మతాలం కాదు మనుషులం - అచ్చంగా తెలుగు
మా బాపట్ల కధలు -21
మతాలం కాదు మనుషులం
భావరాజు పద్మిని.

అది బాపట్లలోని చారిత్రాత్మకమైన మున్సిపల్ హై స్కూల్...
తరతరాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంలా ఉండే ఆ స్కూల్ భవంతి, నిజానికి బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఒక అతిధి గృహం. ప్రవేశ ద్వారం మీద దర్జాగా అటూ, ఇటూ నిలబడి కావలి కాస్తూ ఉండేవి రెండు జంట సింహం బొమ్మలు. స్కూల్ భవంతి బయట ఆవరణలో ఐదు “ఏనుగు వడ చెట్లు” అనే అరుదైన చెట్లు (Baobab – Elephant tree) ఉన్నాయి. కట్టేసిన ఏనుగులు సైతం పెకిలించలేని ఈ గజ వృక్షాలు బలమైన కాండంతో గమ్మత్తుగా ఉంటాయి. చాలా అరుదైన వృక్షాలివి. ఈ చెట్ల పూలు నారింజ, పసుపు రంగుల్లో మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఒకే వరుసలో ఐదు చెట్లూ ఉండడంతో, వీటిని ఎప్పటినుంచో “పంచ పాండవుల చెట్లు” అనేవారు. ఆ చెట్లు ఊహించనలవి కానంత విశాలమైనవి, దట్టమైనవి. ఎండ, వాన ఆ చెట్ల గుబురును దాటి క్రింద పడడం అసాధ్యంగా ఉండేది. ఎండాకాలం ఉక్కపోతలో, గాలాడక  చాలాసార్లు మాష్టార్లు ఆ చెట్ల క్రిందనే పిల్లల్ని కూర్చోపెట్టి, పాఠాలు చెప్పేవారు.
మఱ్ఱి చెట్టుకు ఉన్నట్లే, ఈ చెట్లకూ ఊడలు ఉంటాయి. స్కూల్ విరామ సమయంలో ఒక చెట్టు మీది నుంచి మరొక చెట్టు మీదకు ఊడలు పట్టుకు దూకడం పిల్లలకు ఒక ఆటవిడుపు. అందిన ఊడ పుచ్చుకుని, ఊగుతూ ముందుకు వెళ్ళిన రామశాస్త్రికి, మెరుపు వేగంతో మరో ఊడకు వేళ్ళాడుతూ వచ్చిన బాలుడెవరో  తగలడంతో దబ్బున కింద పడ్డాడు. ఆ బాబు వెంటనే ఊడ దిగి, రామశాస్త్రి వద్దకు పరుగెత్తుకు వచ్చాడు.
“అరెరె, దెబ్బా తలిగిందీ? దిఖావో” అంటూ వచ్చాడు ఐదేళ్ళ బాలుడు. చూడ్డానికి సాయెబుల పిల్లాడిలా ఉన్నాడు. దెబ్బ సంగతేమో కాని, ఆ పిల్లాడి భాషకు పుసుక్కున నవ్వేసాడు రామశాస్త్రి.
“తల్గిందీ అనకూడదు, తగిలిందా? అని అడగాలి, సరేనా? ఊరికే కాస్త గీరుకుందిలే అంతే. ఏం పర్వాలేదు. అన్నట్టు నాపేరు రామశాస్త్రి తెల్సా! మా నాన్నగారు పౌరోహిత్యం చేస్తారు.” గొప్పగా చెబుతూ, “ నీపేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు?” అంటూ బట్టలు దులుపుకుంటూ లేచాడు శాస్త్రి. 
“నాకీ పేరు అబ్దుల్. మేము బందర్ నుంచి వస్తాయ్. నీకీ పేరు బాగా ఉంది. ఈ చెట్టు బాగా ఉంటాయ్. దీన్కీ పేరు ఏంటి?” అడిగాడు శాస్త్రి దగ్గరకు వచ్చి, భుజం మీద చెయ్యేస్తూ అబ్దుల్.
పకపకా నవ్వడం మొదలెట్టాడు శాస్త్రి. భాష విషయంలో అబ్దుల్ సంగతంతా అతనికి తెల్సిపోయింది. కాసేపటికి తేరుకుని, ‘ఈ చెట్టు పేరు “ఏనుగు వడ చెట్టు” ఏదీ చెప్పు చూద్దాం,’ అన్నాడు ఆట పట్టిస్తూ.
