'నన్నొక మిత్రునివలె స్వీకరించండీ' - సత్యసాయిబాబా

కొంపెల్ల శర్మ 


సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, విద్యలన్నియు నేర్చి విలువ సున్నసత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, దాన ధర్మాల సార్ధకత సున్నసత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, బహుళ సత్కార్యలాభంబు సున్నసత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, పదవుల నేలిన ఫలము సున్న. - శ్రీ సత్యసాయిబాబా

మానవతాగుణాలైన - సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను నాలిగింటినీ సమతులనం చేసి, అమౄతవాక్కులను అందించారంటే, అది సామాన్య మానవునికి దుర్లభమైన విషయం.
జీవితం ఒక సవాలు - దానిని ఎదుర్కో, జీవితం ఒక అనురాగం - దానిని అనుభవించు, జీవితం ఒక కల - సాధించి ఫలింపజేసుకో, జీవితం ఒక ఆట - తెలుసుకొని క్రీడించు.
జీవితం - దౄశ్యానికి, అదౄశ్యానికి మధ్య వారధిలాంటృఇది అని జీవితానికి యిచ్చిన నిర్వచనాలు.
మానవుడి రూపాన మహనీయుడు, మాధవుడు - నిత్య 'సత్యా రత్నాకరుడు. మనిషి - మనీషి మధ్య 'సత్యసాయీ.
ఆస్తికత - నాస్తికత మధ్య మన వేదవాదాలు
తనను తాను తెలుసుకోగలిగిన ప్రతీ మనిషీ దేవుడే! నాలో ఈస్వేరు డున్నాడు; ఆ ఈశ్వేరుడే అన్ని సేయిస్తాడు; సేయించే పన్లన్నీ నాలో ఈస్వెరుడే సేస్తాడు అని రావిశాస్త్రిగారు 'పాపీ అన్న రచనలో చెప్పడం జరిగింది. దేవుడెక్కడో లేడు, మనందరి నివేదనలకోసం మనలోనే దాక్కున్నాడు. ఆశ, అసూయా అనేవి లేకపోతే మనిషి భగవంతుడు అవుతాడు. ఇందుగల డందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపహతుం డెందందు వెదకి చూచిన నందందే గలడు అని పోతనగారు సెలవిచ్చారు. కాని, ఓ సందర్భంలో ఆయనకు కూడ, కించిత్తు సందేహం వచ్చింది - కల డందురు దీనులయెడ, కలడందురు పరమయోగిగుణముల పాలం గలడందురన్ని దిశలను, గలడు గలండనెడువాడు గలడో లేడో' అని ఆ భాగవతంలోనే సుసందేహాన్ని అంకురించాడు. ఏమైనా, మనుషులు నిమిత్తమాత్రులు, మానవాతతీత శక్తి ఆడించే నాటకంలో పాత్రలు. ఏదైనా, ప్రపంచంలో ఎంతమంది ఆస్తికులున్నారో అంతమంది భగవంతుళ్ళున్నారు; ఒకరి భగవంతుడిలో ఒకరు తప్పు పట్టడానికి లేదు. మామూలు మనుషులు మనుష్యులను నమ్ముకుంటారు; భక్తుడు దేవుణ్ణి తప్ప నమ్మలేడు - అని అన్నారు ప్రముఖ రచయిత కొడవటిగంటివారు.
ఈ రోజు భారతదేశంలో ప్రజలు - దేవుళ్ళు, దైవబలం, దైవభీతి, ఆస్థికత, నాస్తికత చుట్టూ -తమ దైనిక జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరి స్థాయిలో వారి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని పొందడానికి తాపత్రయపడుతున్నారన్నది వాస్తవం. వీరి స్థాయిని, స్థానాన్ని కొలవడానికి, తూచడానికి త్రాసులు, తరాజులు కూడ వారే తయారు చేసుకుంటున్నారు. వారి ప్రమాణాలను వారే నిర్ధారించుకుంటున్నారు. విశ్వస్థాయిలో ఒక ప్రమాణత, ప్రమాణత రెంటినీ కోల్పోతున్న చిత్రాతిచిత్రమైన పరిస్థితుల్లో కూరుకుపోతున్నాం.
