Wednesday, August 23, 2017

thumbnail

తానే తానే యిందరి గురుడు(అర్థ విశేషాలు)

తానే తానే యిందరి గురుడు(అర్థ విశేషాలు)
      -డా. తాడేపల్లి పతంజలి

పల్లవి:
తానే తానే యిందరి గురుఁడు
సానఁ బట్టిన భోగి జ్ఞాన యోగి
.1:
అపరిమితములైన యజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మ యోగి
.2:
అన్ని చేఁతలును బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరఁగఁ గరుణించ
పన్నగ శయనుఁడే బ్రహ్మ యోగి
.3:
తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాస యోగి
(రేకు: 0360-05సం: 04-355)
పల్లవి:
తానే తానే దత్తాత్త్రేయ యోగి ఇంతమందికి గురువు,పదును చేసిన, వాడిచేసిన (సానబట్టిన) భోగముగలవాడు,
అనుభవశాలియైనపురుషుడు.జ్ఞానము కలిగిన స్వామి. (జ్ఞానము కలిగిన స్వామి)దత్తాత్త్రేయ యోగి
.1:
అధికమైన యజ్ఞాలను వేగముగా చేయటానికి,తన శరణాగతులకు బుద్ధిని వ్యాపింపచేసితపస్సుగా , పుణ్యముగా ఫలమును  పూర్తిగా విడిచిపెట్టేటట్లు చేయించేఅందమైన ,గొప్పతనము కలవాడు ఆదత్తాత్రేయుడను కర్మయోగి  (నిష్కాముడై విహిత కర్మలను ఆచరించువాడు)
.2:
ఏదైనా జపమో తపమో యజ్ఞమో చేసిన తరువాత ,అన్ని రకముల పనులను తత్ఫలితాన్ని బ్రహ్మకే అర్పిస్తున్నామను బుద్ధిని కలిగించి
భక్తులను ఆదరించి బుద్ధులను చాటుగా చెప్పి ఉన్నత స్థానమునకు దయచూపు ఆదిశేషుడు శయనముగా కలిగిన విష్ణుమూర్తియే దత్తాత్రేయుడను  బ్రహ్మయోగి.( 1. శుభాశుభ వృత్తి రహితుడైన వాడు.2. సమదృష్టి కలిగిన వాడు.3. చతుర్విధ ఆశ్రమాలకు అతీతుడైనవాడు.)
.3:
కపిలుడై ( కర్దమ ప్రజాపతికిని దేహహూతికిని పుట్టిన ఋషి.సాంఖ్యయోగ ప్రవర్తకుఁడు. ఈతని విష్ణుని అవతారము అందురు.ఈతని కోపదృష్టిచే సగర చక్రవర్తి కొడుకులు అఱువదివేగురు భస్మముఅయిరి.) దత్తాత్రేయుడై (అనసూయ, అత్రి మహాముని దంపతుల
కుమారుడుగా జన్మించిన సాక్షాత్ మహావిష్ణువు.)గొప్పదైన మహిమతో శ్రీ వేంకట పతియై సొగసుగా, లక్షణంగా సంసార యోగము (1. పుట్టడం, గిట్టడం,బంధాలను, అను బంధాలను వదలక, కష్టాల లంపటంలోకూరుకొనిపోవడం అనే సంఘటనల నుంచి బయటపడటం.2. సంసారచక్రం నుంచి విముక్తి.3. ముక్తి.) అనుగ్రహించు దైవ మార్గములలో చేయు అభ్యాసయోగము కలవాడు ఈ దత్తాత్రేయుడు
విశేషాలు
1.బుద్ధులు
(.) 1. పండ, 2. మేధ, 3. చార్వి, 4. చత్వ, 5. గృహీతి, 6. శ్రౌతి, 7. ప్రతిభ.(.)
1. జ్ఞానమునెఱుగు నాసక్తి కల బుద్ధి, 2. వినిన సంగతుల నవలోకనమొనర్చు బుద్ధి, 3. మనమున నూహించు నేర్పు ఎక్కువగా గల బుద్ధి, 4. సంశయములను నికారించు బుద్ధి, 5. శ్రద్ధగా వినుటయు వినిన దానిని మరవక గ్రహించుటయు గల బుద్ధి, 6. శుశ్రూషలొనరించు నాసక్తి కలిగిన బుద్ధి, 7. బోధించు నేర్పు గల్గియు నితరులు తన్ను ప్రశ్నింపకుండునటుల తానే స్పష్టపరచును విపులముగ బోధించు నేర్పు
2.ప్రేమపంచకము
1. అభ్యాసయోగము, 2. అభిమానజము, 3. సంప్రత్యయయోగము, 4.వైషయికము, 5. స్వభావసాత్మ్యము.అనునవి ప్రేమపంచకము.  
జటాధరం పాండురంగం
దత్తాత్రేయుడు
జటాధరం పాండురంగం
శూలహస్తం కృపానిధిం
సర్వరోగహరం దేవం
దత్తాత్రేయమహంభజే
ఈ శ్లోకాన్ని ఎప్పుడూ చదువుతుంటే  భ‌క్తుల‌కు    ఆయుష్హు , ఆరోగ్యము కలుగుతాయని నమ్ముతారు..
స్మృతిగామి  అయిన  దత్తుడు ..తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడు
భాగవతమూ, విష్ణుపురాణమూ ప్రకారం దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారము
దత్తం..అంటే సమర్పించుకోవడం.
అత్రి మహర్షి, అనసూయ దంపతుల కుమారుడు దత్తుడు.త్రి మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు.
అత్రి...అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం.అతడి అర్ధాంగి అనసూయ...అసూయలేనిది.
కల్లుముంత
దత్తాత్రేయుడు చేతిలో కల్లుముంతతో కనిపిస్తాడు.. అది కల్లు కాదు, బ్రహ్మజ్ఞానం. ఆయన చుట్టూ న్న  కుక్కలు వేదానికి ప్రతీకలు. ఆవు ని ఉపనిషత్తుల సారంగా చెబుతారు. దత్తుడిది జ్ఞానావతారం!
అజగరవృత్తి
వేటకు వెళ్ళకుండా. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే పొట్ట నింపుకునే కొండచిలువ పాటించే వృత్తిని  అజగరవృత్తి  అంటారు. దీనిని పాటించాడు దత్తుడు.    దత్తాత్రేయుడు అజగర వృత్తి సమయంలో  జ్ఞానమార్గాన్ని బోధించాడు.
దత్తుని అవతారాలుగా  శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్కోట మహరాజ్ (అక్కల్), షిర్డీసాయి (షిర్డీ) చెబుతారు. .మార్గశిర పౌర్ణమి దత్తజయంతి.
                అన్నమయ్య  - ఈ కీర్తనలో -  వేంకటేశునిలో దత్తాత్రేయుని దర్శించి, మనలను తరింపచేసాడు.

           ***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information