Saturday, September 23, 2017

thumbnail

అవాల్మీక కదంబమాల-4


అవాల్మీక కదంబమాల-4
సేకరణ- మాడపాటి సీతాదేవి.

ఉత్కళ వాజ్ఞ్మయమున రామాయణము
ఒరియా భాషలో తొలి రామాయణ కర్త బలరామదాసు
యుద్దార్దుడై వెడలుచున్న రావణుని గాంచి, మండోదరి రావణుడు వైకుంఠమున  ద్వారపాలకునిగా వెడలుచున్నాడని తలచినదట.
మండోదరి విభీషణునకు భార్యయగును.
దశకంధరుడు మద్దారాపహారంబు జేయు కాలంబున నేను ప్రతిజ్ఞ చేసితి కావున నీ భార్యను లోకా లోకంబు లెరుంగునట్లన్యుని కిచ్చెదనని పల్కితి. కావున నీ వంటి సాద్విని యన్యుల కిచ్చుట యుచితంబు కాదు.విభీషణుండు నా భర్తకు ననుజుండు.ధర్మాధ్ర్మ వివేక జ్ఞానుండాతని కొసగెదను.సుఖంబున నతనికి భార్య వై లంకాద్వీపమున అష్టైశ్వరంబులు ననుభవించుచు,సుఖంబుండుమని రామచంద్రుడానతిచ్చిన మండోదరి విభీషణుని భార్యైనది.

విచిత్ర రామాయణము
రచయిత; సరళాదాసు -పదునైదవ శతాబ్ధివాడు
సౌమిత్రి పర్ణశాల చుట్టు కార్ముకంబున గిరులు వ్రాయును.
మండోదరి సీత కు సారె నొసుగును.ఆ సారె ను సీత త్రిజట కిచ్చును.
బ్రహ్మాదులు సరస్వతి ని రావించి నీవు శ్రీరాముల హృదయంబునను, జానకి మనంబునను, కొందరు పౌరజనుల యాత్మలను ప్రవేశించి, శ్రీరాముడు సీత ను విసర్జించునట్లు చేయవలయును నని చెప్పించిరి.
ఒక నాటి రాత్రి శూర్పణక ఏడ్చుచుండగా గాంచిన సీత నీకు సమ్మతంబైన మా సౌమిత్రి కి నీకు ననుకూలంబు గావించెదనని యూరడించెను.శూర్పణక పేరు సురేఖ.

రామచరిత మానసము
ఆద్యాత్మికా చింతనాపరులకు రామచరిత మానసమొక కరదీపిక.సాంఘిక ఆద్యాత్మిక కవితా విషయములు ముప్పేటగా మార్చిన ముత్యాలహారము రామచరిత మానసము. 
ఈ కోవకు చెందినదే ఆచార్య కేశవదాసుని రామచంద్రిక.కేశవదాసు గొప్ప సంస్కృత పండితుడు.అతని ఇంటి పనివారు కూడా సంస్కృతమునే వాడుదురు.హిందీ సాహిత్యకోశమున సూరదాసు సూర్య్డని,తులసీదాసు చంద్రుడని,కేశవదాసు నక్షత్రములని చాటువు కలదు.

మైధిలీ చరణ గుప్తుని- సాకేత
ఇందులోని కథ యంతయు లక్ష్మణుని భార్యైన ఊర్మిళకు సంబంధించినది.సీత కంటే ఊర్మిళ మిన్నయని ఇందు నిరూపించబడినది.
అయోధ్య లోని ఊర్మిళ చుట్టూ రామాయణ లతను ప్రాకించినాడు. ఈ కవి రచనమును గాంచిన ఆంధ్రులకు తెనుగు జానపద సహిత్యములోని లక్ష్మణదేవర నవ్వు,ఊర్మిళాదేవి నిద్ర జ్ఞప్తికి వచ్చును.

గోవింద రామాయణము
ఆత్మకూరి గోవిందాచార్యులవారు తమ గోవింద రామాయణమును ఉత్తరకాండలతో నారంభించి వ్రాసిరి.సితా పుణ్యసాధ్వి జీవితాన్ని గూర్చి
ఆమె జీవితమొక మహా స్రవంతి
బహుళ కాంతార సీమల బారి పారి
మెట్ట పల్లము లెన్నెన్నో మెట్టి మెట్టి
శాంతి గనదాయె దల్లి లో సమయము దాక.
అని వ్యాఖ్యానించిరి.

చంద్రావతి వంగ రామాయణము

వివాహ సమయములందు నేటికి ని బ్రాహ్మణులు మంత్రములతో పాటు చంద్రావతి రామాయణము ను పఠింతురు.తెనుగునాట సూత్ర ధారణ  సమయమున,ఆనందమానందమాయెనే మన సీతమ్మ పెళ్ళికూతురాయెనే, "జానక్యాః కమలాం జలిపుటేః" అను శ్లోకముతో శుభలేఖలు ఆచారమై యున్నవి.
కుటుంబ వ్యవస్తను నాటి నుండి నేటి వరకు అదృశ్య శక్తియై కాపాడుకొనుచూ వచ్చినది రామాయణము.

గాధా సప్తశతి

రామ కథాఘట్టములను ఇండ్ల యందు బొమ్మలు గీచుకొనేవారట.ఆ బొమ్మ కుటుంబ వ్యక్తుల మధ్య శీలము చెడ కుండా కాపాడినదట.అది సీతకు లక్ష్మణుడు నమస్కరించు చిత్రము.
ఆయింటి కోడలిని మరది కామించినాడట.కోరికను వ్యక్తము చేసినాడు.ఆమె పలుక లేదు ఉలకలేదు.అచటి నుండి కదిలినది.అతడు ఆమె వెంటనే నడిచినాడు.ఆమె ఈ చిత్రము వద్ద నిలిచినది.చిత్రమును చూపినది.మరదికి బుద్ది వచ్చినది.వదినకు నమస్కరించినాడు.