దేవుడు - మనిషి మధ్య అనాదిగా సాగుతున్న ప్రయాణం రైలులో అనుకుంటే, ఆ రైలుబండి ఏ పట్టాలపైన నడుస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితిలో వున్నాం. అంటే - మనకు రైల్వేవారు తరచుగా చెప్పే - బ్రాడ్, మీటర్, నేరో గేజ్ లాగా రకరకాలుగా నడుస్తున్న చరిత్రగా మారిపోతున్న వైనం. మతాలు గతులు తప్పుతున్నాయి. మేధలకు మతులు పోతున్నాయి. మతకారులు కేవలం వేషభాషల్లోనే నీతిచంద్రికలను వల్లెవేస్తున్నారు. ఆచరణల్లో అదౄశ్యగోచరమవుతున్నారు.
నిత్య సత్య సందర్శనమూర్తి
పతనం చెందిన మానసిక స్థితినుంచి, మానవత్వాన్ని ఉద్ధరించి, మానవునికి సౄష్టిలో సంక్రమించిన మహోన్నతిని మరల ప్రాప్తింపజేయుటకొరకే అన్నట్లు, శాంతి ఆనందాలనూ, సుఖసంతోషాలనూ మరల మానవలోకానికి అందించటం కొరకే అన్నట్లు ఒక అవతారమూర్తి అవతరించాడు. మానవాకారంలో దర్శనం యిచ్చే మహనీయుడు. దేవునికి మరోపేరు భగవాన్. నిత్యశ్రీమంతుడు. సత్యసంపన్నుడు.
అత్యంత ఆధునికమైన యోచన, ఆలోచనావిధానం. ప్రపంచాన్ని ప్రభావపరుస్తున్న ప్రణవమూర్తి. ఒక మానవతామూర్తి. మహాపురుషుడు. అవతారచక్రవర్తి. పరంపరాగతమైన సంప్రదాయపు పుట్టుక. విశిష్టమైన ఆలోచనావిధానం. నేటి మానవుని దు:ఖానికీ, అశాంతికీ, అసమానతలకూ మూలకారణాలను మహామేధావులంతా తమతమ అణ్వేషణలో విఫలమవుతుండగా, మనిషిలోని మానవతా సుగుణాలు అధ:పతనంలోనే వున్న కారణం అని చెప్పిన సమన్వయమూర్తి. మానవతా విలువలన్నీ అంతరించి పోతున్న తరుణంలో ఆ విలువల్ని మానవునిలో పున:ప్రతిష్ఠ కావించిన కారుణ్యమూర్తి. నిజమైన ఆధునికతకు నిదర్శనం. ఆయన సందేశాల్ని, విశ్లేషణల్నీ ప్రపంచ భాషలన్నింటిలో ప్రచురించబడిన ఘనత ఈయనది. ఏమిటి ఈ ఆలోచనావిధానం? ఎందుకీ ఆలోచనావిధానం? అన్న ప్రశ్నలకు ఎంతమాత్రం సమాధానం దొరకని పరిస్థితిని కల్పించిన మహావ్యక్తి, మహాపురుషుడు, సంపూర్ణమానవమాత్రుడు - ఎవరో కాదు, ఆయనే, భగవాన్ గా కోట్లాది భక్తిలచే నిత్యం, క్షణం క్షణం కొనియాడబడే మార్గదర్శి, శ్రీ సత్యసాయిబాబాగారు.
