Monday, October 23, 2017

thumbnail

శ్రీధరమాధురి – 44

శ్రీధరమాధురి – 44
(ఆశించడం అనేది ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందన్న అంశం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు)


మీరు అనేక మందితో అనేక కారణాల వలన సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ అనుబంధాల్లో ఏదైనా సాంద్రత ఉందా? ఈ బంధాలు ఏ అవగాహనతో నైనా ఏర్పరచుకున్నవా? ఈ అవగాహన ఏదైనా ఆశించేలా చేస్తోందా? అసలు ఏమీ ఆశించకుండా ఉండే బంధం ఏమైనా ఉంటుందా? అటువంటి బంధమే ఉంటే, అది అలౌకికమైన ఆనందాన్ని ఇస్తుంది కదా?

ప్రేమైక జీవనంలోకి ఆశించడం అనే దెయ్యం ప్రవేశించిన రోజున, ప్రేమ ముక్కలౌతుంది. నిందలు మోపే ఆట మొదలౌతుంది.

ఆశావాదం అనేది ఆశాజనకంగా ఉంటుంది కనుక, మిమ్మల్ని ఆశించడం ద్వారా జీవించేలా చేస్తుంది. నిరాశావాదం కంటే ఆశావాదం మంచిది. ఆశావాదం వలన మీకు లాభం చేకూరినా, చేకూరకపోయినా, నిరాశావాదం మిమ్మల్ని పూర్తిగా క్రుంగిపోయేలా చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఆశావాదమే మెరుగైనది. కాని, ఇది ఆశలను ప్రేరేపిస్తుంది.

కోపం మిమ్మల్ని నిలువునా కాల్చేస్తుంది. ఆశించడం మానెయ్యండి. కోపం మటుమాయమవుతుంది.

 నా ఎదుటకు ఏమీ ఆశించకుండా ఎవరైనా వచ్చినప్పుడు, అది నా ఆశలను వమ్ము చేస్తుంది.

మీ కోరికలు తీరేందుకు పనిచెయ్యండి. మీ పనిని బట్టి, మీరు ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. గురువు మీ కోరికలను తీర్చరు. అందుకే అటువంటివి ఆశించి ఒక గురువు వద్దకు వెళ్ళకండి. జీవితంలో ఏదైనా ఆశించి మీరు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా మీరు నిరాశకే గురౌతారని నాకు తెలుసు. గురుశిష్యుల అనుబంధం చాలా పవిత్రమైనది, స్వార్ధ ప్రయోజనాలకు అతీతమైనది.


భయమే అనేక అనర్ధాలకు కారణం. అటువంటి ఒక అనర్ధం కోపం. కోపం అనేది భయం వల్ల, ఆశించడం వల్ల ఒస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు కోపం వస్తుంది, ఇదొక రకమైన కలహానికి దారితీస్తుంది. అందుకే భయపడే వ్యక్తి పిరికివాడు. ధైర్యవంతులు ఎన్నడూ భయపడరు. ధైర్యవంతులు కలహిస్తూ ఉండరు.

ఆశలకు, వాస్తవానికి మధ్య ఎప్పుడూ అంతరం ఉంటుంది. వాస్తవం ఆశలను అధిగమిస్తే, అది ఆనందానికి, ఆశలు వాస్తవాన్ని మించిపోతే, అది నైరాశ్యానికి దారితీస్తుంది.

మానవాళికి, ప్రపంచానికి చేసే సేవ డబ్బు, కీర్తి వంటివి ఏవీ ఆశించకుండా చెయ్యాలి. ఈ ప్రక్రియలో మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినా, శపించినా కూడా మీరు సంయమనాన్ని పాటించి, వారిని పట్టించుకోకపోవడం అలవర్చుకోవాలి. మీరు నిస్వార్ధమైన సేవ చెయ్యాలి. ఎవరినైనా, ఏమైనా మాట్లాడనివ్వండి. మీ సేవాభావానికి  వ్యతిరేకంగా ప్రతికూల శక్తులన్నీ కలిసి మిమ్మల్ని శపించనివ్వండి. మనం నిస్వార్ధమైన సేవ చేసేటప్పుడు అచంచలంగా, ఏమీ ఆశించకుండా ఉండాలి.

