స్ఫూర్తిదాయిని - అచ్చంగా తెలుగు
స్ఫూర్తిదాయిని 
పెమ్మరాజు అశ్విని 
       
తెల్లవారి అలారమ్ మోతతో మెలకువొచ్చి గబా గబా లేచింది వసుంధర . గుమ్మం బయట శుభ్రం చేసి కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టింది ,ఇల్లు శుభ్రం చేస్కుని వేడి గా పాలు కాచి ఫ్రెష్ గా డికాషన్    వేసి   కమ్మటి కాఫీ కలుపుకొని చక్కగా కప్ లో పోసుకుని ఒక్కసారి ఆ వాసన కి కాస్తోకూస్తో వున్న బద్ధకం కాస్త వదిలింది "ఆహ రోజు కమ్మగా మొదలయింది అనుకుంది . అలవాటు గా వార్తాపత్రిక తిరగేయసాగింది , ఆ  వార్త ఈ వార్త తిరిగేస్తున్న వసుంధర కళ్ళు ఒక న్యూస్ దగ్గర ఆగిపోయాయి ,అది చదువుతూ కాసేపు మనసంతా బాధ గా మూల్గింది .
            ఒక బాలిక ను సామూహికం గా అత్యాచారం చేశారన్న వార్త అది . మాములు గృహిణి అయితే బహుశా ఆ వార్త చదివి కాసేపు సమాజాన్ని తిట్టుకొని ప్రభుత్వాన్ని పోలీసుల్ని మాటలు అని ఊరుకునేది . అయితే ఇలాంటి అభాగ్యుల కోసం ఒక సేవా సదన్  నడుపుతోంది ,సమాజం లోని గృహ హింస ,వరకట్న పిశాచి కి,అత్యాచారాలకి బలవుతున్న ఆడ పిల్లలకి అండగా నిలిచి వారిలో ఆత్మ స్తైర్యాన్ని నింపే "శక్తీ వనం " నడుపుతోంది వసుంధర . వృత్తి రీత్యా న్యూట్రిషనిస్ట్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో స్లిమ్మింగ్ సెంటర్స్ లో ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ గా పని చేస్తూ చక్కగా సంపాదిస్తున్న ఎదో వెలితిగా ఉండేది వసుంధర కి. డబ్బున్న వారు ఇలాంటి వసతులు తీస్కుని ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతున్నారు కానీ దిగువ,మధ్య  తరగతి మహిళలకి వారి పోషణ గురించి అసలు పట్టదు ,పోషక మైన ఆహరం తినలేరు,ఎంత సేపు సంసారం లో పడి  కొట్టుకుపోతుంటారు ,ఇలాంటి వారికీ ఎలా సహాయం చేయాలి అనే ఒక తపన వెంటాడేది .
                 తన ఇంటి చుట్టుపక్కల ఇటు వంటి మహిళలని కూడగట్టి తనకి వీలైనంత వరకు నెలలో నాలుగు సార్లు వారికీ ఆరోగ్య రక్షణ సంబంధించిన సూచనలు చెప్తూ ఉండేది . అయితే అలా వారి తో మాట్లాడినప్పుడే ఆమెకు వారి అశ్రద్ధ వెనక కారణం ఆర్ధిక వెనకుబాటు అని అర్ధం అయింది . వసుంధర భర్త   సాయిరాం రాష్ట్ర ప్రభుత్వం లో కుటుంబ శిశు సంక్షేమ శాఖ లో ఆఫీసర్ ,తన వృత్తి కి ప్రవృత్తి కి అనువుగా వున్న వసుంధర ని విశాఖపట్నం లో తన స్నేహితుడి ఇంట్లో ఒక ఫంక్షన్ లో చూసి  కోరి పెళ్లి చేసుకున్నాడు . సాయిరాం చాలా సున్నిత మనస్కుడే గాక ఉన్నతమైన నైతిక విలువలు గల మనిషి. తన జీతం తప్పించి ఒక్క రూపాయి పై సంపాదన కి  ఆశ పడదు,అలాగే పెళ్లి కూడా కూరగాయల బేరం కాదని కట్నాలు లాంఛనాలు లాంటి అట్టహాసాలు లేకుండా అన్నవరం దేవస్థానం లో బంధుమిత్రుల సమక్షం లో సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం తో వసుంధర సాయిరాం లు ఒకటఅయ్యారు .
        హైదరాబాద్ లో కాపురం పెట్టిన కొత్తలో అపోలో ,యశోద వంటి కార్పొరేట్ హాస్పిటల్ లో విసిటింగ్ న్యూట్రిషనిస్ట్ గా చేరింది వసుంధర . చక్కటి సంసారం అన్యోన్యమైన దాంపత్యం వారిది , వసుంధర చక్కటి ఎత్తు చూడచక్కని కళ అయిన మొహం పసిడి వర్ణం రూపానికి తగ్గట్టే నప్పేట్టు భారతీయత ఉట్టిపడేలా వుంది వసుంధర వస్త్రధారణ ఎక్కువగా చురీదార్ ,చీరలు ఇవే వేసుకునేది ,చీర కట్టుకుంటే బాపు గారి బొమ్మలా ఉంటావని సరసమాడేవాడు సాయిరాం . తమ పెళ్ళైన కొత్తలోనే  ఇంటి దగ్గరగా వున్న దిగువ ,మధ్య తరగతి మహిళా లకి తాను ఎలా సహాయం చేద్దాం అనే తన ఊహ   సాయిరాం తో చెప్పింది వసు (వసుంధర ని సాయిరాం అలాగే

