Thursday, February 22, 2018

thumbnail

నెచ్చెలులు నిర్వహించే - అన్నమయ్య పద యజ్ఞం

నెచ్చెలులు నిర్వహించే  - అన్నమయ్య పద యజ్ఞం
భావరాజు పద్మిని 

పెళ్ళైన స్త్రీలు - ఇక ఇల్లు, పిల్లలు, సంసారమే తమ ప్రపంచమనుకుని, జీవితం గడిపేసే రోజులు మారాయి. చదువుతో మరుగున పడ్డ తమకిష్టమైన కళలను తిరిగి అభ్యాసించేవారు కొందరైతే, తమలో నిద్రాణమై ఉన్న సృజనను వెలికి తీసేవారు మరి కొందరు. విదేశాల్లో ఉన్నా, ఒక ఉదాత్తమైన ఆశయాన్ని ఏర్పరచుకుని దానికోసం కృషి చేస్తున్న శ్రీమతి పాలూరి హిమబిందు, శ్రీమతి గురజాడ ప్రత్యూష అనే ఇద్దరు స్నేహితురాళ్ళ కధనం ఈ నెల ప్రత్యేకంగా మీ కోసం...

‘అన్నమయ్య పద యజ్ఞం’ అసలు ఎలా మొదలయ్యింది. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?
మేమిద్దరం దుబాయ్ నివాసులం, గృహిణులం, స్నేహితురాళ్ళం. ఇద్దరం సంగీతం నేర్చుకున్నాము. ఇరువురికీ అన్నమయ్య సంకీర్తనల మీద ఉన్న మక్కువతో, గత సంవత్సరం అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని “అన్నమయ్య పద యజ్ఞం “ అనే  మహా యజ్ఞం ప్రారంభించాము. 

ఇందులో 32 వేల మంది గాయకులు/వాద్యకారులు పాల్గొనాలి అన్నదే మా ఆశ, ఆశయము. ఆ సంఖ్య విశిష్టత ఏమిటీ అంటే, ఆయిన అన్ని సంకీర్తనలు రాసినట్టు ప్రసిద్ధి. నేటి ఆధునిక పద్దతులు ఉపయోగిస్తే మా లక్ష్యం
సులువుగా చెరుకోవచ్చు. మా పని చిరస్థాయిగా చరిత్రలో  నిలిచిపోతుంది కదా, అని అనిపించింది. 

అందుకే  ఫేస్బూక్ లో అన్నమయ్య పదయజ్ఞం అనే పేరుతో ఒక పేజీని  నిర్వహిస్తున్నాము.


ఈ పద యజ్ఞం ఎప్పుడు మొదలుపెట్టారుఇప్పటిదాకా ఎన్ని వీడియోలు పెట్టారు? 
మా పదయజ్ఞాన్ని మే 11, 2017 న పెద్దలు, గురువుల ఆశీర్వాదాలతో ప్రారంభించాము. ఇప్పటికి 400 కు పైగా వీడియోస్ ని సేకరించాము. ఇందులో 480 మంది ఇప్పటి వరకు పాల్గొన్నారు. 

మీకు వీడియోలు ఎలా పంపాలి?

నచ్చిన సంకీర్తనను శృతి పెట్టుకొని లయ బద్ధంగా పాడుతూ, వీడియోగా రికార్డ్ చేసి, మాకు ఈమైల్  ద్వారా పంపితే, మేము వాటికి సాహిత్యన్ని జతచేర్చి, ఫేస్బూక్ పేజీలో , తదనంతరము యూట్యుబ్  చానెల్ లో పెడతాము. వీడియో పంపేటప్పుడు, వారిని పరిచయం చేస్కుంటూనే, వారి గురువుల పేర్లు, అన్నమయ్య పద యజ్ఞం అనే మా కార్యక్రమం పేరుని కుడా తప్పనిసరిగా  చెప్పాలి.

ఒకరు ఎన్నైనా సంకీర్తనలు పంపవచ్చు. కాకపొతే కాస్త కాలవ్యవధి ఇచ్చి వీడియోస్ ని అప్లోడ్ చేస్తాము. అలాగే ఒకటే సంకీర్తనను ఎన్ని సార్లైనా పాడవచ్చు. అలాంటి ఆంక్షలు కూడా ఏమీ లేవు.
గ్రూప్ గా పాడి పంపించేవారు, వారి బృందంలో ఐదుగురు సభ్యులకు మించకుండా చూసుకోవాలి.  

మీ ప్రయాణంలో మీరు చేసిన వినూత్నమైన ప్రయోగాలు ఏమిటి?
   
ముఖ్యంగా మా ప్రయాణంలో మేము కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్పెషల్ సిరీస్ కూడా తీసుకుని వచ్చాము.

శ్రావణ సంకీర్తనం శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శ్రావణ మాస ప్రత్యేకతను వివరించే సంకీర్తనల సమాహారం.

శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం శ్రీ గంధం శంకర్ గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు వాడే స్వామివారి వాహనాల గురించిన వివరాల సిరీస్.

బ్రహ్మోత్సవం భక్తి సంకీర్తనం ప్రముఖ గాయకులు బ్రహ్మోత్సవ సమయంలో అందించే అన్నమయ్య భావగీతాలు.

అన్నమయ్య సంకీర్తనా వేదం శ్రీ గంధం బసవ శంకర్ గారు ప్రతి ఆదివారం, ఈ సిరీస్ లో ఒక సంకీర్తన యొక్క భావాన్ని  వివరిస్తారు.

ఔత్సాహిక గాయకులకు వారి ప్రతిభను నిరూపించుకునే ఒక వేదిక కల్పించేందుకు, అదే సమయంలో దైవాన్ని చేరే మార్గాన్ని తన కీర్తనల ద్వారా చూపిన అన్నమయ్యకు కళాకారులు నీరాజనాలు సమర్పించేందుకు, మేము అవకాశాన్ని కల్పిస్తున్నాము.


