శ్రీరామకర్ణామృతం - 22
                 సిద్ధకవి                    
 డా.బల్లూరి ఉమాదేవి.


తృతీయాశ్వాసము.
1.శ్లో:శ్రీరామం శివచాపభంగ నిపుణం సీతాంగనా వల్లభం
సుత్రామార్చిత పాదపద్మ యుగళం సూర్యేందు నేత్రోజ్జ్వలం
కర్పూరాంగ విలేపనం ఘనరుచిం కారుణ్య పాతోనిధిం
వందేకల్పతరు ప్రవేశితలసత్సింహాసనాధిష్ఠితమ్.

భావము:శివధనస్సును విరచుట యందు నేర్పరి యైనట్టి, సీతకు ప్రియుడైనట్టి దేవేంద్రునిచే పూజింప బడిన పాద పద్మ ద్వంద్వము గలిగి నట్టియు సూర్య చంద్ర రూపనేత్రములచే ప్రకాశించు నట్టియు కల్పవృక్ష సమీపము నందున్నట్టియు, ప్రకాశించు సింహాసనము నధీష్ఠించి నట్టి రామునకు నమస్కరించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శా:శ్రీ మందార మహీరుహాప్తి కలసత్సింహాసనాసీనునిన   శ్రీమద్భర్గ గర్వభంగ నిపుణున్ సీతాధినాథున్ ఘన శ్యామున్ జందన చర్చితాంగు రవిచంద్రాక్షున్ గృపాబ్ధిన్ బరం
ధామున్ రాము బురందరార్చితు మదిన్ ధ్యానింతు నశ్రాంతమున్.

2.శ్లో:శ్రీ రామః శితికంధరస్య ధనుషస్సంభేదన ప్రాపితాం
సీతాం కాంచన సన్నిభాం పరిణతా మాకల్ప రత్నోజ్జ్వలాం
వామాంకోపరి లజ్జయానతముఖీ మాలోక్య దివ్యాసనే
శ్రీమద్భాను శశాంక కోటి సదృశః పాయాత్ సవో రాఘవః.

భావము:శివధనస్సు విరచుట చేత లభించినట్టి బంగారుతో తుల్యురాలైనట్టి ఈ రూపముగా మారిన లక్ష్మియైనట్టి యలంకారముల యందలి రత్నములచే
ప్రకాశించుచున్నట్టి యెడమ తొడపై నుండు సిగ్గుచే వంచబడిన ముఖము గలట్టి సీతను జూచి ప్రశస్తమైన పీఠమందు కూర్చుండి శోభించుచున్న బహు సూర్యచంద్రులతో సమానుడైన రాముడు మమ్ము రక్షించు గాక.

తెలుగు అనువాదపద్యము:
మ:రవి చంద్రాయుత కోటికోటి నిభుడై రమ్యాసనాసీనుడై
భవ కోదండ విఖండ లబ్ధ విలసత్పాణిగ్రహన్ మైథిలిన్
నవరత్నాభరణన్ ద్రపాన్విత సువర్ణన్ నైజవామాంక మం
దవలోకించు రఘూద్వహుండు దయనన్నశ్రాంతమున్ బ్రోవుతన్.

3.శ్లో:శ్రీరామం భువనైక సుందర తనుం ధారధర శ్యామలం
రాజీవాయత లోచనం రఘువరం రాకేందు బింబాననమ్
కోదండాది నిజాయుధాశ్రిత భుజైర్భాంతం విదేహాత్మజా
ధీశం భక్తజనావనం రఘువరం శ్రీరామచంద్రం భజే.

