మలిపొద్దు - అచ్చంగా తెలుగు
మలిపొద్దు 
పొన్నాడ లక్ష్మి


సత్యం తలపట్టుకు కూర్చున్నాడు.
 “మీ అన్నయ్యని మాట్లాడకుండా నోరు మూసుకోమనండి.” అంది త్రీవంగా రమ.
“నేనెందుకు నోరుమూసుకోవాలి? నా సొమ్ము తింటూ, అందరూ నన్నే అంటున్నారు” అన్నాడు సత్యం అన్నయ్య విశ్వం కోపంగా.
“నోర్మూసుకుని ఉండకపోతే  ఫో. నీ చేత మాటలు పడవలసిన అవసరం నాకు లేదు” అంది అంతకన్నా కోపంగా రమ.
“ఎలాగూ పోతాను. పొమ్మన్నాక సిగ్గు లేకుండా ఉండడానికి నేనేమీ అంత
గతిమాలినవాడిని కాను” అన్నాడు విశ్వం.

“ఎన్నిసార్లు అన్నావో ఈ మాట. ఎక్కడికి పోతావు? మళ్ళీ నేనే గతి. నీకు
ఎవ్వరూ చాకిరీ చెయ్యరు. మళ్ళీ నా దగ్గరకే వస్తావు.” అని నిరసనగా మాట్లాడి రుసరుసలాడుతూ లోపాలకి వెళ్ళిపోయింది రమ. సత్యం ఏమీ మాట్లాడలేక భార్యకి ఎదురు చెప్పలేక మిన్నకుండి పోయాడు.

విశ్వం, సత్యం మొత్తం నలుగు అన్నదమ్ములు. సత్యం ఆఖరివాడు. విశ్వం ఒక్కడే కుటుంబ బాధ్యత పట్టించుకుని తల్లిదండ్రులని తమ్ముణ్ణి బాధ్యతగా
చూసుకున్నాడు. మిగతా ఇద్దరు అన్నదమ్ములు అసలు పట్టించుకునేవారు కాదు.

విశ్వం పెళ్లి నాటికి సత్యం ఎనిమిదేళ్ళవాడు. విశ్వం భార్య కూడా అతనికి తగిన ఇల్లాలే. వారికి సంతానం కలగలేదు. అయినా వారు చాలా అన్యోన్యంగా ఉంటూ సత్యాన్నే తమ కొడుకుగా భావించి ఆలనా పాలన చూసారు. చదువు చెప్పించి మేనమామ కూతుర్నిచ్చి వివాహం చేసారు.
సత్యంది చిన్న ఉద్యోగం మూలాన ఆర్ధికంగా కూడా విశ్వం తమ్ముణ్ణి ఆదుకున్నాడు. పదవీ విరమణ తర్వాత స్వగ్రామం లో ఇల్లు కట్టుకుని భార్యతో స్థిరపడ్డాడు.
సత్యం కూడా పదవీ విరమణ అయ్యాక తనతో పాటు స్వగ్రామంలో అందరూ కలసి ఉందామని ముసలి వయస్సులో తమకు అండగా ఉంటారని తమ్ముణ్ణి విశ్వం దంపతులు కోరారు. రమ దానికి ఒప్పుకోలేదు. విశాఖ లో చిన్న ఇల్లు కట్టుకుని వేరే చిన్న సంస్థలో పనిచేస్తూ అక్కడే ఉండిపోయాడు సత్యం.

సత్యం భార్య రమ స్వార్ధం, అహం, గయ్యాళితనం మూర్తీభవిం చిన ఇల్లాలు. తన మాటే వేదవాక్కు తను, తన పిల్లలంత ఉత్తములు, తెలివయినవారు ప్రపంచంలోనేలేరని ఆవిడ అభిప్రాయం. ఎవరితోనైనా చిన్న బెదాభిప్రాయం వస్తే వాళ్ళ గతి అంతే.  అన్నింటికీ గొడవలు పడలేక సత్యం మౌనం వహించేవాడు.

