Saturday, December 23, 2017

thumbnail

గోలకొండ పత్రిక - కధలు

గోలకొండ పత్రిక - కధలు
అంబడిపూడి శ్యామసుందర రావు 

1926లో సురవరం ప్రతాప రెడ్డి గారి సంపాదకత్వములో ద్వైవార పత్రికగా  ప్రారంభమైన "గోలకొండ పత్రిక" తెలంగాణలో సాహితి,సాంస్కృతిక చైతన్యాన్నిప్రజలలో పురికొల్పటంలో ప్రధాన పాత్ర వహించింది.ఈ పత్రికలో రైతులకు ఉపయోగపడే అంశాలతో పాటు సాహిత్యము, గ్రంధాలయ  ఉద్యమము,సంఘ సంస్కరణ,మహిళాభి వృద్ధి,కుల సంఘాల వికాసమువంటి అంశాలపై విరివిగా వ్యాసాలు,వార్తలు ప్రచురితము అయ్యేవి. ఈపత్రిక నిజాం రాష్ట్రములోని  తెలుగువాళ్ళను ఒకతాటిపై తెచ్చి రాజకీయ చైతన్యాన్ని తెచ్చి స్వరాష్ట్ర సాధనకోసము ప్రయత్నిస్తూ ఇతరుల వెటకారపు అవమానాలు భరిస్తు ఆంధ్ర మహా సభల నిర్మాణములో చురుకైన పాత్ర పోషించింది. మొదట 1926లో ఈ పత్రికలో మాడపాటి హనుమంత రావు గారు కధలకు ఆహ్వానము పలుకుతు ఉత్తమ కధకు ఐదు రూపాయలు బహుమతి ప్రకటించారు కదా ఇతివృత్తాలు నిజాం రాష్ట్రాంధ్రకు సంబంధించినవిగా ఉండాలని భాష సులభముగా ఉండాలని పేర్కొన్నారు. 

తరువాత ఈ పత్రిక సారసత్వ అనుబంధము కోసము ప్రత్యేకముగా చిన్నకధలు కావాలని 1933లో ప్రకటించి ,1934 నుండి "మా చిన్నకథ"అనే శీర్షిక క్రింద తెలంగాణలోని పలువురు రచయితల కథలను ప్రచురించి చాలామంది కధకులను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ పత్రికదే.  మధ్యలో ఈ శీర్షికను కధాన్ జలి గా మార్చారు.  తెలంగాణలో కవులున్నారా?అన్న తెలాంగాణేతురుల ప్రశ్నకు ఆ రోజుల్లోనే ఈ కధల ప్రచురణ ద్వారా దీటైన సమాధానము ఇచ్చారు. ఈ పత్రికలో ప్రచురించిన కధలన్నీ నేటి తరము కధకులకు మార్గదర్శకాలు గోలకొండ పత్రిక చేసిన సాహితి సేవకు ఆనవాళ్లు. పత్రికలో ప్రచురణమైన కధలన్నీ 1926 నుండి 49 వరకు పలు రచయితలు రచించినవే కధానిక అంటూ నిర్దిష్టమైన పేరు పెట్టింది ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు . ఈకథలన్ని నేటి తరానికి పాత తరానికి వారధి లాంటివి.

గోలకొండ పత్రిక కధలు పేరిట విడుదల అయినా సంకలనములోని యాభై  రెండు కధలలో ప్రస్తుతము,"కొత్త యల్లుడా ? పాత యల్లుడా?"అనే కధను గురించి గురించి ముచ్చటించుకుందాము ఇది ఒక సాంఘిక హాస్య కధ. ఈ కధ ఇతివృత్తము ఏమిటి అంటే , బాల్య వివాహము తరువాత విడిపోయిన భార్యాభర్తలు ఒకరినొకరు తెలియకుండానే పెద్దవారు,నాగరికులై,పరస్పరము ఆకర్షించుకొని పెండ్లి చేసుకుంటారు. ఈ విషయము తెలిసిన అత్తవారికి వచ్చిన సందేహమే" కొత్త అల్లుడా? పాత అల్లుడా?"  అని. ఈవిధముగా ఆరోజుల్లోనే బాల్య వివాహాల కన్నాశారీరకంగా మానసికముగా వ్యక్తులై ప్రేమించి పెళ్లిచేసుకోవటం మంచిదని తెలిపే సందేశాత్మక కధ ఇది.ఈ కధ 14-08-1926 లో గోలకొండ పత్రికలో ప్రచురించబడింది     