భావము:లోకములందొక్కటియే సొగసైన దేహము గలిగినట్టియు మేఘమువలె నల్లనైనట్టియు పద్మమువలె విస్తారమైన నేత్రములు గలిగినట్టి రఘుశ్రేష్టుడైనట్టి పూర్ణ చంద్రబింబము వంటి మొగము గలిగినట్టి ధనస్సు మొదలగు తన యాయుధములచే నాశ్రయించ బడిన భుజములచే ప్రకాశించుచున్నట్టి సీతానాథుడైనట్టి భక్తజనులను రక్షించునట్టి రఘు శ్రేష్ఠు డైనట్టి శోభచే చంద్రుని వలె ప్రకాశించు చున్నట్టి రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:సరసీజాయతపత్ర నేత్రు విలసత్సౌందర్య పాత్రున్ సుధా
కర బింబానను నీలతోయద లసద్గాత్రున్ ధరాపుత్రికా
వరు కోదండ ముఖాయుధాశ్రతభుజున్ వందారు మందారు శ్రీ
కరు శ్రీరాముని రాఘవున్ రఘువరున్ గాంక్షించి సేవించెదన్.

4.శ్లో:ఆరామం వైభవానామభినవ సుపథం హారకేయూర కాంతం
హాసోల్లాసాభిరామం మణిమయమకుటం మంగళానాం నివాసమ్
మందారారామ సీమాంతర మణి భవనాధిష్ఠితం శిష్ట సేవ్యం
సల్లాపానంద సింధు ప్రణయ మభినిశం రాచంద్రం భజేహమ్.

భావము:వైభవములకు తోట యైనట్టి మంచి క్రొత్తమార్గమైనట్టి హారములచే భుజకీర్తులచే మనోహరుడైనట్టి నవ్వుయొక్క యుల్లాసముచే శోభించుచున్నట్టి మణికిరీటము కల్గినట్టి శుభములకు స్థానమైనట్టి కల్పవృక్షముల తోట లోని మణిగృహము నధిష్ఠించినట్టి యోగ్యులకు సేవింప దగినట్టి యోగ్య సంభాషణము చేతనైన యానంద సముద్రమునందు ప్రేమ కలిగినట్టి రాముని ప్రతిదినము సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
చ:తత విభవాభిరామువసుపథ ప్రవిహారు ధర స్మితాననాం
చితు మకుటాంగదాభరణు సేవక సేవధి మంగళాకరున్
సతతము గల్ప భూరుహ వన స్థల సన్మణిగేహ మధ్య రంజితు సరసోక్తి సంతుషిత సింధువు రామవిభున్ భజించెదన్.

5.శ్లో:శ్లో:రామం రాజశిఖామణిం రఘువరం రాకేందు బింబాననం
రాజీవాయత లోచనం రణహతానేకాసురం రాఘవమ్
సీతాచారు పయోధరాంచిత లసత్కాశ్మీర గంధాంచితం
రాజత్కుండల మండితం శుభకరం రామాభిరామం భజే.

భావము:రాజులకు శిరోరత్నమైనట్టి రఘు శ్రేష్ఠుడైనట్టి పూర్ణ చంద్ర బింబము వంటి మొగము గలిగి నట్టి పద్మములవలె విశాలమైన కన్నులు కలిగినట్టి యుద్ధమందు చంప బడిన బహు రాక్షసులు గలిగినట్టిరఘువంశమందు పుట్టినట్టి సీతాదేవియొక్క స్తనములయందొప్పుచున్న కుంకుమ పరిమళముచే  నొప్పుచున్నట్టి ప్రకాశించుచున్న కుండలములచే నలంకరింప బడినట్టి శుభములను జేయునట్టి సుందరులలో సుందరుడైన రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:ధరణీనాథ శిరోమణిన్ శుభకరున్ దైత్యాబ్రజంఝానిలున్
ధరణీజోరు పయోధరాంకిత లసత్కాశ్మీర గంధాంకితున్
సరసీజేక్షణు గండ మండల విరాజత్కుండలున్ రాము సుం
దర పూర్ణేందు నిభాననున్ గొలిచెదన్ రామాభిరామున్ మదిన్.

