చెరువు - అచ్చంగా తెలుగు
చెరువు
దొండపాటి కృష్ణ 
“రామకృష్ణకు ఏమైంది నాన్నగారు?” అడిగాడు కృష్ణ.
“ఫోన్ చేసిందెవర్రా?” అడిగాడు తండ్రి.
“శోభన్...” చెప్పాడు కొడుకు.
“వాడికేం పనిలేదా? బయట విషయాలన్నీ చేరేయ్యడమేనా?” కసురుకున్నాడు తండ్రి.
“అంటే విషయం ముందే తెలుసా? నాకెందుకు చెప్పలేదు మరి” అడిగాడు కొడుకు.
“చెప్తే ఏం చేస్తావ్? వాడిలాగా మూర్ఖంగా ప్రవర్తిస్తావా?” కన్నెర్ర జేశాడు తండ్రి.
“ఇంటికేప్పుడు వచ్చినా పలకరించేవాడు. ఈసారి రాకపోయేసరికి అనుమానమొచ్చినా, బిజీగా ఉండి పట్టించుకోలేదు. ఇలా జరిగిందని మాట మాత్రమైనా చెప్పలనిపించలేదా మీకు?” సూటిగా అడిగాడు కృష్ణ.
“చెప్పాలనిపించలేదురా. అయినా ఎందుకు చెప్పాలి? వాళ్ళిద్దరి జత పట్టే జాబ్ మానేసి తిరుగుతున్నావ్. వాళ్ళతో తిరగడం మానేస్తే మంచింది” చెప్పాడు తండ్రి.
“అడిగిన విషయాన్ని మీరెప్పుడు సూటిగా చెప్పారు కనుక” అంటూ బయటకు నడిచాడు కృష్ణ.
“కృష్ణ..కృష్ణ..ఆగు...ఆగరా... వెళ్లకు...” అరిచాడు తండ్రి.
“రెలటివ్స్ కు కాని,ఫ్రెండ్స్ కు కాని ఇలానే జరిగితే చూస్తూ ఉంటారా..? వాళ్ళను చూడ్డానికి వెళ్ళరా?” ప్రశ్నించి, ఆగకుండా శోభన్ ఇంటికెళ్ళాడు కృష్ణ. 
జనరేషన్ ప్రాబ్లమ్ అంటే ఇదేనోమో! చిన్నపిల్లలు - ఏం చేయాలో తెలీక, నచ్చింది చేస్తూ హాయిగా ఆడుకుంటారు. టీనేజీలో- అయోమయంలో తప్పటడుగులు వేస్తారు. కుర్రాళ్ళు- ఆలోచనల్లో ఆవేశాలను నింపుకొని భంగపడతారు. పెద్దవాళ్ళు- ఏమీ పట్టించుకోవద్దంటూ, నీ గురించే పట్టించుకోమంటారు. తండ్రి కూడా అలాగే ప్రవర్తించేసరికి చిరాకు పడ్డాడు కృష్ణ. శోభన్ టీవీని చూస్తూ కూర్చున్నాడు. కృష్ణను చూసి దాన్ని ఆఫ్ చేసి కుర్చీని అందించాడు.
“అదేంటిరా నువ్వేమో ఆక్సిడెంట్ అన్నావ్. మీఅమ్మెమో ఎవరో కొట్టారంటుంది. అసలేం జరుగుతుందిరా ఊళ్ళో!” అయోమయంగా అడిగాడు కృష్ణ.
“చెప్పెసిందా.! ఆమంతే ఏదీ దాచుకోదురా బాబు...” విసుక్కున్నాడు శోభన్.
“వాడేం తప్పు చేయడు కదరా! అలాంటప్పుడు కొట్టాల్సిన అవసరమేవరిదీ?” అడిగాడు కృష్ణ.
“మనమెన్ని సార్లు చెప్పినా విన్నాడా వాడు. అందుకే జరిగింది. ఊహించిందేగా! ఏం చేస్తాం. వాడి ఖర్మ” నిట్టూర్చాడు శోభన్.
