మన ప్రబంధ నాయికలు - అచ్చంగా తెలుగు
మన ప్రబంధ నాయికలు
బాలాంత్రపు వేంకటరమణ

మన ప్రబంధాలలో మన మనసుల్ని సంపూర్ణంగా రంజింపచేయడానికి ప్రబంధనాయికలు సిద్ధంగా ఉన్నారు ! వాళ్ళ వాళ్ళ లక్షణాలని బట్టి నాయికలు ఎనిమిది విధాలు అని లాక్షణికులు తేల్చారు.
1) వాసకసజ్జ
2) విరహోత్కంఠిత
3) స్వాధీన భర్తృక
4) కలహాంతరిత
5) ఖండిత
6) విప్రలబ్ధ
7) ప్రోషిత భర్తృక
8) ఆభిసారిక
వీళ్ళని ఆష్టవిధనాయికలు అన్నారు.
సమయాభావం వలన మనం కేవలం ఒకరిద్దరు ప్రబంధనాయికల గురించి చెప్పుకుందాం. 
ముందుగా వరూధిని !
ఆంధ్రకవితాపితామహ అల్లసాని పెద్దనామాత్యుడు రచించిన "స్వారోచిష మనుసంభవం" అనే ప్రబంధ నాయిక మన వరూధిని. కళ్ళు మిరుమిట్లుకొలిపే అందం ఆమెది.
ప్రవరుడు చూసిన వరూధిని ఎలా ఉందంటేట – ఆమె -విద్యుల్లతా విగ్రహ – మెరుపుతీగ లాంటి దేహసౌందర్యం కలది.
శతపత్రేక్షణ - కమలముల వంటి కన్నులు కలది.
చంచరీక చికుర - తుమ్మెదల వంటి కురులు కలది.
చంద్రాస్య - చంద్రబింబంవంటి మోము కలది.
చక్రస్తని – చక్రవాకములవంటి వక్షోజము కలది.
నతనాభి - లోతైన బొడ్డుకలది (సాముద్రికా శాస్త్రం ప్రకారం పొక్కిలి,అంటే బొడ్డు లొతుగా ఉండడమనేది ఉత్తమజాతి స్త్రీ లక్షణమట.)
ఆమెను “మరున్నారీ శిరోరత్నము” – అంటే దేవతా స్త్రీలలో తలమానికము వంటిది - అన్నారు అల్లసాని వారు.
ప్రవరుణ్ణి చూసేవరకూ ఏ చీకూ చింతా లేకుండా, హాయిగా పాటలుపాడుకుంటూ, వీణ వాయించుకుంటూ, మేరుపర్వత చరియల్లోనూ, కల్పవృక్షం నీడలోనూ తోటి అప్సరసస్త్రీలతో, బ్రహ్మ-విష్ణు- మహేశ్వరుల సభల్లో నాట్యం
చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపేది వరూధిని. ఆమె అందాన్ని చూసి మోహించిన వారున్నారు. ఆమె వాళ్ళకేసి కన్నెత్తి కూడా చూసేది కాదు.
పాపం ఆ బేల, ప్రవరాక్షుడి అతిలోక సౌందర్యం చూసి తల-మునకలుగా మోహించేసింది. తనకేసి వస్తున్న ప్రవరుణ్ణి ప్రప్రధమంగా చూడగానే, ఆ దేవతాస్త్రీకి - 
అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ గాంతి పె
ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తులఁ గ్రుమ్మరింపఁగా
గుబ్బ మెరుంగుఁ జన్గవ గగుర్పొడువన్ మదిలోనఁ గోరికల్
గుబ్బతిలంగఁ జూచె నలకూబర సన్నిభు నద్ధరామరున్

నలకూబరనితో సమానమైన అందంకల ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు కాంతిపెల్లుబ్బి, వికసించిన కలువపూవుల్లా అయ్యాయి; గుండ్రనైన మిసమిసలాడే స్తనద్వయం గగుర్పొడిచింది. మదిలో
కోరికలు పెల్లుబికాయి. అతన్ని చూసి -

ఎక్కడివాఁడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్
జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడువాఁడు, మహీసురాన్వయం
బెక్కడ యీ తనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్
డక్కఁ గొనంగ రాదె, యకటా! నను వీడు పరిగ్రహించినన్!