పిల్చుకుంటాడు మరి) .
    సహజం గా ఆదర్శ భావాలు పైగా తానూ కుటుంబ శిశు సంక్షేమ శాఖ లో పని చేయడం తో ఆ మహిళల పరిస్థితి పైన అవగాహన గల సాయిరాం వసు ని ఈ పని కి ఎంతగానో ప్రోత్సహించేడు ,అంతే గాక తమ శాఖ ప్రవేశ పెడుతున్న కొత్త పధకాల గురించి చెప్పేవాడు  వాటిని వీరికి వర్తింప చేయడం గురించి ప్రయత్నించే వాడు . తమ వంతు సాయం గా ఏదైనా చేయాలనే ప్రణాళిక వీరిద్దరూ చేస్కుంటున్న తరుణం లో 2012 లో నిర్భయ మీద అత్యాచారం ,ఆ అంశం మీద దేశం అంత అట్టుడికింది ,ఇదే కోణం లో దేశం లో ని నలుమూలల నుంచి ఇలాంటి దురదృష్ట కరమైన సంఘటనలు వెలుగు చూడడం వీటి పట్ల వార్త పత్రికలో వార్తలు రావడం చూసి వసుంధర కి ఆవేశం కట్టలు తెంచుకుంది , అయితే ఆమె ఆవేశం ఆక్రోశం అర్ధం చేసుకున్న సాయిరాం ఒక్క మాట చెప్పాడు " అత్యాచారాల గురించి మీడియా ఊదర గొడుతున్నారు ,మానవ హక్కుల సంఘాల వారి నుండి కేసు లు నమోదవుతాయి ,కొన్ని సంవత్సరాల వాయిదాల తర్వాత ఆ నిందితులకు శిక్ష పడుతుంది ,కానీ దీని వల్ల బాధితురాలికి ఏమి న్యాయం జరుగుతోంది . ఇలాంటి అత్యాచారాలకు,ఆసిడ్ దాడులకు,వరకట్న భాదితులకు, గృహహింస కి బలి అవుతున్న ఆడవారికి,ప్రేమించమంటూ మోసానికి గురౌతున్న ఆడపిల్లలకి  ఈ కోర్ట్ తీర్పులు కంటే సమాజం నుంచి ఎదురయ్యే ఆటుపోట్లు తట్టుకోవడమే పెద్ద శాపం. నీ ఆక్రోశం ని వీరికి ఉపోయోగపడేలా ఏదైనా చేద్దాం వసు. "