“ఏన్గు చెట్లు వడల్ తింటాయ్ ? “ ఏం పేరిది? నాకీ రాదు,” తేల్చేసాడు అబ్దుల్.
నవ్వాపుకుంటూ మిగతా మిత్రుల్ని పిలిచి, “లేదులే, ఏనుగు చెట్లు వడలు తినవు కాని, మళ్ళీ ఆపకుండా 4,5 సార్లు చెట్టు పేరు చెప్పేందుకు ప్రయత్నించు, చెప్పేస్తావ్,” అంటూ ప్రోత్సహించాడు శాస్త్రి.
“ఏన్గు తొడల్ చెట్టు, ఏన్గు జడల్ చెట్టు, ఏన్గు మెడల్ చెట్టు, ఏన్గు గడల్ చెట్టు, ఏన్గు హడల్ చెట్టు, కైసా, వచ్చినాయ్?” అంటూ ఆశగా అడిగాడు అబ్దుల్.
అందరూ విరగబడి నవ్వసాగారు. చిన్నబుచ్చుకున్న అబ్దుల్ మొహాన్ని చూసి, జాలేసి “లేదులే, నువ్వు కాబట్టి, ఏనుగునే హడలగొట్టేలా పేరు చెప్పావు. శభాష్.” అన్నాడు శాస్త్రి. అబ్దుల్ మొహం వెలిగిపోయింది.
“మనం దోస్తులైదామా?” అడిగాడు అబ్దుల్ ఆశగా.
“హమ్మో, ఏదైనా దోస్తే, మా నాన్నగారు నాకు బడితె పూజ చేసేస్తారు, నాకొద్దు,” అన్నాడు శాస్త్రి భయంగా.
వీళ్ళిద్దరి హడావిడి చూసిన డేవిడ్ నవ్వుతూ అక్కడకు వచ్చి , “వీడు నిన్నేమీ దోచెయ్య మనట్లేదు, ఈ అబ్దుల్ తనతో స్నేహం చెయ్యమని నిన్ను అడుగుతున్నాడు. మా నాన్నతో చాలా ఊర్లు తిరగడం వల్ల నాకు వీళ్ళ భాష తెలుసు,” అన్నాడు.
“అయితే, నీతో కూడా దోస్తీ చేస్తాయ్. సరేనా?” అడిగాడు డేనియల్ ని అబ్దుల్.
ముగ్గురూ ఆనందంగా ఒకర్నొకరు హత్తుకున్నారు. ఈలోగా బెల్ కొట్టడంతో చెట్టు కింద తెలుగు పాఠం వినేందుకు రమ్మన్నారు లంకా వెంకటరామయ్య మాష్టారు. కధలు, నీతులు కలిపి చెప్పే ఆయన క్లాసంటే పిల్లలకు చాలా ఇష్టం. ఒకే వరుసలో కూర్చున్నారు డేనియల్, అబ్దుల్, రామశాస్త్రి.
“చూడండి పిల్లలూ! మీలో రకరకాల ప్రాంతాల వారు, మతాల వారు ఉన్నారు. మీ అందరి దేవుళ్ళు వేరు, పద్ధతులు వేరు. కాని, వీటన్నింటికంటే ముందుగా మనం మరచిపోకూడని అంశం ‘మనం మతాలం కాదు, మనుషులమని!’. మానవత్వమే మన మతం, సమత, మమత మన కులం. మనందరం సమానమే, మనలో ఎక్కువ తక్కువ భేదాలు ఏమీ లేవు. ఇది బాగా మనసులో గుర్తు పెట్టుకోండి, రేపటి పౌరులైన మీరు దేశంలో శాంతి సామరస్యాలు పెంపొందేందుకు కృషి చెయ్యండి.” అంటూ చెప్పసాగారు.
శ్రద్ధగా వింటున్న పిల్లలంతా అక్కడికి హెడ్ మాస్టర్ పరశురాం గారు రావడంతో తలతిప్పి చూసారు. ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లో, గంభీరంగా ఉంటారు ఆయన. “లంకా గారు, ఈరోజు మీ క్లాస్సులో అబ్దుల్ అని, కొత్త కుర్రాడు చేరాడండి. వాళ్ళ నాన్న ఇక్కడికి బదిలీ అయ్యి వచ్చారు, వీళ్ళు మనకు కావలసిన వాళ్ళు. తెలివైన కుర్రాడు, బాగా చూస్కోండి.” అని చెప్పారు. మాష్టారు అబ్దుల్ ను నిల్చోబెట్టి, వివరాలు కనుక్కున్నారు. అతనికి వచ్చిన ఒక పద్యం చెప్పమన్నారు. శాస్త్రి అదిరి పడి డేనియల్ వంక చూసాడు, అతడూ పళ్ళు బిగించి నవ్వాపుకుంటున్నాడు. ఏం చెబుతాడోనని ఇద్దరూ చూడసాగారు.
