నీకు నేనున్నా – 13 - అచ్చంగా తెలుగు
నీకు నేనున్నా – 13
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com

(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టిస్తారు చరణ్, విక్రం . హాస్టల్ లో చేరే ఆడపిల్లల విభిన్న మనస్తత్వాలతో కొత్త సవాళ్ళను ఎదుర్కుంటుంది మధురిమ . అందులో వర్ష అనే అమ్మాయి దూకుడుగా ప్రవర్తించి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది . తన కూతురు వర్ష ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతోందని తెలిసి, ఆమెను, తన భార్యను కొడతాడు హరి. ఆమెకు పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తాడు. ఇక చదవండి.)

వర్షను సాత్విక్కి ఇచ్చి పెళ్లిచేద్దామని ఇంట్లో చెప్పాడు హరి. హరి అంత ప్రశాంతంగా మారిపోయి, బాధ్యతగా మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యంతో మరోవైపు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తల్లీ, కూతుళ్లు.
వర్ష ఇచ్చిన సాత్విక్ అడ్రస్ కాగితాన్ని జేబులో పెట్టుకొని, సాత్విక్ పెద్దవాళ్లతో మాట్లాడాలని బయలుదేరాడు హరి.
హైదరాబాదు శివార్లలో లోపలకి వున్న చిన్న కాలనీలో చాలాసేపు తిరిగాడు హరి. అక్కడ ఆటోలు తిరగవు. చాలాదూరం నడిచే వెళ్లాడు. వెళ్లగావెళ్లగా బాగా లోపలకి వుందా ఇల్లు, అక్కడ నిలబడి సాత్విక్ మేనమామ శంకర్ పేరు అడిగాడు హరి. లోపలనుండి శంకర్ బయటకొచ్చాడు. హరిని చూడగానే ఆశ్చర్యపోయాడు శంకర్. శంకర్ ని చూడగానే హరికూడా అదే స్థితిలో ఉన్నాడు.
వెంటనే శంకర్ ని కౌగిలించుకున్నాడు హరి. 
"సాత్విక్ మేనమామ అంటే ఎవరో అనుకున్నాను శంకర్! అది నువ్వేఅయినందుకు సంతోషంగా వుంది. ఎంతకాలమైంది శంకర్ నిన్ను చూసి. ఇదినువ్వు ప్రసాదించిన జీవితమే శంకర్!" అన్నాడు హరి గతాన్ని గుర్తు చేస్తూ, చాలాకాలం తర్వాత శంకర్ ని చూశానన్న సంతోషంతో.
“ ఇప్పుడవన్నీ ఎందుకు హరీ! లోపలకి పోదాం పద" అంటూ ప్రేమగా హరి భుజం నిమురుతూ లోపలకి తీసికెళ్లాడు శంకర్ లోపలకి వస్తున్న హరిని చూడగానే శంకర్ తల్లి సావిత్రమ్మ అక్కయ్య రాజ్యం ఆశ్చర్యపోయారు. వర్ష తండ్రి వస్తున్నట్లు సాత్విక్ ఫోన్ చేస్తే ఎవరో అనుకున్నారు. 
సావిత్రమ్మ ఇచ్చిన మంచినీళ్లు త్రాగి మాట్లాడుతూ కూర్చున్నాడు హరి.