              ఇంత మంచి ఆలోచన చెప్పినందుకు ఒక్క క్షణం ఆరాధన భావం తో వచ్చి సాయిరాం ని లతలాగ పెనవేసుకుంది వసు ,స్త్రీల పట్ల అతనికి గల భావాన్ని చూసేక వసు కి అతని పట్ల గల ప్రేమ రెట్టింపైంది . వారి ఆలోచన కి రూపు చేసేందుకు ప్రయత్నిస్తూ వున్నా తరుణం లో లావణ్య అనే మహిళా పోలీస్ తో పరిచయం ఏర్పడింది వసు కి ,తన ద్వారా హైదరాబాద్ లో మరియు పరిసర ప్రాంతాలలో స్త్రీల పట్ల నమోదవుతున్న కేసు లు అందులోని భాదిత మహిళల జాబితా ను తీస్కుని వారిని కలిసి ఆ భాదితురాళ్లను ఒక దగ్గర కూడదీసి "శక్తీ వనం" ప్రారంభించింది వసు .
               "శక్తీ వనం " లో పెద్ద చిన్న ,బీద గొప్ప తారతమ్యం లేదు అక్కడున్న అందరు సమాజం లో ని ఎదో ఒక దురాగతానికి బలైన స్త్రీమూర్తులే ,తొలుత వారు వసు తో మాట్లాడానికి విముఖత చూపారు,ఇంటిలోనా ,బయట జరిగిన అవమానాలే గుర్తొచ్చే తల్లడిల్లే వారు . తమకి ఎటువంటి వేధింపులు ఇక మీదట ఉండవని నిర్ణయించుకున్నాక ఒకరి తో ఒకరు స్నేహం చేయసాగారు ,ఇలాంటి 25 మంది తో మొదలైంది "శక్తీ వనం " . కూకట్పల్లి ఏరియా లో తన స్నేహితుడి మధు  ఇల్లు ఖాళి గా ఉండటం ,అతను అమెరికా వెళ్తూ ఆ ఇంటికి బాడుగకు ఇవ్వమని తనకి అప్పగించడం తో ఆ ఇల్లు చుసేకి వెళ్లారు వసు ,సాయిరాం దంపతులు పెద్ద ఇల్లు నాలుగు పడక గదులతో ,విశాలమైన హాలు తో పాటు పెద్ద వంటగది తో పాటు  చుట్టూ కాస్త పచ్చదనం పెంచగలిగే అనుకూలమైన చోటు చూసి ఇది తమ శక్తీ వనం కి అనువైన చోటు అని భావించి ,తన స్నేహితుడికి చెప్పి తానే అద్దెకి తీసుకుంటానని చెప్పాడు సాయిరాం.

           
       చేసేది మంచి పని కాబట్టి అద్దె తగ్గించి నామమాత్రం గా తీసుకుంటానని ,తన ఇల్లు ఇలాంటి సత్కార్యానికి ఉపయోగపడింది అని ఆనందించాడు , ఒక మంచి రోజున శక్తీ వనం ప్రారంభం జరిగింది ,25 మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసి అందరి లో తాము ఒకరి గా వుంటూ వారికి ఆత్మస్థయిర్యం నింపుతు వారి లో వున్న ప్రతిభ ను గుర్తించి దానికి తగినట్టు తర్ఫీదు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు ,కొందరికి కుట్లు అల్లికలు వాటి ఎంబ్రాయిడరీ వంటివి వస్తే మరి కొందరికి వంట ,సంగీతం,నాట్యం వంటి వాటిలో  వుంది , కుటుంబ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి కొంత సబ్సిడీ ఇప్పించి ఎంబ్రాయిడరీ మెషిన్ లు కొని వారిలో కొందరికి తర్ఫీదు ఇప్పించి ,మరి కొందరి చేత లేటెస్ట్ జ్యువలరీ మేకింగ్ విత్ థ్రెడ్ ఇంకా కొత్త ఫ్యాషన్స్ కి అనుగుణంగా శిక్షణ ఇచ్చారు . నెమ్మదిగా వారిలో ఆత్మ విశ్వాసం పెరిగింది వారి లో చాల మంది వారి చేతి లో వున్న విద్య తో నెమ్మదిగా డ్రెస్ లు ,నగలు చేసారు ,వసుంధర తనకి వున్న పరపతి తో సిటీ లో వున్న పెద్ద బొటిక్యూస్ కి అమ్మించింది వచ్చిన డబ్బు తో వారి వారి పేరు మీద విడిగా అకౌంట్స్ తెరిచి వారికి ఒక ఆర్ధిక భరోసా ని కల్పించారు సాయిరాం దంపతులు.

