శ్రీ  స్వాతి తిరునాళ్ - మహరాజ వాగ్గేయకారులు
-మధురిమ 

కర్ణాటక సంగీత వాగ్గేయకారులలో సంగీత త్రిమూర్తులతరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన ప్రముఖులలో శ్రీ  స్వాతి తిరునాళ్ మహారాజవారు ఒకరు.ఎన్నోవిశిష్టమైన రచనలు చేసిన వీరు ఒక మహారాజుగా, ఒక పరిపాలనా దక్షునిగా  ఎన్నో సాంఘిక  సంస్కరణలు కావించిన వ్యక్తిగా,కళలను ఆరాధించి,ప్రోత్సహించిన గొప్ప కళాపోషకులేకాక...స్వయముగా ఒక అద్భుత కళాకారులు కూడా.. వీరి జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో,ఒడిదుడుకులు,ఆటుపోటులు జీవితాంతం అనుభవించినా కళారాధన ని మాత్రం విడిచిపెట్టలేదు. వీరు జీవించింది కేవలం 33 సంవత్సరాలు....కాని వీరు సాధించినది మాత్రం అనంతం... అనంతపద్మనాభుని దాసునిగా అనంతమైన కీర్తిని ఆర్జించిన గొప్ప వ్యక్తి.
అసలు వీరి జన్మవృత్తాంతం గమనిస్తేనే వీరు కారణజన్ములని అవగతమవుతుంది.చేర రాజవంశస్తుల  కుటుంబంలో మహారాజా బాలరామ వర్మ గారు కేరళని పరిపాలిస్తున్న రోజుల్లో అప్పటి బ్రిటీష్ గవర్నర్ డల్హౌసీవారసులు లేని రాజ్యాలన్ని బ్రిటీష్ సామ్రాజ్యంలో కలవవలిసినదిగా సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా...వీరికేమో పుత్రసంతానం లేదు..కాని బ్రిటీష్ ప్రభుత్వంతో మమేకం అవ్వడం ఇష్టంలేక వీరి సోదరి అయిన గౌరి లక్ష్మిబాయి కి రాజ్యమును అప్పగించినారు.లక్ష్మీ బాయి గారికి కూడా పుత్రసంతానం కలగనందుకు ఆమె ఎన్నో దానాలు,ధర్మాలు చేయుచూ తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభుని సేవించిన తరుణంలో ఆమెకు స్వామి దయవలన స్వాతి నక్షత్రంలో ఒక మగపిల్లవాడు జన్మించగా ఆతనికి రాజవంశ చట్ట ప్రకారం "స్వాతి తిరునాళ్" అని నామకరణం చేసారు.
1816 సంవత్సరం మార్చి 16 చైత్రమాసములో జన్మించిరి.శ్రీ లక్ష్మీ బాయి గారు గర్భవతి గా ఉన్నప్పుడు కూడా రాజ్యపాలన  చేసినందువలన తల్లి గర్భంలోనుండే వీరు రాజ్యపాలన గావించినందుకు వీరిని "గర్భశ్రీమాన్" అనిపిలిచేవారట.వీరి పూర్తిపేరు "శ్రీ పద్మనాభ దాస వంచిపాల శ్రీరామవర్మ కులశేఖర పెరుమాళ్".కాని దురదృష్టవసాత్తూ వీరు కేవలం రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వీరి తల్లి శ్రీ లక్ష్మీ బాయి గారు కాలం చేసారు.అప్పుడు పినతల్లిగారైనటువంటి గౌరీ పార్వతీబాయి గారు వీరిని తన సంతానం కంటే కూడా అల్లారుముద్దుగా పెంచుతూ రాజ్యపాలన కూడా కావించినారట.
వీరి పెంపకంలో సకల శాస్త్ర పారంగతులై, రాజతంత్రములు బాగా నేర్చుకున్నారు.పార్వతీబాయి గారికి చాలా ముందుచూపు ఎక్కువట...ఎప్పటికైనా ఇంగ్లీషు దొరలపాలన మనకి తప్పదని గ్రహించి స్వాతి తిరునాళ్ కు ఆంగ్లము కూడా బోధించడానికి ఉపాధ్యాయులను నియమించారట. ఈవిధంగా వారు తన మాతృ భాషాయిన మళయాళంకాక, తెలుగు,సంస్కృతం,మరాఠీ,తమిళం,పారసీ, ఆంగ్లం ఇలా ఎన్నో భారతీయ భాషలలో నిష్ణాతులవ్వడానికి  పినతల్లి గౌరీ బాయ్ గారే  కారణం.
