మూర్ఖపు ఆవేశాల అనుభూతి - అచ్చంగా తెలుగు

మూర్ఖపు ఆవేశాల అనుభూతి

Share This
మూర్ఖపు ఆవేశాల అనుభూతి
ఆండ్ర లలిత
సమీర లేత పొగమంచు విరిగుతూన్న సూర్యరశ్మిలో తను తన చేతులతో పెంచిన పూల మొక్కలు  ఓలలాడుతూండగా చూస్తూ కాఫీ తాగుతూ  ఆనందిస్తోంది. ఎదురుగా కనబడే రహదారి ఎప్పుడూ వాహనాల రణరంగంలా ఉండేది, ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో సుదీప్ లేచి  తన దగ్గరకు వచ్చి“కాఫీ ఇచ్చేయి సమీరా! ఇవాళ ఆలస్యంగా లేచాను. త్వరగా ఆఫీసుకి వెళ్ళాలి. సమీరా ఇవాళ బుధవారం. శెలవు కాదమ్మా!” అన్నాడు వెటకారంగా సమీరతో సుదీప్.
“అవును.”అంది సమీరా ఏమి పట్టనట్టు.
“అవునూ! అదేంటి పొద్దునే అంత ప్రకృతి వడిలో సేద తీర్చుకుంటున్నావు, నిద్దట్లో అలసిపోయావా ఏమిటీ! ” అన్నాడు సుదీప్ సమీర తంతు చూస్తూ .
“ఆ ఏమీలేదు.  టీవీలో న్యూస్ చూడండి. ఇవాళ మత భేదాల వివాదాలపై  ఏదో చట్టరీత్యా  తీర్పు రాబోతోంది. తీర్పొచ్చాక, ఊళ్ళో గొడవలు అవచ్చు. అదీ మనం విదేశంలో ఉన్నామని గుర్తుచేస్తూ,  పంకజ్  ఫోన్ చేసి చెప్పాడు. Indian high commission భారతీయులను జాగ్రత్తగా ఉండమందట.  అవసరమైతే ఇంటినుంచే పని చేసుకోవచ్చందట. తెగించి కష్టాలలో పడి బావని  వీరుడిలా ప్రవర్తించద్దని చెప్పు అక్కా, అని పొద్దున్నే ఫోన్ చేసాడు. మీరు వెళ్ళొద్దు. ఒక్కరోజు వెళ్ళకపోతే కొంపలేమీ మునిగిపోవు సుదీప్” అంది సమీర ఆందోళన వ్యక్తపరుస్తూ.
“ఆఫీసులు పని చేస్తున్నాయా లేదా సమీరా” అన్నాడు సుదీప్ తేలికగా తీసుకుంటూ.
“ఉన్నాయి, అయితే వెళ్ళి పోతారా! నా మాట లెక్కపెట్టరా!” అంది సమీర సుదీప్ తో కోపంగా. 
“అసలు ఎవరికైనా శెలవు ప్రకటించారా? ఆగు టీవీలో న్యూస్ చూద్దాం ముందు. ఆ... అయినా మన దేశంలో ఇవన్నీ ఏమన్నా కొత్తా. జాగ్రత్తగా ఉండాలంతే. మన జాగ్రత్తలో మనము ఉండాలంతే” అన్నాడు సుదీప్  వీరత్వం చూపిస్తూ.
“శెలవా! ఇచ్చారు బడులు, విద్యాసంస్థలకు  ప్రభుత్వం. కానీ సుదీప్, చూడండి ఎక్కడా వాహనాల రద్దీ లేదు. మీరు కూడా వెళ్లొద్దు నాకు ఎందుకో భయమేస్తోందండి”అంది సమీర సుదీప్ కళ్ళలోకి  చూస్తూ వేదనతో ఆజ్ఞాపిస్తూ.