                మెల్లిగా శక్తీ వనం లో ని మహిళలు స్వయంప్రతిపత్తి సాదించుకో సాగారు ,వసుంధర కి పండంటి పాప పుట్టడం తో ఆ సమయం లో నెమ్మదిగా సంస్థ బాధ్యతలు వారి లో కొందరు అనుభవఙ్గయులకి అప్పగించింది వసుంధర . తానూ అప్పుడప్పుడు నేరుగా ,ఎల్లపుడూ పరోక్షంగా కనిపెట్టుకొని ఉండసాగారు వారిరువురు . శక్తీ వనం ని అక్కడి మహిళా సభ్యులు నడిపే విధానం చూసి ఆ దంపతులు మురిసి పోయేవారు ,అయితే ఏ ములూ బాధ అది ఎందుకు అంటే రోజు రోజు కి ఇలాంటి బాధితుల సంఖ్యా దేశం నలుమూలల పెరిగిపోసాగింది . అలాంటి ఒక బాధాకర సంఘటనే ఇవాళ్టి వార్త పత్రిక లో చూసింది వసుంధర. ఇలా మహిళల పట్ల దురాగతాలు పెరిగిపోతూవుంటే ,శక్తివనం లాంటివి  ఎన్ని సంస్థలు వస్తే మాత్రం ఏపాటి ,ఈ సమస్య కి పరిష్కారం ఏంటి పరిపరి విధాలా ఆలోచించ సాగింది ,తన పాప కి ఇప్పుడు ఐదేళ్లు ,తన పాప లాంటి ఎందరో ముక్కుపచ్చలారని పసి బిడ్డలు పెరిగి పెద్దవారైయి ఇలాంటి అకృత్యపు సమాజం లో పెరుగుతున్నారు,కామాంధులు,కీచకుల చేతి లో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. ఇది ఎవరి తప్పు దీనికి మూలం ఏంటి ,ఈ సమస్య ను కూకటి వేళ్ళతో సహా పెరికించే వారు లేరా అని మదనపడసాగింది. రోజు లాగే అప్పోయింట్మెంట్ చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఎందుకో  మనసు కలవరంగా వుండి  ట్యాంక్ బండ్ మీద వున్న రుద్రమదేవి విగ్రహం దగ్గర కూర్చుని పరిస్థితులు గురించి ఆలోచిస్తూ రుద్రమదేవి ని చూస్తూ "నీ స్ఫూర్తి ఇప్పటి మా తరం మహిళల లో ఏమంటోంది అమ్మ ,ఇలాగ మహిళల మీద అత్యాచారం ,దాడులు ఏమిటి అమ్మ ఈ పరిస్థితి ,స్త్రీల లో ధైర్యం తగ్గుతోందా, లేక సమాజం లో పైశాచికత్వం పెరుగుతోందా అర్ధం కావట్లేదు ,నీ స్ఫూర్తి ని మా మహిళలో నింపు తల్లి " అంటూ మౌనం గా మనసులో ఆర్తి తో వాపోయింది.

                ఇలా అనుకుంటూ వెనక్కి తిరిగి ఆటో పిలుస్తుంటే ఎవరో భుజం మీద తట్టినట్టు అయ్యి త్రుళ్ళి పది వెనక్కి తిరిగి చూసింది సుమారు 6 అడుగుల ఎత్తు తో   ధీటైన శరీరాకృతి తో ఒక చుడిదార్ లాంటి డ్రెస్ వేస్కుని ఒక అమ్మాయి వసు ని ఆపింది . చూడటానికి ఈ కాలం వనిత లాగ అనిపించలేదు . "మీరు ఎవరు ఎక్కడ చుసిన గుర్తు కూడా లేదు అంటుండగానే "కొత్త గా వచ్చిన ఆ వనిత అమ్మ నా పేరు రుద్రమ్మ కొంచెం అవసరం లో వున్నా మీరేమైనా ఆసరా చుపిస్తారేమో అని పిలిచాను ." సరే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా నాతో రండి అంటూ ఆటో ఎక్కింది వసు . వెళ్తూ దారిలో అడిగింది "ఇప్పుడు చెప్పండి అమ్మ మీకు ఏమి కావాలి అని అడిగింది .

