అసలు చెరుచకుమీ యచ్యుత (అర్థ విశేషాలు)
డా.తాడేపల్లి పతంజలి 

తాళ్లపాక పెదతిరుమలాచార్యఅధ్యాత్మ సంకీర్తన (రేకు: 42-2/సంపుటము: 15-238)

అసలు చెరుచకుమీ యచ్యుత
ఆ సుద్దులె యీ సుద్దులు అచ్యుతా*      ॥పల్లవి॥

01.అలవాటే తొల్లే నీకు నచ్యుతా 
అలుగము ఇంక నీతో నచ్యుతా
అలయకు మింక నీవు అచ్యుతా 
నిన్ను నలమి పట్టెఁగాని యచ్యుతా 
       
02.ఆలసించఁ బనిలేదు అచ్యుతా 
ఆలిమగని సంధి నచ్యుతా
ఔలే నీ విట్టే యచ్యుతా 
ఆలించి మమ్మేలితివి ఆచ్యుతా 
   
03.అసము దించకు మింక నచ్యుతా
 అసురుసురై చిక్కితి మచ్యుతా
ఆసలు చెమటఁ గడి యచ్యుతా
రతి యసుదా శ్రీవేంకటాద్రి యచ్యుతా      
  
తాత్పర్యము

విష్ణుమూర్తి రూపమైన వేంకటేశ్వరా ! (అచ్యుతా!) మా మూలధనము(అసలు) చెడగొట్టకు. ఆ మంచిమాటలు, సూక్తులే (సుద్దులు) యీ మంచిమాటలు, సూక్తులు. మాకు తెలుసులే. 01.అచ్యుతా ! పూర్వమునుంచి ఇది నీకు అలవాటే.ఇక నీతో అలక పూనం. ఇక నువ్వు శ్రమపడకు . అచ్యుతా !నిన్ను కమ్మి పట్టుకొంటాం. (అలమిపట్టె) మా కౌగిలినుంచి ఎక్కడికి పారిపోతావో చూస్తాం. 02.భార్యా భర్తలుగా అభినయిస్తూ చిన్నపిల్లలు ఆడుకొను క్రీడావిశేషము (ఆలిమగని సంధి) ఇక ఆడుకోవటానికి ఆలస్యము చేయపనిలేదు . రా...ఆడుకొందాం.అవునులే. నువ్వు ఇంతే!అచ్యుతా! శ్రద్ధతో విని మమ్ములను పరిపాలించావు. 03.ఇక చాలు. ఇంకా మా అహంకారం వదల్చకు(అసము దించకు) అచ్యుతా! బాగా నలిగిపోయి, శ్రమపడ్డాం.శ్రీవేంకటాద్రిమీద కొలువున్న అచ్యుతా! అసలు చెమట వాసనలు గుబాళించే (కడి) రతి క్రీడ (సురతము,) అల్పమా ?(అసదూ? ) కాదు కదా ! విశేషాలు పైకి నాయికలు నాయకునితో మాట్లాడే శృంగార సంభాషణ అనిపిస్తుంది ఈ గీతం. మధుర భక్తి సంప్రదాయంలోని ఈ కీర్తనలోని అంతరార్థం ఇది. భక్తులు స్వామి వారితో ఇలా మొరపెట్టుకొంటున్నారు. “ఓ వేంకటేశ్వరా ! (అచ్యుతా!) మా మూలధనము(అసలు) మోక్షము. భ్రమలు కల్పించి ఆ అసలును చెడగొట్టకు. నువ్వు ఉత్తమ దైవీ లక్షణాలు ఏవి ఉండాలని గీతలో చెప్పావో - ఆ మంచిమాటలు, సూక్తులే (సుద్దులు) మేము పలికే యీ మంచిమాటలు, సూక్తులు. అలా మాచేత పలికించు. 01.అచ్యుతా ! పూర్వమునుంచి ఇది నీకు అలవాటే. మంచి చేయబోతే మాయ కలిగిస్తావు. ఇక నీతో అలక మాకు సాధ్యమా ! ఎందుకయ్యా ! ఈ రాతి గుండెలను మార్చాలని శ్రమ పడతావు? !ఇక నువ్వు శ్రమపడకు . అచ్యుతా !నిన్ను నిరంతరం కదలకుండా నీపేరులో మేము పట్టుకొంటాము. 02.భార్యా భర్తలుగా అభినయిస్తూ చిన్నపిల్లలు ఆడుకొను క్రీడావిశేషము (ఆలిమగని సంధి) ఆడుకోవటానికి ఆలస్యము చేయపనిలేదు . మా మధుర భక్తిలో నువ్వే మా భర్తవు. కనీసం అలా చిన్నపిల్లల ఆటలో అభినయిస్తే- లౌకిక ప్రేమలు తగ్గి- భర్తగా ఉన్న నీమీద మాకు ప్రేమ కలుగుతుందేమో ! అదేమిటయ్యా? !- మేము ఎంత మాట్లాడినా, ఎన్ని రకాలుగా ప్రవర్తించి దయ పొందాలనుకొన్నా నువ్వు మాట్లాడవు. అవునులే. నువ్వు ఇంతే!అచ్యుతా! క్షమించు.. నిన్ను నిందించాము కదా !ఇంతలోనే మా మాటలు శ్రద్ధతో విని మమ్ములను పరిపాలించావు. 03.ఇక చాలు.నువ్వు మాపక్కన ఉన్నావని, మాతోనే, మాలోనే ఎప్పుడూ ఉంటావనే మా అహంకారం వదల్చకు(అసము దించకు). కనీసం ఆపాటి అహంకారం ఉంటేనే నీ నామ స్మరణ చేయకలుగుతాం. అచ్యుతా! ఈ జీవితంలో ఎన్నో రకాలుగా బాగా నలిగిపోయి, శ్రమపడ్డాం.శ్రీవేంకటాద్రిమీద కొలువున్న అచ్యుతా! అసలు నీ దర్శనం కోసం గుంపులు గుంపులుగా తోసుకొంటూ గాలి దూరే సందులేని స్థితిలో చెలరేగే మా చెమట వాసన లో ఉండే మా భక్తితో కూడిన అనురాగము అల్పమా స్వామీ !? కాదు కదా ! అనుగ్రహించవయ్యా !
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top