“ఉప్కీ కప్కీ రంబ్కీ , ఒక్క పోల్కే ఉంటాయ్, జూడా తోడా రుచ్ల వేరే ఉంటాయ్, “ ఇంత వరకూ చెప్పి, గాల్లోకి చూస్తూ ఆలోచించ సాగాడు అబ్దుల్. పిల్లలంతా మాష్టారు తిడతారేమోనాన్న భయంతో నోటికి చేతులు అడ్డం పెట్టుకు నవ్వసాగారు.
“ఒరే బాబూ, సగం పద్యం తోనే చంపేసావు, ఇక ఆలోచించకురా నాయనా, కూర్చో. నీకు తెలుగు నేర్పేసరికి, నాకొచ్చిన తెలుగుకి తెగులు పట్టేలా ఉందిరా తండ్రీ!” అంటూ తలపట్టుకున్నారు లంకా మాష్టారు. ఈలోగా మరో తెలుగు మాష్టారు పి.పి.ఎస్ గారు రావడంతో ఆయనతో మాట్లాడేందుకు వెళ్ళారు. ఘొల్లున నవ్వేసారు పిల్లలంతా. వాళ్ళతో అబ్దుల్ కూడా నవ్వేసాడు, ఇంతమందిని నవ్వించడం అతనికొక ఘనకార్యంలా అనిపించింది.
నెమ్మదిగా జగన్నాధపురంలో ఉండే రామశాస్త్రికి, ఇస్లాం పేటలో ఉండే అబ్దుల్ కి, క్రైస్ట్ నగర్లో ఉండే డేనియల్ కు మంచి స్నేహం కుదిరింది. స్నేహానికి కులం తెలీదు, మతం తెలీదు, ఎంగిలి తెలీదు, ఎల్లలూ తెలీవు... ఈ విషయాన్ని నిరూపించే విధంగా ఉండేది వాళ్ళ స్నేహం. రోజూ విరామ సమయంలో పంచపాండవుల చెట్ల కింద తప్పనిసరిగా ముగ్గురూ కలవాల్సిందే. ఎప్పుడైనా ఇంటి దగ్గర తెచ్చిన కాస్త డబ్బుతో, స్కూల్ గేటు బయట అమ్మే తాటి చాపలు, నిమ్మకాయ బిళ్ళలు, చక్కిలాలు పంచుకుని తినాల్సిందే. ఖాలేగా ఉన్న పెంకుటింటి నేత క్లాస్సులో దాగుడుమూతలు ఆడాల్సిందే. ఇక వాళ్ళలో వాళ్లకి కోపాలోచ్చి అలిగితే చూడాలి.
స్కూల్ భవంతిపై ఉన్న జంట సింహాల్లో ఒకదానికి స్నేహితుడి పేరు పెట్టి,  దానితో తమ షికాయితులన్నీ గట్టిగా మాట్లాడేవాళ్ళు. రెండో వారు రెండో సింహానికి మిత్రుడి పేరు పెట్టి, మాట్లాడేవాళ్ళు. చివరికి ఇద్దరి మాటలూ విన్న మూడో మిత్రుడు వాళ్లకు రాజీ కుదిర్చేవాడు. ఎప్పుడైనా పెద్దవాళ్ళతో కలిసి చెక్క రిక్షా మీద సముద్రానికి వెళ్లి, ఇసుకతో మేడలు కట్టేవారు. శాస్త్రి తన ఇసుక గుళ్ళో శివలింగాన్ని పెట్టి, సముద్రం నీళ్ళు తెచ్చి పోస్తుంటే, డేనియల్, అబ్దుల్ అతనిలాగే చేసేవారు. డేనియల్ ఇసుక చర్చిలో చిన్న దీపం పెట్టి, శిలువ సంజ్ఞలా చేతుల్ని తిప్పుతుంటే, మిగతా ఇద్దరూ అనుకరించేవారు. అబ్దుల్ ఇసుక మసీదు ముందు వంగి, లేచి నమాజు చేస్తుంటే, వీళ్ళు కూడా ఆశ్చర్యపోతూ, అలాగే చేసేవారు. అలసిపోయే దాకా అలలతో ఆడి, పొద్దు పోయాకా ఇంటికొచ్చి, ఆదమరచి నిద్ర పోయేవారు.
