Wednesday, November 22, 2017

thumbnail

విరాట పర్వము - కీచక వధ

విరాటపర్వము:కీచకవధ
డా.బల్లూరి ఉమాదేవి 

వేదవ్యాసుడు సంస్కృత భాషలో మహాభారతమును వ్రాశాడు .పంచమ వేదమనదగిన ఆ భారతమును కవిత్రయము అను పేరుతో ప్రసిద్ధిగాంచిన నన్నయ,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగుభాషలో అనువదించారు.ఆదికవి నన్నయ ఆది,సభాపర్వాలు పూర్తిగానూ,అరణ్యపర్వంలో సగభాగం వరకు వ్రాశాడు.కవిబ్రహ్మగా బేరుగాంచిన తిక్కన విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు అనువదించాడు. ప్రబంధపరమేశ్వరుడైన ఎఱ్ఱన అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు.
తెలుగువారికి భారతమంటే చాలా ఇష్టం.ఎంత ఇష్టమంటే"వింటే భారతం వినాలి,తింటే గారెలే తినాలి"అనేంత ఇష్టం.
తిక్కన ప్రారంభించిన విరాటపర్వం హృదయోల్లాసం కల్గించేది.అనేక రసాలతో కూడుకొన్నది.విరాటపర్వ కథకు సంబంధించిన చిత్రపటాలను చూసి నప్పుడు నా మదిలో మెదలిన పద్యములివి.కీచకవధ,ఉత్తర గోగ్రహణ ఘట్టములు కథా వస్తువులైనవి.

పాండవులు కౌరవులతో జూదమాడి ఓటమి పాలౌతారు.పందెపు నియమానుసారము 12సంవత్సరములు అరణ్యవాసము,ఒక ఏడు అఙ్ఞాతవాసము చేయాలి.దానికి బద్ధులై పాండవులు అడవులకు వెళ్ళడంతో " కీచకవధ "కథ ప్రారంభమౌతుంది.


ఆ.వె: శ్రీనివాసునకును సిరిదేవికిని మ్రొక్కి
వాక్కు నొసగు మనుచు వాణిఁవేడి
ఆది పూజితునకు నంజలి ఘటియించి
వ్రాయ బూని తేను బ్రాతి తోడ. : 1:

ఆ.వె:కపట జూదమాడి కౌరవేయు లచట
పాండుసుతుల నెల్ల పరిభవింప
పంత మాడినటుల పాండవు లెల్లరు
బయలుదేరినారు భామ గూడి. : 2 :

ఆ.వె: కృష్ణు దయను పొంది కృష్ణతో బాటుగా
పాండు తనయులెల్ల పదియు రెండు
వత్స రంబులడవి వాసము జేయుచు

పూర్తి జేసినారు ముదము తోడ. : 3 :


తే.గీ: వేషములు మార్చుకొని పాండవేయు లెల్ల
చేయ నఙ్ఞాత వాసము చింత లేక
మత్స్య దేశంబునకు నేగ మదిని దలచి

భామ తోడను సాగిరి వడిగ వారు. : 4 :


ఆ.వె: వీరులవలె నున్న వీరలగని రాజు
యాశ్రయంబు నొసగి యాదరించె
కంకుభట్టు యయ్యె కౌంతేయు డప్పుడు
నరుడు నేర్పుచుండె నాట్యములను : 5 :

ఆ.వె: వంటవాడిగానె భాసించె భీముడు
కవలలిద్దరు పశు కాప రులుగ
మానిననెడి పేర మగువ ద్రౌపదియేగ
చేరి రెల్లరచట సేమముగను . : 6 :

ఆ.వె: కర్మ కాలినపుడు కాలమే శత్రువౌ
నన్న తీరు గానె నాపదొడమె
రాజు బావమరిది రమణి ద్రౌపదిఁగని
మరులు గొనియె తాను మదము తోడ. : 7 :

ఆ.వె: మగువ జూచి తాను మత్తులోబడి, యక్క
చెంత కేగి వేడె చింత దీర్చు
మనుచు మనసు లోని మాట తెలియ చేయ
ముప్పు వచ్చె నంచు ముదిత దలచె. : 8 :