"వర్ష తండ్రి అంటే ఎవరో అనుకున్నాం బాబు! సుజాత గారు బాగున్నారా? ఆరోజు మీరు బనగానిపల్లె వచ్చినప్పుడు చూడటమే. తర్వాత మీ జాడలేదు. మేం కూడా ఆ ఊరినుండి వచ్చేశాం బాబూ! మళ్లీ ఆ ఊరు వెళ్లలేదు. అయినా అప్పడప్పుడు శంకర్ని అడుగుతుండేదాన్ని 'హరి ఎక్కడున్నాడురా! అని అంటూ ఆప్యాయంగా మాట్లాడింది సావిత్రమ్మ
"నిజమే హరీ! అమ్మ అప్పుడప్పుడు నీ గురించి అడుగుతుండేది. కానీ నేను హైదరాబాదు వచ్చాక సుజాత గారిని కలవలేదు. లేకుంటే నీ పెళ్లికి వచ్చి వుండేవాడ్ని పెళ్లి పనులన్నీ స్వయంగా నేనే చేసి వుండేవాడ్ని అన్నాడు శంకర్ స్నేహితుడ్ని చూశానన్న ఆనందం ఎక్కువగా కన్పిస్తోంది శంకర్లో
"ఎంతమంది బాబు నీకు పిల్లలు? నువ్వు చేసుకున్న అమ్మాయిది ఏ ఊరు?" అంటూ అడిగింది సావిత్రమ్మ.
సాత్విక్ తల్లి రాజ్యం అందరికీ టీ ఇచ్చింది.
"నాకు వర్ష ఒక్కటే అమ్మాయి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిది బనగానేపల్లి. ఆ అమ్మాయి వేమిరెడ్డి రుద్రాణి కూతురు రోజామణి. మేం వుండేది హైదరాబాదులోనే" అంటూ ఖాళీ అయిన టీ కప్ప క్రింద పెట్టాడు హరి.
సావిత్రమ్మ, రాజ్యం షాకయ్యారు. 
శంకర్ ఉలిక్కిపడి హరివైపు చూశాడు.
కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని పరిశీలనగా హరి వైపు చూసింది. సావిత్రమ్మ. హరిది కూడా శంకర్ వయసే. నడివయసులో కూడా వేళకి తిండి తిని బలంగా వున్నాడు శంకర్. హరి శరీరం బాగా సడలిపోయి ఉంది. శారీరకంగా పోల్చుకుంటే తన కొడుకు శంకర్ కి, ఈ హరికి పోలికే లేదు. శంకర్ స్నేహితునిగా చూసినంతసేపు ఏమీ అన్పించలేదు కాని, వేమిరెడ్డి రుద్రాణి అల్లుడి స్థానంలో హరిణి ఊహించుకోలేక పోతుంది.
బనగానిపల్లిలో ఒక్క వెలుగు వెలిగిన మనిషి రుద్రాణి. రోజారాణి తన కొడుకును ప్రేమించిందని, నెలకూడా తప్పిందని తెలియగానే రుద్రాణి రుద్రకాళి అయింది. తక్కువజాతి వాడ్ని ఎలా తాకావని తిట్టింది. కొట్టింది. తన మామగారి చేత శంకర్ ని కొట్టించి ఊరి నుండి వెళ్ళగొట్టింది. సాత్విక్ చిన్నపిల్లవాడిగా వున్నపుడే తల్లిని,భర్తలేని తన అక్కయ్యను తీసుకొని సిటీ కొచ్చాడు శంకర్. ఒక టాక్సీ కొని నడుపుకుంటూ, వచ్చిన డబ్బుతో ఓ పెంకుటిల్లు కొని స్థిరపడ్డాడు. అక్కయ్య రాజ్యానికి కూడా రెండు రేకులతో కట్టిన ఇంటిని కొనిచ్చాడు. రాజ్యం రోజూ ప్రక్కనే వున్న ఫ్యాక్టరీలోకి పనికి వెళ్తోంది. ఇవాళ హరి వస్తాడని తెలిసి పనిలోకి వెళ్ళలేదు.
శంకర్ కి పిల్లలు లేరు. మేనల్లుడు సాత్విక్ నే కొడుకులా పెంచుకొని చదివిస్తున్నాడు. ఈ మధ్యనే బైక్ కూడా కొనిచ్చాడు. సాత్విక్ అంటే శంకర్ కి ప్రాణం.