“దేని గురించి?” అనుమానంగా అడిగాడు కృష్ణ.
“ఇంకా దేని గురించి. మనూరి చెరువు గురించే” అన్నాడుశోభన్.
“చెరువు గురించా? మళ్ళా ఏమన్నా గొడవైందా?” అడిగాడు కృష్ణ.
“స్పింటేక్స్ ఫ్యాక్టరీ పెట్టడంతో ఎదురుగానున్న చెరువు పాడైపొతుందని మన దగ్గర గగ్గోలు పెడుతున్నవాడు, అక్కడితో ఆగకుండా తహశీల్దార్ ఆఫీసులో కంప్లయిట్ చేశాడు. వాళ్ళు ఊరుకుంటారా? కొట్టించారు. పర్సనల్ గాకోపంఉన్నప్పుడే కదా బలంగా కొట్టేది... వాడి మనుషులు కూడా బలంగానే కొట్టారు. అందుకు హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చింది” జరిగినది చెప్పాడు శోభన్.
“వాడికేందుకురా బాబు! చెప్తే వినడు. హీరో అనుకుంటాడా ఏంటి? కంప్లయిట్ ఇచ్చిన సంగతి ఫ్యాక్టరీ వాళ్ళకెలా తెలిసింది?” ప్రశ్నించాడు కృష్ణ– మంచినీళ్ళు త్రాగుతూ.
“అదేమన్నా బ్రహ్మ పదార్దమా తెలియకపోవడానికి. పండే పొలాల్ని కొనేసి పంచాయితీ పెద్దలకు, తహశీల్దార్కు డబ్బులు ఇవ్వకుండానే పర్మిషన్ తెచ్చుకుంటారా చెప్పు? ఆ డబ్బు తిన్నోళ్ళు చెప్పరా మరి? అలాంటివాళ్ళతో మనకెందుకురా అంటే విన్నాడా వాడు?” కోప్పడ్డాడు శోభన్.
“ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు?” వివరాలు అడిగాడు కృష్ణ.
“విజయవాడ జనరల్ హాస్పిటల్” అంటూ వివరాలు చెప్పాడు శోభన్.
“సరే పదా వెళ్లి చూసొద్దాం” అంటూ లేచాడు కృష్ణ. శోభన్ కదల్లేదు.
“కోపతాపాలేమన్నా ఉంటే, వాడికి తగ్గాక చూసుకోవచ్చులే. లే... రా...” అన్నాడుకృష్ణ. స్పందనలేదు శోభన్లో.
“రేపు బయలుదేరి వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు. ఒకసారి చూసొద్దాం. రా..రా..! రావా..? సర్లే నేనే వెళ్తాను” అంటూ బయటకెళ్ళి బస్ను ఆపాడు కృష్ణ. ఎక్కి కూర్చున్నాడు. పక్కనే శోభన్ కూడా. ఆ దృశ్యానికి కళ్ళతోనే అభినందించాడు కృష్ణ.
* * * * * * 
విజయవాడ జనరల్ ఆసుపత్రిలో రామకృష్ణ ఉన్న వార్డులోకి వెళ్ళారు. రామకృష్ణపేరెంట్స్ ను పలకరించి లోపలికెళ్ళారు. బెడ్ పై పడుకున్న రామకృష్ణను చూసి ఖంగుతిన్నాడు కృష్ణ.