'రత్నాకరా వంశ ప్రాభవం
దుర్భర క్షామానికి మారుపేరు ఆ ప్రాంతం. అలనాటి రాయలసామ్రాజ్యభాగపు అనంతరపురం జిల్లాలోని పుట్టపర్తి అనబడే కుగ్రామంలో పెద్ద వెంకప్ప రాజు - ఈశ్వరమ్మ పుణ్యదంపతులకు పున్నామ నరకం నుంచి మోక్షం కలిగిందని సంతోషంతో కదలాడుతున్న క్షణాలు. ఆ రోజు 1926, నవంబర్ 23. విష్ణ్వాంశసంభూతుడైన శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటున్న తరుణంలో జన్మనిచ్చినందులకు ఆ దంపతులు ఆ బిడ్డకు 'సత్యనారాయణరాజూ అని సార్ధకనామం చేశారు. సాధారణత అనుకోకుండా జరిగే స్థితి. అదే అసాధారణత అయితే, నమ్మశక్యంకానివి జరుగుతాయి. అదే జరిగింది. మన రాజు భూమ్మీద పడగానే, సప్తస్వరసహిత సంగీతవాద్యవిశేషనాదఝరి అవతరించిందట. వారిది రత్నాకర వంశంలోని కుటుంబం. ఫలితంగా, రత్నాకర సత్యనారాయణరాజు. అంతేకాదు, తల్లికి కలలో దేవుడు కనిపించడం, గర్భవతి కావడం, ఒక నీలకాంతిస్వరూపం ఆమెలో ప్రవేశించగా ఆమె మూర్ఛిల్లడంతోపాటు, బాలుడు జన్మించిన వెంటనే, పక్కబట్టల్లో, యింటి ఆవరణలో, సర్పదర్శనం లాంటి ప్రత్యేక కధనాలను కూడ మనం సాయి జీవితచరిత్రలో దర్షనం అవుతాయి. ఈ కధనాలకు పూర్వాపరాలు కూడ కనిపిస్తాయి. అటుయిటు సవరణలూ కనిపిస్తాయి. రత్నాకరుడి జన్మ విషయంలో బహుకధనాలు మనకు గోచరిస్తాయి. ఏదిఏమైనా, సాధారణం మాత్రం కాదని చెప్పగలిగే స్థితి.
బుక్కపట్నం చారిత్రాత్మక కధనం
బుక్కపట్నం గ్రామంలో చదువుని ప్రారంభించిన రాజు, తన ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే - నాటకం, సంగీతం, కవిత్వం, నటనాది కళల్లో ప్రావీణ్యం సంపాదించి గ్రామంలో తనదైన ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందాడని ఆయన జీవితవిశేషాల్లో కనిపిస్తాయి. తర్వాత, ఉరవకొండకు చదువు నిమిత్తం మారడం జరగింది. ఆ రోజు రాజుకు 14 ఏళ్ళ ప్రాయం. 1940 మార్చ్ 8 రోజు. పాములకు, తేళ్ళకు, ప్రసిద్ధమైనది ఉరవకొండ ప్రాంతం. నల్లతేలు కుట్టిందన్నారు. అపస్మారకంలో పడడం కూడ జరిగిందట. తిరిగి మెలకువ వచ్చాక ఆరోజు సాయంత్రం రాజు ప్రవర్తన వింతగా వుందని అందరు గమనించడం జరిగింది. తిండి తినకపోవడం, సుదీర్ఘకాలంపాటు మౌనాన్ని పాటించడం, ఆధ్యాత్మిక శ్లోకాల్ని చదవడం, హిందూ ధర్మశాస్త్రోల్లోని విషయాల్ని చెప్పడం జరగ్గా, తల్లిదండ్రులు కంగారు పడడం జరిగిందన్నది కూడ చారిత్రాత్మక కధనాలే. కుటుబం వత్తిడితో రాజు ఉరవకొండకు వెనుతిరగడం అదే నెల జూన్ లో జరిగిందట. రాజు తనంతట తానే శిరిడి లోని సాయిబాబా ఫకీర్ కు తర్వాత అవతారమని చెప్పుకొనడం జరిగింది. సత్యసాయిబాబా చరిత్ర గ్రంధకర్త కస్తూరి నారాయణ అందించిన వివరాల ప్రకారం, 20 అక్టోబర్ 1940 నాడు, తన 14వ ఏట పుస్తకాలకి, చదువుకి స్వస్తి చెప్పడం, కుటుంబంనుంచి తన నిష్క్రమణ చేయడం జరిగింది.