హరి నోట రోజామణి పేరు విన్నప్పటి నుండి శంకర్ గుండెలో ఏదో కదలిక మొదలైంది. మాటలకందని మధురమైన కదలిక అది. బనగానపల్లిలో అందరు శంకర్ ని శివశంకర్ అనే పిలుస్తారు. బయట వ్యక్తులు మాత్రం శంకర్ అని పిలుస్తారు. పేరు ముందు శివ పోయినట్లే, శంకర్ జీవితం లోంచి రోజా పోయింది. పేరుకి ముందున్న శివను మరచిపోయినట్లే రోజాను కూడా మరచిపోలేదు.
ఆరోజు మధురిమను హత్య చేసిన హరిని సుజాత ముఖం చూసి కాపాడాడు శంకర్. ఫ్రెండ్ కదాని డబ్బు కూడా హెల్ప్ చేశాడు. కానీ తనకెంతో అపురూపమైన రోజాకి భర్త స్థానంలో హరిణి చూస్తుంటే అప్పుడతన్ని కాపాడి తప్పు చేశాననిపించింది శంకర్ కి. ఒక హంతకుడితో రోజా కాపురం చేస్తుందన్న నిజం శంకర్ మనసుని రంపపుకోత పెడ్తోంది.
శంకర్,సావిత్రమ్మ,రాజ్యం ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ మౌనం హరికి ఏదోలా అన్పిస్తుంది.
మనసుని గట్టిగా పిండుతోంది.
ఎదుటివాళ్ల మౌనం అంత చిత్రహింస పెడుందని ఇన్నాళ్ళూ తెలియదు హరికి బాధపెట్టటం తప్ప బాధపడటం రాని హరిని వాళ్ల మౌనం ఘోరంగా బాధపెడ్తోంది. వర్షను ఒక హంతకుని బిడ్డగా వాళ్లు భావిస్తున్నట్లు అర్థమైంది హరికి. మధురిమను హత్యచేసింది తనైతే, శిక్ష వర్షకి వరకు పడటం హరికి నచ్చలేదు.
"సావిత్రమ్మ గారు! నేను హంతకుడినని శంకర్ ద్వారా మీకు తెలిసే వుంటుంది. అందుకే నా బిడ్డను మీ ఇంటి కోడలిగా చేసుకోవాలంటే సందేహిస్తున్నట్లున్నారు. మీరంత సందేహించవలసిన అవసరం లేదు. నా బిడ్డ గురించి నేను చెప్పకోవటం కాదుగాని, నా బిడ్డ సానపట్టని వజ్రం లాంటిది" అన్నాడు హరి.
సావిత్రమ్మ ఒక్కక్షణం హరివైపు చూసి మళ్లీ తలవంచుకొంది.
వర్ష హరి కూతురు కాదని సావిత్రమ్మకి తెలుసు. ఒకసారి బనగానిపల్లి వెళ్ళి ఈ సంగతి చెవినేసుకొచ్చింది. రాజ్యంతో చెప్పింది కాని, శంకర్తో చెప్పలేదు. ఒక్క శంకర్కి తప్ప అందరికి తెలుసు వర్ష శంకర్ కూతురని.
సావిత్రమ్మ వాలకం చూస్తుంటే ఆమె మాట్లాడదని తెలిసిపోయింది హరికి, ఆశగా శంకర్ వైపు చూశాడు హరి.
“శంకర్! వర్ష మనసంతా సాత్విక్ మీదనే వుంది. మనం కాదంటే చచ్చిపోయేలా వుంది" అన్నాడు హరి బాధగా
"ప్రేమించుకున్నవాళ్ల కెవరికైనా పెళ్లి చెయ్యకపోతే చచ్చిపోవాలనే ఉంటుంది హరి! అలాగని పెద్దవాళ్లు కులం పట్టింపులు చూడకుండా పెళ్లిళ్ల చెయ్యరు. మీరింతటితో ఈ విషయాన్ని మరచిపోండి" అన్నాడు శంకర్.