దళితవాడలో రామకృష్ణే అందగాడని పేరు. చామనచాయ రూపం. ముచ్చటైన వర్చస్సు. విశాలమైన వదనం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవాడు. ఎక్కడ తధాస్తు దేవతలు “తధాస్తు” అంటారేమోనన్న భయంతో చెడు మాటలు మాట్లాడడానికి కాని, తప్పుడు పనులు చేయడానికి కాని వెనకాడతాడు. దేవుడికి నమస్కరించేటప్పుడు కూడా తన గురించి కాక‘స్వామీ! అందరూ బావుండాలి. సుఖశాంతులతో వర్ధిల్లాలి. మంచిగా ఉండాలి. గొడవలు పడకుండా చూడు’ అంటూ ప్రార్ధించడం తెలుసు. అటువంటివాడు బెడ్ పైన, ఆ స్థితిలో చూసేసరికి మతిపోయింది కృష్ణకు. శరీరమంతా బాధ ఆవహించింది. ఏడిస్తేబాగోదనిబాధనంతా కళ్ళలోనే దాచేశాడు. స్పృహలో ఉన్న రామకృష్ణ, కృష్ణలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గతాన్ని తలచుకున్నారేగాని కదిలించి మాట్లాడే సాహసం చేయలేదు. రాత్రికి డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకోచ్చేశారు. తనకోసమే ప్రత్యేకంగా ఉన్న మంచంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు రామకృష్ణ. అతడినుంది వీడ్కోలు తీసుకొని తర్వాతి రోజు హైదరాబాదు వెళ్ళాడు కృష్ణ.
* * * * * * 
ఎస్.ఐ. నాలుగు చివాట్లు పెట్టి, బెయిల్ పేపర్స్ తీసుకొని వదిలిపెట్టాడు. ఆటోలో ఇంటికి ప్రయాణమయ్యారు. జరిగినది తలుచుకుంటూ నారాయణరావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది గమనించిన కృష్ణ ఓదార్చే ప్రయత్నం చేశాడు.
“ఏం చెప్పను బాబు! నువ్వన్నాకాస్త తోడోచ్చావు. నీలా ఏదో ఒకటి చూసుకోరా అని చెప్తే వినడు. గొడవలన్నీ వీడికేందుకు?బలవంతుల ముందు బలహీనులు నెగ్గగలరా?మనమెంత, మన బ్రతుకెంత?” అన్నాడాయన.
“అలా అనుకోబట్టే ఊరినలా దోచేస్తున్నారు” కోప్పడ్డాడు రామకృష్ణ.
“అంకుల్ చెప్పింది నిజమే కదరా! వదిలేయ్యొచ్చుగా?” అన్నాడు కృష్ణ.
“ఏంటిరా? నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావ్” చిన్నగానవ్వాడు రామకృష్ణ.
“అసలెంటిరా నీ బాధ?” ప్రశ్నించాడు గంభీరంగా.
“మన ఊరి చెరువుని గమనించావా? బాధనిపించడం లేదా? వేసవికాలం వస్తే ఈత కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. చెరువు పక్కనే ఉన్న బళ్ళో చదువుకునేటప్పుడు మనకన్నీ చెరువే! మన దాహార్తిని తీర్చిన చెరువు ఇప్పుడలా అయిపోతుంటే కొంచెం కూడా బాధ లేదా?” ప్రశ్నించాడు రామకృష్ణ.
“గతం గురించి మాట్లాడుకోవడం వ్యర్ధం. మన దాహార్తిని తీర్చిన మాట నిజమే. అప్పటి మాట వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రతి ఇంటికీ కుళాయి నీరు వస్తుంది. మినరల్ వాటర్ వస్తుంది. అటువంటప్పుడు చెరువు ఏమైపోతే మనకేంటిరా?” గట్టిగానే సమాధానమిచ్చాడు కృష్ణ.
“ఒరేయ్ ఫూల్! ఇక్కడ ఏం వచ్చింది, దేన్నీ మార్చింది అని కాదురా... రేపటి తరానికి ఏమి అందివ్వబోతున్నామన్నది ముఖ్యం.మన పూర్వికులు ఊరికో చెరువు చొప్పున ఏర్పాటు చేసుండకపోతే మనమిలా ఉండేవాళ్ళమా?” అంటున్న కొడుకు మాటలకు అడ్డుపడి -
“ఇదిగో ఇలాగే మాట్లాడుతున్నాడు బాబు. ఏం చేయను?” అని తలపట్టుకున్నాడు నారాయణరావు.