సత్యసాయిబాబా ప్రారంభ సందేశం
తనదైన తొలిమాటలు - 'నా భక్తులు నన్ను పిలుస్తున్నారు - నా విధి నాకుందీ అని ప్రకటించి, మూడు రోజులపాటు, ఒక తోటలోని చెట్టుకింద గడపడం, గుమిగూడిన ప్రజలకు భక్తిగీతాలు, భజనలు అందించాడట. ఈ సంఘటన నుంచే భగవాన్ సత్యసాయిబాబా గా అవతారం తీసుకున్నట్లు కస్తూరి కధనంగా గోచరిస్తుంది. ఆప్పటినుంచి, సత్యసాయిబాబా ఆధ్వర్యంలో ఆధ్యాత్మక, మానవీయత, సేవాతత్పరత, త్రివేణీ సంగమమై, సమీకరణం జరిగిందన్నది మాత్రం సత్యం, శివం, సుందరం. ఆనాటినుంచీ నేటివరకూ తిరుగులేని, తిరిగిరాని జీవితాన్ని సాగిస్తూ, కోట్లాదిప్రజలకు విశ్వవ్యాప్తంగా భగవాన్ గా, మహాపురుషుడుగా, అవతారమూర్తిగా, అపరభగవంతుడుగా విరాజిల్లుతున్నాడు. 1942 సంవత్సరం బుక్కపట్నం పాఠశాల వివరాల్లో సత్యసాయి వివరాలు కనిపిస్తాయి. 1944 లో తన గ్రామంలో జరిగిన మందిరనిర్మాణం, యిప్పుడు పాతమందిరంగా పిలుస్తారు. ప్రశాంతినిలయంగా పుట్టపర్తిలో 1948 నుంచి ఒక అంతర్జాతీయ విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక ప్రాంగణంగా అలరిస్తూనే వుంది. కుగ్రామం అయిన పుట్టపర్తి, భూనభోంతరాళంలో ఏకైక గుర్తింపు ప్రాంతం, పుణ్యస్థలి - ప్రశాంతినిలయం - నిలయవిలసిత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్నది నిజం, వాస్తవం, సత్యం.
సత్యసాయి జీవనగమనంలో మలుపులు, మెరుపులు
శాఖాహారి, జంతుహింసకు వ్యతిరేకి, బీదలపై అపార సానుభూతి, పెద్దలు, వికలాంగులపై కరుణాదౄష్టితో మెలగే సత్యసాయి ఆశువుగా భజనలను రచించి, స్వరపరచి, గానం చేయడం ఎనిమిదవ ఏటనుంచే ప్రారంభమైందని చరిత్ర వివరిస్తోంది.
1958 లో సత్యసాయి భక్తులకోసం 'సనాతన సారధీ ప్రచార పత్రిక విడుదల జరిగింది. 1960 నుంచి పాశాత్యదేశ భక్తులను కూడ అమితంగా ఆకర్షించింది. యింతవరకూ, విశ్వవ్యాప్తంగా భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శించడమే కాని, సత్యసాయి ఒకేసారి ఉత్తర-తూర్పు ఆఫ్రికాని 1968లో యాత్ర చేశారు. రత్నాకర సత్యనారాయణ రాజు అనే పేరుగల సత్యసాయిబాబాకు యిద్దరు సోదరులు - శేషమరాజు(పెద్ద), జానకిరామయ్య(చనిపోయిన తమ్ముడు).