ఆ.వె: హితము బల్క నక్క హీనముగా జూచి
పొందు కూర్ప కున్న పోవ ననగ
వలదు వలదు మాట బాగుగా వినవయ్య
పడతి కైదు మంది పతులు గలరు. : 9 :

ఆ.వె: సూక్తమైన మాట సోదరి చెప్పంగ
వినక మూర్ఖు డగుచు విసురుగాను
తరుణి నంప కున్న తగవె మిగులు నింక
కీడు తప్ప దనియె కీచకుండు. : 10 :

ఆ.వె: పతులు ఐదు మంది పడతికి గలరట
వదలబోరు రాజు బావమరిది
వనుచు మోహ మింక వలదయ్య వినుమాట
యనుచు ననునయించి యతివ పలికె. : 11 :

ఆ.వె: కామ పీడితుండు కన్నుమిన్నరయక
'వేగ పంప కున్న వేటు దప్ప'
దనగ భీతి నొంది కినుక బాప సుధేష్ణ
రమ్మని పిలిపించె రమణి నపుడు. :12 :

ఆ.వె : మధువు వలయు నాకు మగువ నీవిప్పుడే
తమ్ము నింటి కెళ్ళి త్వరగ తెమ్ము
ననుచు పలికె తాను నయముగా కృష్ణతో
కాదు కూడదనక కదలు మనగ : 13 :

ఆ.వె :మదిని బెంగ పడుచు మారాడగా లేక
బెదరుచు తనుమధ్య భీతి తోడ
జరుగ బోవునదియు జరిగ తీరు ననుచు
కలశ పాత్ర బట్టి కలికి /కాంత వచ్చె. : 14 :

ఆ.వె: చిగురుబోడిని గని సింహబలుడు తాను
చేయి బట్ట బోగ చెలియ పలికె
వదల వోయి కరము పతులేవురు గలరు
నిన్ను వీడ రిపుడు నిజము నిజము. : 15 :

ఆ.వె :తులువ తనము తోడ తోయలిన్ వేధింప
నిండు కొలువు చేరె నీరజాక్షి
న్యాయ మడుగ బోగ నయముగా కంకుడు
నడ్డు తగిలి పంపె నతివ నపుడె. : 16 :

ఆ.వె :బుసలు గొట్టు చున్న భుజగము వోలెతా
వేగ నడచె నీలవేణి యపుడె
యర్జునుని గనుగొని యాగ్రహావేశాన
బాధ వెళ్ళ గక్కు పడతి జూచి. : 17 :

ఆ.వె :పవనసుతుడు గలడు బాపునీ యాపద
వలదు బెంగ యనుచు పార్థు డనగ
మందయాన సాగె మధ్యము చెంతకు
ననునయించి పలికె ననిల సుతుడు . :18 :ఆ.వె: అంత వంత యేల నతివరో భయమేల
చూచు చుండు మిటులె శుభము గూర్తు
నాట్య శాల యందు నాతి రూపము దాల్చి
మట్టు బెడుదు ననియె మరుత సుతుడు. :19 :

.వె : మాయ మాట లాడి మానిని కీచకున్
నర్తనంబు సేయు నగరు కడకు
రమ్ము యనుచు బిలువ రాచఠీవిని బూని
సింహబలుడు తాను చేర వచ్చె. : 20 :ఆ.వె: పడతి వోలె నున్న పవన సుతుని జూచి
తాను వలచి నట్టి తరుణి యనుచు
మురిసి దరికి చేర ముష్టిఘాతము తోడ
గాయ పరచి గూల్చె గాలి సుతుడు. 21ఆ.వె : సింహబలుని భీమసేనుండు యెదిరించి
చీల్చి జంపె తాను చీకటింట
ముద్ద జేసి వాని మూలకు పడదోసి
యతివ కోర్కె దీర్చె ననిల సుతుడు. 22ఆ.వె : పాండు సుతుల నరయ పన్నికతో మల్ల
యోధునంపె నాసుయోధనుండు
యన్న సైగ తోనె నంత మొందించెను
వలలుడనగ నున్న వాయు సుతుడు. : 23 :
ఆ.వె :కీలక మయినట్టి కీచకు మరణంబె
పాండు రాజ సుతుల బయలు పరుప
కౌరవాధి పతియు కలిసి సుశర్మను
దండయాత్ర కంపె దక్షిణాన : 24 :