“నిజమే! ఇలా వాదిస్తే ఎవరేం చేస్తారు?” అన్నాడు కృష్ణ.
“వాదించడమెంటిరా.? చెరువుని నమ్ముకుని బోర్లు లేని ఇరవై ఎకరాల పొలం ఉంది. వాటి సంగతేంటి? ఒకప్పుడు మంచినీరు ప్రవహించేది. అక్కడ ఫ్యాక్టరీ కట్టడం వలన చెత్తంతా చెరువులోకి చేరి నీరంతా పాడైపోయింది. చుట్టూ పెద్ద పెద్ద చేట్లుండేవి.ఇప్పుడెలాఉందొ చూశావా? ఆ నీళ్ళను పొలాల్లోకి పంపిస్తే పంటలు పండుతాయా? మనం తినగలమా చెప్పు?” అన్నాడు రామకృష్ణ.
“అది పొలం ఉన్నవాళ్ళు పట్టించుకోవాలి. నీకు లేదు - నాకు లేదు. మనకెందుకొచ్చిన గొడవ? వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారుగా. వాటి గురించి పట్టించుకుంటే నీకేమొస్తుందిరా.?” అడిగాడు కృష్ణ.
“మీ నాన్న కూడా నీతో ఎన్నోసార్లు ఈ మాట అనే ఉంటారు. నువ్వు మారావా..? ఏదో వస్తుందని చేయను. ఏదో పోతుందని మానేయ్యను. నువ్వెందుకిలా మారిపోయావో నాకర్ధం కావడం లేదు కృష్ణ” అన్నాడు రామకృష్ణ.
“చెరువు...చెరువు...చెరువు... వదిలెయ్యరా బాబు” అభ్యర్ధించాడు కృష్ణ.
“ఎలా వదిలేస్తాం? ఎవడబ్బ సొమ్మని చెరువుని ఆక్రమిస్తారు? మొన్నటివరకునీటిని నాశనం చేశారు. ఇప్పుడేమో ఆక్రమణలు. అటుపక్కన శింగన్నగూడెం వాళ్ళు, ఇటుపక్కన పాతరేమల్లె వాళ్ళు, ఆఖరికి మన ఊరోళ్ళు కూడా ఎవరికీ నచ్చినంత వారు ఆక్రమించేసుకొని ఫ్యాక్టరీకెదురుగా షాప్లు పెట్టేస్తున్నారు.చెరువు కనుమరుగయ్యే పరిస్థితిది. చెరువులన్నీ కనుమరుగైపోతే భూగర్భజలాలు ఎలా పెరుగుతాయి?” సూటిగా ప్రశ్నించాడు రామకృష్ణ.
“అంటే ఫ్యాక్టరీలు పెట్టడం తప్పా? అవి రావడం వలన ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందిరా” అన్నాడు కృష్ణ.
