Tuesday, January 23, 2018

thumbnail

సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం:
సూర్య శతక కవి ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి (క్రీ.శ.1860-1916) గారు క్రీ.శ. 1860 సంవత్సరమున ఖండవల్లి గ్రామమున జన్మించినాడు. తల్లితండ్రులు వేంకటశాస్త్రి, వేంకటాంబ. వీరినివాస స్థానము కాకరపఱ్ఱు. ఆత్రేయస గోత్రులు. ఆశ్వలాయనసూత్రులు. వీరు తర్కాలంకారములను వేదుల సోమనాథ శాస్త్రుల వద్దను, ఉపనిషద్భాష్యములను ఆదిభట్ట రామశాస్త్రుల వద్దను అభ్యసించిరి. ఖండవల్లి, క్రొత్తపేట లలోని పాఠశాలలలో ఉపాధ్యాయులుగా  తరువాత 1880 నుండి 1915 వరకు రాజమహేంద్రవరములో సంస్కృతోపన్యాసకులిగా పనిచేసిరి.
సంస్కృతాంధరభాషలో ఈ కవి ఉద్దందుడు. వీరు రచించిన కౄలు 1. శ్రీమహాభారతనవనీతము (పదమూడు పర్వములు) 2. ప్రభోదచంద్రోదయము, 3. అనర్ఘరాఘవము, 4. శుద్ధాధ్రఋతుసంహారము, 5. గంగాలహరీస్తోత్రము, 6. భామినీ విలాసము, 7. ఆధ్యాత్మరామాయణము, 8. సూర్యశతకము, 9. భారతఫక్కి, 10. పరాశరస్మృతి, 11. కృష్ణాపుష్కరమాహాత్మ్యము.
ఈకవి క్రీ.శ. 1916 లో పరమపదించినారు.
శతక పరిచయం
ఈసూర్యశతకము క్రీ.శ. 600-630 కాలంలో మయూర కవి రచించిన సూర్యశతకమునకు ఆంధ్రీకరణము. మూలగ్రంధము స్రగ్ధరా వృత్త సంకలితము. తెలుగుసేత మత్తేభ శార్ధూలోత్పల చంపకములలో నడిచినది. సంస్కృతమునందు 101 వృత్తములు, కడపటి 102 వ వృత్తమునందు మయూరకవి ఫలశ్రుతియు, స్వవిషయము తెలిపినాడు. తెలుగుసేతయందు మరొకపద్యము అదికముగావ్రాసి అందును ఆతరువాతి సంస్కృతిక గద్యయందును తనవృత్తాంతమును కవి చాటుకొనినాడు. 
ఆంధ్రసూర్యశతకమునందు భాష కొంచము క్లిష్టముగా ఉన్నది. అందుకు కారణము సంస్కృతమునందలి భావమును వ్యక్తపరచుటకు సరి అయిన పదములను చంధోబధముగా వ్రాయటమే అనుకోవచ్చును. ఈశతకమునందు మహిమావబోధకములగు వర్ణనములు ఆరు ఉన్నవి. 1. ప్రభావర్ణనము (1-43), అశ్వవర్ణనము (44-49), 3. అనూరువర్ణనము (50-61), 4. రథవర్ణనము (62-72), 5. మండలవర్ణనము (73-80), 6. రవివర్ణనము (81-101)
మూల శతకము మాదిరిగానే ఈ సతకమున కూడా మకుట నియమము పాటింపబడలేదు.
కొన్ని పద్యములను చూద్దాము
ప్రభావర్ణనము
చ. అరసి వినమ్రులౌ జనులకందఱ కీముకుళాంతరాశ్రితన్
సిరిఁగడుఁబల్మిందేఁ దలఁపుచేబలెఁ జేసెడు నబ్జభేదమే
కరములు, పల్లవాకృతులు కాలతమోముఖపాతిలోక భీ
హరణచణమ్ములార్కము లవన్ని శుభమ్ములు మీకొసంగెడున్
చ. సరసిజగర్భసీమల, నిశాతధరాగ్రముల న్మెలంగెడు
న్సరిగను, విష్టపౌఘసదనప్రఘణాక్రమ సంప్రవృత్తము
ల్నిరతపథిశ్రమంబుననొ నిర్భేఅతాపములెవ్వి, వేగ, వా
సరవిరతిస్సరూపములు సాకెడు మిమ్ము విబ్రధ్ను పాదముల్
మ. పలుమార్విశ్వము సంచరింప నలఁతల్వాటిల్లెనో, స్వోష్మ, శో