భైరాపురములో అనే కుగ్రామములో పుట్టినవాడు కృష్ణావధానులు అనే శోత్రియ బ్రాహ్మణుడు చిన్నతనానే ధర్మశాస్త్రము,తర్క మీమాంసలు చదివి యుక్త వయస్సురాగానే ప్రక్క ఊరు గొందిపల్లె కరణము  రామయ్య గారి కుమార్తె లచ్చమ్మను వివాహమాడాడు.లచ్చమ్మ బంగారు బొమ్మ,,ఆవిడ  అందము చూసినవారు మన్మధ పారవస్యులు అవటం అతిశయోక్తి ఏమాత్రము కాదు కానీ లచ్చమ్మ పదహారు సంవత్సరములు నిండినా ఇతర బాలికల వలె వ్యక్తురాలు( పెద్దమనిషి) కాలేదు.అవధాని గారు తన భార్య వ్యక్తురాలు అవటానికి ఎన్నో జపాలు తపాలు చేసేవాడు. లచ్చమ్మకు, ఆవిడ  తల్లిదండ్రులకు నలుగురిలో తలవంపులుగా ఉండేది. తన జప తపాలు వ్యర్ధముకాగా అవధానిగారు ద్వితీయ కన్యాన్వేషణ ప్రారంభింపగా అత్తవారు ఇది తెలుసుకొని మిక్కిలి వ్యాకులపడిరి. సమీప బంధువు అగు వేంకటేశము ను  పిలిపించి వారివెంట లచ్చమ్మను భాగ్యనగరానికి పంపి ఆమెకు నవనాగరికత,సంగీతమున ప్రవేశము కలిగించమని వేంకటేశమును ప్రార్ధించిరి. లచ్చమ్మ తన అన్నకూతురు అవటము వల్ల వెంకటేశము వారి అభ్యర్ధనను కాదనలేక లచ్చమ్మను భాగ్యనగరానికి తీసుకొనివెళ్ళి సంగీతము నేర్పించసాగాడు

లచ్చమ్మ గ్రామవేషభాషలు వదలి నాగరికపు అలవాట్లు నేర్చుకొని సాయంత్రాలు మోటారు మీద హుస్సేన్ సాగర్, పబ్లిక్ గార్డెన్స్ వంటి ప్రదేశాలకు బెరుకు లేకుండా తిరగటం నేర్చుకుంది.. ఒక సంవత్సరములో లచ్చమ్మ వ్యక్తురాలు అయింది ఈ విషయాన్ని లచ్చమ్మ తల్లిదండ్రులు అల్లునికి వర్తమానము పంపిన అవధానులుకు అందలేదు. అవధానులు స్వగ్రామము విడిచి కన్యార్ధము దేశాంతరమునకు వెళ్లాడని ,సన్యాసమును స్వేకరించాడని పలువిధాల వార్తలు అత్తవారికి అందినాయి.లచ్చమ్మ జాతకములో రెండవసారి వివాహ యోగమున్నదని జ్యోతిష్కులు చెప్పారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి.

భాగ్యనగరములో కృష్ణమూర్తి అనే 25 సంవత్సరాల నవనాగరిక యువకుడు లచ్చమ్మతో పరిచయము చేసుకున్నాడు ప్రస్తుతము లచ్చమ్మ తన పేరును లక్షమాంబ గా మార్చుకున్నది .ఇరువురి మధ్య మైత్రి దినదినాభివృద్ధి చెంది ప్రేమలోకి  దింపింది. కొంతకాలము ప్రేమ వ్యవహారము ముదరగానే వీరు ఉభయులు ఇల్లు వదిలి కలకత్తా కు వెళ్లి అక్కడ రిజిష్టరు మ్యారేజి చేసుకొని,అక్కడనుండి మదరాసు చేయి అద్దె ఇంట్లో కాపురము పెట్టి సుఖముగా ఉన్నారు కూతురు పారిపోయిన విషయము అన్నగారికి వెంకటేశము తెలియజేసి దీనికి కారణము కృష్ణమూర్తి కారణమని నిర్ణయించుకొని భాగ్యనగరము లో వెదికి అన్ని ఊళ్ళు తిరిగి చివరకు మదరాసు జేరారు.