చిన్నప్పటినుంచే వారికి కళలంటే మక్కువ ఎక్కువ..సహజంగానే సంగీత సాహిత్యాలపై విశేషమైనఅభిమానం ఉండేదట.కళలపై అభిమానం ఉన్నా రాజ్యపాలనని ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యలేదు...సరికదా ఈయన తీసుకువచ్చిన సంస్కరణలు..చేపట్టిన బృహత్కార్యాల వల్ల ఇప్పటికీ  కేరళ రాష్ట్రం వాటి ఉపయోగం పొందుతూనే ఉంది
రాజ్యము తనది కాదని అది అనంతపద్మనాభస్వామిదని వారికి సర్వస్వ శరణాగతి చేయుచూ దాసునిగానే రాజ్యపాలము చేయుచున్నానని భావించి రాజ్యపాలన చేయుచూ,సంగీత సాహిత్య విద్యా వ్యాసాంగ విద్వత్ పోషణ కూడా స్వయంగా చూసుకుంటూ తాను సొంతంగా రచనలు చేసేవారు.
సకల భాషాప్రవీణులను,సకల కళా నిపుణులను తన రాజ్యమునకు రప్పించి తన ఆస్థాన విద్వాంసులుగా వారిని నియమించి ,గౌరవించి తన సభను గాంధర్వ సభ గా చేసారు.పంజాబ్ సులైమాన్ అల్లావుద్దీన్ అనే హిందుస్థానీ సంగీత విద్వాంసులు,అనంతపద్మనాభ గోస్వామి అనే మరాఠీ భాషాప్రవీణులు తిరువనంతపురంలోనే నివసించేవారంటే వీరు ఎంత గౌరవించేవారో మనకి అర్థం అవుతుంది.
స్వయముగా శ్రీ త్యాగరాజస్వామి శిష్యులైనటువటి తంజావూరు సహోదరులుగా పిలువబడే "వడివేలు పిళ్ళై,చిన్నయ్య పిళ్ళై" మొదలైన వారు వీరి ఆస్థాన విద్వాంసులే.మన భారతీయ భాషలోనే కాదు ఆంగ్ల భాష పై వీరికి ఉన్న పట్టుని చూసి ఇంగ్లీషు దొరలే ఆశ్చర్యపోయేవారట.కర్ణల్ వేల్స్ అనే ఇంగ్లీషు దొర వీరి సభ కు విచ్చేసి వీరి వివిధ భాషా ప్రావీణ్యం,సంగీత సాహిత్యాల పైన ఉన్న మమకారాం,పరిపాలనా దక్షతను చూసి ఆశ్చర్యపోయినారట.మహారాజ స్వాతి తిరునాళ్ చిత్రకళ,శిల్పకళ లో కూడా నిపుణులే...
వాగ్గేయకారులుగా శ్రీ స్వాతి తిరునాళ్:
తన అద్భుతమైన సహజ పాండిత్యముతోతెలుగు,సంస్కృత,తమిళ్,మళయాళ భాషలలో స్వరజతులు,తానవర్ణములు,పదవర్ణములు,కృతులు,జావళీలి,పదములు ,తిల్లానాలు ఇలా అన్ని సంగీత ప్రక్రియలలో రచనలు చేసిన మహరాజ వాగ్గేయకారులు.హిందుస్థానీ సంగీత ప్రక్రియలైన ఖ్యాల్,ద్రుపద్ ,తుమ్రీ వంటివికూడా ఎన్నో రచించారు.
ఇవేకాక కుచేలోపాఖ్యానము, అజామీళోపాఖ్యానము మొదలైనా హరికథలు,తిరువనంతపుర వర్ణనము అను కావ్యము,పద్మనాభ శతకము కూడా రచించెను.
వీరి వర్ణ రచనలో "సరసిజనాభా(కాంభోజి) ,స్వామి నిన్నే నమ్మితిరా (యదుకులకాంభోజి)” రాగంలోని తాన వర్ణములు చాలా ప్రసిద్ధమైనవి.దేష్ రాగంలో వీరు రచించిన"తుం బిన మోరె " అన్న హిందుస్థానీ రచన భారతదేశమంతటా ఖ్యాతి చెందినది. మళయాళ భాషలో ఒక సంగీత లక్షణ గ్రంథం కూడా రచించారు.వీరిప్రత్యేక రచనలైన నవరాత్రి కీర్తనలు ....దేవీ నవరాత్రులలో అమ్మవారిపై పాడుకొనుటకు ప్రత్యేకంగా నవరాగమాలికగా రచింపబడినవి,దశావతార కృతి మిక్కిలి ప్రసిద్ధమైనవి..ఇవేకాక రెండు కీర్తనలలో రామాయణ,భాగవతాలను సంస్కృత భాషలో రచించిన తీరు నభూతో భవిష్యతి అన్నట్టుగా ఉంటుంది...”భావయామి రఘురామం అన్న వీరి రామాయణా రాగమాలికా కృతి ముఖ్యంగా ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారి గళంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. వీరి రచనలలో పంకజనాభ,పద్మనాభ,జలరుహనాభ ఇలా ఎన్నో ముద్రలు కలవు.