ఎక్కడివాడో ! అబ్బ! ఎంత సౌందర్యం ! నలకూబరుణ్ణి, చంద్రుడ్ని, జయంతుడిని, వసంతపురుషుణ్ణి, మన్మధుణ్ణి అందంలో గెలవగలిగినవాడు!
బ్రాహ్మణకులం ఎక్కడ? ఈ శరీరసంపత్తి ఎక్కడ? ఆహా! నన్ను ఇతడు పరిగ్రహిస్తే మన్మధుడిచేత వెట్టిచాకిరీ చేయించుకోనా! అంటే మన్మధ సామ్రాజ్యాన్ని జయించి దాని అధిపతి అయిన మన్మధుడి చేతనే
బానిసలాగా వెట్టిచాకిరీ చేయించుకోనా! అనుకుంది.

"చూచి ఝళంఝళత్కటక సూచిత వేగ పదార వింద యై,
లేచి కుచంబులున్ దుఱుము లేనడుమల్లలనాడ ..."

ప్రవరుణ్ణి చూడగానే వరూధిని కాలి అందెలు గలుగలుమని మ్రోయగా లేచింది.కుచములూ, కొప్పూ, సన్నని నడుము అల్లల్లాడిపోయాయి. అంతటి తక్షణ ప్రేమ ఆమెది. అయితే ఆమె మనసిచ్చినది మదగజాలు కుమ్మినా చలించని మద్దివృక్షం లాంటి ధృడ సంకల్పం వున్న ప్రవరాఖ్యుడికి! ఆమె దివ్యసౌందర్యం అతని మనోనిశ్చయాన్ని ఎంతమాత్రం కదల్చలేకపోయింది. తన మీద పడిన అంతటి సౌందర్య రాశినీ, చిటికెన వ్రేలి గోరుతో తోసి అవతలపాడేసి, తన దారిన తాను చక్కాపోయిన మహానుభావుడు ప్రవరాఖ్యుడు! అతని విరహం తట్టుకోలేక ఆమె పరిపరివిధాల దుఃఖ పడింది. ఈ కారణం చేత వరూధినిని "విరహోత్కంఠిత" అనే నాయకిగా మనం స్వీకరించవచ్చు.
తనంత తా వలచి వచ్చి చులకన అయిన వనిత వరూధిని. అంతమాత్రం చేత వరూధిని అపవిత్ర అని మనం భావించనక్కరలేదు. ఆమె మూర్తీభవించిన ప్రేమైకమూర్తి. బేల, ముగ్ధ! ప్రవరుడి అతిలోక సౌందర్యానికి
ముగ్ధురాలైపోయి, త్రికరణశుద్ధిగా అతన్నే వలచింది. అతనికి తన సర్వస్వం సమర్పించుకోడానికి వెంఠనే సిద్ధపడిపోయింది. ఆ పిచ్చి ప్రేమలోపడి, తను మాయాప్రవరుడి వశం అయిన విషయం కూడా ఆమెకి తెలియలేదు. ఆ విధంగా ఆమె ప్రేమ రసాభాస అయింది, కానీ ఆమె రసపిపాసిని. తన్మయ హృదయ, ఒక విధంగా
అభాగ్యజీవిని.

మరొక విధంగా ఆ ప్రేమమూర్తి జన్మ ధన్యతగాంచింది. అది ఎలాగంటే, మాయాప్రవరుడిచే వంచించబడి కూడా, తను ప్రవరునితోనే కాపురం చేస్తున్నానే నమ్మింది. అందుకే ప్రవరుడి మహోన్నత లక్షణాలయిన, పవిత్రత, జప-హోమ- నియమ నిష్టలు, నీతీ నిజాయితీలూ, ఆ పై తనయొక్క గంధర్వ లక్షణాలూ ప్రోదిచేసుకొని కన్న స్వరోచి - అతని ద్వారా మహా పురుషుడై, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క దయకి పాత్రుడైన స్వారోచిషమనువు యొక్క జన్మకి మూలకారణమయిన ధన్యజీవి మన వరూధిని !
(478)