“ప్రేమించుకున్న వాళ్ళకి కులం అడ్డువస్తుందా శంకర్”? అంటూ సూటిగా శంకర్ ముఖం లోకి చోశాడు హరి.
“కులం దేనికి అడ్డురాదో చెప్పనా హరీ! పెద్ద పెద్ద చదువులు చదవటానికి అడ్డురాదు. పెద్ద పెద్ద ఉద్యోగాలకి అడ్డురాదు. గొప్పవాళ్ళతో స్నేహం చేయటానికి, నచ్చినవాళ్ళని ప్రేమించడానికి అడ్డురాదు. ఇంకా చెప్పాలంటే హత్యలు చెయ్యటానికి అడ్డురాదు. మానభంగాలు చెయ్యటానికి అడ్డురాదు. ఒక్క పెళ్ళికి మాత్రం అడ్డు వస్తుంది” అన్నాడు శంకర్. శంకర్ గుండె లేతుల్లోని బాధ అర్ధమైన వాళ్ళలా శంకర్ ముఖంలోకి బాధగా చూశారు సావిత్రమ్మ, రాజ్యం.
హరి తలవంచుకున్నాడు. అతని మనసు అడవిలా తగల తగలబడుతోంది.
“చూడు హరీ! స్వాతిక్ బి.టెక్. చదువుతున్నాడు. అబ్బాయి బాగుంటాడు.మంచివాడు. అందుకే వర్షకి నచ్చివుంటాడు. కానీ మా స్థాయి, మా కులం మీకు తగినవి కావు. అదీ గాక సాత్విక్ తల్లి బాధ్యత కూడా వుంది. ఆమెను అంటరానిదానిలా భావించడం మేము భరించలేము” అన్నాడు శంకర్.
వెంటనే లేచాడు హరి అక్కడే వున్న రాజ్యం చేతులు పట్టుకున్నాడు.
"అమ్మా! నా బిడ్డను కాపాడాలి. నీ ఇంటి కోడలిగా వర్షను అంగీకరిస్తేనే నేనిక్కడ నుండి వెళ్తాను. లేకుంటే ఇంటికెళ్లినాముఖం నా వాళ్లకి చూపించలేను. ఒకప్పుడు నేను చేసిన పాపాన్ని వుతికి ఆరేసి నన్ను కాపాడిన దానివి నువ్వు. ఇప్పడు కూడా నన్ను కాపాడగలిగింది నువ్వొక్కదానివే. వర్ష ఒంట్లో వుండే జీన్స్ వాళ్లమ్మవి. నిన్ను బాధ్యతగా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను నమ్ము, ఇవి చేతులుకావు" అంటూ ఆమె చేతుల్ని కాళ్లుగా భావించి కళ్లకద్దుకుంటూ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు.
రాజ్యం మనసు కరిగిపోయింది. 
ఎప్పడు చూసినా తన ఆవేశంతో ఎదుటివాళ్లను దడదడ లాడించే ఆ హరేనా ఇతను అనుకున్నాడు శంకర్.
పెద్దవారు మీరైనా మీ పిల్లలకి నచ్చచెప్పండి సావిత్రమ్మగారు!" అంటూ సావిత్రమ్మ వైపు తిరిగాడు హరి.
 “నాదేముంది నాయనా! ఊరు పొమ్మంటుంది. కాడు రమ్మంటుంది. అంతా పైవాడి లీల” అంటూ పైకి చూసింది సావిత్రమ్మ.
హరి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేలా వున్నాయి.
హరిణి చూస్తుంటే జాలిగా అన్పించింది శంకర్ కి.
“మీ అమ్మాయి పెళ్ళి విషయంలో నువ్వెందుకింత టోనర పద్తున్నావు. హరీ! నెమ్మదిగా మీవాళ్ళలోనే ఒక అబ్బాయిని చూసి వర్ష పెళ్ళి చెయ్యొచ్చు. నేను కూడా ఈ విషయంలో అవసరమైతే నీకు సపోర్టుగా వుంటాను” అంటూ హరికి ధైర్యం చెప్పాడు శంకర్.