ఏ ఏ సమయాల్లో వీడియోలు పోస్ట్ చేస్తారు?
రోజుకు రెండు వీడియోస్ వరకే పెడతాము - ఉదయము, సంధ్యా సమయాల్లో మాత్రమే. దీనికి కారణం ప్రతి సంకీర్తనను అందరూ వీక్షించేందుకు,  సంకీర్తనని ఆస్వాదించేందుకు తగినంత సమయం ఇవ్వాలని, పాల్గొన్నవరికి ప్రశంసలూ దక్కాలని. అన్నమయ్య సంకీర్తన చిరస్థాయిగా నిలవాలాని మా కొరిక. 

ఈ పదయజ్ఞాన్ని మేము ఇరువురము నిర్వహిస్తున్నా, దీనికి పర్యవేక్షకులు, సాహిత్య పరంగా సూత్రధారిగా శ్రీ గంధం శంకర్ గారు ఉన్నారు. ఆనునిత్యం చిన్నన్న రచించిన అన్నమయ్య జీవిత చరిత్రను విశ్లేషిస్తూ దాని పై క్లుప్తంగా వ్యాఖ్యానిస్తున్నరు. అలాగే ప్రతీ ఆదివారము 'అన్నమయ్య సంకీర్తన వేదం' అనే శీర్షికలో ఒక సంకీర్తన అర్థపరమార్థాలు వివరిస్తారు. ఆయనని ఒక పెద్ద అన్నయ్యలా మేము భావిస్తాము.

మీ పద యజ్ఞానికి ఎటువంటి ప్రోత్సాహం లభిస్తోంది?
మా యజ్ఞానికి పెద్దలు, గురువుల స్పందన అనూహ్యంగా ఉంది. వారు పాల్గొనడమే కాకుండా వారి శిష్యులను కూడా ఇక్కడ పాడడానికి ప్రోత్సహిస్తూ ఉండడం ఆనందదాయకం. వారంతామాకు శ్రేయోభిలాషులు, ఆత్మీయులుగా ఉండడమే కాదు, ఇది వారి సంకల్పంగా భావించడం, మాకు ఇంకా ధైర్యాన్ని కలిగిస్తోంది. ఎంతో మంది స్వరకర్తలు వారి బాణిలను ఇక్కడ స్వయంగ ప్రదర్శించడం హర్షణీయం.

ఈ ప్రస్థానంలో మీరు ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి?
ఇబ్బందులు అంటే వీడియోస్ సేకరించడం, సమయానికి పొస్ట్ చేయడం లాంటివే కాకుండా, వచ్చే ప్రతీ వీడియోని భద్ర పరిచి పొస్ట్ చెయడం కూడా చాలా శ్రమతో కూడిన పని. అలాగే కొందరు పెద్దలు, గురువులకు, సమయం కుదరక ఇంకా పంపించలేదు. వారందరూ కుడా త్వరలొనే మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము. 
  
 సోషల్ మీడియా లో మీ లింక్స్ ఏమిటి ?

మాకు రెండు లింక్స్ ఉన్నాయి. ఒకటి మా ఫేస్బూక్ పేజీ, ఇంకొకటి మా యూట్యుబ్ చానెల్.  క్రింది లింకుల ద్వారా మా సోషల్ నెట్వర్క్ లను చేరవచ్చు.

Please visit our Facebook page at: 


Please subscribe to our YouTube Channel:


మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
మా ఇద్దరికీ పబ్లిసిటీ వద్దండి. ఈ యజ్ఞానికి ప్రచారం వస్తే, కొత్త కీర్తనలన్నీ ఇందులో పెడితే, చాలు. ఎవరైనా పాడలని ఆసక్తి ఉన్నవారు వీటిలోంచి ,వారి వారి స్తాయిల్ని బట్టి, వారికి సులువుగా ఉండే కీర్తనల్ని ఎంచుకుంటారు. 

ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే ప్లాన్డ్ గా, జాగ్రత్తగా ఆచి, తూచి అడుగు వేస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం ఒక రెండు మూడు గంటలు అందరూ పూజ చేసినట్లుగా స్వామి వారి పని చెయ్యడం మాకు అత్యంత ఆనందదాయకం.

నెట్ ఈనాడు మారుమూల గ్రామాలకు చేరింది. దీని ద్వారా అన్నమయ్య కీర్తనలను, అవి పాడేవారిని ప్రపంచానికి పరిచయం చెయ్యాలన్నది మా సంకల్పం. ఈ బృహత్ యజ్ఞం పట్టణాలకు  చేరడం ఒక ఎత్తైతే, మారుమూల గ్రామాల్లో చాలా అద్భుతమైన గొంతులు ఉంటున్నాయి, వారూ పాడితే బాగుంటుంది. 

అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం గురించి పరిచయస్తులకు చెప్పడం, సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం, గుళ్ళలో నోటీసు బోర్డు మీద  ఈ విషయం గురించి రాయడం వంటివి చేస్తే, ఇంకా మరింత మందికి ఇందులో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఈ వేదిక ద్వారా మున్ముందు మరింత ఎక్కువ మందికి ప్రయోజనం  చేకూరాలన్నదే మా కోరిక. ఆ దిశగా కృషి చేస్తున్నాము. 
 హిమబిందు గారు, ప్రత్యూష గారు తమ ఆశయాన్ని పూర్తి చెయ్యాలని, వారికీ పరిపూర్ణ దైవానుగ్రహం కలిగి, అఖండ విజయాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటోంది - అచ్చంగా తెలుగు.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information