విశ్వం భార్య ఉబ్బస వ్యాధి తో బాధపడుతూ భర్తని ఒంటరివాడిని చేసి
స్వర్గస్తురాలయ్యింది. ఆవిడ ఆఖరి దశలో కూడా సత్యం, రమ ఏ విధమయిన సహాయం,సేవ చేయలేకపోయారు. భార్య పోయాక మళ్ళీ తమ్ముణ్ణి తన దగ్గర  ఉండమని అడిగాడు. రమ ఒప్పుకోలేదు. ‘నువ్వే మా దగ్గరకి రా, మేమే  చూస్తాం’ అన్నారు. ఎన్నో ఏళ్లగా భార్యతో కష్టం సుఖం పంచుకున్న సొంత ఇంటినీ,పరిసరాలనీ,   విశ్రాంత  ఉద్యోగులయిన తన స్నేహితుల్నీ వదలి వెళ్ళాలని లేకపోయినా మరో దారి లేక తమ్ముడి పంచన చేరాడు విశ్వం.

విశ్వం రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. పెన్షన్ బాగానే వస్తుంది. తన ఖర్చు నిమిత్తం తమ్ముడికి పెద్ద మొత్తంగానే సొమ్ము ఇచ్చేవాడు. అయినా రమ అన్నింటికీ చిరాకు పడుతూనే వుండేది. కాఫీ ఇవ్వాలి, అన్నం పెట్టాలి,ముసలాడికి అన్ని సదుపాయాలూ చెయ్యాలి అని విసుక్కుంటూ వుండేది. బంధువులు, ఇరుగుపొరుగువారూ కూడా ఈ విషయం పై చెవులు కొరుక్కునేవారు. విశ్వం డబ్బంతా తమకే పెట్టాలని, పూచికపుల్ల కూడా ఎవరికీ ఇవ్వరాదనీ గొడవ చేసేది రమ.
స్వతహాగా దానధర్మాలు చేసే అభిమతం విశ్వంది. ఎవ్వరికీ ఏమి ఇవ్వదని అంటే విశ్వంకి తిక్క రేగేది. కొంచెం చాదస్తం, కొంత  ముసలితనం అన్నీ కలిసి తనూ నోరు పారేసుకునేవాడు. అంతేతప్ప మరే దుర్గుణాలు, దుర్వ్యసనాలు లేని మనిషి.
అతను చేసిన ఉపకారం మరచిపోయి కనీసం వయస్సుకైనా తగిన గౌరవం ఇవ్వక నానా దుర్భాషలు ఆడి ముసలి మనసు నొప్పించారు. తరచూ ఇలాంటి గొడవలు మామూలు ఐపోయాయి.  ఈ గొడవ జరిగాక కూతురు పుట్టినరోజని రమ అన్నదమ్ములిద్దర్నీ వదలి వెళ్ళిపోయింది.  “అన్నయ్యా రెండు రోజులు మీ ఊరెళ్ళి పనులు చక్కబెట్టుకుని రా, ఈ లోపున నేనేదో చూస్తాను’ అని చెప్పి సత్యంకూడా కూతురింటికి వెళ్ళిపోయాడు. వీడెం చూస్తాడు, చాతకాని వాడు, పెళ్ళాం ఎంత చెప్తే అంత అని విశ్వం మనసులో అనుకుని విరిగిన మనస్సుతో స్వగ్రామం వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆమర్నాడు సామాను సర్దుకుని స్వగ్రామం వెళ్ళిపోయాడు. 
గేటు తీయగానే ఎదురింటి పాప  వచ్చి ‘తాతయ్యామళ్ళీ వచ్చేసావా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లావు?’అంటూ  అమాయకంగా, ఆప్యాయంగా తనని పట్టుకుని అడిగింది. వేలు గుమ్మరించినా తమ్ముడి ఇంట్లో దొరకని
ఆప్యాయత , అభిమానం ఈ పసి మనసులో కనిపించేసరికి విశ్వానికి కళ్ళు
చెమ్మగిల్లాయి.  తనను అభిమానించే స్నేహితులూ ఇరుగుపొరుగువారూ ఇంతమంది వుండగా  ఎండమావులు వెంట పరుగుతీసాడు. ఇప్పుడు తను ఒంటరివాడిని కాదన్న ఆత్మవిశ్వాసంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు విశ్వం. వాడిపోతున్న మల్లెతీగ మళ్ళీ జీవం  పోసుకుంది.
 *** 

No comments:

Post a Comment

Pages