శ్రీ నారాయణ తీర్థులు - అచ్చంగా తెలుగు

శ్రీ నారాయణ తీర్థులు

Share This
శ్రీ నారాయణ తీర్థులు
మధురిమ 


జగత్తునందు పాపములు వృద్ధిచెంది ధర్మమునకు హాని ఏర్పడినప్పుడు సర్వశక్తివంతుడైన శ్రీహరి అవతరిస్తాడు.
ఈ విధంగా ఏర్పడినవే మత్స్యః కూర్మో వరాహశ్చ,నారసింహశ్చ వామనః
రామోరామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కి తే దశ అనే దశావతారాలు.
అయితే దశావతారాలలో కృష్ణావతార సారాన్ని ,కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు..కృష్ణ భగవానునికి 'అన్యథా శరణం నాస్తి' అని మనల్ని మనం సర్వ సమర్పణ గావించుకున్నప్పుడే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోగలం.
శాస్త్రీయ సంగీత వాగ్గేయ కారులందరూ ఇదే మార్గంలో నడచిన వారు కాబట్టే వారు భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. జీవించినన్నాళ్ళూ భగవత్ సన్నిధానంలో గడిపారు కాబట్టే చివరికి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ఆయన సాన్నిహిత్యాన్ని పొందగలిగారు.
అసలు 'కృష్ణా' అన్న పేరులోనే ఓ సమ్మోహనత్వం ఉన్నదేమో! ఆ మోహనుడిని తలచుకున్నమాత్రం చేతనే తన్మయత్వాన్ని పొందగలిగన భక్త జయదేవుడు, శ్రీకృష్ణుడే తన సర్వస్వంగా, తన స్వామిగా భావించగలిగిన మీరా, శ్రీకృష్ణుణ్ణి నాయకునిగా తనని తాను ఓ నాయకిగా వర్ణించుకుని ఆ కృష్ణుణిలో ఐక్యం అవ్వగలిగిన క్షేత్రయ్య, ఇలా ఎందరో మహానుభావులు కృష్ణ భక్తిలో ఓలలాడారు. 
తన తరంగాల గానముతో శ్రీకృష్ణుని భక్తి భావనా సాగరంలో సంగమమైన శ్రీ శివ నారాయణ తీర్థుల వారు కూడా శ్రీకృష్ణ భక్తాగ్రేశ్వరులలో అగ్రగణ్యులే!
నారయణ తీర్ధులు మన తెలుగునాట పుట్టి పెరిగినవారని చారిత్రకారులు నిర్ణయించినా, వారు జీవించిన కాలము నిర్ణయించడములో ఎన్నో భేదాభిప్రాయలున్నాయి. తంజావూరుకు చెందిన సరస్వతీ మహల్ గ్రంధాలయంలో తాళపత్రాలను ప్రమాణంగా స్వీకరించి, వారు 1650-1745 కాలానికి చెందినవారుగా నిర్ణయింపబడినది. ప్రస్తుత గుంటూరు జిల్లాలోని మంగళగిరి దగ్గర ఉన్న కాజా గ్రామానికి చెందిన స్మార్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తండ్రి గారి పేరు గంగాధరం, తల్లి గారు పార్వతి. ఇంటిపేరు తల్లావర్జుల వారు. వీరి అసలు పేరు గోవిందశాస్త్రి అని ఒక వాదం కూడా ఉంది.

చిన్నతనము నుండీ సంగీత సాహిత్యములందు ఎంతో ఆసక్తి గలిగినవారట వీరు. ఎల్లప్పుడూ భాగవత గ్రంధమును గానం చేసేవారట. శివరామానందతీర్థులు అను యతి వద్ద ఉపదేశం పొందినారట. యుక్త వయస్సులో వివాహం జరిగినప్పటికీ ఎల్లప్పుడూ కృష్ణ చింతనలోనే ఉండేవారట.

