వాయులీనం లో విలీనమైన 'ద్వారం'
కొంపెల్ల శర్మ


'ఫిడేల్వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం నాయుడు(1893 - 1964)


ఫిడేల్, వైలెన్, వాయులీనం. ఈ పదాలు సాధారణంగా అర్ధంకానివి. పదాలు వేరైనా, వాటి అర్ధం, పరమార్ధం, ఒక్కటే. లలితకళల్లో, అజరామరమైన భాగంగా విరాజిల్లే సంగీతం. అందులోనూ వాద్యసంగీత విభాగం. వాయులీనం. దానినే, ఫిడేల్, వైలెన్ అని పిలవడం పరిపాటి. సంగీత కళకు, కళాకారులకు మధ్య వారధిలా చెలామణి అవుతున్న పరికరం. ఎందరో కళాకారుల చేతుల్లో ఒదిగిపోయి, వినయంగా తన్నుతానే సమర్పించుకున్న సంగీత పరికరం. అటువంటి కళాకారుల్లో, ప్రముఖులు, ప్రప్రధములు - 'ఫిడేల్ నాయుడుగారు. ఆయనే 'ద్వారం' నాయుడుగారు. ఆయన, ఎవరో, వేరెవరో కాదు - ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. 'ద్వారం' ప్రపంచానికే ముద్దుపేరు.
సంగీత కళాజగతి కి ముద్దు పేరు 'ద్వారం'
సంగీత కచేరీ వేదిక పైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్ లేక ఫిడేల్) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని 'మెలోడీ ఫీస్ట్' గా మార్చడానికి కంకణం కట్టుకుని, కృషిని సాధించిన ఘనత కేవలం ద్వారం నాయుడి గారి కళాజీవన ప్రస్థానం లో మరువలేని, మరింక మార్చలేని మైలురాళ్ళు.
20వ శ. చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు 8 నవంబర్ 1893 న బెంగుళూరులో దీపావళి రోజున కళ్ళు తెరవడంతో సంగీతజగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి. తండ్రి వెంకటరాయుడు, ఆర్మీ లో కమీషన్ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నంకు వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వైలన్ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడ ఈ వైలన్ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయం చేసుకున్న వెంకటస్వామి నాయుడు గారు, తన అన్నగారు వెంకటకృష్ణయ్య, తాత దగ్గర వైలన్ నేర్చుకుంటున్న సమయంలో, మన నాయుడుగారు కూడ అన్నగారి వైలన్ ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. ఫలితంగా, ఆరేళ్ళకే తమ్ముడిని వైలన్ విద్యలో పెట్టవలసివచ్చింది. దీనికి కారణాలు - తన వైలన్ ను ఏం చేస్తాడో అని అన్నకు భయం, నాయుడుగారికి కలుగుతున్న అమితమైన శ్రద్ధాసక్తులు. అంతేకాక, ముఖ్యంగా, నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతం పై దౄష్టి మరల్చవలసి వచ్చింది. ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద నాయుడుగారు వైలన్ వాదనంలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. ఫిడేల్, వైలన్ నాయుడుగారు 14వ ఏటనుంచే వైలన్ తో తాదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచంద్రరావు ద్వారం వైలన్ ప్రతిభను గమనించి, డైమండ్ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారిని 'ఫిడేల్ నాయుడూ అని బిరుదుని యిచ్చేరట. వైలన్ నే ఫిడేల్ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్ అంటే 'ఫిడులా' అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్, ఆంధ్రదేశపు సంగీతజగతితో మమైకం అయింది. వైలన్ పుట్టు పూర్వోత్తరాలు సంగీత వాద్య పరికరమే కొత్తగా అనిపించే, వైలన్, 17శ. మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, 'వడివేలూ అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వైలన్ పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు (1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వైలన్ ను తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం. తర్వాత, 19శ. ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో, వైలన్ తో సంపూర్ణ ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్ కౄష్ణ అయ్యర్, గోవిందస్వామి పిళ్ళైలు రంగ్రప్రవేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కధనాలు. వీణ, వేణువు, నాదస్వరం తో వైలన్ ను చేర్చిన ఘనత వాద్యసంగీత జగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరంల ఘనమైన వరసలో వైలన్ ను నిలబెట్టిన ఘనత మాత్రం మన 'ఫిడేల్ద్వారం నాయుడుగారే అన్నది మాత్రం సత్యం. వీటికి వైలన్, వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడ నిరూపించిన నిష్ణాతవిద్వాంసుడు - ద్వారం నాయుడు.