“ఉపాధి దొరుకుతుందా.? నిజమే దొరుకుతుంది. కాని మనోళ్ళకు కాదు. బీహార్, ఒరిస్సా వాళ్లకు. కులపిచ్చి పెరిగి మనోళ్ళు మనగల్గుతున్నారా? ఫ్యాక్టరీలు పెట్టడం తప్పని ఎందుకంటాను.? దానికిది అనువైన చోటు కాదంటానంతే. పొలం పండని చోటయితే మంచిది. బాగా పంటలు పండే ఇలాంటి చోట్ల కడితే ఏం లాభం? ప్రజలకు ధాన్యమేలా వస్తుంది? ఇక్కడ దొరక్క పక్క రాష్ట్రాల నుండి ఖర్చెక్కువ పెట్టి తెచ్చుకోవడం, వాటికి టాక్స్ లంటూ వగైరా వగైరా! పంటలు నాశనం అవ్వడమే. కరెంటు ఆఫీస్ నుండి ఫ్యాక్టరీకి కొత్త లైను వేశారు.రోడ్డుకిరువైపులా చెట్లు, వాటి మధ్యనుండి పెద్ద లైను. వాటి కిందనే ఇళ్లకిచ్చే కరెంటు స్థంభాల లైను. చిన్న షాట్ సర్క్యూట్ జరిగిందంటే ఊరి మొత్తం కాలిపోతుందిరా..! రెండు రోజుల క్రితం పాతరేమల్లె ఎరువుల ఫ్యాక్టరీలోవిద్యుత్ఘాతానికి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.మనిషి ప్రాణమంటే అంత చులకనా? అంతా నిరక్షరాస్యులే!గుడ్డి ఎద్దొచ్చి చేలో మేసినట్లు పనిచేసుకుంటూ పోవడమే కాని వారికేం తెలుస్తుంది చెప్పు. ఇలాంటిదే జరిగితే ఊరిమొత్తం స్వాహా, తెలుసా..?” బాధపడ్డాడు రామకృష్ణ.
“ఇప్పుడేమంటావ్?” వాదించలేక నిట్టూర్చాడు కృష్ణ.
“వదలను. ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు స్పందించేవరకు పోరాడుతూనే ఉంటాను. పైఅధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉంటాను. ఒక్కడైనా మన పరిస్థితికి జాలిపడి స్పందించక పోతాడా.?” ఆశాభావం వ్యక్తం చేశాడు రామకృష్ణ.
“అవినీతి కళ్ళను, నీతి నిజాయితీలను డబ్బుతో ముంచేసినప్పుడు నీ ఫిర్యాదులు, బాధలు వాళ్లనేలా స్పందించేలా చేస్తాయ్? వస్తే గిస్తే ఆవేశమొచ్చి మళ్ళీ జైల్లో పెట్టిస్తారు. జైల్లో కెళ్తే కెరీర్ మొత్తం నాశనమవుతుందిరా... ఆలోచించుకో...” చెప్పాడు కృష్ణ.
“ఇప్పుడు మాత్రం కెరీర్ ఉందా? వదలను. ఇలా చూస్తూ వదల్లేను” అందుకున్నాడు రామకృష్ణ.
“అంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టాక నీ వల్ల తీసేస్తారా? కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే ప్రాణాలు తీయడం వాళ్ళకేంలెక్క కాదు. అంత మంకుపట్టు ఎందుకు?” బాధ పడ్డాడు కృష్ణ.ఆటో వేగంగా ప్రయాణిస్తోంది.
“తీస్తే తీయని. నా చావు వలన జనానికి కనువిప్పు కలుగుతుంది. నా చీకటి కొన్ని తరాలకు వెలుగవుతుంది. చంపేస్తారని భయపడిపోతామా ఏంటి?ఫ్యాక్టరీ కోసం ఇరవై ఎకరాలు కొన్నా, చుట్టు పక్కల ఎన్నో ఎకరాల పొలాలకు దార్లు మూసుకుపోయాయి. కాలుష్యం వలన పక్కపోలాలు దెబ్బ తింటున్నాయి. ఆ బాధలు పడలేకే అమ్మేసుకుంటున్నారు. దాంట్లో కొత్తగా జ్యూస్ ఫ్యాక్టరీని కడుతున్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్కు ‘అమరావతి’ రాజధాని అయ్యిందని తెలివిగల వాళ్ళు లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టేశారు. నల్లధనాన్ని చలామణిలోకి తేవడానికి ఇదో మంచి మార్గమయ్యింది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం వలన పక్క ఊరినుంచి పెద్ద కాలువ నిత్యం ప్రవహిస్తోంది.కొత్త రాజధానికి, ‘పెద్దలకు’ నీళ్ళ ఇబ్బంది రాకూడదని ఇలా అర్జెంటుగా అనుసంధానం చేసుకున్నారంటే నమ్మగలవా? ఇదేదో రెండు మూడు సంవత్సరాలకుక్రితం జరిగినా పొలాలు అమ్ముకోకుండా సాగు చేసుకునే వాళ్ళు కదా! ఆలోచిస్తుంటే ఆవేశమొస్తుంది. మాట్లాడుతుంటే బాదేస్తుందిరా క్రిష్” అంటూ ఆపేశాడు రామకృష్ణ.
