శ్రీ జి.ఎన్.బాలసుబ్రమణ్యం 
మధురిమ 

1928వ సంవత్సరం సంగీత కచేరీల సంస్థానం మద్రాసు మహానగరంలోని మైలాపూర్లో ఉన్న కపాలీశ్వరుని ఆలయంలో ఆ రోజు శ్రీ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి కచేరి జరగాలి...రసికులైన శ్రోతలందరు ముందుగానే ఆలయానికి చేరుకుని కచేరీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు??ఇంతలో నిర్వాహకులకి వచ్చిన సమాచారం ఆయన కచేరీకి రాలేకపోతున్నారని!!!!జరుగుతున్నదేమో  కపాలీశ్వరుని ఉత్సవం..ఆ ఉత్సవంలో స్వామివారికి సుస్వరరాగాభిషేకం జరగకపోతే ఎలా???నిర్వాహకులు హిందూ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి నారాయణ స్వామి అయ్యర్ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి...ఈరోజు స్వామివారికి స్వరాభిషేకం జరిగి తీరాలిసిందే అందుకు పూజాపుష్పంలా మీ అబ్బాయి ఆలయంలో ఈరోజు పాడాలి  అని అడిగారట.  
వెంటనే నారాయణ స్వామి గారికి రాక్షస సంహారం కోసం రాముడిని తనవెంట పంపమని విశ్వామిత్రుడు అడిగినప్పుడు దశరథుడు ఎంత క్షోభ పడ్డాడో అనుకున్నారట.నారాయణ స్వామి గారు సంగీత ప్రియులు మరియు ఆనాటి మద్రాసు మహానగరంలోని చాలా గానసభలకి కార్యదర్శి గా కూడా తన సేవలను అందిస్తూ ఉండేవారు...ఐతే నిర్వాహకులు తన కుమారుని చేత కచేరీ అనగానే ఇంకా అప్పటికి అభ్యసిస్తున్న తన కుమారుడు ఎలా ఇంతమంది రసికులైన శ్రోతలను మెప్పించగలడు అని సంశయిస్తూనే "సరే" అన్నారుట...సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శివశక్తుల సంయోగానికి నిదర్శనం. ఆయన శివుణ్ణి మెప్పించటమేకాదు ఆనాడు తన గాంధర్వ గానంతో శివుణ్ణి రప్పించగలిగాడు  కూడా...ఆ నాడు అలా తన సంగీత జైత్రయాత్ర మొదలుపెట్టి నిర్విరామంగా,నిరంతరం కొనసాగించిన "బాల" సుబ్రహ్మణ్యుడే జి.ఎన్.బి గా సంగీత లోకానికి సుపరిచితులైన  మన గుడలూర్ నారాయణస్వామి బాలసుబ్రమణ్యం....జి.ఎన్.బి గారిని,సెమ్మంగూడి శ్రీనివాస అయ్యంగారిని,మధురై మణి  అయ్యర్ గారిని వీరి ముగ్గురిని కలిపి 20వ శతాబ్దపు నవీన సంగీత త్రిమూర్తులుగా అభివర్ణిస్తారు.వీరు చక్కటి తమిళ నటులు కూడా...
ఒక్కో వ్యక్తిలో ఒక్కో తేజస్సుఉంటుంది....ఆతేజస్సుకి దైవత్వం,చక్కటి పవిత్రమైన వాతావరణం,సత్పురుషుల సహవాసం ఇలాంటివన్నీ తోడైనప్పుడు ఆ వ్యక్తితేజస్సుభగవతార్చన కి వినియోగించే ధూపంలా తన సుగంధాన్ని చుట్టూ వ్యాపింపచేసి అందరినీ ఆహ్లాదపరచడమే కాదు ఆనంద సాగరాలలో ఓలలాడిస్తుంది కూడా.  
బాలసుబ్రమణ్యం గారి జీవితాన్ని పరిశీలిస్తే మనకి ఇదే భావన కలుగుతుంది...1910వ సంవత్సరంలో జనవరి 6వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని గుడలూరు అనే చిన్న గ్రామంలో ఒక సాధరణమైన కుటుంబంలో నారాయణస్వామి అనే ఉపాధ్యాయునికి జన్మించిన ఆయన సంగీత ప్రపంచంలో ఓ ధ్రువ నక్షత్రం అవుతారని ఎప్పుడూ అనుకోలేదు,తల్లితండ్రులు కూడా అలా అవ్వాలనీ ఎప్పుడూ అనుకోలేదు...ఇంకా ఆయన తండ్రి గారు….. బాలసుబ్రమణ్యం గారు ఓ పెద్ద వకీలు అవ్వాలనీ...మద్రాసులో ఓ సొంత ఇల్లుకొనుక్కునే అంత ధనవంతులవ్వాలనీ అనుకునేవారు. కాని దైవం ఆయన జీవితం ఇంకోలా నిర్ణయించాడు...మనల్ని ధన్యులిని చెయ్యడానికి ఆయన జన్మించారు కదా మరి.