సిలెనో, వేసఁగిగ్రాగెనో యొరగలి, న్క్షిత్యంబువు ల్ద్రావి, వా

నలఁ బానాతిశయామయమ్ముననొ, వాతంబుల్, హిమార్తోపమ
మ్ముల, చండమ్ములు, భాన్వభీశుల శుభమ్ము ల్వ్రీల్చు మీకెప్పుడున్
ఒకయెడ వెన్నెలల్దెలుపు నొక్కెడఁజీకటి నల్పుఁదమ్మి దు
మ్మొకకడఁ బచ్చసంజ రెఱుపొక్కటఁగా భువనాఖ్యచిత్రము
త్సుకతను వ్రాయు నర్కునకుఁ దూలిక పోలికనొప్పు ప్రతుషః
ప్రకటితకాంతి మీకుఁ గనుపండువగావుత మెల్లకాలమున్
అశ్వవర్ణనము
మ. సురబృంద మ్మమరాద్రిదారి దరులంజోతల్నుతుల్సేయఁ గం
దరవక్త్రంబుల, హ్రీమదశ్వ ముఖకాంతావక్త్రము ల్సూచి, వే
సరిన న్సారథి, ద్రిప్పుచు న్మెడల నీమన్మందతం బాఱువా
సరకృద్వాజులు మీయఘమ్ములు సముత్సారించు నువ్వెత్తుగన్
ఆనూరువర్ణనము
చ. ఉదయధరాగ్రరంగమున నొయ్యనరే తెరయెత్తఁగాననై
ముదమునఁ జుక్కలనిర్వుల పూర్వత నంజలిఁ జల్లి సూత్రధా
రదశబగంటినాల్గు ప్రహరంబుల నంకములన్వలె న్రుచి
ప్రద, జనమోదనాటిక, దొరంకొను గాశ్యపి మిమ్ముఁగాచెడున్
మ. అపరాధీశునిచేతివో యరుణ యేలా ప్రగ్గముల్పట్ట, నా
సపడంబోకుము విష్ణుచక్రము, విశిష్టం బేకచక్రత్వమే,
ద్యుపవాహమ్మును బూన్ప నష్టమముగా యోచింపకం, చిట్లు ము
క్తాపరేచ్చఖిల పార్కయంత్రితుఁడు సూతశ్రేష్టుడిష్టంబిడున్
అథరథవర్ణనం
మ. సులువెంతేనొకనాట ముజ్జగముల న్సొంపారలంఘించుటన్
బలువెంతే గనకాద్రిశ్రుంగముల రత్నముల్నలంగించుటన్
వెలయున్లోకముపైనొ యస్తశిఖరోర్విం దద్దయుం గ్రిందనో
విలసిల్లు న్రవితేరమేయుగతి దుర్విద్యల్దొలంగించెడున్
చ. అరయఁ ద్రిలోకియుందిరుగు నర్కుని యేయరదంపుఁ జక్రమం
దరములబంతిఁజక్రి, హరి యాహరుల, న్వరుణుం డనూరుఁ, గూ
బరము గుబేరుఁడు, న్సురలు భాసురవేగము, నక్షమున్వల
క్షరుచి రుచిప్రసాదయుతి సన్నుతియింతురు మిమ్మదేలెడున్
మండలవర్ణనము
మ. క్షయముంజెందెడు చందమామ, యిఁకఁ జుక్కల్గాఁచు నెవ్వండు, హృ
చ్ఛాయ హృన్నేత్రము నిద్రితంబు హరివక్షఃకౌస్తుభం బప్రభో
చ్ఛాయ మగ్నిద్యుతి ద్రాక్తిరక్సృతి, వివస్వద్బింబ మాప్తోదయం
బయి యిర్లట్లెది దోఁచు వెల్గులిటు లద్దానందము ల్మీకిడున్
మ. పరఁగుందూర్పునఁ దొల్తనెద్ది, యుదయింపం దూర్పునొనెద్ది, వా
సరమధ్యంబున దీప్తమౌనెది, తతోస్రంబెద్ది చేయుంబవల్
వరుసన్లోకములం దపించునెది, జీవమ్మేది లోకాళికిన్
భరణోత్పాదకారి యాసవితృబింబం బుత్తమార్థంబిడున్
భాష క్లిష్టమైననూ కొంచం ఓపికగా చదివినవారికి మయూరిని సూర్యశతకార్థం ఈ పద్యాలలో మనకు సంపూర్ణంగా తెలుస్తుంది. మయూరుని సంస్కృత సూర్యశతకాన్ని శ్రీనాథుని వంటి అనేక కవులు తమ కృతులలో అనువదించి వాడుకున్నారు. మనంకూడా ఆ శతక సారాంసాన్ని అనుభవించి ఆనందిద్దాము.

మీరూ చదవండి ఇతరులతో చదివించండి

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information