            అమ్మ నేను  వరంగల్ దగ్గర ఒక పల్లె నుంచి వస్తున్న మొన్న ఒకరోజు పేపర్ లో మీ గురించి చదివి మీరు చేసే పని లో నేను భాగం పంచుకుందామని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతె " అంటూ వసు కేసి చూసింది రుద్రమ్మ ,మంచిపని చేయడానికి అనుమతులతో పని లేదు కానీ మీరు ఏ విధంగా మా పని లో  పాలు పంచుకోగలరు .అంది వసు. " అమ్మ మీరు వారి కాళ్ళ మీద నిలబడే లాగ శిక్షణ ఇస్తున్నారు, వారికి ఆత్మరక్షణ పరంగా  వారు నేర్చుకొనవలసిన మెళకువలు నేను నేర్పిస్తాను . "
          అప్పటివరకు తనకి రాని  ఈ ఊహ కి తాను ఇప్పటి వరకు సతమతవుతున్న సమస్య దూదిపింజలా తేలిపోయిందనిపించింది . అయితే రుద్రమ్మ ఎవరో ఏంటో తెలియదు ఉన్నటుండి ఎక్కడి నుంచో వచ్చింది ,తన గురించి పేపర్ లో చదివాను అని చెప్తోంది అనే చిన్న సందేహం ఎదో మూల వున్న ,మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం తో సరే అని రుద్రమ్మ ని శక్తివనం కి తీసుకెళ్లింది . రుద్రమ్మ వచ్చిందే తడవు గా అందరి తో కలిసిపోయింది ,చాల కలివిడిగా వుంటూ వనం లో ని మహిళల  లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారికి కరాటే ,కర్రసాము వంటివి నేర్పడం మొదలుపెట్టింది . అంతేకాక అమ్మాయిలు ఎలా మోసగాళ్ల బారి నుంచి రక్షించుకోవాలి వంటి వాటిల్లో కావలిసినంత వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తోంది .
              ఇవన్నీ చూడటానికి చాలా సంతోషంగా వున్నా వసు కి ఎదో మూల చిన్న భయం వుంది  ,ఎంత ఆలోచించినా రుద్రమ్మ చెపుతున్న తను చెప్తున్న నేపధ్యానికి ఆవిడ వస్త్రధారణ కి మాట తీరు కి పొంతన కుదరట్లేదు ,వసు  తన భర్త సాయిరాం తో తన  భయం గురించి చెప్పింది అది విన్న సాయిరాం వసు భయం లో ని లోతు అర్ధం చేస్కుని కొన్ని రోజులు రుద్రమ్మ తమ ఇంట అట్టేపెట్టి కొంత గమనిస్తే ఫలితం వుండచ్చేమో ఆలోచించమని సలహా ఇచ్చాడు. ఇక ఎక్కువ రోజులు ఈ బెరుకు ఉండకూడదని చెప్పి రుద్రమ్మ ని నాకు కొంచెం ఇంట్లో సాయం కావాలి  అని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది వసు . అయితే రాత్రి పూట ఆమె ఎందుకో గదిలో తలుపు వేస్కొని ఉండడం వసు ద్రుష్టి దాటి పోలేదు .ఒకరోజు రాత్రి అనుకోకుండా కిటికీ లోంచి రుద్రమ్మ గది లో కి చుసిన వాసు ఒక్కసారి గా స్థాణువైపోయింది . రుద్రమ్మ పాత చారిత్రక  సినిమా లో రాణి మాదిరి వస్త్రధారణ లో వుంది రుద్రమ్మ.కాసేపు తన కళ్ళ ని తానే నమ్మలేకపోయింది వసుంధర .
         ఇంతలో అనుకోకుండా రుద్రమ్మ వసు ని చూసి గబగబా తన దగ్గరికి వచ్చి ష్ అంటూ గమ్మున గది లో కి తీసుకుపోయింది .వసు కాసేపు తన చుట్టూ ఏమి జరుగుతోందో అర్ధం కాక పిచ్చిచూపులు చూడ సాగింది . వసు పరిస్థితి అర్ధం చేసుకున్న రుద్రమ్మ ఒక లోటా నీరు ఇచ్చి ఇలా చెప్పనారంభించింది "అమ్మ వసుంధర నువ్వు ఇప్పుడు చూసింది నా అసలు రూపం నేను 12వ శతాబ్దానికి చెందిన రుద్రమ దేవి లేదా రుద్రదేవుడ్ని ,ఆ రోజు నువ్వు నా విగ్రహం దగ్గర కూర్చుని మన భారతీయ మహిళల దుస్థితి గురించి బెంగ పడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను ,అయితే నేను రాజ్యపాలన చేసిన సమయం లో మహిళలని చులకన గా చూసే వారు ఒక స్త్రీ రాజ్య అర్హత లేదు నా మీద తిరుగుబాటు చేసిన సందర్భాలు ఎన్నో ,కానీ నా మనోధైర్యం ,ఈశ్వరుని మీద భక్తి నన్ను నేను మల్చుకునేలా చేశాయి. "