6.శ్లో:రామం కోమల నీల మేఘ విలసద్గాత్రం పయోజాననం
కాకుత్స్థం దశకంఠబాహు విదళత్కోదండ బాణాన్వితమ్
పాపఘ్నం విశదాయతాక్షి యుగళం సౌమిత్రి సంసేవితమ్
భక్తానాం పరమౌషధం మునివరైస్సంస్తూయమానం భజే.

భావము:సొగసైన నల్లని మేఘమువలె ప్రకాశించుచున్న దేహము గలిగినట్టి పద్మము వంటి మొగము గలిగినట్టి కకుత్స్థ వంశమందు పుట్టినట్టి రావణుని భుజములను బ్రద్దలు చేయు ధనుర్బాణములతో కూడినట్టి పాపములను కొట్టి వేయునట్టి నిర్మలమైన విస్తారమైన నేత్రద్వంద్వము గలిగినట్టి భక్తులకు ముఖ్యౌషధ ప్రాయుడైనట్టి మునిశ్రేష్ఠులచే స్తోత్రము చేయబడుచున్న రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
చ:కలుష వినాశకారి దశకంధరకంధర బాహుఖండనో
జ్జ్వల శరధారి పంకరుహ వక్త్రు బరాపరు సర్వమౌని మం
డలనుతు గంజ నేత్రు గరుడధ్వజు నాశ్రిత లోకలోక ని
ర్మలర్మల పరమౌషధంబయిన రాము సలక్ష్మణు నాశ్రయించెదన్.

7.శ్లో:రామం శ్యామల మేఘ కోమల రుచిం రాకేందు బింబాననం
రక్షోఘ్నం రవిజార్చితంరఘువరం రత్నోజ్జ్వలత్కుండలమ్
రాజీవాక్ష మమానుషం రణబలోదగ్రం రమానుగ్రహం
రాజేంద్రం రమణీయ రూప మసకృద్ ధ్యాయే జగన్మోహనమ్.

భావము:నల్లని మేఘము వలె సొగసైన కాంతి కలిగినట్టి, పూర్ణచంద్రబింబము వంటి మొగము కలిగినట్టి రాకషసుల కొట్టునట్టి సుగ్రీవునిచే పూజింప బడినట్డి రఘుశ్రేష్టుడైనట్టి, రత్నములచే ప్రకాశించుచున్న కుండలములు గలిగినట్టి  పద్మములవంటి నేత్రముల కలిగినట్టి మనుష్యమాత్రుడు గానట్టి యుద్ధబలముచే గొప్పవాడైనట్టి లక్ష్మియందనుగ్రహము గలిగినట్టి రాజశ్రేష్టుడైనట్టి సుందరమైన రూపము గలిగినట్టి జగములను మోహింప చేయు రాముని బలుమారు తలంచుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శా:రామున్ విశ్వ విమోహనున్ రఘువరున్ రాజేంద్రు గంజాక్షు సు
త్రామారాతి విమర్ధునన్ రణబలోదగ్రున్ రమానుగ్రహున్
శ్యామాంగున్ విరజార్చితున్ గనకరత్నా కల్ప దీప్తున్ బరం
ధామున్ గారణ మూర్తి రమ్యుని సుధాధామాననున్ గొల్చెదన్.

8.శ్లో:రామం రమ్యగుణం రమాపతిసమం రాకాశశాంకాననం
రాజన్యం రమణీయ రూప మమలం రామాభిరామం హరిమ్
రాజారాధిత పాదపద్మ మనిశం రాజన్య సద్భాసితం
రాకేందు ప్రతిమం రమాకుచయుగే విన్యస్త హస్తం భజే.