ఓరోజు ఆయన నది అవతలి ఒడ్డున ఉన్న అత్తవారి ఇంటికి వెళ్ళడానికి నది దాటుతూ ఉండగా ప్రవాహం ఎక్కువగా ఉండడం వలన ఇక జీవితము మీద ఆశ వదులుకుని యజ్ఞోపవీతము తీసివేసి సన్యాశాశ్రమము స్వీకరించారుట. నది దాటుతూ ఉండగా మళ్ళీ ప్రవాహము తగ్గగానే అవతలి గట్టుకు చేరుకున్నారుట. తాను సన్యశించినట్లు ఎవ్వరికీ తెలియదు కాబట్టి, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలకున్నారుట. కాని ఇంటి లోపలకి వస్తున్న నారాయణతీర్ధుల్ని చూడగానే ఆయన భార్యకు మాత్రం ఒక దివ్యతేజస్సుతో విరాజిల్లుతున్న ఓ మహాపురుషుని వలే కనిపించారట. ఇక ఆ తరువాత శాస్త్రోక్తముగా సన్యాశాశ్రమును స్వీకరించారట.
ఇక అప్పటి నుంచీ సన్యాశాశ్రమ ధర్మము ప్రకారమూ, దేశాటనం చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించడం ప్రారంభించారు.
మొదట గా ఆంధ్రరాష్త్రంలోని చల్లపల్లి ముత్యాల సంస్థానములో గడిపి అచ్చటి నరసింహస్వామిపై కొన్ని రచనలు చేసారు. ఇక ఆ తరువాత ఒడిస్సా రాష్త్రంలోని పూరి క్షేత్రంతో మొదలు పెట్టి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారట. అయితే ఈ యాత్రలో వారు విపరీతమైన కడుపునొప్పితో బాధ పడుతూ ఉండేవారట. ఓసారి కావేరి అనే పల్లెటూరులో బస చేసి ఉన్నప్పుడు,  ఓ వినాయకుని గుడిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కలలో శ్రీకృష్ణ భగవానుడు కనబడి ఈ విధంగా చెప్పారట.
"నీకు రేపు రెండు వరాహములు కనిపిస్తాయి. వాటి వెనుక బయలుదేరి, అవి అగిన చోటే నువ్వూ విశ్రమించు. అప్పుడు నీ బాధ తగ్గుతుంది."
మర్నాడు ఉదయాన్నే దైవాజ్ఞ ప్రకారం ఆ వరాహాలను అనుసరిస్తూ వెళుతూ ఉండగా అవి "భూపతి రాజపురము" అనే ఊరిలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం దగ్గర కొన్ని క్షణాలు ఆగి అదృశ్యమయ్యాయి.ఆ దేవాలయంలో ప్రవేశించిన వెంటనే అతని కడుపునొప్పి కూడా మాయమయ్యెనట.
నారాయణతీర్థులవారు చాలాకాలము ఇక్కడే గడిపారని చారిత్రకారుల అభిప్రాయం. ఆయన ఏ కార్యసాధనకై జన్మించారో ఆ కార్యమును కూడా ఇక్కడే పూర్తి చేసారు. వారు "శ్రీకృష్ణ లీలా తరంగిణి" గ్రంథాన్ని ఇక్కడే రచించారు. ఈ ఊరికే తరువాత వరాహపురమనియు, వరాహపూర్ అని పేర్లు కూడా వచ్చాయి. శ్రీ కృష్ణ లీలా తరంగిణి గీతగోవిందాన్ని పోలి ఉన్న కావ్యామృతం. సంగీతంతో పాటు నృత్యానికి కూడా పెద్ద పీట వేసిన కావ్యం.ఈ గ్రంథం భాగవతంలోని దశమ స్కందం యొక్క సారాంశం.
శ్రీకృష్ణ గాధను సంస్కృతములో 12 సర్గలు(అంకములుగా)రచించారు వీరు. ఈ గ్రంథము ప్రారంభములో మంగళా చరణము, తరువాత శ్లోకాలు, ఇష్టదేవతా ప్రార్థనలు, ఆ తరువాత తరంగాలు ఉంటాయి.