            "ఇవాళ్టి సమాజం లో స్త్రీలకి ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు,సమాజం కోసం వారి వస్త్రధారణ ,సంస్కృతీ మార్చుకొని మగవారి తో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా కూడా మగవారి తో సమానంగా అంతకుమించి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది  ,మగపిల్లల్ని ఆడపిల్లల్ని సమానంగా పెంచాలి అనే మాట వాదనలకే పరిమిత మవుతోంది గాని ఆచరణ లో కొద్దీ మందే చూపుతున్నారు ,ఇంతేగాక ఇంత చదువుకున్న వారు వున్నా కూడా ఈ రోజుకి భృణ  హత్యలు,బాల్య వివాహాలు,వరకట్న చావులు అంటూ ఆడపిల్లలు బలవుతూనే వున్నారు. ఇవి సనాతన ఆచారాల పేర నడుస్తున్న అనాగరికపు  చర్యలు ,కుటుంబ వ్యవస్థలో ,సమాజం లో   మార్పు వస్తే గాని  ఇలాంటి అకృత్యాలు తగ్గుతాయి. వీటన్నిటికీ పునాది ఆడవారు దృఢచిత్తం తో ఆత్మరక్షణ విద్యల్లో రాణించిన రోజు ,ఎవరైనా ఆడవారి పట్ల అరాచకానికి పాల్పడే ప్రయత్నం చేస్తే వారికీ మగవారు అనే అహంభావం ని దించేయాలి ,వారిని ఎదిరించి తరిమికొట్టాలి . ".
         రుద్రమ్మ చేసిన ఈ ఉద్బోధ విని వసుంధర కళ్ళ వెంబడి ఆనంద బాష్పలు వర్షించాయి ,ఆ తన్మయ స్థితి లో వసు "అమ్మ మీరు చెప్పిన విషయాలు మేము తప్పక గుర్తుపెట్టుకుంటాము,ఆచరిస్తాము  ,అయితే మీరు  ఎలా ఈ కాలం లో బ్రతికి వచ్చారు అని అర్ధం కావట్లేదు , ఇది కలయో వైష్ణవ మాయో అన్నటున్నది ,దయ చేసి ఈ విషయం వివరించండి అమ్మ" .  రుద్రమ్మ "వసుంధర నువ్వి ప్రశ్న అడుగుతావని నేను ముందే ఊహించాను ,ఆ రోజు నా విగ్రహం దగ్గర నీ ఆక్రోశం చూసి నేను పార్వతీ పరమేశ్వరులు ని ప్రార్ధించాను,అమ్మ ల గన్న అమ్మ ఎంతైనా జగన్మాత కదా నీ ఆక్రోశం,నా ఆక్రోశం వెరసి భారతీయ స్త్రీల పరిస్థితి ని గ్రహించి నన్ను కొంత కాలం నా ధర్మం నిర్వర్తించి భారతీయ స్త్రీలకి ధైర్యం నింపి ,భారతావని గర్వించేవిధంగా తయారు చేసేందుకు నాంది పలకమని నన్ను పంపించింది జగన్మాత ."
             ఆ మాటలు విన్న వసు "ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటో తెలుపు తల్లి "అని అడిగింది ,ఆ మాటలు విన్న రుద్రమ్మ "వసు ఇప్పుడు మన శక్తివనం లో స్త్రీల ను ఎలా మానసికంగా ,శారీరికంగా బలోపేతం చేస్తున్నామో అలాగే దేశం అంతటా మన లాగ పనిచేసే శాఖలని సంకీర్ణం చేస్తూ వారిని బలోపేతుల్ని చేయాలి ,అంతేకాదు ప్రతి స్త్రీ కి ఆత్మరక్షణ విద్యలలో ప్రవేశం కల్పించాలి,మగపిల్లల కి తన చుట్టూ స్త్రీల పట్ల  తప్పుడు భావన కలిగితే ప్రభుత్వం తీవ్రమైన శిక్షలు తక్షణమే అమలు పరిచే విధముగా ప్రభుత్వాలు చట్టాలు మార్చేలాగా భారతావని స్త్రీలందరు ఉద్యమించాలి." రుద్రమదేవి మాటలు విన్న వసుంధర మంత్రముగ్ఢురాలై స్ఫూర్తి పొందినదై వెలుగు వైపు అడుగులు వేయసాగింది .

 ***

2 comments:

  1. చాలా బాగా వ్రాశారు. రుద్రమదేవిని ఆత్మగా ప్రవేశపెట్టడం క్రొత్త ప్రయోగం. ఇలా మంచి కథలు వ్రాస్తూనే ఉండండి.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు సర్

      Delete

Pages