నారాయణ స్వామి అయ్యర్ గారు మంచి సంగీతాభిమాని..మద్రాసు నగరంలో సంగీత సభలన్నీ స్థాపించబడుతున్న తొలి నాళ్ళలో ఆయన ఓ కార్యదర్శిగాఎన్నో సేవలు అందించారు.గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో వారిల్లు  ఎప్పుడూ ఎంతో కళ కళ లాడుతూ ఉండేది.ఏగూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది ఇందులో వింతేముంది!!! అన్నట్లుగామన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చిన్నతనం నుండీ సంగీతభిమానే... చదువుకునే సమయం తప్ప ఇంకెప్పుడు కాస్త వ్యవధి దొరికినా అది సంగీత సాధనలోనే గడిపేవారట. అలా వారింటికి  వచ్చే విద్వాంసులలో  అరియక్కూడి రామనుజ ఆయంగార్ గారి తో జి.ఎన్.బి గారు ఎంతో సన్నిహితంగా ఉండేవారు.వారి సంగీతాన్ని వింటూ తిరిగి వారితో పాడుతూ ఉండేవారు.ఇలాకాలం గడుస్తూ ఉండగా  ఓనాడు నారాయణ స్వామి గారు అరియక్కూడి రామానుజయ్యంగారితో ఇలా అన్నారుట.. "రామానుజ నాకు సంగీతం అంటే అభిమానమే ,గౌరవమే..కాని వీడు సంగీతాన్నే తన జీవిత పరమావధి గా ఎంచుకోవాలనుకుంటున్నాడు!!!ఈ నిర్ణయం వీడికి ఎంతవరకూ సరైనదో నాకు అర్థం కావట్లేదు " అన్నారుట...అప్పుడు రామనుజయ్యంగార్ జి.ఎన్.బి గారిని పిలిచి భక్తిగా ఓ పాట పాడమన్నారుట...వారు పాడుతూ ఉంటే రామానుజయ్యంగారు అలా కళ్ళు మూసుకుని వింటూ ఉన్నారట.
పాట ముగియగానే ఇలా అన్నారుట..."నారాయణా సంగీతమే ఇతని మార్గము....ఆ మార్గంలో నువ్వు కూడా అడ్డురాకు..ఈ మార్గంలో ప్రయాణిస్తేనే ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అన్నారుట" తండ్రి అనే మమకారపు మేఘం ఆయనను ఎంతగా ఆవహించిందంటే!! ఈ మార్గంలో తను గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలడా?? అని అడుగగా... రామానుజయ్యంగార్ ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారుట...అలా పసిప్రాయంలోనే పదేళ్ళైనా నిండకుండానే కపాలీశ్వరుని గుడిలో  తన మొదటి కచేరి చేసి అందరి మన్ననలు పొందారు.ఈవిధంగానే చదువుని కొనసాగిస్తూ సంగీతాభ్యాసం చేస్తూ వచ్చారు.. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీ నుండి ఆంగ్ల సాహిత్యం లో పట్టభద్రులైయ్యారు.ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన టైగర్ వరదాచారి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా మద్రాస్  సంగీత విశ్వవిద్యాలయం లో ప్రవేశ పెట్టిన డిప్లమా పట్టా కూడా పొందారు. ఇందులో భాగంగా త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన "మధురై సుబ్రమణ్య అయ్యర్" గారి దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. ఇది జరిగిన రెండేళ్ళకే కేవలం 18 సంవత్సరాలకే పూర్తి స్థాయిలో  కచేరీలను చెయ్యడం ప్రారంభించారు.
తమిళ చలన చిత్ర రంగంలో కూడా జి.ఎన్.బి గారికి మంచి పేరు ఉంది...పలు చిత్రాల్లో కూడా నటించారు.నటి వైజయంతి మాల గారి తల్లి అయినటువంటి వసుందరాదేవి గారితో, అలాగే సంగీత సరస్వతీ అవతారం అయినటువంటి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారితో శకుంతల  చిత్రంలో దుష్యంతుడిగా నటించారు. అయితే చలన చిత్ర రంగంలో ఆయన ఎక్కువ రోజులు కొనసాగలేదు....తిరిగి తన కచేరీలు,సంగీతానికే తన జీవితం అంకితం చేసారు.