“నీ పిచ్చి కాని జనమిదంతా ఆలోచిస్తారా? పంటలు పండనప్పుడు ఏం చేస్తారు? ఇలా అమ్మేసుకుంటారు” చెప్పాడు కృష్ణ.
“వర్షాలు లేకపోతే పంటలేలా పండుతాయ్? వర్షం వచ్చినప్పుడు నిల్వ చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవ్వడం, పాడైపోవడం జరుగుతుంటే ఇంకెలా పండిస్తారు? భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని పచ్చదనంతో నింపితేనే కదా వర్షాలు పడేది. ఫ్యాక్టరీలు ఇష్టమొచ్చినట్లు పెట్టేసి కాలుష్యాన్ని పదిరెట్లు పెంచేస్తే వర్షాలెం పడతాయ్? బోరు బావుల్లో కూడా నిల్వలు తగ్గిపోతున్నాయి.అవింకా తగ్గితే పరాయి దేశస్తుల్లా అన్నంకు బదులుగా పిజ్జాలు, బర్గర్లు అంటూ కృత్రిమమైన భోజనం చేయాలి. అప్పుడు మనిషి కూడా కృత్రిమమైపోతాడు. అదే నా బాధ. అర్ధం చేసుకునేదేవర్రా?” బాధపడ్డాడు రామకృష్ణ.
“ఇన్నాళ్ళు నీలోనున్న అతి మంచితనం చచ్చిపోవాలనుకున్న, కానిప్పుడు నీలోనున్న మూర్ఖత్వం చచ్చిపోవాలనుకుంటున్నాను రా...” కోపంగా అన్నాడు కృష్ణ.
“అవునులే... నా ఆవేశం, ఆలోచనా నీకు మూర్ఖత్వంలానే అన్పిస్తుందిలే. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, దాని కోసమే ఈ పోరాటం. మరి నీకేం ఉంది. కాసేపు జాబు చేస్తానంటావ్, మరికాసేపు సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బావుంటుందంటావ్, కాసేపు ప్రైవేటు జాబు అంటావ్, మరికాసేపు గవర్నమెంట్ జాబు అంటావ్. నీకంటూ ఒక స్పష్టమైన ఆలోచన ఉందా?హైదరాబాదు నుండి ఇంటికి జాబు మానేసి రెండు సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉన్నావ్. అది తెలియక ఊళ్ళో వాళ్ళంతా నువ్వేదో వెలగబెడుతున్నావ్ అనుకోవడం. నీలో వచ్చిన మార్పెంటిరా? ఇవన్నీ ఆలోచిస్తుంటే మూర్ఖంగా ప్రవర్తించేదెవరు?” ఆటో ఆగగానే రామకృష్ణ కూడా ఆపేశాడు.
ఊహించని సమాధానం, వినకూడదనుకున్న వ్యక్తీ నుండి అపరాధ భావం కల్గించే మాటలు. కృష్ణకుమనస్సు లోతుల్లో ఎక్కడో తడిమినట్లయింది. కొంచం కోపం కూడా వచ్చింది. తమాయించుకున్నాడు. అనుకోకుండా జరిగిన దానికి ముగ్గురూ మౌన మునిలైపోయారు. ఆటోవాడికి డబ్బులిచ్చి పంపించేశారు. కృష్ణ తనింటికి మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తనపై ఎందుకిలా మాట్లాడావని నారాయణరావు ప్రశ్నించాడు రామకృష్ణను.