“వర్ష పెళ్ళి సాత్విక్ తోనే చేయాలి శంకర్. లేకుంటే వర్ష బ్రతకదు. వర్ష అందరిలాంటి అమ్మాయి కాదు. సాత్విక్ తోనే పెళ్ళి చేస్తానని వర్షకి మాట ఇచ్చాను” అన్నాడు హరి.
హరి మాటలు శంకర్ ని బాగా కదిలించాయి.
“నీలో మంచి తండ్రి కన్పిస్తున్నాడు హరీ! నీ లాంటి తండ్రులుంటే ప్రేమించే పిల్లలకి గుండెకోత వుండదు, ఆపరేషన్లు చెయ్యకుండానే పిల్లల గుండెల్ని కోస్తున్న తండ్రులతో పోల్చకుంటే నువ్వు చాలా మంచినాడిని, వర్ష పెళ్ళి స్వాతిక్ తోనే చేద్దాం" అంటూ సంతోషంగా హరి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శంకర్. శంకర్ చేతి స్పర్నకి పులకించిపోయాడు హరి, హరి కళ్లలోని కన్నీళ్లు ఆనందబాష్పాలైనాయి.
శంకర్ వైపు చూస్తూ తమ కళ్లతోనే సంతోషాన్ని వ్యక్తం చేశారు సావిత్రమ్మ రాజ్యం. చకచక అందరికి భోజనాలు వడ్డించింది రాజ్యం, ఆ భోజనం తెంటుంటే మళ్లీ బనగానిపల్లి గుర్తిచ్చింది హరికి వాళ్లు చెప్పే కబుర్లు వింటూ తృప్తిగా భోంచేశాడు.
“ఇక నేను వెళ్తాను సావిత్రమ్మ గారు!" అంటూ వాళ్ల దగ్గర సెలను తీసుకున్నాడు హరి.
”ఉండు హరీ! నేను ఆటే వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను” అంటూ డ్రెస్ మార్చుకొని, వెళ్ళి తన ట్యాక్సీలో కూర్చున్నాడు శంకర్.
హరి కూడా టాక్సీ ఎక్కాడు. టాక్సీ కదిలింది. కొద్దిదూరం వెళ్లగానే... వర్ష వుండే హాస్టల్ మేడమ్ హరిసెల్ కి  కాల్ చేసి  మాట్లాడింది. మేడం తో మాట్లాడిన హరికి ఒళ్లంతా చెమటలు పోశాయి. డ్రైవ్ చేస్తున్న శంకర్ ఎక్కడ వింటాడోనని భయపడుతూనే ఆమెతో మాట్లాడాడు.
హరితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు శంకర్. ఎటువంటి రోడ్డు మీదైనా అవలీలగా డ్రైవ్ చేస్తాడు శంకర్. బాగా అలవాటైన రోడ్డుమీద వెళ్తున్నట్లు అవలీలగా వెళ్తోంది టాక్సీ.
రోడ్డు ప్రక్కగా కారాపుకొని నిలబడివున్న మనోహర్ ని చూసి షాకయ్యాడు హరి. మనోహర్ ని చూసి చాలా కాలమైంది హరి. మనోహరో కాదోనన్న అనుమానం వచ్చింది. మనోహర్ అయితే బాగుండునని మనసు కొట్టుకుంటుంది. అతని మనసు ఎందుకో ఈ మధ్యన తన చిన్ననాటి స్నేహితులని తలచుకుంటోంది. అప్పటికే హరి వెళ్తున్న టాక్సీ మనోహర్ ని దాటి వెళ్లింది.