ద్వారం గురించి ప్రముఖుల కృషి, ప్రశంసలు
నాయుడుగారి ప్రతిభను చిత్రించిన రవివర్మ పాశ్ఛాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వైలన్ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణీస్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేసున్నట్లు చిత్రం విశ్వవ్యాప్తంగా ఆశ్చర్యానందభూతుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. ప్రముఖ సంగీతవిద్వాంసుల మెచ్చుకోళ్ళు ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలను చెప్పడం కూడ జరిగింది. అందులో, ప్రముఖ సంగీతవిద్వాంసులు - టి.యల్. వెంకట్రామ అయ్యర్, టి.వి.సుబ్బారావు, పి.సాంబమూర్తి, అరియకూడి రామానుజ అయ్యర్ (సంగీత కచేరీ సంప్రదాయానికి విధులు నిర్ణయించినవారు), తిరుకొడికవల్, ఆఖరున చెప్పుతున్నా, మొదటగా ప్రస్తావించదగిన ప్రముఖ సంగీత కళాకారుడు - శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ గారు లాంటి ప్రభౄతులు ద్వారంవారి ప్రతిభను వేనోళ్ళ కొనియాడడం ఆ రోజుల్లో సర్వసామాన్యం. ప్రముఖ కవులనుంచి అనుభూతులు సంగీత విద్వాంసులతోపాటు, ప్రముఖ ఆంధ్రులు, కవులు కూడ తమ కవిత్వంలో ద్వారం వారిని మరవలేదు. వారిలో, చెళ్ళపిళ్ళ, విశ్వనాధ, బాలాంత్రపు రజనీకాంతరావు, గుర్రం ఝాషువా, గుంటూరు శేషేంద్రశర్మలను మరువలేం. సమాజంలోని అన్నివర్గాల ప్రతినిధులనుంచి ద్వారం నాయుడు గారు పొగడ్తలను అందుకున్నారు.
ప్రపంచ వైలన్ విద్వాంసుడు 'యెహుది మెనుహిణ్కి శృంగభంగం
ప్రతిభ వున్న చోట అధికారంతోపాటు అహంకారం కూడ అధికమైన కళాకారులను ఆవరిస్తాయి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైలన్ విద్వాంసుడు, 'యెహుది మెనుహిణ్ ఒక సన్నివేశంలో తన వైలన్ పరికరాన్ని, ద్వారం వారికి చూపించడానికి కూడ అంగీకరించలేదట. కాని, నాయుడుగారి వైలన్ వాదన ప్రభంజనం గమనించాక, ఈ మహానుభావుడు ఆశ్చర్యపోవడమే కాక, చివరికి ఆయన ఘనపరికరాన్ని నాయుడుగారికిచ్చి, వాయించమని వినయప్రకటన చేశాడట. అంతాకాక, ద్వారంవారిని ఆహ్వానించాడట. అదండీ, మన తెలుగు వెలుగు, తెలుగు తేజం తెలుగుదనం!