“అయితే హిమజకి బడి లేదన్నమాట. ఇద్దరూ సరదా సరదాగా గడపండి. నేను వెళ్తాను.  తొందరగా కాఫీ ఇవ్వు వెళ్ళాలి. ఏమీకాదు. అన్నింటికి కంగారు పడతావు. అంతగా అవుతే ఏమోతుంది. ఇంటికి వచ్చేస్తాను. నాకు అన్నీ ‘spoon feed' చేయక్కర లేదు.  చారడేసి కళ్ళు వేసుకుని, నాకేసి రుస రుసా చూడక్కరలేదు. వెళ్ళు కాఫీ పెట్టు” అన్నాడు  వార్తా పత్రిక లోంచి తొంగి చూస్తూ సుదీప్ సమీరా తో. ఈ ఘర్షణ వింటున్న  హిమజ తను చదువుకునే పుస్తకం పక్కన పెట్టి పరుగున వచ్చి నాన్నని కౌగలించుకుని “నాన్నా వెళ్లొద్దు” అంది 6వ తరగతి చదువుతున్న హిమజ.
“అలాగే నమ్మా, అక్కడ బాగా లేక పోతే గొడవలుగా ఉంటే వచ్చేస్తాను.  మీ అమ్మకన్నీ కంగారే. నువ్వు కలత చెందకమ్మా” అన్నాడు సుదీప్ హిమజ తల నిమురుతూ.
“ఏమిటీ, హిమజతో ఏమన్నారు?  నాకు కంగారా! అసలు అంతే లేండి. మీ మీద ప్రేమ పెంచుకోవటం నాదే తప్పు. నా మాట ఎప్పుడు విన్నారు కనుక. దారిన పోయే దానయ్య మాటలన్నా తీయగా ఉంటాయి. నా మాటలు మాత్రం చేదు. మీ గురించి ఆలోచించటమే నా బుద్ధి తక్కువ. కుక్కతోక వంకర, ఏదో బుద్ధి గడ్డితిని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూంటా, మీ స్వభావం తెలిసినా మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను” అని సణుగుకుంటూ  అనుకుంది వంటింట్లో కాఫీ పెడ్తూ.
“ఇదిగోండి కాఫీ. త్వరగా తాగి ఇక స్నానానికి వెళ్ళండి. ఇంతలోకి టిఫిను ఇడ్లీలు కరివేపాకు కారప్పొడి  తమకు కంచంలో పెట్తాను ఆరగించి వెళ్దురుగాని” అంది సమీర సుదీప్తో మూతి అష్టవంకర్లు తిప్పుతూ.
“మరి నువ్వూ, హిమజ తిన్నారా!” అన్నాడు సుదీప్ స్నానానికి వెళ్తూ సమీరాతో.
“హిమజకి పెట్టాను. నాకు తలనొప్పిగా ఉంది. పడుకుంటాను. తరువాత తింటాను.  అయినా మా సంగతులు మీకు ఎందుకు లేండి. మీకు  టిఫిను భోజనాల బల్లమీద పెట్తాను. తిని వెళ్ళండి” అంది సుదీప్తో బెడ్రూమ్లోకి వెళ్తూ పడుకునేటందుకు.
“విశ్రాంతి తీసుకో సంతోషంగా ఉండు” అన్నాడు సుదీప్ సమీరాతో.
*******
ఎప్పుడు నిద్ర పట్టిందో సమీరకి తెలియలేదు కాని పెద్ద శబ్దానికి మెలకువ వచ్చింది. ఇంతలో పక్క గదిలోనుంచి హిమజ వచ్చి కిటికీలోంచి చూస్తూ “అమ్మా రా”అని సౌజ్ఞ చేసింది.
సమీర హిమజా వాళ్ళు ఉన్న 4వ అంతస్తు బెడ్రూమ్ కిటికీలోంచి చూసారు. రహదారి ఒక రణరంగంలా ఉంది. రక్త ప్రవాహాలు. ఒకళ్ళని ఒకళ్ళు నరికేసుకోవడం. రక్తపు చినుకుల అభిషేకాలు, చేతులూ కాళ్ళూ తలలూ అటూఇటూ ఎగురుతున్నాయి. రహదారిమీద వాహనాలని అడ్డుకుంటుంన్నారు. వాటి మీద దాడి. అరుపులూ కేకలూ. వాహనాలు తగల పెడుతున్నారు. ఎక్కడ చూసినా అగ్ని జ్వాలలు రగిలిపోతున్నాయి. తగలపడుతున్న వాహనాలు పేలి మనుషుల రక్తపు మాంసపు ముక్కలు ఎగిరి పడుతున్న దృశ్యాలు చూస్తుంటే మనసు దేవేస్తోంది సమీరాకి. ఒక్కసారి హిమజని చూసి అనుకుంది, ఆ లేత హృదయం ఎలా తట్టుకుంటుందో అని... 