పరిపాలకులుగా శ్రీ స్వాతితిరునాళ్:
స్వాతి తిరునాళ్ మహారాజావారి కాలంలోనే బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణ చాలా ఎక్కువగా జరుగుతున్నప్పటికి తన సామ్రాజ్యం బ్రిటీష్ సామ్రాజ్యంలో మమేకం అవ్వకుండా తను జీవించి ఉన్నంతవరకూ ఎంతో పోరాడారు.మహారాజుగారు చాలా నైతిక విలువలున్న వ్యక్తి...రాజ్యంలో అధర్మం ఏమాత్రం సహించేవారు కాదట,రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకీ ఉపయోగపడేలా పనులు చేయించేవారట.ఉదాహరణకి ఆయన వేసిన నీటిపారుదల వ్యవస్థనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు,రైతులపై అధిక పన్నుల భారం వేసేవారు కాదు.ఎప్పుడూ ప్రజలమంచినే కాంక్షించిన మహారాజు,తన పరిపాలనలో వ్యాపార రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేసారు.సముద్రతీరాలనుంచీ ఎగుమతులు కూడా జరిగేవి...తిరువనంతపురంలో గ్రంధాలయం ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి.అలాగే తిరువనంతపురంలో పురాతన వస్తు ప్రదర్శన శాల,జంతుప్రదర్శన శాల వంటివి ఆనాడే ఏర్పాటుచేసారు.
తిరువనంతపురంలో ఆయన ఏర్పాటు చేసిన స్వచ్ఛంద ఆసుపత్రి ఇవన్నీ ఆయనకు ప్రజలపై గలఅభిమానాన్నిచాటి చెప్పుతాయి..ఎన్ని చేసినా నేను పద్మనాభ దాసుణ్ణే అని, ఆయనే ఇవన్నిచేయిస్తున్నాడు అనేవారట..
కాని దైవలీలలు మనకి అర్థంకావు. ఆయనేఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది..గవర్నర్  కల్లెన్ ని ట్రావంకోర్ సంస్థానాధీసునిగా బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది...కళ్ళముందే పినతల్లి,తండ్రి,పెద్దభార్య,ముగ్గురు కుమారులూ ఒకరితరువాత ఒకరు మరణించడంతో...ఒకవిధమైన ఏకాంతంలోకి వెళ్ళిన మహారాజావారు దుఃఖ సాగరంలోనుంచి బయటకి రాలేకపోయారు...అలానే తన 33 ఏటనే 1846 డిసెంబర్ 27 అనంతుని ఆస్థాన విద్వాంసునిగా శాశ్వతంగా స్వామి యొక్క  సానిహిత్యాన్ని పొందారు.33ఏళ్ళు జీవించితేనే ఇన్ని గొప్ప పనులు చేస్తే, నిండు నూరేళ్ళు బ్రతికుంటే భావి తరాలకు ఇంకెన్ని అందించేవారో అనిపించడం సహజం..
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈయన పేరుమీదుగా "స్వాతి సంగీత పురస్కారాన్ని స్థాపించి" ప్రతీ సంవత్సరం సంగీత కళాకారుని సత్కరిస్తుంది.సెమ్మంగుడీ శ్రీనివాస అయ్యర్మంగళంపల్లి బాలమురళి కృష్ణ, డా.కె.జె.యేసుదాస్పం.భీంసేన్ జోషి వంటివారు పురస్కారాన్ని పొందిన ప్రముఖులలో కొందరు

ట్రావంకోర్ సంస్థానానికి మహారాజుగా, సంగీత సామ్రాజ్యంలో వాగ్గేయకారునిగా వీరు చేసిన సేవలు సదాస్మరణీయం.

స్వాతి తిరునాళ్ కృతులను క్రింది లింక్ లలో వినండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top