భావము:సుందరగుణములు గలిగినట్టి విష్ణుతుల్యుడైనట్టి పూర్ణచంద్రుని వంటిముఖము గలిగినట్టి రాజవంశమందు పుట్టినట్టి సుందర రూపము గలిగినట్టి నిర్మలుడైనట్టి సుందరులలో సుందరుడైనట్టి విష్ణురూపుడై రాజులచే పూజింప బడు పాదపద్మములు గలిగినట్టి రాజులయందు లెస్సగా ప్రకాశించుచున్నట్టి పూర్ణచంద్రునితో సామ్యము కలిగినట్టి లక్ష్మీ దేవి యొక్క స్తనద్వందమందుంచబడిన చేతులుగల రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శా:రామున్ రమ్యగుణున్ రమాధివసమున్ రామాభిరామున్ బరం
ధామున్ రాజలలాము రాఘవు సుధాధామాననున్ భార్గవీ
రామా రత్న పయోధరోజ్జ్వల కరున్ రాకేందు సంకాశు నా
స్వామిన్ రాజవరార్చితాంఘ్రి యుగళున్ సద్భక్తి సేవించెదన్.

9.శ్లో:రామం కౌశిక గౌతమ ప్రియకరం సీతాపతిం సానుజం
రక్షోఘ్నం వనవాసినం గుణనిధిం విఘ్నఘ్న మాప్తార్కజం
సేతోర్భంధన ధీర వానరబలం దిక్కుంభ కర్ణేంద్రజిత్
పంక్తిగ్రీవ మవద్విభీషణ మజం శ్రీరామ చంద్రం భజే.

భావము:విశ్వామిత్ర గౌతముల కిష్టము చేయునట్టి సీతానాథుడైనట్టి తమ్మునితో గూడినట్టి రాక్షసుల గొట్టినట్టి వనవాసము చేసినట్టి గుణములకు స్థానమైనట్టి విఘ్నములను హరించినట్టి  యిష్టుడైన సుగ్రీవుడు గలిగినట్టి సేతువు గట్టుట యందు ధైర్యము గల వానర సేన గలిగినట్టి కుంభకర్ణుని నింద్రజిత్తును రావణుని ధిక్కరించినట్టి విభీషణుని రక్షించినట్టి పుట్టువు లేనట్టి రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:సరసున్ గౌశిక గౌతమ ప్రియకరున్ క్ష్మాజేశు విఘ్నమ్ము సు
స్థిర సౌమిత్రి సమేతు రాము వనవాసిన్ భానుపుత్రాప్తు దు
స్తర వారాశి నిబంధన ప్లవగ సంతానున్ దశస్యాది ము
ష్కర దైత్యారి విభీషణావను రఘుస్వామిన్ ప్రశంసించెదన్.

10.శ్లో:రామం కోమల నీల నీరద నిభం నీలాలకాలంకృతం
కట్యాం శోభిత కింకిణీ ఝణఝణధ్వానై రుపేతం శిశుమ్
కంఠాలంబిత రక్షు నిర్మల నఖంకంజాక్ష మబ్జచ్ఛవిం
భాస్వంతం మకుటాంగదాది వివిధా కల్పం సదాహం భజే.

భావము:సుందరమైన నల్లని మేఘములతో సమానుడైనట్టి నల్లని ముంగురులచే నలంకరించబడినట్టి మొలయందు ప్రకాశించుచున్న చిరుగంటల ధ్వనులతో
గూడినట్టి,బాలుడైనట్టి కంఠమందు వ్రేలుచున్న  పులియొక్క గోరు కలిగినట్టి పద్మములవంటి నేత్రములు కలిగినట్టి పద్మములవంటి కాంతి గలిగినట్టి కిరీటము,భుజకీర్తులు మొదలగు పలు దెరంగుల యలంకారము గల రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:హరి నీలాలకు నీలనీరద విరాజాంగున్ గిరీటాది సుం
దర సద్భూషణు గింకిణీ ఝణఝణధ్వాన స్ఫురన్మేఖలున్
వరశార్దూల నఖప్రకాశిత గళున్ బాణున్ రఘుస్వామి  సు
స్థిరు రాకేందు నిభాననున్ గుణనిధిన్ శ్రీరాము గీర్తించెదన్.

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top