చిత్ర కళా తపస్వి - ఆర్టిస్ట్ బోసు - అచ్చంగా తెలుగు

చిత్ర కళా తపస్వి - ఆర్టిస్ట్ బోసు

Share This
చిత్ర కళా తపస్వి - ఆర్టిస్ట్ బోసు
భావరాజు పద్మిని

చిన్నప్పటి నుంచి ఆయన ఆశ, శ్వాస, ధ్యాస, కేవలం చిత్రకళే. కాని ఆ కళను ఎలా నేర్చుకోవాలో చెప్పే గురువూ లేరు, నేర్చుకునేందుకు తగిన ఆర్ధిక స్తోమతా లేదు. మనసులో ఉన్న సంకల్పమే దారి చూపించగా, తప్పటడుగులు వేస్తూ, పడిపోతూ, తిరిగి లేస్తూ, నడక నేర్చుకుని, నమ్మిన దారిలోనే నడిచారు ఆర్టిస్ట్ బోసు గారు. ఈనాడు చిత్రకళా రంగంలో తనకంటూ మంచి పేరు, స్థానం సంపాదించుకుని, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఇదే రంగంలో కృషి చేస్తున్న బోసు గారి పరిచయం ఈ నెల ప్రత్యేకించి మీకోసం...

మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.

నాపేరు అబ్దుల్ రాయబోస్. మా అమ్మ పేరు జమునబీ, నాన్న అబ్దుల్ నబి. మాది నిర్మల్ జిల్లాలో కడం మండలంలో, లింగపూర్ గ్రామం. నేను చిన్నప్పటినుండి బొమ్మలు వేస్తుండేవాన్ని. ఆర్ట్ మీద ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను.

నేను 8వ తరగతి వరకే స్కూలుకు వెళ్లి, బొమ్మలు బాగా నేర్చుకోవాలని స్కూల్ మానేసి, ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ దగ్గర చేరా. అప్పుడు నేను బుక్ లో బొమ్మలు వేసేది వాళ్ళే, అనుకునేవాడిని. అందుకే అక్కడ చేరా, కానీ తర్వాత తెలిసింది, ఇది కాక, ఇంకా వేరే ప్రపంచం ఉందని. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నా కాని రాయడం మాత్రమే నేర్చుకోగలిగాను. అప్పుడు నాకు పైంటింగ్ లో డిగ్రీ ఉంటుంది అని తెలిసింది.

కానీ నాకు చదువు లేదు, మాది ఉన్నత కుటుంబం కాదు. మధ్యతరగతి కూడా కాదు. నాన్న వ్యవసాయం, అమ్మ కూడా గృహిణి. తర్వాత ఇంటికి

వచ్చి, మళ్ళీ ప్రైవేటు గా 10 వతరగతి రాసి ,పాస్ అయ్యా. అప్పుడు డిగ్రీ చేద్దామని హైదరాబాద్ వచ్చా కానీ, నా దురదృష్టవశాత్తు ఎంట్రెన్స్ కోసం కనీస అర్హత ఇంటర్మీడియట్ చేశారు. 




నిరాశ పడ్డాను కానీ, ఇక్కడ ఇంకో అవకాశం ఉందని తెలిసి వెంకటేశ్వర యూనివర్సిటీ లో చదవాలని వెళ్లాను. కానీ అక్కడ సంవత్సరానికి 10 వేలు అన్నారు. ఇంట్లో అన్ని డబ్బులు పెట్టే స్థోమత లేదు. అది దూరమైంది కానీ, బొమ్మలు వేయడం ఆపలేదు. ఇలా వేస్తూనే బ్రతకడానికి చాలా పనులు చేసాను.

మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?

మా ఫామిలీ లో ఆర్టిస్ట్ లు ఎవరు లేరు.

చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?

నాకు ఊహ తెలిసేటప్పటికి నేను బొగ్గుతో, బలపంతో ఎక్కడ పడితే అక్కడ ఏవో బొమ్మలు వేసేవాడిని. గోడలు పాడుచేస్తున్నావని, ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు.

మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?

నాకు గురువులు అంటూ ఎవరు లేరు. కానీ బాలి , సుభాని గార్ల బొమ్మలు
చూసి ప్రాక్టీస్ చేసేవాడిని. ఇక ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక శేష బ్రహ్మం అన్న, గుండు ఆంజనేయులు అన్న, బాగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ బొమ్మలంటే చాలా ఇష్టం.

మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?

పూర్తి స్థాయిలో ఈ రంగం లోకి బ్రహ్మం అన్న గారి వల్లే వచ్చానని చెప్పాలి. వారి ప్రోత్సాహంతోనే నా ప్రస్తానం మొదలయ్యింది.

ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?

ఈ రంగం కొంచం ఇబ్బందే. పేరు రావాలంటే కష్టమే. కానీ పట్టుదలతో వర్క్ చేస్తే, అది అసాధ్యం ఏమి కాదు. కాని బొమ్మలు వేసుకునే బ్రతకాలంటే కష్టమే అని అర్థం అయింది.

మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.

నేను వేసిన 'ఫిష్ ముక్కలు' బొమ్మ బాగా పాపులర్ అయ్యింది.

మీరు పొందిన మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.

నేను వేసిన అన్ని బొమ్మలకు ప్రశంసలు అందాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ ఫిష్ బొమ్మకు పలువురి మన్ననలు పొందాను.

మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?

నా భార్య యస్మిన్, నేను రోజంతా బొమ్మలు వేసుకుంటూ ఉన్నా, ఆమెఅస్సలు చిరాకు పడదు. ఇంకా మెచ్చుకుంటుంది కూడాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళుకూడా 'పప్పా, ఈరోజు ఏం బొమ్మ వేసావని', స్కూల్ నుండి వచ్చాక అడుగుతారు.

భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

నేను చెప్పేది ఏముంటుంది, కానీ బొమ్మలు టైంపాస్ కోసం బొమ్మలు వేయొద్దు. ఇష్టంతో వెయ్యాలి. మన బొమ్మను మనం ప్రేమించాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు కూడా ప్రేమించేంత బాగా వెయ్యగలుగుతాము .

ఆర్టిస్ట్ బోసు గారు మరిన్ని మంచి బొమ్మలు వేసి, మంచి పేరు తెచ్చుకోవాలని, విజయ శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది -అచ్చంగా తెలుగు.

1 comment:

  1. హృదయపూర్వక అభినందనలు సర్

    ReplyDelete

Pages