భువనహితార్ధమై తరులు పూర్ణ ఫలంబు లొసంగు
భువన హితార్ధమై నదులు పూర్ణముగా బ్రవహించునెప్పుడున్
భువన హితార్ధమై జలద పూగము నీటి నొసంగు రాగాన
మీరవని బరోపకార పరులై చరి యింపుడు శాంత భావనన్ 

(పూగము- ప్రోగు)

అని శ్రీరాముడు అవతార పరిసమాప్తి కి ముందు తన ప్రజలకు హిత బోధ చేశాడని "శ్రీరామ విజయము" అనే నామాంతరము కలిగిన సహస్ర కంఠ రామాయణము చెపుతుంది.శ్రీరామావఝుల కొండయ్య శాస్త్రి గారు ఈ గ్రంధాన్ని రచించారు.పద్మ పురాణం లోని కథను ఆధారం చేసుకొని రచించిన గ్రంధమిది.(వావిళ్ళవారి ప్రచురణ.ప్రధమ ముద్రణ 1928).
రాముడు అవతారం చాలించి వైకుంఠానికి తిరిగి వెళ్ళే ముందు పురజనులకు సద్వర్తనులుగా జీవించ వలసిందని ఉద్భోధ చేశాడు.లోక కళ్యాణం కోసం చెట్లు మంచి ఫలాలను ఇస్తాయని, నదులు నిండుగా ప్రవహిస్తాయని,మేఘాలు చక్కగా వర్షిస్తాయని అభయం ఇచ్చాడు.ప్రజలందరి శ్రేయస్సు కోసం అవసరమైన వివరాలు అప్పుడు రాముడు ప్రజలకు చెప్పాడు.పరోపకారులుగా , శాంత స్వభావులుగా జీవించమని భోదించాడు.
తను వైకుంఠానికి వెళ్ళిపోతుంటే ధుఃఖిస్తున్న ప్రజలను చూసి తన విగ్రహాన్ని చేయించి పెట్టుకోవలసిందని, అందులో తన కళలను ప్రవేశ పెడతాననీ కూడా చెప్పాడు.అప్పుడు ప్రజలు బంగారు విగ్రహాన్ని చేయించారు.
“కనక రాముని చేయించి, కనక రత్న ఖచిత లోలాయంబున ఘనత నిలుప 
అందు రాజొచ్చి నిలిచె బొందుగాను
షోడశాంశ సమేతుడై సొంపుమీర.”
అయోధ్యలో ప్రజలు రాముడి విగ్రహాన్ని సేవించటము అప్పటి నుంచి మొదలయ్యింది.ఆనాటి ప్రజలు అయోధ్య లో ప్రతిష్ఠించుకున్నది బంగారు విగ్రహము.అటు తరువాత ఎన్ని విగ్ర్హారాలు మారాయో.విగ్రహాలు స్వర్ణయ్గం నుంచి శిలా యుగానికి మారటానికి ఎంతకాలం పట్టిందో!
కూజంతం రామ రామేతి మధురం, మధురాక్షరం
అరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.

కవిత్వం అను కొమ్మపై కుర్చొని రామ రామ అని తీయగను,తీయని అక్షరముల తో కూడు కొని ఉండునట్లును కూయుచున్న వాల్మీకి అను కోయిల కు నమస్కరించు చున్నాను.

వాల్మీకి ముని సింహస్వ
కవితా వన చారిణః
శ్రుణ్వన్ రామ కథానదం
కోనయాతి పరాంగతిం
కవిత్వమను వన మందు సంచరించు వాల్మీకి ముని అనెడి సింహము యొక్క రామకథ అను ధన్విని (గర్జన) వినుచు మోక్షమును పొందని వారు ఎవరు ఉందురు.వాల్మీకి చెప్పిన రామకథను వినువారికి తప్పక మోక్షము లభించును.

19 వ శతాబ్ధిలో బంకుపల్లి మల్లయ్య శాస్త్రి సంస్కృత భాషలో సీతాకళ్యాణము, జానకీవహ్ని ప్రవేశము అను హరి కథలు రచించిరి.పురాణ వాచస్పతి అని వీరికి బిరుదు.

స్మస్కృత రామ నాటకములు;

భాసుని-ప్రతిమ-అభిషేకము
భవభూతి-మహావీర చరితము, ఉత్తర రామ చరితము
దిజ్గ్నాగుని-కందమాల
శక్తి భద్రుని-ఆశ్చర్య చూడామణి
మురారి-అనర్ఘ రాఘవము
రాజశేఖరుని-బాల రామాయణము
దామోదర మిశ్ర-హనుమన్నాటకము
జయదేవుని-ప్రసన్న రాఘవం
సుభటుని-దూతాంగద
విరూపాక్షదేవ-ఉన్మత్త రాఘవము
భాస్కరుని-ఉన్న్మత్త రాఘవము
మహదేవుని- అద్భుత దర్పణము
ఝూర్జర సోమేశ్వరుని- ఉల్లాస రాఘవము

దేశ భాషలలో స్త్రీలు వ్రాసిన రామాయణాలు-

మళయాళం లో-సుభద్రాంత పురాట్టి
కన్నడం లో-గిరియమ్మ
గుజరాతీలో- దివాలీబాయి,పూరీబాయి,కృష్ణాబాయి
వంగ బాషలో-చంద్రావతి
వీనిలో చంద్రావతి, మొల్ల రామాయణాలే ప్రాచీనాలు - ప్రశస్తాలు.చంద్రావతి అవివాహిత, మొల్ల వితంతువు.
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information