ఈ తరంగములు పల్లవి, అనుపల్లవి, చరణములతో స్వనామ ముద్ర కలిగియుంటాయి. అనుపల్లవి, చరణాలు ఒకే ధాతుశైలి కలిగి "నారాయణ తీర్థ" అన్నస్వనామ ముద్రతో ఉంటాయి. నాయకా నాయకీ స్వభావ వర్ణన కలిగిన ఈ రచనలు తోడి,కళ్యాణి, శంకరాభరణం వంటి పెద్ద రాగాలోనేకాక దేశాక్షి, రేవగుప్తి వంటి అపూర్వ రాగాలలో కూడా రచింపబడినవి. సంగీత, సాహిత్య సంపుటితో నిండియున్న ఈ తరంగాలు మధుర భక్తి ప్రధానముగా అలరారుచున్నవి. అందుకే ఈ గ్రంథమునకు  "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" అన్న పేరు సార్ధకమయ్యింది. రాధాకృష్ణుల ప్రేమ తత్వము, ప్రణయగాధలను వర్ణించు శృంగార రస ప్రధానమైన కావ్యమిది. మొత్తం 12 సర్గలలో శ్రీకృష్ణ ప్రాదుర్భావము, బాల లీలలు, గోవత్సలపాలనము, కృష్ణ గోపాల వర్ణనము, గోవర్ధనోద్ధరణము, కృష్ణ గోపీ సమాగమము, రాసక్రీడ,మధురా ప్రవేశము, కంస సంహరము, ద్వారకా ప్రవేశము, రుక్మిణీ కృష్ణుల వివాహ మహోత్సవము ఇలా ఒక్కో సర్గలో ఒక్కో అంశము వర్ణింపబడినది. తరంగములలో ఆద్యంతమూ కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడిగా, గోపికల ప్రసంగమంతయూ పరబ్రహ్మముతో కూడినదిగా, వర్ణించబడింది. ఈ గ్రంథం
రాయడం ముగించగానే నారాయణతీర్థులవారికి రుక్మిణీకృష్ణుల దర్శనం కూడా అయ్యిందని జనవాక్కు.
ఇంత అద్భుతంగా తన లీలలను వర్ణించిన వారికి దర్శనం ఇవ్వకుండా ఆ భక్తవత్సలుడు మాత్రం ఎలా ఉంటాడు?
నాట్య శాస్త్రములోనూ శ్రీ నారాయణ తీర్థులకు విశిష్టమైన ప్రవేశం ఉండడం వలన ఈ తరంగాలు నృత్య సంగీతమునకు కూడా అనువుగా ఉన్నవి. 'గోవర్ధన గిరిధారి' వంటి తరంగాలు నృత్య ప్రదర్శనలలో విరివిగా మనం చూస్తూ ఉంటాం కూడా.
ఈ గ్రంథమే కాక తెలుగులో "పారిజాత అపహరణం" మరియు సంస్కృతంలో "హరి భక్తి సుధాణవము" అను ఇంకో రెండు గ్రంథాలు కూడా వీరు రచించారు. పారిజాత అపహరణం యక్షగానంగా ప్రసిద్ధి చెందింది. నారాయణ తీర్థులు ఎందరో శిష్యులకు ఈ యక్షగానమును నృత్యనాటకముగా వరాహపుర్ లో నేర్పించారని కూడా ప్రచారములో ఉన్నది.
కొన్ని ప్రసిద్ధి చెందిన తరంగాలు కేదారగౌళ రాగంలోని “నందముకుందే పరమానంద” దేశాక్షి రాగంలో “హేరామ హేకృష్ణ” సారంగ రాగములో “కంసాసుర సంహరణ” ముఖారి రాగంలో “కృష్ణం కలయసఖి సుందరం” ఇలా ఎన్నో ఎన్నెన్నో….
శ్రీ కృష్ణ లీల తరంగిణిని లో గల చివరి శ్లోకం 
"కామదా కామినామేషా ముముక్షూణాంచ మోక్షదా
శృణ్వుతాం గాయతాం భక్త్యా క్రిష్ణలీలా తరంగిణీ "
అంటే కృష్ణ లీలా తరంగిణిని భక్తితో వినినను, గానము చేసినను భోగములానందించ గలవారికి భోగము, మోక్షము గోరువారికి మోక్షము కలుగునని అర్థము.
ఈవిధంగా హరినామ రచనతో తరించి, స్మరణచే ఎప్పటికీ మానవాళిని తరింపజేసే శ్రీ నారాయణతీర్థులవారు మాఘ శుద్ధ అష్టమి నాడు కృష్ణ సాన్నిధ్యాన్ని చేరారు. వీరి సమాధి వరాహపురములోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయమునకు సమీపానే ఉన్నది. అందులో వీరి ఛాయాచిత్రాన్ని కూడా దర్శించవచ్చు. ప్రతీ కృష్ణాష్టమికీ ఇక్కడ తరంగాలు గానం చెయ్యడం సాంప్రదాయం. నారయణ తీర్థులు జయదేవుని అంశ అని కూడా ప్రతీతి.
మధుర భక్తి సామ్రాజ్యంలో తన తరంగాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలంచేసుకున్న వీరు, ప్రాతః స్మరణీయులు. మిగతా వాగ్గేయకారుల రచనల వలె, కళాకారులు తరంగాలు కూడా సభలలో పాడి ఆ పుణ్యమూర్తిని స్మరించుకుని వారు ధన్యులు కావాలని ఆశిద్దాం.

  -- కృష్ణం వందే జగద్గురుం --  

No comments:

Post a Comment

Pages