మహా మంత్రం - అచ్చంగా తెలుగు
మహా మంత్రం
రావి కిరణ్ కుమార్ 

                          హరే క్రిష్ణ  హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే 
                      హరే రామ హరే రామ రామ రామ హరే హరే 
మహా మంత్రం . అన్ని విధాలుగా మనలను ఆదుకొని ఉత్తేజపరిచే దివ్య ఔషథరాజం .అన్ని  మంత్రములు ఇందే ఆవహించెను అన్న అన్నమయ్య పదానికి అచ్చమైన నిదర్శనం 
క్రిష్ణుడు చంద్ర వంశపు రాజకులానికి చెందిన యదు వంశంలో పుట్టిన వాడు . ఆయన నామ స్మరణం చంద్రునికి ఆనందాన్నిస్తుంది . చంద్రుడు మనఃకారకుడు . అందుకే చంద్రుని వెన్నెల ఎంతటి అశాంతి తో కూడిన మనస్సుకైనా ఆహ్లాదాన్నిస్తుంది . క్రిష్ణ నామము అంతే మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది  .  ఆహ్లాదభరితంగా మనస్సు శాంతంగా ఆలోచిస్తుంది 
సహన స్వభావాన్ని కలిగివుంటుంది .
బుధుడు   చంద్రుని కుమారుడు . మనలోని సహన గుణానికి వినయానికి కారకుడు . క్రిష్ణ నామ స్మరణతో చంద్రుడు సంతోషభరితుడయితే , తన తండ్రి సంతోషానికి కారణమైన మనపట్ల బుధుడు ప్రసన్నత కలిగి ఉండి సహన గుణాన్ని మనలో ప్రేరేపిస్తాడు . 
ఎవరు సహనవంతులో వారినే శాంతి వరిస్తుంది . 
ఎవరి మనసు ప్రసన్నత తో కూడి సహన పూర్వక ప్రవర్తన కలిగి వుంటారో వారి బుద్ధి  సరైన మార్గంలో ప్రచోదితమవుతుంది . బుద్ధి కారకుడు బృహస్పతీ 
శ్రీరాముడు సూర్య వంశపు రాజు . రాముని గుణ కీర్తనతో సూర్యుడు సంతోషిస్తాడు . సూర్యుడు గ్రహాధిపతి . చక్కని ఆరోగ్యాన్ని , సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు 
శ్రీరాముని పాద స్పర్శతో పునీత అయిన మాత భూమాత . రాముని హృదయలక్ష్మి భూజాత సీత . ఆ భూ పుత్రుడే అంగారకుడు ...ఋణ విమోచన కారకుడు . రాముని స్మరణం సీతమ్మకు ఆనందాన్నిస్తుంది  . సోదరి ఆనంద కారకుడైన వాని పట్ల అంగారకుని అనుగ్రహం లక్ష్మీప్రదం .  
భార్గవ వంశోద్భవి అమ్మ మహాలక్ష్మి. హరికి పట్టపు రాణి . హరి స్మరణ అమ్మకు ఆనందదాయకం . అమ్మ ఆనందం భార్గవ వంశ భూషణుడైన శుక్రాచార్యునికి మోదాన్నిస్తుంది . శుక్రుని మోదం మనకు సుఖదాయకం 
రాముని స్మరణం సూర్యునికి తృప్తిని కలిగిస్తే , తన తండ్రి అయిన సూర్యుని మనస్సుకు సంతోషం కలిగించిన మన పట్ల శని ప్రసన్నత భావం కలిగి వుంటారు . 
శని సరయూ తీరంలో నిరంతరం క్రిష్ణ నామ ధ్యానం లో వుంటారు . తన ఇష్ట దైవమైన  క్రిష్ణ నామ స్మరణ తో శని మన పట్ల కరుణాంతరంగుడవుతాడు . 
శని సంప్రీతుడైతే ఆయన ఆజ్ఞానువర్తులై ఫలాలు ప్రసాదించు రాహు కేతువులు శుభ ఫలితాలిస్తారు. 
శ్రీరాముడు సకల గుణాభిరాముడు లోకోత్తర సౌందర్య రూపుడు . అమ్మ లలిత..   త్రిపుర సుందరి   సకల గుణాభిరామి 
శ్రీరాముడే అమ్మ లలిత 
శ్రీకృష్ణుడు సకల కళావల్లభుడు  షోడశ కళానిధి ......... అమ్మ శ్యామల సకల విద్యా స్వరూపిణి .
శ్యామల చేతి వీణయే కృష్ణుని హస్త భూషణమైన వేణువై విలసిల్లింది 
శ్రీకృష్ణుడే అమ్మ శ్యామల 
హరి నామంలోనే దాగి వుంది హర నామం . సకల పాపాలను హరించే వాడు హరి . ఈ శరీరాలను లయం చేసుకునే వాడు హరుడు . హరే హరుడు . హరుఁడే హరి 
చతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అమ్మ లలిత 
యోగి గణ సేవితుడు శ్రీరాముడు 
ఆ యోగిని యోగి గణములే గో గోప గోపికలై సేవించు పరంధాముడే శ్రీకృష్ణుడు 
అదే చింతామణి గృహం అదే వైకుంఠం అదే గోలోక బృందావనం 
ఒక్క మంత్రం సకల దేవతా సాక్షాత్కారం . ఒక్క మంత్రం సకల దేవతా నమస్కారం . ఒక్క మంత్రం సకల సమస్యా పరిష్కారం . 
సందేహమే లేదు ....... అన్ని మంత్రములిందే ఆవహించెను ;
ఈ నామ స్మరణ మించిన రత్నం లేదు యంత్రం లేదు తంత్రం  పూజ లేదు వ్రతం లేదు హోమం లేదు యజ్ఞం అంత కన్నా  లేదు . ఇంతకు మించి సత్యము లేదు.
***



No comments:

Post a Comment

Pages