట్టింది.

“నేను ఒంటరిగా మునిపల్లిలో ఉండక తప్పలేదు. అందరికీ లోకువై పోయాను.

ఒక రాత్రి తెలుగు మాష్టారు పాపారావు ఫుల్‍గా తాగి నాగదికొచ్చాడు. ఏవేవో అసందర్భపు ప్రేలాపన లాడుతూ నన్ను లోబర్చు కోవాలని ప్రయత్నం చేసాడు. నేను ధైర్యంగా ఎదురించి దగ్గరలోనే ఉన్న పోలీసు స్టేషన్‍కు పరుగెత్తాను. స్టేషన్లో నేను అవమానంపాలయ్యానే గాని న్యాయం జరుగలేదు.

పాపారావుకు రాజకీయ పలుకుబడి ఉంది. అతడిని నేను ఏమీ చేయలేక పోయాను.

ఇక ఊళ్ళో ఉండటం ప్రమాదకరమని వికారాబాదుకు మారాను. పాపారావు నా మీద కక్షతో విద్యార్థులను ఉసిగొలిపాడు. కొందరు విద్యార్థులు వికారాబాదు నుండి మునిపల్లికి వచ్చే వాళ్ళు. అందులో కొందరు పిల్లలు బస్సులో నా వెనకాలే కూర్చొని వ్యంగ్యాస్త్రాలు విడవడం.. భరించలేకపోయే దాన్ని.
రాత్రుళ్ళు నాగది ముందు తారట్లాడుతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేసే వారు. నేను కిటికీలు గూడా తెరిచే దాన్ని కాను. భయం భయంగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికాను.
ఇక బదిలీ కాగానే లైబ్రరీ ఇంచార్జ్ పాపారావుకిమ్మన్నాడు ప్రిన్సిపాల్. పాపారావు స్టాక్‍రిజిస్టర్ తీసుకొని ఒక్కొక్క పుస్తకం అప్పగించమని ఒత్తిడి తెచ్చాడు. నాకు అలా అప్పగించలేదని అడిగితే అలా తీసుకోక పోవడం నీ తెలివి తక్కువతనం.. అని బెదిరించాడు. నిజమే.. అది నా తెలివి తక్కువతనమే ఏడుపొచ్చింది..  లేని పుస్తకాల కోసం పదిహేను వేల రూపాయలు నావద్ద లాక్కున్నారు.. రశీదు లేదు..పాడూ లేదు..
రిలీవై వస్తుంటే నన్ను హీనంగా  తరిమాడు పాపారావు. మరోపక్కవిద్యార్థులు లెక్చరరన్న గౌరవం చూపకుండా రౌడీ మూకల్లా వెంటపడ్డారు. నేనేం పాపం చేసాను.. నాకెందుకీ శిక్ష..” అంటూ భోరున ఏడ్చేసింది నాగమణి. నా కళ్ళూ చెమర్చాయి.
“మాష్టారూ మీ మూలాన నేను బతికి బట్టగట్టాను. ఎవరికైనా స్థానబలం కావాలి.. నాకిప్పుడది లభించింది.. “ అంటూ కాస్తా తేరుకుని కర్చీఫ్‍తో కన్నీళ్లు ఒత్తుకుంది.
“అన్నట్టు చెప్పడం మరిచాను. మా అక్కయ్య పెళ్లి కుదిరింది మాష్టారూ.. సరిగ్గా సమయానికి వచ్చాను.. మీ మేలు ఎన్నటికీ మరువ లేను”
“పదే. పదే నన్ను పొగడకమ్మా.. అయిందేదో అయింది. అనుభవాల దొంతర్లలో  మనం మన జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశముంటుంది. జీవితమన్నాక చీకటి వెలుగులు తప్పవు” అని ఓదార్చాను.
ఇద్దరం కలిసి కాలేజీకి బయలు దేరాం. దారిలో సిలబస్ విషయం చెబుతూ ‘ప్రస్తారాలు-సంయోగాలు’ పూర్తి  చేసాను అనగానే ఆమె కళ్ళు మెరిసాయి.
“మాస్టారూ నేను సబ్జెక్ట్ మర్చిపోయాను. మళ్ళీ ప్రిపేర్ కావాల్సిందే.
మునిపల్లిలో విద్యార్థులకు చెప్పాలంటే చాలా కష్టమయ్యేది. నాలుగును వందతో గుణిస్తే ఎంత వస్తుందని అడిగితే పైన నాలుగు కింద వంద వేసుకొని సున్నాలతో గుణిస్తూ చివరికి తప్పే చేసే వారు. అలాంటి వారికి మ్యాథ్స్ చెప్పాలంటే ఎంత కష్టం.. అందులో ప్రస్తారాలు సంయోగాలు, అవధులు చెప్పడం చాలా కష్టం.. చాలా థాంక్స్ మాస్టారూ.. నాకు చాలా శ్రమ తగ్గించారు” అంటుంటే ఆమె మోముపై చిరునవ్వు విరబూసింది.

***

1 comment:

  1. మీకు చెడ్డ క్రెడిట్ ఉందా? మీరు బిల్లులను చెల్లించడానికి డబ్బు అవసరం? మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? నిరుపేద నిధుల కారణంగా మీరు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ఉందా? మీకు ప్రయోజనం కలిగించే ఏ ప్రత్యేకతలోనైనా పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు అవసరమా? మరియు మీరు ఏమి చేయాలో మీకు తెలియదు? మేము క్రింది రుణాలను అందిస్తాయి: వ్యక్తిగత రుణాలు, సురక్షితం మరియు అసురక్షిత రుణాలు, కలయిక రుణాలు, విద్యార్థి రుణాలు, ఏకీకరణ రుణాలు మరియు చాలామంది ఇతరులు 2% వడ్డీ రేటుతో చాలా అనుకూలమైన నిబంధనలు మరియు షరతులతో. కానీ దయచేసి దరఖాస్తుదారులు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. ద్వారా మరింత సమాచారం కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి సంకోచించకండి (ఇమెయిల్: prudentialinvestmentmanagement@gmail.com) లేదా సంప్రదించండి: +1 205-671-0404

    ReplyDelete

Pages