Friday, September 22, 2017

thumbnail

నాకు నచ్చిన తాతాచారి కధ "సద్గతి-దుర్గతి" సి పి బ్రవున్ సంకలనము నుండి)

నాకు నచ్చిన తాతాచారి కధ "సద్గతి-దుర్గతి" 
(సి పి బ్రవున్ సంకలనము నుండి)
అంబడిపూడి శ్యామసుందర రావు

చార్లెస్ ఫిలిప్ బ్రవున్ అనే ఈ పేరు తెలుగు యువతకు అంతగా పరిచయములేనిది. ఎందుకంటే ఆయన హాలీవుడ్ నటుడు కాదు క్రికెటర్ కాదు కానీ తెలుగు భాషకు అమూల్యమైన  సేవలు (తెలుగువారికన్నా )అందించిన మహనీయుడు ఈయన.
1798 నవంబరు పదో తేదీన కలకత్తాలో జన్మించిన ఈయన 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరి మద్రాస్  సివిల్ సర్వీస్ అధికారిగా తెలుగునాట దాదాపు నాలుగు దశాబ్దాలు నివసించిన ఆంగ్లేయుడు. తెలుగు భాష మీద  బ్రవున్ కు అపారమైన ఆసక్తి అభిమానము ఉండటంవల్ల తెలుగు భాషను, సాహిత్యాన్ని ఎంతో శ్రద్ధతో అధ్యాయనము చేశాడు. అంతేకాకుండా తన  ఖర్చుతో తెలుగునాట గల  పండితులను పిలిపించి వారికి వసతి సౌకర్యాలను ఏర్పరచి వారిచే వందల సంఖ్యలలో తెలుగు గ్రంధాలకు శుద్ధమైన పరిష్క్ర్తత ప్రతులను తయారుచేయించాడు.
తానె స్వయముగా అనేక రచనలను చేశాడు. సమగ్రమైన అంధ్రా -ఆంగ్ల ,ఆంగ్ల-ఆంధ్ర నిఘంటువులను (డిక్షనరీ ) తయారుచేసాడు. 1829లో వేమన పద్యాలను ఆంగ్లములోనికి అనువదించి ప్రపంచానికి అందించాడు గిడుగు రామ మూర్తిగారి వ్యావహారిక భాషోద్యమానికి ముందే తాతాచారి కధల సంకలలాన్నివిడుదల చేసినప్పటికీ రావలిసినంత గుర్తింపు రాలేదు.