“శంకర్! టాక్సీని రివర్స్ పోనీ, అక్కడ నిలబడి వుండేది నా ఫ్రెండ్ లాగే అన్పిస్తుంది. మేమిద్దరం ఒకప్పుడు హైదరాబాదులో చదువుకున్నాం” అన్నాడు హరి.
హరి అలా అనగానే టాక్సీని రివర్స్ చేసి వెనక్కి పోనిచ్చాడు శంకర్.
హరి అనుకున్నట్లే అతను మనోహరే.
వెంటనే టాక్సీ దిగి మనోహర్ దగ్గరికి వెళ్ళాడు హరి.
మనోహర్ హరిణి గుర్తుపట్టలేదు. అంత మార్పు ఉంది హరిలో. మనోహర్ ఖరీదైన దుస్తుల్లో ఠీవిగా హుందాగా, బలంగా ఇంకా చెప్పాలంటే చిన్న వయసులో ఉన్న అందం కంటే ఇంకా రెట్టింపు అందంతో చూసేవాళ్ళకి గౌరవభావం కలిగేలా వున్నాడు.
“మనోహర్! నేనురా! హరిని. నన్ను గుర్తు పట్టలేదా?” అంటూ బాగా దగ్గరికి వెళ్ళి పలకరించాడు హరి.
“హరీ అంటే! ఓ హరీ నువ్వా!బాగున్నావా? అంటూ హరి భుజాలవైపు ఓ సారి చూసి, తర్వాత హరి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ పలకరించాడు మనోహర్. అప్పట్లో హరి భుజాలు బలంగా ఉండేవి. ఇపుడు వాటి రూపురేఖలు మారిపోయాయి. వయసులో ఉన్నప్పటి హరికి, ఇతనికి పోలికే లేదు.
బాగున్నానన్నట్లు తలవూపాడు హరి.
“ఏంటి హరీ! ఇంతగా మారిపోయావు? గుర్తుపట్టలేదు నేను” అంటూ తదేకంగా హరినే చోశాడు మనోహర్.
"వయసు వస్తుంది కదా మనోహర్" అన్నాడు మెల్లగా
"మాకు రాలేదా వయసు! ఇది వయసు తెచ్చిన మార్పులా లేదు హరీ! ఆరోగ్యమేమైనా బాగలేదా? ఆప్యాయంగా అడిగాడు మనోహర్
"ఆరోగ్యం బాగనేవుంది మనోహర్! నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు  అన్నాడు హరి.
"నా కారు ట్రబులిచ్చింది హరీ!" అన్నాడు కారువైపు చూస్తూ మనోహర్
“అవునా! అయితే వుండు. శంకర్ ని పిలుస్తాను “ అంటూ టాక్సీ వైపు కదిలాడు హరి.
"ఆగాగు! శంకరెవరూ?? వెళ్లబోతున్న హరిని ఆపాడు మనోహర్.
"మంచి డ్రైవర్! బేతంచర్లలో నేనొక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరం ఫ్రెండ్సయ్యాం" అన్నాడు హరి.
“సరే పిలువు." అన్నాడు మనోహర్.  
మనోహర్ని చూడగానే సెల్యూట్ చేసి పరిచయం చేసుకున్నాడు శంకర్.కారు ఎలా ఆగిపోయిందో మనోహర్ చేత చెప్పించుకున్నాడు. శంకర్, డ్రైవర్ గా పనిచేస్తున్న అనుభవం వల్ల పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా మసలుకోవాలో శంకర్ కి తెలుసు. ఎంత కోపంతో వున్నవాళ్లయినా శంకర్ ని చూస్తే కూలయిపోతారు. ఎంత కష్టమైన పని అప్పజెప్పినా క్షణాల్లో చేసిపెడతాడు. అందువల్లే పెద్దవాళ్లలో అతనికో గుర్తింపు వుంది.
వెంటనే బానేట్ ఎత్తి ఇంజన్ చెక్ చేశాడు శంకర్. తర్వాత పైపులన్నీ చెక్ చేశాడు.