ఎపార్టమెంట్ కాంప్లెక్స్ రక్షణా సిబ్బంది అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. 
హిమజ కేసి చూసి “ Total security collapse” అంది సమీరా హిమజని హత్తుకుని.
“పద మనం ఇంక చూడవద్దు హిమజా” అంది సమీర. “హిమజా నాకేసి చూడు” అని హిమజ గడ్డంకింద చేయి పెట్టి తనకేసి తిప్పుకొని “హిమజా భయపడకు ఇక్కడ ఉన్నంత వరుకు మనకి ఏమి అవ్వదు” అంది సమీర హిమజకేసి చూస్తూ.
అమ్మా చూడు, “The mob is coming towards our apartment complex.  Our security people are arguing with them. రాజా security guard, ఇంకా మనకు సామాను పంపించే గ్రీన్ మాక్కెట్ సునీల్ ఏదో వాదించుకుంటున్నారు. కనబడుతున్నారా” అంది హిమజ. వాళ్ళు చూస్తుండంగా సునీల్ రాజా తల కొడవలితో నరికేసాడు.  అది చూస్తూ హిమజ “అబ్బా!!”అని తల తిప్పేసుకుంది అమ్మకేసి.
“ఇంక వద్దు మనం సావిట్లో కూర్చుందాము రా హిమజా” అంది సమీర హిమజ చేయి పట్టుకుని లాగుతూ.
“ఊ...” అంటూ  సమీరా చేయి విదుల్చుకుని హిమజ మళ్ళీ కిటికీ కేసి పరుగెట్టింది .
“అమ్మా రాజా తల చూడు పాపం ఎంత దూరంగా పడిందో. రాజా బాడీ అంతా రక్తంతో తడిసిపోయింది” అంటూ హిమజ రాజా గార్డ్ పోయాడమ్మా  అని వణికిపోయింది సమీరాతో చెప్తూ. 
ఆ చిన్ని హృదయం ఎంత భయ పడుతోందో హిమజ కళ్ళల్లో సమీరాకి స్పష్టంగా కనబడింది. ఒక్కసారి సమీరా మూగబోయిన మనసుతో హిమజని దగ్గరకు తీసుకుని, గట్టిగా కౌగలించుకుంది. ఎప్పుడూ అలా చూడ లేదనుకుంది సమీరా తన మనసులో. ఇంతలో ఎపార్టమెంట్ కాంప్లెక్స్ మెయిన్ గేట్  దగ్గర గొడవలు మొదలైయ్యాయి. సునీల్ సమూహానికి రక్షణా సిబ్బందికి మధ్యలో.
రోజూ తను మంచి వాళ్ళు అనుకునే మనుషులు, మంచి హృదయమున్నవాళ్ళు, ఎప్పుడూ ఇంటికి వచ్చి అవసరమైన సామాను అమ్మేవారు, అదే ఎప్పుడూ చేపలు,పళ్ళు కూరలు వగైరా వగైరా అమ్మేవాళ్ళు కొడవళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు. క్షణికావేశం, ఎవరో నూరిపోసిన శత్రుత్వం వాళ్ళలో రాక్షసత్వాన్ని రేపిందనుకుంది సమీరా. చాలా మంది విచక్షణా జ్ఞానమున్నవారే, కాని కొంత మంది స్వార్ధపరులు విపరీత సిధ్ధాంతాలను నమ్మేవారు, ఈ మనుషుల్లో వివాదాలను సృష్టించి, రెచ్చగొట్టి, వీరిలో రాక్షసత్వాన్ని సృష్టిస్తారు. అదీ మందగా వున్నప్పుడు మనుషులను రెచ్చగొట్టి పక్షపాత ఉద్రేకాలను ప్రేరేపించి, నలుగురు ఎలాచేస్తే వాళ్ళూ ఉన్మాదశక్తితో అదేచేసే గొర్రెమంద మనస్తత్వాన్ని ప్రేరేపిస్తారు. ఈ నాయకులలో వున్న బలమేమిటంటే వాళ్ళు సృష్టించిన ఉన్మాద సిధ్ధాంతాలు వాళ్ళ అనుచరులను తమప్రాణాల గురించి కూడా ముందువెనక ఒక్క క్షణం కూడా ఆలోచించనీయకుండా చేస్తాయి.  