1820లో కడప జిల్లా కలెక్టర్ సహాయకుడిగా ఉద్యోగ జీవితములో ప్రవేశించిన
బ్రవున్ ఆంధ్ర లో పలు ప్రాంతాలలో వివిధహోదాలలో పనిచేసి ఉద్యోగ విరమణ
అనంతరము ఇంగ్లండ్ వెళ్లిన తరువాత లండన్ విశ్వ విద్యాలయములో తెలుగు ప్రొఫెసర్ గా పని చేశాడు.  1884 డిశంబర్ 12 వ తేదీన ఎనభయ్యారేళ్ల  వయస్సులో మరణించాడు. ఈయన జీవితాంతము అవివాహితుడుగానే ఉండిపోయినాడు అందువల్ల వారసులు అంటే మనుమళ్ళు లాంటి వాళ్ళు ఎవరు ఇంగ్లాండులో లేరు.
 ఈ మధ్యయే ఒక తెలుగు భాషాభిమాని ఇంగ్లండ్ లో వున్న ప్రవాసాంధ్రుడు డాక్టర్ పసుమర్తి సత్యనారాయణగారు బ్రవున్ గారి గురించి పరిశోధన చేసి ఎట్టకేలకు తుప్పల మధ్య ఉన్న ఆయన సమాధిని చూసి చలించి తన సొంత ఖర్చులతో బాగుచేయించి అధికారభాషా సంఘమువారికి తెలియజేశాడు.  తెలుగుభాషకు అంత సేవ చేసిన మహనీయుడి కి మన తెలుగు రాష్ట్రాలలో ఏవిధమైన  మంచి స్మారక చిహ్నము లేకపోవటము  తెలుగు భాషకే భాధాకరము.
తాతాచారి కధలు అనేవి తాతాచారి చెప్పినవి. ఆయన చెప్పిన కధలను లేఖకులు చేత వ్రాయించి 1855లో సి.పి .బ్రవున్ అప్పటి కడప జిల్లా కలెక్టర్  కథల సంకలనాన్ని ప్రచురించాడు. 
ముందుగా మనము తాతాచారి గురించి కొంత తెలుసుకోవాలి ఈయన అసలు పేరు నేలటూరి వెంకటాచలము ద్రవిడ బ్రాహ్మణుడు సి.పి బ్రవున్ వద్ద చిరుద్యోగి (వంటవాడు) పండితులను పిలిపించి వారిచేత తెలుగు గ్రంధాలకు సంబందించిన వ్యాఖ్యానాలు ఇతర రచనా వ్యాసంగాలకు, వారి వసతి భోజన సదుపాయాలను ఏర్పాటులో భాగముగా తాతాచారిని నియమించాడు. తాతాచారిసహజముగానే హాస్యప్రియుడు సరసుడు కాబట్టి పండితులతో సాహిత్య చర్చలలో పాల్గొంటూ సమోయోచితముగా చిత్ర విచిత్ర కధలను చెపుతూ ఉండేవాడు. అవే తాతాచారి కధలుగా రూపుదిద్దుకొని బ్రవున్ గారి పుణ్యమా అని అచ్చులోకి వచ్చినాయి. ఆ కధలను స్వయముగా చదివి వాటికి వ్యాఖ్యానాలు వ్రాసి అచ్చు వేయించాడు మహానుభావుడు బ్రవున్.  
ఈ కధలు ఆనాటి వ్యావాహరిక భాషకు చక్కటి నమూనాలు . రెండు వందల సంవత్సరాల క్రితము  మన తెలుగునాట ఉన్న సామాజిక వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి కధలలో మతాల గురించి వర్ణాల గురించి వాడిన   పదజాలము ఆనాటి సామాజిక స్థితిని తెలియజేస్తుంది, కానీ
ప్రస్తుతానికి  ఆ పదాలు కొంచెము ఎబ్బెట్టుగాను అభ్యంతరకరముగాను ఉంటాయి.
మచ్చుకు ఒక తాతా చారి కథను తెలుసుకుందాము.  ఈ కధ  పేరు"సద్గతి -దుర్గతి". ఈ కధాంశము చాలా చిన్నది కదా కూడా చాలా చిన్నది ఈ కధలో ఒక వేశ్య దాసి ఒక పండితుడికి ధర్మ సూక్ష్మాలు చాలా సరళముగా  పాండిత్యము అవసరము లేకుండాపండితుడే ఆశ్చర్య పోయేటట్లుగా చెపుతుంది '
ఒకరోజు ఒక మాహా పండితుడైన బ్రాహ్మణుడు ఒక భోగము(వేశ్య) దాని ఇంట్లో కూర్చుని సంభాషిస్తూ ఉండగా వీధిలో ఒక శవాన్ని తీసుకు పోతున్నప్పుడు చేసే డప్పుల మోత  వినిపిస్తుంది పండితుడు ఆ వేశ్య ఇంట్లో పనిచేసే  దాసిని పిలిచి వీధిలోకి వెళ్లి ఆ శవము స్వర్గానికి పోయేదా లేక నరకానికి పోయేదా కనుక్కురమ్మంటాడు.
ఆ దాసీ వీధిలోకి వెళ్లి కొంచము సేపటికి తిరిగివచ్చి ఆ పండితుడితో," అయ్యా
ఆ పీనుగ స్వర్గానికి వెళ్లే పీనుగ "అని సమాధానము చెపుతుంది. ఈ సమాధానము విన్న పండితుడికి చాలా ఆశ్చర్యము వేస్తుంది ఎందుచేతనంటే ఏమాత్రము చదువులేని ఒక దాసీ అంత  ఖచ్చితముగా ఆ పీనుగ స్వర్గానికి వెళుతుంది అనిఎలా  చెప్ప గలుగు తుందో అర్ధము కాలేదు. 
తన సందేహాన్ని అడిగి తెలుసుకోవటానికి మొదట అహము అడ్డు వచ్చింది కానీ  జవాబు తెలుసుకోవాలన్న ఆసక్తి ఆ అహాన్ని అధిగమించి ఆ దాసిని ,"నీవు ఆ పీనుగ స్వర్గానికి వెళుతుంది అని అంత ఖచ్చితముగా ఎలా చెప్పగలుగుతున్నావు?"అని ప్రశ్నించాడు.
"అయ్యా అదేమీ అంత  పెద్ద విషయము కాదు ఆ పీనుగను అనుసరించి వెళ్లేవారు అయ్యో పుణ్యాత్ముడు చనిపోయినాడు అని అంటే ఆ పీనుగు స్వర్గానికి వెళుతుంది. అలాకాకుండా వాడా దుర్మార్గుడు చచ్చాడు పీడా విరగడైయింది అన్నారంటే ఆపీనుగ నరకానికి వెళుతుంది." అని ఆ దాసీ వివరణ ఇచ్చింది ఆ వివరణ విన్నపండితుడు ఆ దాసీ పరిజ్ఞానానికి ధర్మ సూక్ష్మన్ని వివరించిన తీరుకుసంతోషించాడు.అంటే నలుగురితో మంచిగా ఉంటూ మంచి పనులు చేసేవారుసద్గతిని, చెడు పనులు చేస్తూ నలుగురికి ఇబ్బందులు కలుగజేసే వాళ్ళుదుర్గతిని పొందుతారు అనేది ఈకధలోని నీతి ఒక వేశ్య యొక్క దాసిచేత ఈ నీతిని చెప్పించారు.
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information