2003 లో శరీరానికి తుంటిపై ప్రమాదం. 2005 నుంచి చక్రాల సైకిలును వాడడం జరుగుతుంది.
'సత్యసాయి సంభాషణలూ (1:31:198) (29.9.1960) ప్రకటన ప్రకారం, సత్యసాయి యింకా 59 సంవత్సరాలు జీవించడం జరుగుతుందని చెప్పడంకూడ జరిగింది.
ఆడ ఏనుగు - సాయిగీత - చిన్నప్పటినుంచి తన జీవితాన్ని సత్యసాయి సన్నిధిలోనే గడిపి, ఈ మధ్యనే చనిపోయింది. ప్రస్తుతం, సత్యగీత అనే ఏనుగు ఆ స్థానాన్ని ఆక్రమించింది.
విశ్వాస వాస్తవాలమధ్య సత్యసాయి ప్రచారోద్యమం
సర్వసంప్రదాయసేవాస్థలిగా పుట్టపర్తిలోని ప్రశాంతినిలయం విరాజిల్లింది. చైతన్యజ్యోతి (విశ్వవిద్యాలయం), ఆధ్యాత్మిక సంగ్రహాలయం, ప్లానిటోరియం, రైల్వేకూడలి, సుందర ప్రకౄత సమగ్ర క్రీడాస్థలి, పరిపాలనాప్రాంగణం, ఎయిర్ పోర్ట్, సమాజావసర సేవల రూపాన మౌలిక సదుపాయాలు, వెరసి పుట్టపర్తి-ప్రశాంతనిలయం ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా భాసిల్లుతోంది.
అగ్రజులు, అగ్రశ్రేణుల భక్తశిఖామణి బౄందాలతో నిత్యం విరాజిల్లే ప్రశాంతి నిలయం.ఈ సమూహం మధ్య సత్యసాయి ఆశీర్వచనాలు, అభినందనలు, దర్శనాదర్శనాలు, కానుకలు, బహుమతులు, ప్రాప్తాప్రాప్తాల మధ్య ఆశ-నిరాశల మధ్య భక్తజనసమూహం.
ప్రముఖులైన నాయకులు, అధినాయకులు, అతిరధుల మధ్య, ఒక మిలియన్ జనాభాతో 180 దేశాలనుంచి ప్రతినిధులమధ్య తన 83 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సహస్రచంద్రదినోత్సవం - వేయి పున్నమిల దర్శనభాగ్య సందర్భంగా ఈ ఏడు జన్మదినోత్సవానికి చాలా ప్రధాన్యతతో సన్నాహాలు జరుతున్నాయి.
ప్రశాంతి నిలయం, బౄందావనం (కడుగొడి - బెంగుళూరు దగ్గరగా), సాయి శౄతి కుటీరం (కొడైకెనాల్, తమిళనాడు) సత్యసాయి నివాస ప్రాంతాలు.
ధర్మక్షేత్ర-సత్యం (ముంబాయి), శివం (హైదరాబాద్), సుందరం (చెన్నై), మూడు ముఖ్య సందర్శక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సత్యసాయి ఆత్మకధ కూడ సత్యం-శివం-సుందరం' అవడం యదౄచ్ఛికం.
నిత్య దర్శనం, పూజలు, వ్రతాలు, ప్రత్యేక పండుగలు, ఉత్సవాలు, సత్యసాయి జన్మదినం, భక్తుల రాకకు ప్రోద్బలాలు, ప్రేరణలు, ప్రోత్సాహకాలు.
మహత్యాలు ఉన్నచోట విమర్శలు, ఎదురాటలు, ఎదురీతలు తప్పనివి, అవే సత్యసాయిని కూడ వరించాయి. రెండు ధోరణులూ, సవ్యసాచిగా, సమాంతరంగా సత్యసాయితోపాటు, సహజీవనం చేస్తున్నాయి.
