మాధవ శతకము - ఆల్లమరాజు రంగశాయి కవి - అచ్చంగా తెలుగు

మాధవ శతకము - ఆల్లమరాజు రంగశాయి కవి

Share This
మాధవ శతకము - ఆల్లమరాజు రంగశాయి కవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం

అల్లమరాజు రంగశాయి కవి (క్రీ.శ.1861-1936) పిఠాపురము సమీపములోని చేబ్రోలు గ్రామనివాసి. వీరు ఆపస్తంబసూత్ర, ఆరామద్రావిడ బ్రాహ్మణులు. హరితసగోత్రులు. వీరివంశమునందు చాలామంది కవులు కలరు. వీరితండ్రిగారైన అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి బహుగ్రంధకర్త. సుబ్రహ్మణ్యకవి అనేక గ్రంధాదులేకాక అనేక శతకముల కర్త కూడా. రంగశాయికవి తల్లి పేరు చిన్నమ. 

భువిలో నల్లమరాజవంశకలశాంభోరాశిపూర్ణేందుఁ డా
ర్యవరశ్లాఘితసచ్చరిత్రుఁ డగు సుబ్రహ్మణ్యసంజ్ఞాక స
త్కవికిన్ జిన్నమకున్ సుతుండ నమరంగన్ రంగశాయ్యాఖ్యనౌ
కవి నేనీశతకంబు నీకొసంగితిన్ గైకొమ్ము సర్వేశ్వరా

అని ఈ కవి తనగురించి శతకాంతపద్యంలో చెప్పుకొన్నారు. రంగశాయి కవి బహు శతక కర్త. వీరు రచించిన శతకములు 1. రఘురామశతకము, 2. పరమాత్మశతకము, 3. సర్వేశ్వరశతకము, 4. గోవిందశతకము, 5. లక్ష్మీశతకము, 6. మాధవశతకము, 7. కుక్కుటలింగశతకము, 8. గోపాలస్వామిశతకము, 9. మల్లికార్జునశతకము అనునవి. ఈకవి ఈశతకములేకాక శ్రీమదాంధ్ర చంపూభారతము, రామాయణచంపువు తెలుగున, మరికొన్ని సంస్కృతకృతులనుకూడా రచించినారు. ఈకవి కవిత్వము మృదుమధురపదగుంఫనము కలిగి లాక్షణికమైన పద్ధతులలో సాగిపోతూ పూర్వకవితలను గుర్తుచేస్తాయి. ధారాశుద్ధి శబ్షపటుత్వము, శ్రవణపేయసమాససంకలనము, నిరాఘాటమైన యురవడి ప్రతిపద్యంలో మనకు కనిపిస్తుంది.

ఈకవి సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయములో కొంతకాలము పనిచేసినాడు. అంతకుపూర్వము గోడే గజపతిరాయప్రభువు వద్ద ముప్పదియేళ్ళు ఆస్తానకవిగా నుండినాడు. తరువాత ఏ ఉద్యోగములేక యున్నదానితో తృప్తిపడి సుమారు డెబ్బదియైదేండ్లు జీవుంచి క్రీ.శ. 1936 లో కీర్తిశేషుడయినాడు.

శతక పరిచయం:

"మాధవా" అనే మకుటంతో శార్ధూల మత్తేభ వృత్తాలలో నూటమూడు పద్యాలతో రచించిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. కవి ఈశతకమును దాదాపు క్రీ.శ. 1910 ప్రాంతాలలో ప్రౌఢవయసులో, పిఠాపురమునందలి కుంతీమాధవస్వామికి అంకితముగా రచించినట్లు తెలుస్తున్నది. ఈశతకములోని అన్ని పద్యములు భక్తిరసోద్భోదకమై మృదుమధురభూఇష్ఠమై శ్రావ్యముగా ఉంటాయి. మాధవుని లీలలను మధురంగా వర్ణించారు. కవి నూతనుడు కావటం వలన కవి ఈ శతకాన్ని నాగరీకులకు రుచించే విధంగా భావసమన్వితంగా రచించాడు.

మ. శ్రీపీఠాపురమందు భక్తులను రక్షింపం దలంపూని త
ద్వ్యాపారంబులఁ జక్కజేయుచుఁ గిరీటాద్యుత్తమాలంక్రియల్
దీపింపన్ జిఱునవ్వుమోముదగఁ గుంతీదేవిచేతం బ్రతి
ష్ఠాపూజల్ గనియున్న నిన్ గొలిచెదన్ స్వామీ హరీ మాధవా!