గురుదేవ్ రవీంద్రుడు కలిపిన స్వరగళం
ద్వారం నాయుడుగారి వైలన్ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్, అన్ని ముఖ్యకార్యక్రమాలను అనుకున్నవి మరచిపోయి, పూర్తి కచేరి వినడమే కాక, నాయుడుగారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోయింది. నిలయవిద్వాంసుల కార్యక్రమాల్లో నాయుడుగారి వైలన్ వాద్యమే ఎప్పుడూ! ఆ రోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో, ద్వారం నాయుడుగారి వైలన్ కచేరీలు కోకొల్లలుగా వచ్చేవి; అంతేకాక, ప్రకటించిన కార్యక్రమాలకు అంతరాయం వచ్చిన సందర్భాల్లో, నాయుడుగారి కచేరీయే తరచుగా ప్రసారం చేసేవారట. అలాగే, కాకినాడ సరస్వతీసంగీతసభ కార్యక్రమానికి, అనుకున్నట్లుగా, గురువృద్ధుడు, గోవిందస్వామి పిళ్ళై రాలేని పరిస్థితిలో, యువకుడు ద్వారం వారి వైలన్ కచేరీ పెట్టాలని సలహా యిచ్చారట. వయోభేదం అడ్డురాదన్న మాటకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సంగీత కళాశాలకు వన్నెలు
ప్రముఖ హరిదాస పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు విజయనగరం సంగీత కళాశాల మహామహోపాధ్యాయులుగా వున్నప్పుడు, ద్వారం వారిని కేవలం 25 ఏళ్ళకే (1919 లో), విద్యార్ధిగా పరీక్షకు వచ్చినప్పుడు చూపించిన ప్రతిభ నేరుగా వైలన్ శిక్షణ విభాగానికి అధిపతిగా నియామకానికి దారితీసింది. అంతేకాక, ఆదిభట్ల వారి తర్వాత, ద్వారం వారే విజయనగరం కళాశాల స్థానాన్ని 1936 లో ఆక్రమించారు అన్నది ద్వారం వారి ఘనప్రతిభ వెల్లడయింది.
ప్రతిభాపురస్కారాలతో ద్వారం విశిష్ట ప్రక్రియలు
ద్వారం వారిని వరించిన బిరుదులు, పురస్కారాలు, సన్మానాలు, అగణితాలు. 1938 లో వైలన్ సోలో ప్రదర్శన, తమిళనాడులోని వెల్లూరు లో యిచ్చారు. 1952 లో అంధుల సహాయసంస్థకు నిధులను చేకూర్చేందుకు, డిల్లీలోని జాతీయ శాస్త్రీయ సంస్థ లో ప్రదర్శన యిచ్చారు. న్యాయవాది పి.వి.రాజమన్నార్ యింట్లో ప్రముఖ అంతర్జాతీయ వైలన్ విద్వాంసుడు యేహుది మెనుహిన్ ఆశ్చర్యం మేరకు ద్వారం వారి కచేరీ జరిగింది. కర్నాటక సంగీత కచేరీ కార్యక్రమాల్లో వైలన్ ను వాడవచ్చు అన్న భావకుల్లో ద్వారం ప్రధములు అని చెప్పుకోగలిగిన ఘనత. సంగీతకళ పై ద్వారం ఎన్నో వ్యాసాలు - 'తంబూర వింతలు, విశేషాలూ అన్నది మచ్చుతునక.
సంగీత కళానిధి (1941 - మద్రాసు మ్యూజిక్ అకాడమీ); కళాప్రపూర్ణ (1950 - ఆంధ్రవిశ్వవిద్యాలయం); సంగీత నాటక అకాడమీ, లలితకళలు (1953); పద్మశ్రీ (1957 - భారతప్రభుత్వం); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సంగీత కళాకారుడుగా నియామకం (ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ, ఉపాధ్యక్షులు). రాజలక్ష్మీ పురస్కారం (1992 - నాయుడు స్మారక సంస్థ, చెన్నై); శతజయంతి 1993 - భారతప్రభుత్వంవారి స్మారకచిహ్నంగా నాయుడుగారి తపాలాబిళ్ళ.