“వాడికొచ్చింది కోపం కాదు నాన్న. ఆలోచనది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మాటలు మనస్సును మధించేలా చేస్తాయ్. ఈ సంఘటనతో ఆలోచనలో పడ్డాడు. వాడి నిర్ణయమేంటో చూద్దాం” అంటూ అతనివంకే చూస్తూ చెప్పాడు రామకృష్ణ. లోపలికెళ్ళి పోయారు.
* * * * * *
“చూస్తుంటే నిండా ముప్పయ్యేళ్ళు లేవు, ఇవన్నీ నీకెందుకయ్యా? ఎవరితో పెట్టుకుంటున్నావో అర్ధమవుతుందా నీకు?” హెచ్చరిస్తూ అన్నాడు ఆఫీసరు.
“ప్రజలను ఇబ్బంది పెట్టె ప్రతీదీ సమస్యే సార్. పరిష్కారించాలంటే దారులను వెతుక్కోవాలి గాని సృష్టించిన వాడి బలాన్ని, బలగాన్ని చూసి వెనకడుగేయ్యకూడదు సార్” అన్నాడు రామకృష్ణ చిరునవ్వు వదనంతో.
“వినరయ్యా వినరు! మీ వయస్సాలాంటిది. ఉడుకు రక్తం. ఏదో చేద్దామని తాపత్రయం. ఏం చేస్తాం. నీ ఒక్కడివల్ల కాదుకాని సాక్షి సంతకాలు తెచ్చుకో, అప్పుడు చూద్దాం” అంటూ పేపర్స్ ను రామకృష్ణ చేతికందించాడు ఆఫీసరు.
“సంతకం చేయడానికి నేనున్నాను సార్” అన్నాడుఅప్పుడే అక్కడికొచ్చిన కృష్ణ.
“నువ్వెంటిక్కడ?” ఆశ్చర్యపోయాడు రామకృష్ణ.
“ఒకరిద్దరుంటే సరిపోదు. సాక్ష్యం బలంగా ఉండాలి” ఇద్దరి మొహాలు చూస్తూ చెప్పాడు ఆఫీసరు.
“ఇందాకటి వరకు ఒక్కడే. ఇప్పుడిద్దరు.. తర్వాత గుంపులు గుంపులు అవుతారు. ప్రళయం వచ్చే సమయమైంది. అప్పుడొచ్చి కలుస్తాం సార్” అని చెప్పి లెటర్ ను తీసుకొని బయటకు నడిచాడు కృష్ణ.
“ఏంటిరా అంత కోపంగా ఉన్నావ్? హైదరాబాదు వెళ్ళలేదా?” అడిగాడు రామకృష్ణ, కృష్ణను అనుసరిస్తూ.
“ఇక వెళ్ళే అవసరం లేదురా” చెప్పాడు కృష్ణ.
“దానర్ధమేంటి?” అర్ధం కాక అతనివంకే చూస్తూ అడిగాడు రామకృష్ణ.
“చెప్పావ్ గా, లక్ష్యమేదీ లేదని గట్టిగానే మనస్సులో గుచ్చావ్ గా” పేపర్ ను మడుస్తూ అన్నాడు కృష్ణ.
“కోపమొచ్చిందా..?” అన్నాడు చిన్నగా నవ్వుతూ రామకృష్ణ.
“ఆలోచించాను. నువ్వుకాక మరెవరన్నా అంటే ఆవేశపడేవాడినేమో! మూర్ఖంగా ప్రవర్తించాను. నేనలా వాదించాల్సి కాదు. ఒకందుకు మంచిదయిందిలే! ఏం చేయాలో అర్ధమైంది. నీదారే నా దారి” అన్నాడు కృష్ణ.
“నేను చేసేది కొంతమందికి అర్ధంకాదు, నచ్చదు. నువ్వు కూడా నాతొ వస్తే, ఆ సంగతి మీ పేరెంట్స్ కు తెలిస్తే,అమ్మో.. ఇంకేమన్నా ఉందా?” అనుమానంగా అన్నాడు రామకృష్ణ.