మనుషులలో కోపావేశాలకు వశమైనప్పుడు కట్టుదిట్టాలు సడలిస్తే ఎంత రాక్షసత్వం వస్తుందోనని ఆశ్చర్యపోయింది సమీర. అందుకే  మనమెప్పుడూ చెప్పుడు  మాటలకు ఉద్రేకం రానివ్వకూడదు మనలో, మన విచక్షణా జ్ఞానాన్ని ప్రక్కకి పెట్టకూడదు. ప్రపంచములో మనుషులను మంచి చెడు, విషయాలను ఒప్పు తప్పు అలా సులువైన నలుపూ తెలుపు వర్గాలుగా అంచనా వేయకూడదు. ప్రతీ మనిషిలో మంచి చెడూ వుంటాయి, ఈ విభజన మనం చూసే దుష్టికోణం బట్టి కూడా వుంటుంది. ఎవరూ దేవుళ్ళు కాదు, రాక్షసులూ కాదు సహజంగా. ఒక ప్రాంతం మనుషులంతా ఒకే రకం కాదు. అలాగే మనిషులను భాషాపరంగా, జాతి పరంగా అలా అలా రక రకాల సమూహాలగా మనం చూడకూడదు. అలా ప్రచారం చేసే వారిని కూడా దూరంగా వుంచితే మన మానసిక ఆరోగ్యానికి శ్రేయస్కరం అనుకుంది. ఇలా ఏవో ఆలోచనలు పరిగెడుతున్నాయి. కాని  బయట ప్రపంచం అంతా   మనం అనుకున్నంత ఆదర్శవంతంగా వుండదు   కదా. ప్రత్యక్షంగా కనిపిస్తోనే వుంది. ఇవన్నీ హిమజకి ఎలా చెప్పాలో తల్లిగా. కొంతమంది పిల్లలకి జ్వరాలు వస్తాయి. కొంత మంది జీవితాంతం ఈ దృశ్యాల ప్రభావంవంతో భయభీతులగా బ్రతుకుతారు. హిమజపై ఈ సంఘటనల ప్రభావం ఎలా వుంటుందోనని ఆందోళనపడింది. హిమజ కిటికీని పట్టుకుని వేలాడుతోంది. రెండు నిమిషాలకి ఒకసారి సమీరాకేసి తిరిగి “అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు?” అని అడుగుతోంది.
ఇంతలో హిమజ “అమ్మా రా! రా!”అని పిలిచింది సమీరాని.
“ఏమిటే బాబు” అంది సమీరా హిమజతో. వాళ్ళు కిటికీలోంచి చూస్తుండంగా ఒక కారును ఆపి, కారును తిరగపడేసి లోపల జనం ఉండగానే పెట్రోల్ పోసి తగలేస్తున్నారు.  లోపల జనం దబదబా కారు కిటికీలని బాదుతూ బయటకి రావటానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ ఈ బయట రాక్షసమూక ఆనందిస్తున్నారు. దాంట్లో చిన్నపిల్లని ఎత్తుకున్న తల్లి ప్రాధేయ పడుతునట్లుంది, బహుశా తలుపు తీయమని. కాని కలియుగ రాక్షసులు వినటం లేదు. నిర్దాక్షిణ్యంగా కారు తిరగేసి పెట్రోల్ పోసి తగలేసారు. ఆ కారు మంటలు రగులుకుని గాలిలో పేలినప్పుడు ఆకాశం దద్దరిల్లి విరగపడి నవ్విందా అనిపించింది. మానవుల రాక్షసపు చేష్టలకి. అది చూసి మనసు వికలమై నీళ్ళు నిండిన కళ్ళతో “ఛా ! మానవమృగాలు. హిమజా చదువుకో! ఆడుకో! ఇవన్నీ చూడకు. ప్రభుత్వం గాజులు తొడుక్కుని కూర్చుందా! ఛా”అంది సమీర ఆవేదనతో హిమజతో.