ఇలా ఆడుతూ, పాడుతూ, అలుగుతూ,  చూస్తుండగానే పదో తరగతి పూర్తి చేసుకున్నారు వాళ్ళు. అబ్దుల్ తండ్రికి బదిలీ అవడంతో విజయవాడ వెళ్ళిపోయాడు. భారమైన మనసుతో అతనికి వీడ్కోలు పలికి, ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పారు ఇద్దరు మిత్రులూ. మొదట్లో విరివిగా వచ్చే ఉత్తరాల వాన నెమ్మదిగా వెలసిపోయింది. ఆ తర్వాత డేనియల్ పైచదువులకు మద్రాసు లోని ఒక మిషనరీ కాలేజికి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి మాత్రం బాపట్ల లోనే ఉండిపోయాడు. స్థాన మార్పిడీ, బదిలీలు ముగ్గురు మిత్రులను విడదీసాయి.
కాలం చాలా విచిత్రమైనది. పరిచయమే లేని వాళ్ళను తెచ్చి గుండె గూటిలో ప్రతిష్టిస్తుంది. బలమైన అనుబంధం పెరిగాకా ఎందుకో దూరం చేసి, సంబరపడుతుంది. జ్ఞాపకాల ఆనవాళ్ళు చెదిరిపోతూ ఉండగా, చిత్రంగా మళ్ళీ దగ్గర చేసి వినోదిస్తుంది. ఓ రోజు బాపట్ల నుండి గుంటూరు వెళ్తూ రైల్లో అనుకోకుండా డేనియల్ ను కలిసాడు రామశాస్త్రి. తను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. ఇంతేకాక, తాను అబ్దుల్ ను కూడా కలిసానని, అతనీ మధ్య బాగా తెలుగు నేర్చుకుని కవితలు రాస్తున్నాడనీ, అతని నెంబర్ కూడా ఉందని చెప్పి, అతనితో మాట్లాడించాడు డేనియల్. అబ్దుల్ ‘అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ’ లో ప్రొఫెసర్ గా స్థిరపడ్డాడట. మిత్రుల ఆనందానికి ఎల్లలు లేవు.  ఇప్పుడు ఫోన్లు, నంబర్లు కూడా వచ్చాయి కనుక, ముగ్గురూ కలిసి ‘చిన్ననాటి స్నేహం’ అనే వాట్స్ ఆప్ గ్రూప్ ఆరంభించారు. 
తమతో చదివిన మిత్రులు అందరినీ అందులో కలిపారు. మొదట్లో మధురంగా సాగిన ముచ్చట్లు, నెమ్మదిగా కులమతాలకు సంబంధించిన పోస్ట్లు వచ్చేసరికి వివాదాస్పదంగా మారాయి. ముగ్గురు మిత్రుల చుట్టూ ఉన్న మరింత మంది మిత్రులు,”ఏరా, బ్రాహ్మడి వయ్యుండీ, ఆ అబ్దుల్ అలా రెచ్చిపోతుంటే ఊరుకుంటావా? ఇలా కాదూ మన ధర్మం భ్రష్టు పట్టిందీ?” అంటూ ఎగదోసారు. “ఏరా, మన క్రిష్టియన్ లను అలా తిడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటావా?” అంటూ మరొకడు డేనియల్ మీద రెచ్చిపోయాడు. ఇలా అంతా కలిసి మిత్రుల మధ్య నెమ్మదిగా విషం వెదజల్లారు. చిలికి చిలికీ గాలివాన అయినట్లు, ఒక రోజున ముగ్గురూ వివాదాలతో విడిపోయి, ‘చిన్ననాటి మిత్రులు’ గ్రూప్ నుంచి వెళ్ళిపోయారు. ప్రాణప్రదంగా భావించిన స్నేహితులనే బ్లాక్ చేసారు. స్నేహాన్ని మతాల పంతం అధిగమించింది. ఆ తర్వాత ఎవరి దారులు వారివి. 
***
ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్ళే దారి... 
అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ తరఫున ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాల్గొనేందుకు ఒక ప్రైవేట్ బస్సులో  వెళ్తున్నాడు అబ్దుల్. మధురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఒక భజన బృందంతో హాజరయ్యి, తిరిగి ఒక మెటాడోర్ వాన్ లో వెళ్తున్నాడు రామశాస్త్రి. ఢిల్లీ వచ్చిన తన పై అధికారులు, తాజ్మహల్ చూడాలంటే, ఒక ఇన్నోవాలో వారిని ఆగ్రా తీసుకువెళ్ళి, తిరిగి వెళ్తున్నాడు డేనియల్. ఈ మూడు దారులూ ‘టప్పల్ ‘ వద్ద యమునా ఎక్ష్ప్రెస్స్ హై వే లో కలుస్తాయి. 
డిసెంబర్ నెల... మంచుతెరలు దట్టంగా కమ్మేసి ఉన్నాయి, కళ్ళు పొడుచుకున్నా, ముందు దారి అసలు కనిపించట్లేదు. సాధారణంగా అటువంటి సమయాల్లో ఫాగ్ లాంప్స్ కూడా పెద్దగా ఉపయోగించవు. దేవుడిపై భారం వేసి, నెమ్మదిగా చూసుకుంటూ, ఒకరి వెనుక ఒకరు డ్రైవ్ చెయ్యడం ఒక్కటే మార్గం. ముందు ఇన్నోవాలో వెళ్తున్న డేనియల్ బృందం ఆఫీసుకు సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ, డ్రైవర్ సడన్ బ్రేక్ వెయ్యడంతో ఉలిక్కి పడ్డారు. వాళ్ళ ముందు వెళ్తున్న లారీ, గేదె అడ్డం రావడంతో అదుపు తప్పి, డివైడర్ ను బలంగా ఢీకొంది. దీనితో ఎంత బలంగా బ్రేక్ వేసినా డేనియల్ కారు వెళ్లి లారీని గుద్దుకుంది. ఇంతలో కారు వెనుక వస్తున్న అబ్దుల్ బస్సు అదుపు తప్పి, డేనియల్ కారును కుడిపక్కగా గుద్దేసి, కొంత దూరం దాన్ని తోసుకు వెళ్ళింది. ఆ వెనుకగా వస్తున్న రామశాస్త్రి వాన్ వాడు, ఈ ప్రమాదాలను గమనించి, లాఘవంగా వాన్ ను పక్కకు తప్పించి ఆపాడు. వెంటనే వాన్ లో ఉన్న వాళ్ళంతా రోడ్డు మీద తమతో ఉన్న సింధూరం రంగు జండాలు పాతి, ప్రమాదానికి గురైన వాహనాల వైపు పరుగెత్తారు. 
కార్ వద్దకు వెళ్లి, ఇరుక్కున్న డోర్ ను తన వాళ్ళతో కలిసి కోసి, తీసాడు రామశాస్త్రి. లోపల ఉన్న వారంతా చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. ఎడమ ప్రక్క కూర్చున్న తన ప్రాణ మిత్రుడైన డేనియల్ ను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు శాస్త్రి. అతని కాలికి బలమైన గాయం తగలడంతో స్పృహ తప్పి ఉన్నాడు. డ్రైవర్, కార్లోని మిగతా వారి స్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది.
ఆ పరిస్థితి చూసి, మనసు తొలిచేసింది శాస్త్రికి, ఒక్క పట్టున బిగ్గరగా ఏడవసాగాడు. ఎందుకో ఆ సమయంలో అతనికి గతంలో తమ మధ్యన జరిగిన గొడవలేమీ గుర్తుకు రాలేదు. ఎలాగైనా తన బాల్య స్నేహితుడిని బ్రతికించుకోవాలి, ఇదొక్కటే లక్ష్యం. అతడిని బయటకు లాగి, అంబులన్స్ కి ఫోన్ చేసాడు శాస్త్రి, తన మిత్రుడి కాలుకి తగిలిన దెబ్బ వలన మరింత రక్తస్రావం కాకుండా తన ఉత్తరీయంతో కట్టు కట్టాడు. తన మిత్రుడిని ఎలాగైనా రక్షించమని తాను నమ్మిన దేవతలను ప్రార్ధించసాగాడు.