ద్వారం సలహాలు
విద్యార్ధులకు, వర్ధమాన కళాకారులకు, కనీసం ఒక్కరోజైనా సరే సాధన తప్పకూడదు అని సలహా చెప్పారు. ఒక్కరోజు తప్పితే - ఎవరి తప్పులు వారికే తెలుస్తాయి, రెండురోజులు అయితే - ప్రేక్షకులు, రసికులు కూడ తెలుసుకునే తప్పులు అని విభజించారు. నాయుడుగారు సంగీతం ఒక 'శ్రవణ తపస్సూ అని వర్ణించారు. ద్వారం నాయుడు గారి స్మారక సంస్థలు చెన్నైలో స్మారకసంస్థ, విశాఖపట్నంలో స్మారక కళాక్షేత్రం తో పాటు, విశాఖపట్నం, చెన్నైలో నాయుడుగారి విగ్రహాలు ఆయన ప్రతిభకు తార్కాణాలు, నిదర్శనాలు.
'ద్వారం' వారిపై ప్రముఖుల అభిప్రాయాలు
దేశాన్ని వైలన్ వాద్యంలో ముంచెత్తి, సంగీత నాదాన్ని అందంతో, ఆనందంతో అందజేసిన మహావిద్వాంసుడు; సంస్కౄతీ పునరుద్ధరణ సమయంలో 'ద్వారం' లేని సంగీత ప్రపంచాన్ని ఆలోచించడం కష్టతరం. (కళాక్షేత్ర, వ్యవస్థాపకురాలు, ప్రముఖ నాట్యకళాకారిణి - రుక్మిణీదేవి అరండలే)
ఆకాశవాణి లో ద్వారం కచేరి విని ప్రభావితమైన సంఘటన - నా జీవితంలో ఒక అమోఘమైన మైలురాయి. (నూకల సత్యనారాయణ, ప్రముఖ సంగీత విద్వాంసులు) వైలన్ విద్వాంసుడిగానే 'నూకలా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రముఖ గాత్ర సంగీత ప్రతిభావిద్వాంసులుగా నిలిచారన్నది జగద్వితిమే.
కర్ణాటక సంగీత సంప్రదాయ ధోరణి లో ఆచరించే ఒక 'ప్రోటకాళ్(సదాచారం) ప్రకారం, సహవాద్య సంగీత కళాకారుడే, గాత్ర సంగీత కళాకారుడి వద్దకు వెళ్ళడం ఆనవాయితీ. అయితే, ద్వారం వారి వద్దకు సుప్రసిద్ధ గాత్ర సంగీత విద్వాంసులు తమంత తామే స్వయంగా వచ్చి పలకరించే విధానాన్ని బట్టి, ద్వారం వారి ప్రతిభ, గౌరవం, మర్యాద, వర్ణనాతీతమైనే చెప్పాలి; కళాకారుడికి సాధనాభ్యాసాలు నిత్యావసరం అన్న సూత్రాన్ని, మనసావాచాకర్మణా, నమ్మి, మనోధర్మ ప్రవౄత్తిని ఆచరించిన కళాకారుల్లో ప్రముఖులు ద్వారం నాయుడుగారు. ఒకసారి విజయవాడ కచేరీకి వచ్చి, 'మహిమ తెలియ తరమా' అన్న కౄతి పల్లవి సరిగ్గా కుదురుట లేదని, అభిప్రాయాలను అల్పస్థాయి కళాకారులను కూడ సంప్రదించడం జరిగేది. (ప్రముఖ సంగీత విశ్లేషకులు - టి.ఆర్.సుబ్రహ్మణ్యం).
నాయుడు గారి నిరాడంబరత
యింత పేరు ఎలా తెచ్చుకున్నారు అని ద్వారం వారిని అడిగితే, 'ఎట్లా వాయించాలో నాకు తెలియదు; ఏదో వాయించాను; బాగుందో, లేదో, నాకు తెలియదు" అని తరచు ద్వారంవారు సమాధానం చెప్పడం వారి నిరాడంబరతా వ్యక్తిత్వానికి, హౄదయవైశాల్యతకి, మానవతకి నిదర్శనం అని పలువురి భావన.