“వస్తానమ్మా ఆగు. అయినా మన గ్లాస్ కిటికీలోంచి బయట వాళ్ళు మనకు కనబడతారు కాని మనము వాళ్ళకు కనబడము. ఇప్పుడే నా స్నేహితురాలు రోసీ తో ఇంటర్ కాంమ్ ఫోనులో మాట్లాడాను. తనూ చూస్తోంది. మన కింద ఫ్లాట్ కదా” అంది హిమజ సమీరాతో.
“వాళ్ళు మలేషియా నుంచి కదా!” అంది   అమ్మ సమీరా హిమజతో 
“వాళ్ళ నాన్న వెళ్ళారా” అంది సమీర హిమజతో.
“లేదు” అంది హిమజ. 
మంచం మీద కూర్చొని నెత్తి మీద చేయి పెట్టుకుని హిమజా “ఫోన్ చూడు పనిచేస్తోందా. మొబైల్ ఎలాగూ పనిచేయటంలేదు. పోద్దున్న పని చేయలేదు. అందరూ మీ నాన్నంత పిచ్చి వాళ్ళు ఉండరు.” అంది సమీరా హిమజతో. 
హిమజ ఫోన్ చూద్దామని సావిట్లోకి  పరుగెట్టింది. ”పనిచేయటల్లేదమ్మా” అని అంటు ఏదో అరుపులు వినబడుతుంటే వంటింటి కిటికీవెంపు పరుగు పెట్టింది.
“అమ్మా రా రా!”అని గట్టిగా కేక పెట్టింది హిమజ.
“ఏమిటే బాబూ అటు కనబడేది నాన్న ఆఫీసు కదా! నాన్న ఆఫీసులో ఏమైంది”అంటూ సమీర హిమజ దగ్గరకు వెళ్ళింది వంటింటి వైపు.
“అబ్బా నాన్న కాదమ్మా. గోవర్థన అంకుల్ అక్కడ పరుగెట్టేది. చూడు ఎలా పరుగెట్తున్నారో. Someone is chasing him. Look”
అమ్మా “నాన్న”అంది హిమజ సమీరా భుజం మీద తలవాల్చి .
“ఏమీ కాదమ్మా”అంది సమీర ధైర్యం ఇస్తూ.
ఇంతలో సమీరా హిమజ చూస్తుండగానే గోవర్థన అంకుల్  ఎవరితోనో ఘర్షణ పడుతున్నారు. ఆ దుండగులు గోవర్థన అంకుల్కి మెడ దగ్గర కత్తి పోటు పొడిచి పారి పోయారు తుప్పలు పుట్టలు దాటుకుంటూ గోడలు దూకుతూ.  చూస్తూ చూస్తుండగా ఈ గందరగోళం సాగుతూనే సాయంత్రం 6 గంటలు అయింది. క్రింద రక్షణా సిబ్బందికి మద్దతుగా సాయుధ సైనికులు వచ్చారని ఇద్దరూ చూసారు. వేయి కళ్ళతో సుదీప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఫోన్ మ్రోగుతోందని గమనించి ఇద్దరూ ఫోన్ కేసి పరుగు పెట్టారు. సమీరా ఎత్తి “హలో”అంది సుదీప్ అని గమనించి సంతోషపడింది. కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి. మాట తడబడింది.  
ఇంతలో సుదీప్ “ఎలా ఉన్నారు సమీరా? నువ్వూ హిమజా. పొద్దున నుంచి ఒకటే బెంగ వచ్చింది మీ ఇద్దరి మీద! నేను బానే ఉన్నాను. స్పీకర్లో పెట్టు సమీరా, హిమజ కూడా వింటుంది.”
“సరేనండి”అంది సమీర సుదీప్ తో.
“హిమజా, నేనూ ఇంకా నా సహోద్యోగులు ఇక్కడ గాయ పడినవారికి చికిత్స చేయటానికి ఆసుపత్రివారికి మద్దతు ఇస్తున్నాము. వాలంటియర్స్ కిందన్నమాట. పొద్దున్న నుంచి ఆసుపత్రిలో ఉన్నాము హిమజా”అన్నాడు సుదీప్.
