సెల్ ఫోన్ తో... - అచ్చంగా తెలుగు
సెల్ ఫోన్ తో...
సుబ్బుమామయ్య కబుర్లు!

పిల్లలూ మీకు అమ్మదో, నాన్నదో సెల్ ఫోన్ దొరికితే ఏం చేస్తారు? గేమ్స్ ఆడుకుంటారు కదూ..అలా ఆడుతుంటే వాళ్లు తిట్టి లాక్కుంటారు కూడా అవునా, కాదా? ఎందుకంటే ఉపయోగం లేని ఆ ఆటలవల్ల సమయం వృధా అవుతుంది, బ్యాటరీ డిస్చార్జ్ అవుతుంది, సెల్ పాడయ్యే అవకాశం ఉంది. అందుకే అలా విసుక్కుంటారు. ఈసారి మీరు అలా చెయ్యొద్దు..ఏం చేస్తారంటే..!
నా చిన్నప్పుడు ఫోటో తీయడం తీయించుకోవడం ఒ పెద్ద కార్యక్రమం. అందరం ముస్తాబై ఫోటో స్టూడియోకి వెళ్లి ఫోటోదిగితే ఆ షాపతను తర్వాత తీరిగ్గా రీలంతా ఫోటోలతో నిండాక, ఎక్కడో ఉన్న పెద్ద స్టూడియోకి తీసుకెళ్లి ఇస్తే, అక్కడి వాళ్లు చీకటి గదిలో నెగటీవ్ ఎక్స్పోజ్ చేసి, కెమికల్లో కడిగి, ఆరబెట్టి, ఫోటో ప్రింట్లు వేసి..అబ్బో ఇలా ఓ పెద్ద తతంగమే ఉండేది. రెండు, మూడు రోజులయిన తర్వాతగాని ఫోటో మా చేతికొచ్చేది కాదు.
ఇపుడు అలా కాదు ఎంచక్కా సెల్ ఫోన్ తో ఎక్కడ కావలిస్తే అక్కడ, ఎలా కావాల్సొస్తే అలా  ఫోటో దిగిపోవచ్చు. మనకి మనం కూడా (సెల్ఫీ)ఫోటో తీసుకోవచ్చు. మనకి ఎలా కావాల్సొస్తే అలా మార్పులు, చేర్పులు, రంగుల మార్పిడి (ఎడిట్) చేసుకోవచ్చు. బాగుంటే దాన్ని మిత్రులతో, చుట్టాలతో పంచుకోవచ్చు. ఫోటో ప్రింట్లూ వేయించుకోవచ్చు. భలేగా ఉంది కదూ.
మీరేం చేయాలంటే, మీ సెల్ ఫోన్ లో ఫోటో తీయడం, జూం చేయడం, ఎడిట్ చేయడం ఇలాంటి మెళకువల్ని మీకు మీరుగా గాని అమ్మ, నాన్నలని అడిగి కాని తెలుసుకోండి. ఉపయోగించడం నేర్చుకోండి. దీని వల్ల ఏమీ వృధా అవదు ( మా కాలంలో అయితే రీల్ వేస్టయ్యేది). పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు, పార్కులకు, చారిత్రక కట్టడాలకు, గుళ్లకు వెళ్లినప్పుడు చక్కని ఫోటోలు తీయండి. కొండలు, గుట్టలు, చెట్లు, పూలు, తుమ్మెదల్లాంటి కంటికి అందంగా కనిపించే ప్రకృతి అందాలు, మనసును మెలిపెట్టే బాధాకర దృశ్యాలూ ఫోటో తీయండి. అందరికీ చూపించండి. చప్పట్లు కొట్టకపోతే నన్నడగండి. బాగా వచ్చిన దృశ్యాన్ని నాన్నగారితో చెప్పి ప్రింట్ తీయించి ఫ్రేమ్ కట్టించో, లామినేషన్ చేయించో ముందు గదిలో అథిదులకు కనిపించేలా పెట్టమనండి. గోడల్ని అలంకరించడానికి ఏ సీనరీలో, ఎవరి ఫోటోలో ఎందుకు? మనం తీసినవే పెడదాం.
ఫోటో తీయడం ఒక కళర్రా. గతాన్ని చూసుకోవాలంటే ఫోటోలు ఉండాల్సిందే.
మరి మీరు మంచి మంచి ఫోటోలతో అందర్నీ మురిపిస్తారు కదూ, మీరు తీసిన ఫోటోలు నాకు చూపించండి..సరేనా..ఉంటానర్రా!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

2 comments:

Pages