మీనం మేషం బ్రహ్మజ్ఞానం - అచ్చంగా తెలుగు

మీనం మేషం బ్రహ్మజ్ఞానం

Share This
మీనం  మేషం   బ్రహ్మజ్ఞానం 

రావి కిరణ్ కుమార్

అర్ధ సత్యాలు అసత్యాలనే సత్యాలుగా భ్రమింపచేస్తూ వాట్సాప్ లో రకరకాల జ్ఞానాలు ప్రపంచమంతా చుట్టేస్తున్నవేళ...
నేను ఓ ఉదయాన ఓ జ్ఞాన వీచికను అందుకున్నా . అది చదివాక ముందు కనులు తరువాత మనసు తెరుచుకున్నాయి.
అది పూర్తిగా గుర్తు లేదు గాని... 

ఆకులు తింటేనే జ్ఞానమొస్తుందంటే, మేకలు బ్రహ్మజ్ఞానులవ్వాలి, నీళ్లలో మునిగితే పాపలు పోతాయి అంటే చేపలు ఎంతో పుణ్యం పొందాలి.... అంటూ ఇంకేదో వుంది మరచాను. 
అది చదివి ఇది వ్రాయాలనిపించింది తప్పని భావిస్తే క్షంతవ్యుడిని. 

ఆకులు తింటే బ్రహ్మజ్ఞానం రాదు నిజమే,
నీళ్ళల్లో మునిగితే పాపాలు పోవు  అదీ నిజమే. మనలో లేనిది ఏదీ మనకు ఆవల లేదు. మనకు ఆవల వున్నదంతా మనలోనే వుంది. ఇది చాలా గొప్ప ఆత్మతత్వం.

తెలిసి మనం చేసేదేమిటి ,తెలియని మేక చేస్తున్నదేమిటి ?
మేకలు ఆకులు అలములు తింటాయి . ఓ వయసు వచ్చాక మనకు ఆహారమవుతాయి. 
బ్రతికినన్నాళ్ళు చీకు చింతా లేక తిరుగుతాయి . తనను ఎదో ఒకరోజు తనను పెంచే మనిషే 
తెగ నరుకుతాడని తెలిసినా, అతనితోనే ఉంటాయి . అతనికి ఆకలి తీరుస్తాయి. అవసరాలు తీర్చే సొమ్ములు సంపాదించి పెడతాయి. అంతే తప్ప ,ఎక్కడా చికాకు చూపవు. అంతటి సౌమ్యగుణం ఎలా వచ్చేనబ్బా?

బహుశా ఆత్మ వేరు, శరీరం వేరు అన్న చిరు జ్ఞానం వాటికి బాగా వంట బట్టి ఉంటుందేమో!
ఆకులు తింటే అబ్బిన బ్రహ్మజ్ఞానం అదేనేమో మరి!

మనం తినే ఆహరం మన ఆలోచనలను ప్రతిబింబిస్తుందంటే అదే కదా మరి.
చేప కనులదానా, అని చక్కని కనులున్న చినదాని చూపుల పోలిక చెబుతుంటారు.
ఏమిటో ఆ చేప కనుల గొప్పదనం?

మనలోని భావాలను ప్రతిఫలింప చేసేవి కనులు . కోటి కాంతులొలుకు కనులంటారు కదా.ఆ కనులకు ఆ తేజస్సు ఎక్కడ నుండి వచ్చింది?
ఎవరి మనసు తేజోవంతమై ఉంటుందో, ఆ కాంతి వారి కనులలో ప్రతిఫలిస్తుంది. మరి మన కనుల కాంతి ఏపాటిదో కానీ చేప కనులతో పోలుస్తారు.
చేపలు నీటిపై గుడ్లను విడచి తమ కంటి యొక్క కాంతిని వాటిపై ప్రసరింప చేయటం ద్వారా తమ సంతు పెంచుకుంటాయి. వాటికా శక్తి ఎక్కడిదో మరి?  
బహుశా ఎప్పుడు జలాల్లో జలకాలాడుతూ ఉండటం వల్లే వచ్చిందేమో.
అంతే కదా, ఎపుడూ పగలు సూర్య కిరణాల తేజస్సును, రాత్రిళ్ళు చందురుని ఓజస్సును తమలో నిలుపుకుని నిత్య యవ్వనంతో తొణికిసలాడుతూ జల జల మంటూ జాలు వారు జలకన్యలే కదా సకల ప్రాణకోటికి ప్రాణాధారం. మరి వాటిలో మునకలేస్తే మనకాపాటి పుణ్యం దక్కదంటారా ?
పెద్దల మాటలు... కడుపు మంట పుట్టించే ప్యారడైజ్ బిర్యాని పాకెట్లు కాదు . సత్తువను, చల్లదనాన్నిచ్చే చద్దన్నం మూటలు.
వారు చెప్పినట్లుగా, ఆకులు అలములు తింటూ , చెప్పిన సమయానికి చెప్పిన తీరులో మునకలేస్తుంటే, బుద్ధి సరి అయిన తీరులో ప్రచోదితమై, మనస్సు తేజోవంతమై,  బ్రహ్మజ్ఞానులం కాలేక పోయినా, నడిచే దైవమని పేరు పొందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారసులుగానైనా నిలుస్తాం.
పెద్దల మాటలు అవహేళన చేస్తూ  ఆత్మజ్ఞానులమని భావిస్తే నిత్యానంద లేక రామ్ రహీమ్ బాబా వారసులుగానో మిగులుతాం.
***

No comments:

Post a Comment

Pages