“నాన్నా గోవర్థన అంకుల్ ఎలా ఉన్నారు?” అంది హిమజ  ఆందోళనగా.
“ఫర్వాలేదమ్మా ఇప్పుడు బావున్నారు. నీకు ఎలా తెలుసూ?” అన్నాడు సుదీప్ హిమజతో.
“నేనూ అమ్మా చూసాము నాన్నా” అంది హిమజ.
“అక్కడ ఏమి చేస్తున్నావు నాన్నా?” ప్రశ్నించింది హిమజ ఆరాటంగా నాన్న సుదీప్ ని.
“ఇవాళ మీరూ చూసే ఉంటారు. ఇవాళ జరిగిన దౌర్జన్యపు సమరంలో ఒకరి మీద ఒకరు దాడులలో  రహదారుల మీద రక్తపు కాలవలు కట్టాయి. అక్కడ నుంచి పరుగెట్టి ఎక్కడెక్కడో దాక్కుని దాగుడు మూతలు ఆడుతూ  ప్రాణం కాపాడమని ఆసుపత్రికి వస్తున్నారు. ఇక్కడ వైద్యులు వారి వారి ఆకలి దప్పికలు పక్కన పెట్టి, ప్రతీ వారి ప్రాణం అమూల్యమని భావించి పని చేస్తున్నారు. ఇది ఆసుపత్రి కాదు. ఒక దర్మ సత్రంలా ఉంది. చాలా మంది ఇక్కడికి రక్తపు మడుగులలో వస్తున్నారు. బ్లెడ్ బ్యాంక్ రక్తం సరిపోవటం లేదు. మేమంతా కూడా రక్తదానం చేసాము. సరిపడా మందులు లేవు ఆసుపత్రిలో. ఇక్కడ ఆలస్యం అవుతుంది. నన్ను రక్షణా సిబ్బంది సురక్షతతో ఇంటిలో దింపుతారు. ఇంటికి వచ్చాక చాలా మాటాడుకుందాము మనము. బై సమీరా. బై హిమజా” అనిఫోన్ పెట్టేసాడు సుదీప్. భోజనం తిని హిమజా సమీరా ఎన్నో కబుర్లు చెప్పుకుంటుంటే సమయం తెలియలేదు. ఇంతలో సుదీప్ వచ్చాడు. సమీర పక్కమీద నుంచి లేచి వెళ్ళి భోజనం పెట్టింది సుదీప్ కి. సమీరా హిమజ, సుదీప్ చెంతలో చేరారు. సుదీప్ తింటూ అలా కబుర్లలో జారుకున్నాడు.
“గోవర్థన అంకుల్కి ఏలా ఉంది నాన్నా?”అని అడిగింది హిమజ  భోజనం చేస్తున్న నాన్న పక్కన కూర్చొని.
“ఇప్పుడు బానే ఉంది. అంకుల్ కి ఆ దుండగులు గొంతు దగ్గర కత్తితో పొడిచారు”అన్నాడు సుదీప్ .
“ఎందుకు?”అంది హిమజ 
“వారి భాష మాటాడలేదని. మూర్ఖులు. పెద్ద నరము తెగింది. గుండె కొట్టుకున్నప్పుడల్లా  రక్తం త్రుళ్ళి బయటకి వచ్చిందట. పాపం అక్కడ చేయ్యితో గట్టిగా అదిమి పట్టుకుని పరుగు పరుగున ఓపికలేక పడుతూ లేస్తూ ఆసుపత్రిలోకి వచ్చాడు. వైద్యులు గబగబా చికిత్స చేసారు. మత్తు మందు లేకుండానే కుట్లు వేసారు. చాలా కుట్లు పడ్డాయి”అన్నాడు సుదీప్  చిట్టి తల్లి హిమజతో.
“నొప్పి పుట్టలేదూ”అంది హిమజ
“పుడ్తుంది కాని ఏమి చేస్తాము. మత్తు మందు స్టాక్ అయిపోయింది” అన్నాడు సుదీప్.  ఇదంతా వినలేక మనసు చెదిరి  ఊపిరందక సమీరా బాల్కనీ లోకి వెళ్ళింది.