శ్రీకృష్ణ లీలలను నుతించే ఈ క్రిందిపద్యాలు గమనించండి

మ. తొల్లి ధర్మజ్ఞులు పాండునందనలకున్ దుర్యోధనుం డెన్ని కొం
దలముల్ గూర్పదలంచినన్ భువి భవత్కారుణ్యయుగ్వీక్షణం 
బులచే నయ్యవిగీటణంగుచు శుభంబుల్ వారికెల్లప్పుడున్
గలిగెన్ గావున నీవు సాధురక్షన్ జేయొదౌ మాధవా!

శా. శూరుండౌ నరకాసురుండు జగముల్ క్షోభింపఁగా జేసి చె
న్నారంగాఁ బదియాఱువేలనృపకన్యాశ్రేష్ఠలన్ బల్మిచేఁ
గారాగారముఁ జేర్ప నయ్యసురునిన్ ఖండించి బంధస్థలౌ
వారిన్ నీవు వదల్చి యందఱ సుఖింపజేసితౌ మాధవా!

మ. ముర దైత్యేంద్రుని సమ్హరించి మధుడన్ పూర్వామరాధ్యక్షునిన్
దురమందున్ బఱిమార్చి కేశిపలలాంధోనాయకులం గూల్చి ము
ష్కరుఁడైవర్తిల్లు వజ్రనాభదనుజున్ జక్కాడి నీవీ వసుం
ధర నిషంటకం జేసినాడవు మహాత్మా మ్రొక్కెదన్ మాధవా!

మ. అతి దారిద్ర్యము నొంది విప్రుఁడు కుచేలాఖ్యుండు నీబాల్యమి
త్రతనాత్మందలపోసి పిమ్మట భవ్త్సానిధ్యముంజేరి నీ
కతఁడర్పింపఁగ దెచ్చినట్టి యటుకుల్ హర్షంబుతో మెక్కి భూ
రిత రైశ్వర్యములిచ్చితీవతనికిన్ శ్రేయఃప్రదా మాధవా!

శా. పాకారాతిదురాగ్రహంబున శిలావర్షం బహోరాత్రముల్
వీకన్ దాఁ గురియింప నంత మొదవుల్ భీతిల్ల గోవర్ధనా
ఖ్యాకం బైన గిరీంద్రమెత్తివెస నీవాగోపగోపాళి క
స్తోకంబైన సుఖం బొసంగితివి నీదోశ్శక్తిచే మాధవా!

ఈ విధంగా భాగవత దశమ స్కందంలోని కృష్ణ లీలలన్ని శార్ధూల మత్తేభ వృత్తాలలఓ మనకు కనిపిస్తాయి.

ఈశతకంలో ఎనభైఎనిమిదవ పద్యం మొదలుకొని పన్నెండుపద్యాలు అంత్యనియమాలంకారాముతో మనోజ్ఞముగా రచింపబడినవి. పదజటిలము, నియమపరిపాలన, ధారాసౌష్ఠవము లనుబట్టిచూస్తే ఈపద్యములు కృతులకు ఆశ్వాసాంత పద్యములలో చేర్చదగినవిగా కనిపిస్తాయి. కొన్ని పద్యాలను పరికిద్దాము.

మ. అఘవీరుత్తతిదాత్ర దాత్రలఘుబల్య స్తోగసనందిర
రఘణార్చావిధి పాత్ర పాత్రని శభాస్వద్గోత్ర గోత్రాసకృ
న్నిఘసాపాదకగాత్ర గాత్రమరమౌని శ్లాఘ్యదోశ్శక్తి భా
ఙ్మఘవత్పుత్రకమిత్ర మిత్రశశి శుంభన్నేత్ర శ్రీమాధవా

మ. అసితాభ్రోపమ కాయకాయదతి భక్తంహస్తమస్సూర్యసూ
ర్య సురక్షాంచిత భావభావభవజన్మాధాననైపుణ్య పు
ణ్యసమూహప్రద సత్కధారవ రసజ్ఞత్యంతమాధుర్యదా
య్యసమానాచ్ఛసమాఖ్యమాఖ్యశశభృత్ప్రాంచద్యశామాధవా!

ఇలా అత్యంత మధ్రంగ సాగిపోయే పద్యాలతో అందరినీ అలరించే ఈశతకం మీరూ చదవండి మీ మిత్రుచే చదివించండి

No comments:

Post a Comment

Pages