“ఆయిల్ సప్లయ్ ఆగిపోయింది సార్! ఐదు నిముషాలు మీరలా వెళ్ళి నా టాక్సీలో కూర్చోండి! నేను దీన్ని కరక్ట్ చేస్తాను" అన్నాడు శంకర్.
“ఫర్వాలేదు. అదిగో ఆ డాబాలో కూర్చుంటాం. కారు రెడీ కాగానే నా సెల్ కి 'మిస్డ్కాల్’ఇవ్వు” అంటూ మనోహర్ నెంబరిచ్చాడు శంకర్కి.
ఇద్దరు వెళ్ళి ‘దబా’ లో కూర్చున్నారు.
ఒకప్పుడు ఆ ఇద్దరి మధ్యన వున్న క్లాష్ కాలగర్భంలో కలసిపోయింది. అదేమీ గుర్తురావటం లేదు వాళ్ళకి. మనోహర్ కూల్ డ్రింక్స్ కి ఆర్డరిచ్చాడు.
కుర్చీలో కూర్చుని వున్న మనోహర్ రిలాక్స్ అవుతూ ఫ్రెష్ గా కన్పిస్తున్నాడు. హరి మాత్రం కుంచించుకుపోయి కూర్చుని వున్నాను. మేడం ఫోన్ గుర్తొస్తూ హరి గుండెలు దడదడ లాడుతున్నాయి.
“ఎన్టీ! టెన్షన్ గా వున్నావు హరీ?కొన్ని రకాల టెన్షన్లు చెప్పుకుంటే తగ్గుతాయి. మొహమాటం దేనికి? ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? లేక ఆఫీసు ప్రాబ్లమా? చెప్పు హరీ?” అంటూ ఎంతో అభిమానంగా అడిగాడు మనోహర్.
“ఏం లేదు మనోహర్! మా అమ్మాయి వర్ష, శంకర్ మేనల్లుడు స్వాతిక్ ని ప్రేమించింది. సాత్విక్ తో వర్ష పెళ్ళి జరిగేలా శంకర్ తో మాట్లాడి ఒప్పించాను. కానీ రాణా అనే అబ్బాయి వర్ష వెంట పడుతున్నాడు. ఏడిపిస్తున్నాడు. వర్ష ఉండే హాస్టల్ కి వెళ్ళి గోల చేస్తున్నాడు. హాస్టల్ మేడం వర్షను బయటకు పంపుతా అంటుంది. అదే టెన్షన్ గా ఉంది” అన్నాడు హరి.
“వేరే హాస్టల్ లో జాయిన్ చెయ్యి హరీ! దీనికింత టెన్షన్ దేనికి?” అన్నాడు మనోహర్. ఆటను అంటున్న తీరు చాలా క్యాజువల్ గా ఉంది.
“రాణా విషయం శంకర్ కి తెలిస్తే తన మేనల్లుడికి వర్షను చేసుకోడు మనోహర్! అదే నాకు టెన్షన్ గా వుంది” అన్నాడు బాధపడ్తూ హరి.
హరి ముఖంలో తొలిసారిగా అలాంటి ఫీలింగ్స్ చూశాడు మనోహర్.
“రాణా లాంటి అబ్బాయిల వల్ల ఏ తరం అమ్మాయిలకైనా ఇబ్బందిగానే వుంటుంది హరీ!” అంటూ ఆలోచిస్తూ దూరంగా చూశాడు మనోహర్.
మనోహర్ మాటలు ఏదో పాట జ్ఞాపకాలను వెతుకుతున్నట్లు హరిని గుచ్చుకున్నాయి.
“నీ మాటలు నన్ను గుచ్చుకుంటున్నాయి మనోహర్!” అంటూ నొచ్చుకున్నాడు హరి.
***

No comments:

Post a Comment

Pages