అక్కడ నుంచుని సమీరా రహదారి కేసి చూస్తూ, తన మనసులో ప్రకృతి సౌదర్యాల నెలవూ మనసులకు కోవెలైన ఈ దేశాన్ని మానవ వైపరిత్యాలు క్షణికావేసాలు ఎంత పనిచేసాయి.  ఎంతమందికో సజీవ సమాధుల కట్టారు. రావణ కాష్టానికి నెలవుయైనది ఈ దేశం..  ఎంత మంది అనాదులైనారో. ఎంత మంది హృదయాలలో బరువెక్కి, కన్నీరు వరదలై పారుతోందో. అయ్యో! ఆవేశం తగ్గించి మానవత్వం పెంచవా. దుఖంతో ఆలసిన ఆ హృదయాలను నీ పండు వెన్నెల కాంతిలో దారి చూపవా....ఓ చల్లని రాజా ఓ చందమామ....అంటూ ఆకాశం కేసి చూసి పౌర్ణమి చంద్రుడుతో  ఊసులాడింది. ఇంతలో హిమజ సుదీప్ కూడా వచ్చారు అక్కడకి.  
“అంతా బావుంటుంది” అన్నాడు సుదీప్.
“మీరు పొద్దున్న నేను వద్దంటున్నా వెళ్ళారు, కానీ మానవసేవే మాధవసేవయని నిరూపించారు. మానవ సేవలోనున్న తృప్తి మరి దేంట్లో వస్తుంది. కాని ఒక్కసారి మీరు కూడా గోవర్థన గారి లా  అపాయానికి గురి అవుతే ఏమయ్యేది అనే ఆలోచన  వచ్చినప్పుడు ఒళ్ళు జలదరిస్తుందండి. కలకాలం మన నావ సవ్యంగా సాగితేనే కదా  మనము పది మందికి సహాయపడగలము. ఎప్పుడూ సుదీప్, మనము  ఆకాంక్షించటములో తప్పులేదు. కాని  మనము యెంచుకునే దారిలో  కష్టాలు రావని కాదు. మనము మన లక్ష్యం సాధించగలగాలి. మధ్యలో మనమే అంతమైపోకూడదు.”అంది సుదీప్ చేయి పట్టుకుని.
“అవును మన ఆలోచనలు, చేష్టలు మన జీవితాలను అపాయాల వరదలు చేయకూడదు. అందరూ ఆశ్వాదించే మాహానదీ ప్రవాహం లాగ సాగిపోవాలి” అంటూ సుదీప్ సమీరాని హిమజని దగ్గర తీసుకున్నాడు. చంద్ర బింబంలాటి హిమజ మొహం పట్టుకుని, మనసులు దద్దరిల్లేలాగ చేసిన ఒక పెద్ద అలజడి పోయి,  మంచి రోజులు వస్తాయి అని పలుకుతున్నట్లుగా  వున్నపండు వెన్నెల కాంతులలో బ్రతికి బట్టకట్టామన్న భావనతో నుంచున్నారు. ఈ రోజు మనందరికి భయం, ఆర్ద్రత కలిగించిన ఈ మూర్ఖపు ఆవేశాల అనుభూతి మనందరిని మంచి ఆదర్శ పౌరులుగా వ్యవహరించేందుకు ధృఢనిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించుకోవాలిగాని జీవితాన్ని భయమయంగా బ్రతకడానికి కాదు అని నిర్ధారించుకున్నారు ముగ్గురూ కలిసి.
మనసునిండా కొత్త ఊహలతో చంద్రుడిని చూసి వికసించిన కలువల లాగ, కొత్త ఆలోచనలతో, ఆశల బరువులతో సమీరా సుదీప్  ఎప్పుడూ నవ్వుకుంటూ ప్రవాహానికి నున్నగా అయిన గులకరాళ్ళలా, బాధ్యతలను నిర్వహిస్తూ నిర్మల స్వభావంతో మహానదిలా  ప్రవహిస్తూ అలలు వంటి అలజడులు తట్టుకుంటు ముందుకు సాగిపోయారు.
***

2 comments:

  1. nice story, but the violence need not have been described so graphically, that too when a child is present



    ReplyDelete
  2. ధన్యవాదాలండి

    ReplyDelete

Pages