మతబోధకులుగా, ప్రచారకర్తగా, గురువుగా, భగవాన్ గా, సేవాతత్పరుడుగా, సమాజసేవాపరాయణుడిగా, రత్నాకర సత్యనారాయణ రాజు అనే వ్యక్తి - భగవాన్ సత్యసాయిబాబా గా - ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణాక్షరాలతో తనదైన అధ్యాయాలను సంపుటీకరించుకున్నారన్నది మాత్రం నిస్సందేహం. సంశయంలేని సత్యం.
ప్రశాంతి నిలయం నుంచి వినబడే వేదఘోషతోపాటు, అన్యతరహా ఘోషలు కూడ ప్రతిధ్వనిస్తున్నాయి; కాని, అవి నిరంతరం ప్రశాంతనిలయంలోకి చొచ్చుకుపోతున్నాయో లేదో, చెప్పలేని స్థితిగతులు.
ప్రచారం, బోధలు, రచనలు, ప్రచురణలు
సత్యసాయి చెప్పిన ప్రతి మాట, బాట సాక్షీకరింపబడుతోంది. చరిత్రలో భాగంగా నిర్మితమవుతోంది. స్థలపురాణం రోజురోజుకూ మరో యితిహాసంగా మారుతోంది. భారతావనిలో భావితనానికి ఒక మలుపుని, మెరుపుని ప్రసాదిస్తున్నాయి. రామకధరసవాహిని ప్రవహిస్తోంది. భజనలు అభంగధోరణిలో సాగుతున్నాయి. విద్య, వైద్య, సమాజావసర రంగాల్లో సకలోచితసదుపాయాలు కలిగిస్తున్నారు. మానవతా విలువలను ప్రదర్శించే వలువలను నిర్మాణంచేసి, ప్రజకు అందిస్తున్నారు. సత్యం, ధర్మం, అహింస, ప్రేమ, శాంతి పంచ వేదాలుగా వేదఘోషతో ప్రవచనలు కావింపబడుతున్నాయి.
దేహశుద్దిలేని తెల్లని బట్టలు, భావశుద్ధిలేని దైవపూజ, పాకశుద్ధిలేని బంగారుపీటలు, వాక్కుశుద్ధిలేని శ్లోకపఠనం, నేటి నాగరికులు పాటించు పద్ధతి - అని సత్యసాయి నిత్యం బోధిస్తూంటారు.
మానవతే కులం, ప్రేమయే మతం, హౄదయవాదమే భాష, నిత్యసత్యసందర్శనమూర్తే భగవంతుడు అన్నది సత్యసాయి మంత్రం, సూత్రం.
సత్యసాయి పథంలో ముందుకు నడుస్తూ, తమ నడకల్ని, నడతల్ని, సరిదిద్దుకుంటూ మార్గదర్శకంలో ఎన్నో భక్తులు, సంస్థలు, తమతమ కార్యాలను నిర్వహించుకునే క్రమంలో నిమగ్నమయ్యారు.
ప్రశంసలతోపాటు, విమర్శనలను సరిసమంగా సత్యసాయి ఎదుర్కుంటున్నారు. సమాధానాలు చెప్పవలసిన చోట చెప్పుతున్నారు. అవసరం లేదనుకున్న సందర్భాల్లో వాటిని యధాతధంగా వదిలేస్తున్నారు.
ఉపశౄతి
పుట్టపర్తి సత్యసాయిబాబాను సర్వధర్మ సమభావనకు, అధ్యాత్మికపరమైన విశ్వజనీనస్ఫూర్తికి మారుపేరుగా విరాజిల్లుతున్నారు.
నవంబర్ 23 న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా, తెలుగు రథం నుంచి అభినందనల్ని తెలుపుకుంటూ, ఆశీర్వచనాల్ని కూడ తెలుగురథం ఆశిస్తోంది.
శుభం భూయాత్. ఓం. శాంతి:
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top