ఇదిఇలా ఉండగా లచ్చమ్మ కృష్ణమూర్తి దంపతులకు బాలుడు జన్మించెను ఆ పిల్లవాడి బారసాల నాడు నగరంలోని బ్రాహ్మణులను ఆహ్వానించారు ఆ సందర్భముగా తెలిసినవారిద్వారా వెంకటేశము నా,వదినలు కూడా ఆ శుభకార్యానికి వచ్చి లచ్చమ్మను గుర్తుపట్టి కోపించి వారిరువురిని పోలీసులతో అరెస్ట్ చేయించారు తమ కూతురు పెళ్ళైన  లచ్చమ్మను కృష్ణమూర్తి లేవదీసుకు పోయినాడని కోర్టులో కేసు పెట్టారు. కేసు విచారణకు వచ్చినప్పుడు మదరాసు పురజనులు కేసు మీద ఆసక్తితో తీర్పు ఏవిధముగా ఉంటుందో వినటానికి వచ్చారు. ముందు మనగతి ఏమగునో అని కృష్ణమూర్తి లచ్చమ్మలుఆందోళనగా ఉన్నారు. చివరికి కృష్ణమూర్తి దేవుడిమీద భారము వేసి కోర్టులో తన వాజ్ములాన్ని ఇవ్వడము ప్రారంభించాడు.

"నా పేరు కృష్ణావధానులు మాది భైరాపురము,నేను గొండిపల్లి కరణముగారి కూతురు లచ్చమ్మను పెళ్లి చేసుకున్నానుకానీ నా భార్య వ్యక్తురాలు కానందునమల్లి పెళ్లి చేసుకోవటానికి దేశము తిరగటం ప్రారంభించాను కానీ ఎవరు పిల్లను ఇవ్వనందువల్ల శ్రోత్రియము వదలి నవనాగరిక వేషభాషలు అలవర్చుకొనియావదాస్తినీ అమ్మి మొదట మదరాసు ఆ తరువాత హైదరాబాద్ చేరాను అక్కడ నాలాగే భర్తను వదలిఒంటరిగా ఉన్న లక్షమాంబను చూసి ఇద్దరికి జత బావుందని తలచిస్నేహము చేసుకున్నాను నాకు అమ్మాయికి ముందుగానే పెళ్లి అయినా సంగతి తెలియదు నేను కూడా నాకు ఇంతకు మునుపె పెళ్లిఅయిన సంగతి చెప్పలేదు మేమిద్దరమూ మా వివాహాన్ని రిజిష్టరు చేసుకొనిమదరాసులో కాపురము చేస్తున్నాము". అని జరిగిన వృత్తాంతాన్ని కోర్టు వారికి కృష్ణమూర్తి (కృష్ణావధానులు) తెలియజేశాడు.ఈ విషయాలన్నీ విన్న వెంకటేశము,అతని అన్నా వదినలు బోలెడు ఆశ్చర్యపోయి ,"మనకొత్త అల్లుడు పాత అల్లుడే",అని సంతోషపడి కేసును వాపసు తీసుకొని మనవడి భారసాల ను ఘనంగా జరిపించారు.అప్పుడప్పుడు లక్షమాంబ పిల్లవాడిని ఆడిస్తూ,"నీవు కృష్ణఅవధానులుకు పుట్టావా లేక  కృష్ణమూర్తికి పుట్టావా? "అని భర్తను పరిహసిస్తుంటుంది ఈవిధముగా కదా సుఖాంతము అయ్యింది. 
***


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information