Tuesday, January 23, 2018

thumbnail

మేటి చిత్రకారులు - ఆర్టిస్ట్ రాం ప్రతాప్

మేటి చిత్రకారులు - ఆర్టిస్ట్ రాం ప్రతాప్
భావరాజు పద్మిని  చిత్రకళ ఆయనకు వారసత్వంగా అబ్బింది. దానికి తన సృజన, కృషిని జోడించి పెయింటింగ్స్, ఆనిమేషన్, నఖ చిత్రాలు,  వంటి వైవిధ్యభరితమైన ప్రయోగాలు చేసి, పలువురు ప్రముఖుల మన్ననలు అందుకున్న రాం ప్రతాప్ గారి పరిచయం ఈ నెల తెలుగు బొమ్మలో మీకోసం...

మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 

మాది శ్రీకాకుళంలో మురపాక అనే పల్లెటూరు. నేను అక్కడే 10 వ తరగతి చదివాను. మా తండ్రిగారు గ్రామ కరణం, వారికి నేను 7వ సంతానం. నలుగురు అక్కలు,ఇద్దరు అన్నయ్యలు. చిన్నవాడిని కావడంతో ఇంట్లో అందరూ ముద్దుగానే చూసేవారు. ఊరిలో కూడా మా కుటుంబం అంటే చాలా గౌరవంగా చూసేవారు.

మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మా ఇంట్లో మా తాతగారు పేర్రాజు గారు కరక్కాయ ఇంకుతో వేసిన కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. వారికి ఇంకా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది అని నాన్నగారు చెప్పేవారు. అలాగే మా పెదతండ్రి గారు కాశీపట్నం  రామారావుగారికి కూడా ప్రవేశం ఉండేదట. మా తండ్రిగారు
water  colours తో చిత్రాలు వేసేవారు. ఇంకా అతికొద్ది మంది నఖచిత్రకారుల్లో ఆయన ఒకరు. ఇంకా నాచిన్నతనంలో రెండో అక్క ఉమ,అన్నయ్య  పేర్రాజు paintings వేసేవారు. అలాగే మా అత్తకొడుకు, కూతురు ఇంకా మా పెదనాన్న గారి అబ్బాయి వ్యాసమూర్తి, చిన్నాన్న కూతురు విమలకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది.

చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
ఔను చిన్నప్పుడు 3rd class చదివే రోజుల నుండి చిత్రలేఖనం మీద ఆశక్తి వుండేది. ఒకసారి ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ(పేరు గుర్తులేదు) వారు మా స్కూల్ కి వచ్చి ఆర్ట్స్ మెటీరియల్ ఇచ్చి ఒక పోటీ నిర్వహించినట్లు గుర్తు ఉంది.అప్పుడు మొట్టమొదటిసారి కుండలో రాళ్లు వేస్తున్న కాకి బొమ్మ వేసాను. అది చూసి చాలా ప్రోత్సహించారు. అప్పటినుండి చిత్రకళపై మక్కువ పెరిగి వేయడం మొదలెట్టాను.ఇంకా మా నాన్నగారి బొమ్మలు చూడడం, అలాగే మా పెద తండ్రి గారు వచ్చినప్పుడు పెద్ద చిత్రకారులు గురించి చెప్పడం, ఇంట్లో అక్క, అన్నయ్య వేయడం చూసి ఇంకా మక్కువ పెరిగింది.

 మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
మొదట గురువులు మా నాన్నగారు, తర్వాత 6th class నుంచి 10th class వరకు మా చిత్రకళోపాధ్యాయులు శ్రీ ఇప్పిలి జోగి సన్యాసిరావుగారు. అభిమాన చిత్రకారులు కీ.శే. వడ్డాది పాపయ్యగారు.ఆయన బొమ్మలు చూసి,copy చేసి చాలా నేర్చుకున్నాను.తరువాత సొంతంగా నేర్చుకున్నాను.
ఇంకా రవివర్మ, బాపుగారు, చంద్రగారు. బాపూగారిని పలుమార్లు కలిసే అదృష్టం కలిగింది.మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
చిన్నప్పటి నుండి నేర్చుకున్న చిత్రకళలోనే ఉండాలని అనుకున్న. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్నుంచి కొంచెం practice చేసాను. Lower,higher,teacher training లాంటివి కూడా పూర్తి చేశాను. రకరకాల చిత్రకళలకోసం తెలుసుకున్నాను. ఇంకా కమర్షియల్ వర్క్స్ కూడా చేసాను.
ఆర్ట్ మీద వచ్చే సంపాదన అంతా ఆర్ట్ మీదనే ఖర్చు పెట్టేవాడిని. ఆ తరువాత హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు యానిమేషన్ రంగంలో పనిచేశాను. ఆ తరువాత సొంతంగా ఒక పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెయింటింగ్ shows ,చిత్రకళా పోటీలు నిర్వహించడం కోసం "కాశీపట్నం ఆర్ట్స్ అకాడమీ" సంస్థను ఏర్పాటు చేశాము.ఇంకా అనేక బృంద చిత్ర ప్రదర్శనలలో ( group shows) పాల్గొంటున్నాము. 


ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ఈ రంగంలో ఇబ్బందులు సహజం(ప్రతిరంగంలో అంతే అనుకోండి) కానీ పెద్ద ఇబ్బందులు అనిపించలేదు. ఎందుకంటే కొంతమంది చిత్రకారుల జీవితాలు కూడా చదివాను. ఇంకా మా నాన్నగారు మాటల సందర్భంలో నువ్వు ఈ రంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించగలవేమో కానీ డబ్బు సంపాదించలేవేమో అని అనేవారు. ఒక పెయింటింగ్ వేసిన తరువాత వచ్చే ఆనందం ఒక ఆర్టిస్ట్ మాత్రమే అనుభవించగలడు.అందుకే కొన్ని కష్టాలు కనపడక పోవచ్చు.

మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
ఒక బొమ్మ అని ఉండదు.కొన్ని కొంతమందికి నచ్చుతాయి. ప్రశంశలు అందుకుంటాయి.అందులో మదర్ థెరిసా, యమ్.యస్.సుబ్బలక్ష్మి లాంటివి పెద్దల మన్ననలను పొందాయి అని చెప్పొచ్చు. మరికొన్ని కూడా ఉన్నాయి.


2002 అనుకుంటా నారాచంద్రబాబు నాయుడు గారికి వారి నఖచిత్రం బహుకరించే అవకాశం వచ్చింది.నాతో 2నిముషాలు ముచ్చటించి ఆ చిత్రాన్ని తన డైరీలో పెట్టుకున్నారు. 

మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
ఓసారి బాపూగారు శ్రీకాకుళం వచ్చారు. ఆయన వేసిన నవరసాలు బొమ్మను నఖచిత్రాలుగా గీశాను.మా పెదతండ్రి గారి వల్ల ఆయనను కలవడం జరిగింది. వెంటనే నేను నా నఖచిత్రాలను చూపించాను.ఈ నఖచిత్రాలను నేను తీసుకోవచ్చా అని అన్నారు.అంతటి కీర్తి శిఖరం అలా అడిగేసరికినోటమాట రాలేదు.వాటిని తీసుకుని తనవెంట తెచ్చుకున్న సంచిలో భద్రంగా పెట్టుకున్నారు. అది నాకు పెద్ద ప్రశంశ,ప్రక్కనే రమణగారు ఉండడం ఇంకో ఆనందం. అలాగే సిద్దిపేట రాజయ్య గారు,చంద్రగారు, కొంతమంది కలెక్టర్లు, కళాకారులు కవులు ఇచ్చిన ప్రశంశలు నాకు ఎంతో బలాన్నిచ్చాయి.ఇంకా ఎన్నో అవార్డులు ఉండనే ఉన్నాయి.

మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నాన్నగారు, అమ్మ, అక్కలు,అన్నయ్యలు, బంధువులు,స్నేహితులు అందరూ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు.అలాగే పాత్రికేయులు అనేకమంది నా చిత్రాలను పత్రికల్లో ప్రచురించారు.
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
భావి చిత్రకారులు సందేశం కన్నా సలహా ఇవ్వగలను. చిత్రకారుడు అన్నవాడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. నిత్యం కొత్తదనం చూపించగలగాలి,విన్నూత ప్రక్రియలతో చిత్రాల్ని వెయ్యాలి.తనకు తెలుసినవి వేరొకరికి చెప్పాలి, కొత్తవి తెలుసుకోవాలి.సొంతశైలిని ఏర్పాటు చేసుకోవాలి.వేసిన చిత్రాలను ప్రదర్శనలలో ప్రదర్శించాలి. అప్పుడే రాణించగలుగుతారు.Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information