అలనాటి సమకాలీనులలో జి.ఎన్.బి గారిని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయనశైలే..ఆయన కంఠం కంచు ఘంట లాగా గంభీరంగా ఉన్నా ఎదో తెలియని మృదుత్వం కూడా వినిపిస్తూ ఉండేదిట..తోడి,కాంభోజి,కల్యాణి, నళినీకాంతి, ఆందోళిక, వసంత భైరవి, జ్యోతిస్వరూపిణి మొదలైన రాగాలంటే ఆయనకి చాలా ఇష్టం. వీటిని చాలా విస్తృతంగా ఆలపించేవారు.. త్రిస్థాయిలలో,త్రికాలాలో వీరిని గొంతు అద్భుత విన్యాసాలు చేస్తూ ఉండేదిట...కొన్ని కొత్త రాగాలని కూడా ప్రతిపాదించారు...సుమారు 250 కృతులను రచించారు ….    ముఖ్యంగా వారు అమ్మవారిపై వారు రచించిన కృతులు వారి  శ్రీవిద్యోపాశనకు నిదర్శనాలు....మోహన రాగంలో ఆయన రచించిన సదాపాలయ అనే కృతి ఇప్పటికీ ప్రఖ్యాత విద్వాంసుల కచేరీల్లో వినిపిస్తూనే ఉంటుంది. రాగాలాపన,స్వరకల్పన కూడా ఎక్కువ మధ్యమకాలం లోనే చేసేవారట.ముఖ్యంగా సంగతులువెయ్యడంలో వారికి వారే సాటి..ఒక కీర్తన లో చాలా తక్కువ సంగతులు వేసినప్పటికీ ఆ సంగతులు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉండేవట. చెన్నై ఆకాశవాణి కేంద్రంలో జి.ఎన్.బి గారు  కర్ణాటక సంగీత శాఖ సహ నిర్వాహకులుగా,శ్రీ సెమ్మంగూడి శ్రీనివాస అయ్యంగార్ నిర్వాహకులుగా,శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు లలితసంగీత శాఖా  నిర్వాహకులుగా వెలిగించిన వెలుగే ఇప్పటికీ చెన్నై ఆకాశ వాణిని ప్రజ్వలిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.
ఎంత గొప్ప విద్వాంసులో అంత గొప్ప గురువుకూడా ....ఎందరో ప్రఖ్యాత శిష్యులకు సంగీత ఓనమాలు దగ్గరనుంచీ నేర్పించి వారిని పండితులుగా తీర్చి దిద్దారు. వారిలో శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి,రాధా జయలక్ష్మి,తంజావూర్ఎస్.కళ్యాణరామన్,త్రిచూర్.వి.రామచంద్రన్,టి.ఆర్.బాలు,వంటి వారు ప్రముఖులు.కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ స్వాతి తిరునాళ్ సంగీత కళాశాల ప్రధానాధ్యాపకులుగా కూడా పనిచేసారు.ఎంతో అద్భుతమైన రచనలు చేసినా తన కచేరీలలో  ఎప్పుడూ తాను రచించినవి పాడేవారు కాదట...అవి కేవలం శిష్యులకు మాత్రమే నేర్పించేవారు....కచేరీలలో సహకార వాయిద్యాల వాళ్ళని ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించేవారట. బడే గులాం అలీ ఖాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టపడేవారు...ఆయనని సన్మానించి ఆయనకు పాదాభివందనం చేసిన గొప్ప వ్యక్తి...ఇతరులలోని సరస్వతిని  గుర్తించగలిగిన నిరహంకారి కూడా..బాలునిగా బాలసుబ్రమణ్యం గారు  మహారాజపురం సంతానం,అరియకూడి రామానుజ అయ్యంగార్ వంటి వారితోగడిపిన రోజులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ.. ఆనందిస్తూ ఉండేవారట. అరియకూడి రామానుజ అయ్యంగారిని తన మానసిక గురువుగా స్వీకరించారు. ప్రతీసారి కచేరీలలో కొత్త కొత్త రాగాలు, కృతులు పాడడానికే ఎక్కువ మక్కువ చూపించేవారు.నా ప్రతీకచేరీ విన్నవారికి ఆనందం ఇవ్వడమే కాదు నాకొక పాఠం కావాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారట.
ఈవిధంగా సంగీత ప్రపంచంలో ఎప్పుడూ గౌరవించబడే ప్రతిభాశాలి,గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు శ్రీజి.ఎన్.బాలసుబ్రమణ్యం గారు.
వీరి సంగీతాన్ని క్రింది లింక్స్ లో వినండి.


0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top