“మొదట పెద్ద గొడవే జరిగింది. తర్వాత ఆయనే అర్ధం చేసుకున్నట్లు ఆగిపోయారు. వాళ్ళేతెలుసుకుంటార్లె. రా... మనం వెళ్దాం” అంటూ ఆహ్వానించాడు కృష్ణ.బండిపై ఎక్కి బయలుదేరారు.
“చిన్నవాళ్ళం పెద్దవాళ్ళకు నచ్చజెప్పడం, వాళ్ళే తెలుసుకుంటార్లె అని ధీమాగా ఉండడం విచిత్రమే! నాఫ్యామిలీతో పాటు మీ ఫ్యామిలీ కూడా బాధపడుతుందిరా. మనం చేసేది తప్పేమో?” వెనకనే కూర్చొని నిరాశగా అన్నాడు రామకృష్ణ.
“ఏరా నన్ను పరీక్షిస్తున్నావా?” బండిని నడుపుతూ నవ్వుతూ అడిగాడు కృష్ణ.
“అలాని కాదురా! నిన్ను చూశాక ఇప్పుడు భయం వేస్తుంది” వెనకనుంచి భుజంపై చేతులు పెట్టి అన్నాడు రామకృష్ణ.
“ఇప్పటి మన బాధ ఒక పరిష్కారం చూపిస్తే రేపంతా ఆనందమేరా! నన్ను మార్చిన నువ్వు ఇప్పుడిలా డీలా పడడం నచ్చలేదు రామా” అన్నాడు కృష్ణ. మౌనం వహించాడు రామకృష్ణ.
“మా నాన్న అన్నట్లు మన పేర్లు ఒకటే – ఇప్పుడు మన లక్ష్యం కూడా ఒకటే! పేర్లు ఒకటైనంత మాత్రానా మనుషులంతా ఒకలా ఉండాల్సిన పనిలేదన్నాడు ఆయన. అది నిజమే కావొచ్చు. కానిఒక లక్ష్యం కోసం పనిచేసేటప్పుడంతా ఒకటే” భరోసానిస్తున్నట్లు అన్నాడు కృష్ణ. బండి వేగంగా వెళ్తుంది.
“అంతేనంటావా?” రూడీ చేసుకోవడానికి అడిగాడు రామకృష్ణ.
“అంతే!మంచే దేవుడు. చెడే దెయ్యం. మంచి చేస్తే అది దేవుడిలా రక్షిస్తుంది. చెడు చేస్తే అది దెయ్యంలా పీడిస్తుంది. సమస్య తీరిపోతే ఆత్మసంతృప్తిగా ఉంటుంది” అన్నాడు కృష్ణ.
“అయితే మన ఊర్లో కూడా మాటకారులకు కొదవే లేదన్నమాట” అన్నాడు రామకృష్ణ. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. పకపకా నవ్వుకుంటూ లక్ష్యం కోసం ప్రయాణిస్తున్నారు.
-: సమాప్తం :-

4 comments:

  1. చెరువు కలిపింది ఇద్దరిని. మున్ముందు కలుపుతుంది అందరిని.visit bathulaVVapparao.com

    ReplyDelete
  2. చెరువు కలిపింది ఇద్దరిని. మున్ముందు కలుపుతుంది అందరిని.visit bathulaVVapparao.com

    ReplyDelete
  3. కథకి తీసుకున్న అంశం బాగుంది.
    కథనంలో కూడా నైపుణ్యం క్రమేణా కనపడుతోంది.
    ప్రగతి, అభివృద్ధి జీవన గమనానికి అవసరమే కానీ, అవి సంస్కృతిని, మానవ మనుగడకి ప్రయోజనకారులనీ ధ్వంసం చేయకూడదు అనే సత్యాన్ని బాగా చెప్పేవు.

    ReplyDelete

Pages