సత్యభామ !
ఈ ప్రబంధనాయకి పేరు తల్చుకుంటేనే తెలుగు జాతికి ఒళ్ళు పులకించిపోతుంది. ఒక శృంగార రసాదిదేవత మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ బిక్ష మనకి పెట్టినవాడు ముక్కు తిమ్మనాచార్యుడు. పురాణ కాంత అయిన సత్యభామని ప్రబంధనాయకిగా,"పారిజాతాపహరణము" అనే ఒకగొప్ప ప్రబంధం ద్వారా మనకి పరిచయంచేశాడు. ఆవిడకి ఇంతలో బేలతనం, అంతలో రోషం, ఇంతలో అలక,అంతలో ప్రేమ. ఆమె నవరస గుళిక ! ఆమెది పట్టలేని సౌందర్యం అలవిమీరిన ఆభిజాత్యం. బహుభార్యాలోలుడైన శ్రీకృష్ణుని ఆమె ఇంకెవరితోనూ పంచుకోలేదు. ఆమెయే ఆతని ఏకైక ప్రేమాస్పద కావాలి!
నారదమునీంద్రుడు ఒక దివ్య ప్రారిజాతపుష్పాన్ని శ్రీకృష్ణునినికి ఆయన రుక్మిణీమందిరంలో ఉండగా ఇచ్చాడు. దానిని శ్రీకృష్ణుడు రుక్మిణి తలలో తురిమాడు. అంతే కాదు, నారదుడు దీనితో "నా యంతటి వారు లేరని యహంకృతి నెప్పుడు విఱ్ఱవీఁగుచున్ వంతుకు వచ్చు సత్యగరువం బిఁకఁ జెల్లదు” అని పలికాడు. ఈ ఉదంతమంతా చెలికత్తె వచ్చి చెప్పగానే, సత్యభామ -

అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయివోయ భ
గ్గన దరికొన్న భీషణహుతాశనకీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు దనచెక్కులఁ గుంకుమపత్రభంగ సం
జనిత నవీన కాంతి వెదచల్లఁగ గద్గదఖిన్నకంఠి యై !