ఆ.వె :విరటరాజు సాగె వీర సైనికులతో
దక్షిణంబు వైపు త్వరిత గతిని
యదును జూచి వచ్చె నాకౌరవేంద్రుడు
ఉత్సుకతన తాను నుత్తరాన :25 :

ఆ.వె:అయ్య గావు మంచు నాత్రంబు తోరాగ
కొలువు నందు విరటు కొమరు డడిగె
భీతి చెంద నేల వేగమె నుడువుడు
చెంత నుండ నేను చింత యేల. 26

ఆ.వె:గోవు లపహరించి కురుపతి యచ్చోట
నురుకు చుండె తాను నుత్తరాన
విరట రాజు యపుడు వేలసైన్యంబుతో
వెడలె తాసుశర్మ పీచ మణచ. 27

ఆ.వె:అయ్య గావు మంచు నాత్రంబు తోరాగ
కొలువు నందు విరటు కొమరు డడిగె
భీతి చెంద నేల వేగమె నుడువుడు
చెంత నుండ నేను చింత యేల. 28

ఆ.వె:గోవు లపహరించి కురుపతి యచ్చోట
నురుకు చుండె తాను నుత్తరాన
విరట రాజు యపుడు వేలసైన్యంబుతో

వెడలె తాసుశర్మ పీచ మణచ. 29


ఆ.వె:నేను యిచట నుండ నేటికింక భయము
జంకు వలదు మీకు జయము మనదె
తెగువ జూపి మీరు తెండిటు సారథిన్
యనుచు పలికె తాను నార్తి తోడ 30ఆ.వె:చాటు నుండి విన్న చాన సైరంధ్రి తా
రాకుమారి చెంత రవము తోడ
నాట్య గురువు తానె నడుపు రథమునంచు
పలుక సంతసాన పట్టు బట్టె 31ఆ.వె:అన్న యొప్పె;పిదప నాచార్యు నొప్పింప
రథము నడుప నతడు రహిని జూపె
రాకుమారుడపుడు రణము చేయగ నెంచ
సాగు చుండె క్రీడి జవము తోడ. 32తే.గీ:కౌరవుల సేనగని గుండె గుభిలు మనగ
భయము తోడ నుత్తరుడటు బరుగు దీయ
జమ్మి వృక్షము పైనున్న శరము లెల్ల
జూపి యర్జునుం డాతని శోక ముడిపె. 33కం: చక్కని సారథి దొరకిన
గ్రక్కున నేగుచు దునిమెద కౌరవ సేనన్
యుక్కడగించెద నని తా
నెక్కుడు సైన్యము గనగనె నిలపై జారెన్. 34ఆ.వె:గడువు ముగియు చుండ గన్పించె పార్థుడై
శరము లన్ని యచట జాలు వార
యుద్ధరంగమందు యోధుడై పోరాడి
విజయ మంద జేసె విరటు సుతుకు. 35ఆ.వె:విజయ మందినట్టు విజయుడు దెల్పగ
పట్టు కుచ్చు లెల్ల పట్టి తేగ
చెల్లి కోర్కె దీర్చె సెహబాస నగ ప్రజ
తండ్రి మెచ్చు కొనియె తనయు నపుడు. 36ఆ.వె: పాండుతనయు లెల్ల పరమ హర్షంబుతో
నసలు రూపు తోడ నగపడంగ
సంతసించితాను సతి కోర్కెపై పృథ్వి
పతి సుతనుయొసగె పార్థు సుతుకు . 37
.ఆ.వె: అర్జును సుతునకును నతివ యుత్తరకును
శుభ వివాహ మవగ 'సుఖము గనుడు'
యనుచు పెద్ద లెల్ల యాశీర్వదింపంగ
పెండ్లి తంతు ముగిసె వేడ్క తోడ. 38
********Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

2 Comments

avatar

చాలా బాగున్నాయి. అభినందనలు చెల్లాయీ..

Reply Delete
avatar

మీ ప్రయత్నమును మనసారా భినందించుచున్నానమ్మా.

Reply Delete


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information