ఈలోగా బస్సులో గాయాలైన వారిని క్రిందికి దించసాగింది ఒక బృందం. ఎటు చూసినా రక్తపు మడుగులు, గాయాలు. శాస్త్రి రోదనలు విని, చప్పున తలతిప్పి చూసాడు బస్సు దిగుతున్న అబ్దుల్. వెంటనే అక్కడకు పరిగెత్తుకు వెళ్ళాడు. అతని చేతిలో పగిలిన బస్సు అద్దాలు దిగబడి ఉన్నాయి. ఆ చేతినే శాస్త్రి భుజమ్మీద వేసాడు. అబ్దుల్ ను చూసిన శాస్త్రి ఒక్క ఉదుటన లేచి, అతడిని కావలించుకుని భోరుమన్నాడు. తన వద్ద ఉన్న నెయిల్ కట్టర్ తో మిత్రుడి చేతిలో దిగబడ్డ గాజు పెంకుల్ని నెమ్మదిగా తీసి, అతని గాయాలకు కట్టు కట్టాడు. వెంటనే ఇద్దరూ అవసరంలో ఉన్న మిగతావారికి సాయం చేసేందుకు కదిలారు.
పది నిముషాల్లో దగ్గరలో ఉన్న ‘జేవర్’ అనే ఊళ్ళోని కైలాశ్ హాస్పిటల్ అంబులన్స్ లు వచ్చి ఆగాయి. కొందరిని వాటిల్లో ఎక్కించాకా, తమ సామాన్లు తీసుకుని, దొరికిన ఆటోలో అంబులన్స్ వెనుకే బయలుదేరారు అబ్దుల్, శాస్త్రి.
డేనియల్ చికిత్సకు అవసరమైన సంతకాలన్నీ చేసి, డబ్బు కట్టేశాడు అబ్దుల్. కాని, మరో సమస్య వచ్చి పడింది. చాలా రక్తం పోవడం వలన డేనియల్ కు వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉంది, అతనిది అరుదైన ‘ ఎ నెగటివ్’ గ్రూపు రక్తం. ఈ సంగతి చెప్పగానే, తనదీ అదే గ్రూప్ అని, వెంటనే తన రక్తం తీసుకుని, తన మిత్రుడిని బ్రతికించమని వేడుకున్నాడు శాస్త్రి. ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చాకా, డేనియల్ కు అత్యవసరమైన సర్జరీ చెయ్యాలని, అది పూర్తయితే కాని ఏమీ చెప్పలేమని అన్నారు డాక్టర్లు. సర్జరీకి సమ్మతించి, అతని భార్యకు సమాచారం అందించి, ఆపరేషన్ గది బయటే కూర్చున్నారు ఇద్దరు మిత్రులూ. నీళ్ళు నిండిన కళ్ళతో ఒకరినొకరు చూసుకుని, గాఢంగా హత్తుకున్నారు. ఇన్నాళ్ళు తమను తొలిచేసిన విభేదాలన్నింటినీ వారి కన్నీరు ప్రక్ష్యాళన చేసిన ఆ మౌనంలో, ఒక్కసారిగా తాను రాసిన కవితను బిగ్గరగా చదవసాగాడు అబ్దుల్.
“ఎందుకు మతాలు? ఎందుకు కులాలు?
ఎందుకు ప్రాంతాలు? ఎందుకు జాతులు?
మనసుల్ని కలపలేని మతాలెందుకు ?
మతాలం కాదు మిత్రమా, మనం మనుషులం.

గాలీ, నీరూ చూపవు భేదాలు,
నింగికి, నేలకు లేవే  తేడాలు,
ఎండకు, వానకు ఉండవు ముసుగులు,
మనుషుల్ని విడదీసే మతాలెందుకు?  
మతాలం కాదు మిత్రమా, మనం మనుషులం.

నీలో నాలో ఊపిరి ఒకటే,
లోలో చీము, నెత్తురు ఒకటే,
నొప్పి, బాధ ఇరువురికొకటే,
ఆత్మ బంధాల్ని ఏమార్చే మతాలెందుకు?  
మతాలం కాదు మిత్రమా, మనం మనుషులం.

వింటున్న శాస్త్రిలో ఆగని అశ్రుధార. అది అతనిలోని మలినాలను కడిగేస్తోంది, కొత్త ఊపిరి పోస్తోంది. ఈలోగా బయటకొచ్చిన డాక్టర్ “యువర్ ఫ్రెండ్ ఇస్ సేఫ్” అని చెప్పడంతో, “ఇక మనల్ని ఏ మతమూ విడదియ్యలేదు.” అంటూ మరోసారి ఆనందంగా హత్తుకున్నారు ఇద్దరు మిత్రులు.

No comments:

Post a Comment

Pages