మగత్రాచుకంటే ఆడు త్రాచుపాముకి కోపమెక్కువట. అందుకని, దెబ్బతిన్న ఆడుత్రాచు ఎలా బుస్సన లేస్తుందో అలా లేచిందిట. నెయ్యిపోస్తే భగ్గుని ఎలా మంటలు లేస్తాయో అలా లేచిందిట! ఆ కోపాగ్ని అరుణకాంతులు కళ్ళలోంచి బుగ్గలమీదికి వ్యాపించి - ఆహా ఆ క్రోధాన్నీ, ఆ సౌందర్యాన్నీ ఊహించుకోండి!
ఇంతటి క్రోధావేశం మనం ఇక ఏ ఇతర ప్రబంధనాయికిలోనూ చూడం. అంతలోనే “ఆ..అలా మాట్లాడ్డం జగడాలమారి అయిన నారదుడికి సహజమేలే, రుక్మిణిని కూడా తప్పుపట్టడం దేనికి - అంతా ఆ ధూర్తగోపాలుడు చేసినదే. ప్రాణసమానమైన పతి ఇలా చేస్తే మనసు మండకుండా ఎలా ఉంటుంది?” అని వగచింది. అందులోనే నిరాశ; ఉక్రోషం ! అంతలోనే కడు బేలగా అయింది. డగ్గుత్తిక పడిపోయిన కంఠంతో చెలికత్తెతో, “ఓ చెలీ ఈ మొగవాళ్ళని
నమ్మకూడదే, ఇన్నాళ్ళూ పతి నా పట్ల అనురక్తుడై ఉన్నందునే నా ప్రభ వెలిగింది. ఇక అందరికీ తెలిసిపోతుంది. నా పని ఐపోయింది. సవతులలో ఇక నేను తలయెత్తుకోలేను. ఇంకా బ్రతికిఉండి యెన్ని అవమానాలు భరించాలో! ఎప్పుడూ ఎడబాయకుండా పూసలో దారం లాగా, తలలో నాలుక లాగా సతి మదిలో మెలిగే భర్త ఎన్నో పుణ్యాలుచేసుకుంటే గానీ లభించడు. నేను అలాటి నోములు నోచుకో లేదు కాబోలు ! నా ఈ స్వర్ణసౌధం ఇంకెవరికో సొంతం అయిపోతుంది. నేను ఎంతో కష్టపడి మాటలు నేర్పిన చిలుకలు ఇంకెవరి వశమో అయిపోతాయి. నా శమంతకమణి కాస్తా వేరొకరిపాలయిపోతుంది!”
ఇలా, పరి పరి విధాల ఆ బేల ఊహించుకొని దుఃఖ పడింది. అంతలోనే తేరుకుని, తన"స్వాధీన భర్తృక" నాయికా లక్షణాన్ని నిరూపించుకుంది. అలకాగృహంచేరి, అలిగి, ఎన్నోవిధాల భర్త చేత బ్రతిమాలించుకుని బామాలించుకుని తన కోరిక నెరవేర్చుకుంది.
సత్యభామ లోకోత్తర సౌందర్యం, శ్రీ కృష్ణుని పట్ల ఆమెకున్న అనన్యమైన ప్రేమాతిశయం, ఆమె యొక్క జగత్ప్రసిద్ధమైన అలకలూ, వాటిని తీర్చడంకోసం శ్రీకృష్ణుడు పడిన పాట్లూ, మనమెవరమైనా మరువగలమా
! ఆఖరికి ఆవిడ యొక్క కాలితాపుకూడా తిన్నాడు కదండీ అంతటి శ్రీ కృష్ణ పరమాత్ముడూనూ! తిన్నాడో లేదో, శిరస్సు తీసికెళ్ళి ఆవిడ పాదానికి ఆన్చాడు ! కవి ఎటూ తేల్చకుండా “అచ్చో వామపాదమునం తోలగం దోచె
లతాంగి” అన్నాడు. వామపాదముతో లేదా వామపాదముచేత తోసింది అనలేదు. ఆచోటి నుండి పాదమును తప్పించింది అనుకోవచ్చు. దానికే ఆవిడ పశ్చాత్తాప పడిపోయింది కూడాను. గడసరి కృష్ణుడు, నువ్వు తన్నినా నాకు ఫరవాలేదులే అన్నాడు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁ గిన్కఁ బూని తాఁ
చినయది నాకు మన్ననయ, చెల్వగు నీపదపల్లవంబు మ
త్తనుపులకాగ్రకంటకవితానము దాఁకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా ఇఁకనైన నరాళకుంతలా !

నువ్వు నెయ్యపుటల్క పూని తంతే నాకు సన్మానమే కదా అన్నాడు. చెల్వగు అంటే అందమైన నీ పదపల్లవాలు - నీ చిగురు పాదాలు - నా శరీరమందలి రోమాంచము కొనలనెడి ముళ్ళని తాకితే నీకు నొప్పి కలుగుతుంది అన్నాడు. ఇక అలాటి ప్రియుడికి ఏ యువతి వశీకృతురాలవ్వకుండా ఉంటుంది చెప్పండి?
పైగా ఆవిడ అలక తీర్చడానికి స్వర్గలోకం నుండి పారిజాతవృక్షాన్నే అపహరించి తెచ్చి ఆవిడ పెరట్లో నాటవలసివచ్చింది! ఈ పనిచెయడంకోసం దేవేంద్రాదులతో యుద్ధం కూడా చేయవలసివచ్చింది శ్రీకృష్ణునికి.
అంతటి "స్వాధీనభర్తృక" ఆ నాయకి ! శ్రీకృష్ణుణ్ణి కొంగుకి ముడివేసుకుని, ఇక “నీ గీచిన గీటు దాటనని" అంతటి దక్షిణ నాయకుడిచేతా వాగ్దానం చేయించుకున్న శృంగార రసాధి దేవత, ప్రౌఢ, ఘటికురాలు మన సత్య భామా
దేవి !
అదండీ ! తెలుగు జాతి మర్చిపోలేని, గర్వించదగ్గ రమణీ మణులు మన ప్రబంధనాయికలు. తెలుగు జాతి తలుచుకుని, తలుచుకుని మరీ, మరీ మురిసిపోవలసిన మహాకవుల షృష్టి మన ప్రబంధనాయికలు.
శుభమస్తు!
***


No comments:

Post a Comment

Pages