Friday, December 22, 2017

thumbnail

కమల పరీక్ష

కమల పరీక్ష
ఆండ్ర లలిత 

అనగనగా వంగతోటనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ బోళ్ళు వంగతోటలు ఉండేవిట.అందుకే ఆ పేరు వచ్చిందట.  ఆ ఊరిలో ఒక చిన్నింట్లో కమల వాళ్ళ అమ్మ మాధవి,  నాన్న మాధవుడు ఉండేవారు. నాన్నమాధవుడు వ్యవసాయం చేసేవాడు. అమ్మ ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లో ఉండేది.   కమల వాళ్ళింటి దగ్గర బడికి వెళ్ళేది. ఐదొవ తరగతి చదువుతోంది.  కమలకి ఆ రోజు నెలవారీ తరగతి పరీక్ష.  చదువుకుని వెళ్ళింది కానీ , ప్రశ్నాపత్రం చూడగానే ఏమీ గుర్తు రాలేదు. బెంబేలైపోయింది. 
ఇది చూస్తున్న స్నేహితురాలు రాధిక‌, కమలకి తనదానిలోనుంచి కాపీ చేయమని సౌజ్ఞ చేసింది. కమల ఒక్క క్షణాణికి కాపీ చేద్దామనుకుంది. కాని అమ్మఅప్పుడెప్పడో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పరీక్షలలో   మనం చదువుకొని అర్థం చేసుకున్నవి వ్రాసి మార్కులు తెచ్చుకోవాలని; మనము నేర్చుకున్నది వంటపట్టించుకుంటే పెద్దవాళ్ళమైయి అర్ధవంతంగా బ్రతకడానికి పునాదులు ధృఢపడతాయని; అప్పుడు మన చదివిన చదువులకు సార్థకత వస్తుందని.  తనకి  నాన్న “కష్టకాలమును  శాంతముగా ఎదురుకోవాలని” చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి,.
ఈ ఆలోచనలతో కమల కాపీ చేయనని రాధికకి సౌజ్ఞ చేసింది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, స్తిమితపడి, దృష్టికేంద్రీకరించుకుని  బెంబేలవ్వకుండా తనకి ఎంత వస్తే అంతే రాద్దామనుకుంది. పశ్నాపత్రం శాంతముగా మళ్ళీ చదువుకుంది. గాబరా పడకుండా నిదానముగా చదివినది గుర్తు తెచ్చుకుని ఫలితం పర్యవసానం గురించి ఆలోచించకుండా రాయటం మొదలుపెట్టింది.  ఎలాగో అలాగ తనకి గుర్తున్నంత వరకు రాసింది. మళ్ళీ తను ఏమి   రాసిందో మరొక్కమారు చదువుకుని టీచరుగారికి జవాబు పత్రం ఇచ్చి ఇంటికి వచ్చింది. 
జరిగినదంత   అమ్మమాధవికి  చెప్తే తిట్తుందేమోనని   తర్జనబర్జనైయి వంట చేస్తున్న అమ్మ మాధవి దగ్గరకెళ్ళి చెప్పింది. అమ్మ తిట్టకండా కమలని దగ్గరకు తీసుకుని సముదాయించింది. 
“పోనిలే నాన్నా బాధ పడకు. ఈసారి బాగా చదువుకుని సరిగ్గా రాద్దువుగానీ. కాపీ మాత్రం కొట్టద్దు. ఒక పరీక్ష సరిగా చేయనంత మాత్రాన్న జీవితము ఆగిపోదు. ఈ పాలు తాగు. పొద్దన్నెప్పుడో ఆదరా బదరాగా నాలుగు మెతుకలు తినివెళ్ళావు.  బెంగపెట్టుకోకు.  ఎక్కడెక్కడ  ఏ ప్రశ్న రాయలేక పోయావో చూసుకో ఇప్పుడు. ఎందుకు గుర్తురాలేదో తెలుసుకుని, చదువుకునే  విధానము మార్చుకో కమలా. ఒకొక్కసారి అర్థవంతంగా చదివితే గుర్తుంటుంది. ఒకొక్కసారి  మనము చక్కగా పుస్తకంలో రాసుకుంటే గుర్తుంటుంది. అలా తెలుసుకుని పద్ధతిగా చదువుకుంటే ఎందుకు రాదు. అలా ఎడుస్తూ నాకు రాదనుకునే కన్నా  నాకు రావాలీ రావాలీ అనుకోవాలి. అలా  నువ్వనుకుంటే తప్పకుండా  వస్తుంది చదువు కమలా” అంది అమ్మ మాధవి. ఏమైనా ఫరవాలేదు కాని కాపీ చేయాల్సిన ఖర్మమాత్రం నీకుపట్టలేదు అని మరీమరీ చెప్పింది మాధవి.
“మనిషికి నైతివిలువలు చాలా ముఖ్యం, అవి కోల్పోతే వ్యక్తిత్వం చాలా దెబ్బతింటుంది. మంచి వ్యక్తిత్వం లేని మనుషులు సమాజానికి చీడ పురుగులు” అని కమల తల నిమురుతూ చెప్పింది. అమ్మ మాటలు చాలా ప్రశాంతతనిచ్చాయి కమలకి.
“ఊ అమ్మా ఇప్పుడు చదువుకోనా నేను“ అంది కమల కళ్ళు తుడుచుకుంటూ. 
“ఇప్పుడు అలిసిపోయావు పడుకో పొద్దన్న లేచి చదువుకుందువుగాని. ఆగు అన్నం  పెట్తాను.తిన్న వెంటనే పడుకోకుండా, ఒక్కసారి ఇవాళ ఏం పాఠాలు చెప్పారో పుస్తకంలో చూసుకున్నాక పడుకుందువుగాని” అంది మాధవి కమలతో. 
కమలలో తను నేర్చుకోవాలనే పట్టుదల, ఉత్సుకత అగ్నిలా రగిలాయి.  భగవంతుని మీద నమ్మకమూ, తల్లి తండ్రుల ప్రేరణతో చదువులలో కమల అధైర్యం, నిరుత్సాహము తనదగ్గరకి రానీయకుండా, పట్టువీడని విక్రమార్కుడిలా చదువుల నిచ్చెన ఎక్కుతూ ఆకాశాన్ని అంటుకుంది. అమ్మ రోజూ పాడే జోలపాట “బంగారు పాపాయి బహుమతులు పొందాలి...” పాటలోలాగా బోళ్ళన్ని బహుమతులందుకుని అమ్మా నాన్నలికి మంచిపేరు తెచ్చింది. 
కాపీ కొట్టడం మంచిది కాదని, నిదానంగా వచ్చినంతే వ్రాయాలని  గుర్తుండిపోయింది కమలకి. కమల సోమరితనము వదిలి  సాలీడు లాగా పట్టుదలగా లక్ష్యాలు సాధించింది. మనకి పట్టుదలుంటే సాధించలేనది అంటూ ఏం ఉండదు అని నిరూపించింది.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information