ఆమెకు దోషం ఎవరిదో నిర్దారించడం తెలీదు. వైవాహిక బంధం బాగాలేకపోయినా, ఆమెకు అందులోంచి బయటపడే ధైర్యం లేదు. అతను మారతాడని ఆశిస్తూ ఆమె దశాబ్దం పైగా కోల్పోయింది. అలా ఆశించడం నేడు ఆమెను మరింతగా గాయపరుస్తోంది. అతను పెద్ద శాడిస్ట్ (పరపీడా పరాయణుడు) నేడు ఆమె అతనికి తగ్గ మాసోచిస్ట్ (స్వపీడనా పరురాలు)గా తయారౌతోంది. ఇప్పుడిది సరైన జోడీలా తయారౌతోంది. ఇప్పుడామె పూర్తిగా అతని పీడనా విధానాల మీద ఆధారపడిపోతోంది. బాధను, వేదనను ఆస్వాదించడం మొదలుపెట్టింది. కాని, కుమిలిపోతూనే ఉంటుంది.

అరటి చెట్లపై ఆపిల్స్ కాయాలని ఆశించకండి. మీ చుట్టూ ఉన్న వాస్తవాన్ని అంగీకరించండి.

అజ్ఞానంతో కూడుకున్న మనసు చికాకుగా, దురాక్రమణతో కూడి ఉంటుంది. నేడు అంతా లక్ష్యాలు, టార్గెట్లు, సాధించడాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రక్రియలో అన్ని రంగాల వ్యక్తులూ పోటీ పడుతూ ఉంటారు. ఆశించడం అనేది అత్యధికమౌతుంది. పోటీ అనేది దుర్మార్గానికి దారి తీస్తుంది. దీని వల్ల ఆందోళన కలుగుతుంది. ఆశించకుండా పని చెయ్యడమన్నది ఒక వరం. అటువంటి వ్యక్తులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. వారు పనిని ప్రేమిస్తారు, కేవలం పని చెయ్యడం కోసమే పని చేస్తారు. ఎటువంటి అవార్డులు, రివార్డులు ఆశించరు. వారికి బహుమతులు, ప్రశంసలు వచ్చినా కూడా, విజయం వారి తలకెక్కదు. వారు జ్ఞానాన్ని, సంతులనాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఆశించకుండా మీ పూర్తి సామర్ధ్యంతో పని చెయ్యడం నేర్చుకోండి. మీరు ప్రశాంతతతో సహా జీవితంలో అన్నింటినీ సాధిస్తారు.

వ్యాకులత అనేది అనిశ్చితమైన ఆశలకు, నిశ్చితమైన వాస్తవానికి మధ్య ఉండే తేడానే.

 నిజమే, ఇది చాలా పెద్ద సమస్య. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమకు, ఆకార్షణకు మధ్య ఉన్న తేడాను తెలుసుకోలేరు. వారు దేనిపట్ల అయినా తేలిగ్గా ఆకర్షింపబడతారు. చాలా ఏళ్ళుగా వారు ఒకరికొకరు తెలుసని వారు చెబుతూ ఉంటారు. కారణాలతో, ఆశించడంతో కూడిన ప్రేమ కేవలం ఆకర్షణే. పెళ్లి తర్వాత ఈ ఆకర్షణ మటుమాయం అవుతుంది, వాస్తవం తెలిసేసరికి, వెనక్కు వెళ్ళడం కష్టమైపోతుంది. పెళ్లి తర్వాత ప్రేమ పేరుతో కొన్ని జంటలు,   అభద్రతా భావం వలన ఒకరినొకరు పట్టుకు వేళ్ళాడుతూ ఉండడం, నేను చూసాను. ఈ పరిస్థితి పెద్దలు చేసిన పెళ్ళిళ్ళలో కూడా రావచ్చు. సాధారణంగా, తగినంత సంబంధం ఏర్పరచుకున్నాకా జరిగే పెళ్ళిళ్ళలో, భాగస్వాములు తమ ప్రేమ బూటకమని తెలుసుకున్నాకా, అది మరింతగా గాయపరుస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ ప్రేమ బేషరతైనదని, ఆకర్షణ కాదని, పెళ్ళికి ముందే నిర్ధారించుకోవడం మంచిది.


మీరొక గురువు వద్ద ఉన్నప్పుడు, ఆశించనిది జరుగుతుందనే ఎల్లప్పుడూ ఆశించండి. మీ అభ్యర్ధనలు ఆయన మన్నించవచ్చు, మన్నించకపోవచ్చు.

ఆశించడంలో సమంజసమైనవి, అసమంజసమైనవి అంటూ ఏమీ ఉండవు. ఆశలు తీరని నాడు అవి నిరాశకే దారి తీస్తాయి.

నిరాశ అనేది ఎక్కువగా అవాస్తవికమైన ఆశల వల్లనే కలుగుతుంది.


***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information