ద్వారం ప్రియరాగాలు
ద్వారం నాయుడు గారిని, వారి ప్రియసంగీత రాగాలు ఏమిటని అడిగితే, తరచుగా వచ్చే రాగాలు - కాపీ, బేహాగ్, నళినకాంతి రాగాల్లో సుదీర్ఘమైన 'కరవై'లతో ప్రదర్శించే రాగాలు అని చెప్పడం, భక్తులు దైవప్రార్ధనలో మునిగిపోయి పరిసరాలను మరపించి రాగదేవతను ప్రత్యక్ష దౄశ్యం కలిగించే అనుభవం తరచుగా అయేదిట. 'ఖమాశ్, 'నీలాంబరీ లాంటి రక్తి రాగాలను అందించడంలో అధ్బుత కౌశలత్వం, విశిష్ట సౌందర్య నాదాలుద్భవించేవట.
ద్వారం వారు, విజయనగర సంగీత కళాశాల నిర్వాహకత్వంలో అధిక విద్యార్ధులు వైలన్ విభాగంలోనే, గాత్ర సంగీతభాగంలో కన్న, అభ్యసించేందుకు సంసిద్ధత ప్రదర్శించేవారని, అందరూ, ఎప్పూడూ, ఈనాటికీ, అనుకునే మాట. ఆంధ్ర సంగీత జగతి చేసుకున్న పుణ్యం సంగీతకళానిధి గా విశ్వవిఖ్యాతమైన ప్రతిభను తెచ్చుకున్న ద్వారం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ సంగీతప్రియులు చాలా అదౄష్టవంతులని, దక్షిణ, అఖిల భారత సంగీత కార్యక్రమాల్లో ప్రాతినిథ్యం వహించిన వారిలో ద్వారం వారు ప్రధముల్లో ప్రధములు అని చెప్పాలి. కళాకారుడికి వుత్పన్నమయ్యే ప్రతిభాపాటవాలు విశిష్టమై, విశ్వవ్యాప్తమైతే, తోటి వర్ధమాన కళాకారుల ప్రశంసలు కూడ తప్పక లభిస్తాయి అన్నది ద్వారం వారి విషయంలో నిజం అయి కూర్చుంది. అదే వారికీ, వారి సహకళాకారులకీ సౌభాగ్యం. విశ్వసంగీతజగతి ద్వారాలు తెరుచుకున్నప్పుడల్లా, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వారితోపాటు, వారి మాంత్రిక వైలన్ వాదనవైభవం లేనిదే ద్వారాలు తెరచుకోవు అన్నదాంట్లో ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు.
ద్వారం వారి జయంతి, వర్ధంతి నవంబర్ నెలలోనే సాధారణంగా జరగడం యాదౄఛ్ఛికం. నవంబర్ 8 వారి జయంతి అయితే, నవంబర్ 25 న వారు మహాభినిష్క్రమణం చెందారు.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్న నానుడి, బహుశ ద్వారం వారి వాయులీనవాదన సౌరభం విన్న తర్వాత వచ్చినది కావచ్చు. గురజాడ పదానికి ద్వారం స్వరం 'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అన్న దేశభక్తి గీతానికి ప్రముఖ కవి గురజాడ సాహిత్యరచన కావిస్తే, ఆ గీతానికి స్వరరచన చేసింది మన ద్వారం నాయుడు గారే. గురజాడ శత వార్షిక సంఘం, హైదరాబాద్ సంచిక వారు ప్రచురించారు. సింధుభైరవి రాగం - మిశ్రచాపు తాళం (హనుమత్తోడి రాగ జన్యం) లో నడచిన వైనం ఆ నాడు యావద్భారతాన్ని పులకాంకితుల్ని చేసింది.

ద్వారం వారికి, వర్ధంతి సందర్భంగా కళానివాళిని వినమ్రంగా సమర్పించుకోవడం 'తెలుగువారందరి ధర్మం, కర్తవ్యమే కాక, విధిగా మన విధి.. కొంపెల్ల శర్మ

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top