(జ)వరాలి కధలు - 20 
కొల"మానాలు" (తూకాలు)
 గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సొమసుధ)


ఉదయాన్నే నిద్ర లేవగానే వరాలు కనిపించలేదు. ఈమధ్య తనకు ఒళ్ళు వస్తోందని ఎవరో అన్నారట! అందుకని వారంరోజులనుంచి మార్నింగ్ వాక్ కి(మనకు అలవాటు లేని పదం. "పొద్దున్నే పెత్తనాలు" అని పత్రికలవాళ్ళలా అనువాదం చేస్తే బాగుండదుగా! అందుకే మార్నింగ్ వాక్ గానే ఉంచేద్దాం!) వెడుతోంది. అలాగే యీ రోజు వెళ్ళి ఉంటుంది. కానీ వెళ్ళేముందు నన్ను లేపి వెళ్ళేదిగా! మరీరోజు? 
" ఓర్నాయనో! తను వీధితలుపు తీసిపోతే యింట్లో దొంగలు పడొచ్చు" అంటూ మంచం దిగి వీధిగదిలోకి పరుగుతీశాను. 
ఇంట్లో వస్తువులన్నీ సరిగానే ఉన్నాయి. కానీ తలుపే చేరవేసి ఉంది. 
"బాధ్యత లేకుండా పోయింది" అనుకొంటూ తలుపుని పట్టి లాగితే రాలేదు. రెండు, మూడుసార్లు గట్టిగా లాగి చూసినా ఫలితం లేదు. వెంటనే పెరటివైపు తలుపు తీసి సందులోనుంచి వీధివైపు వెళ్ళాను. నన్ను వెక్కిరిస్తూ తాళంకప్ప కనిపించింది. వెంటనే మా యింటి గేటు తీసి దూరంగా కనిపించే పార్కువైపు చూశాను. పార్కు లోపల, బయట పరుగులు తీసేవాళ్ళు, సూర్యనమస్కారాలు చేసేవాళ్ళు, పార్కు చుట్టూ నడిచేవాళ్ళూ కనిపించారు. వాళ్ళలో వరాలు కనిపించలేదు. 
ఒక్కసారి భారంగా నిట్టూర్చి పెరటివైపు నుంచి యింట్లోకెళ్ళి తలుపు గడియపెట్టాను.
"మొగుణ్ణి యింట్లో పెట్టి తాళం వేస్తుందా?" నాలో కోపంతో పాటు ఈ వ్యాయామప్రదర్శనలపై భావాలు తన్నుకొచ్చి పుస్తకం అందుకొన్నాను. 
"ఈమధ్య దేశంలో అందరికీ ఆరోగ్యసూత్రాల మీద శ్రద్ధ ఎక్కువైపోతోంది. ఇవి సంఘంలో రెండురకాలుగా రూపుదిద్దుకొన్నాయి. భగవంతుడు మనకు ప్రసాదించిన శక్తి కన్న ఎక్కువ శక్తి కావాలని కొందరు డ్రగ్స్ వాడేసి హనుమంతుడి సోదరులుగా భ్రమలో బతికేస్తుంటారు. గతంలో రాజులకు మద్యపానీయాలిచ్చి ఆంగ్లేయులు వారిని తమకు బానిసలుగా చేసుకొన్నారు. ఇప్పుడీ డ్రగ్స్ అందించి భారతీయ యువతను కొంతమంది వారి గుప్పిట్లో పెట్టుకొని నిర్వీర్యులను చేస్తున్నారు. ఆటల్లో గెలవాలన్నా, ఆడదాని మనసును దోచుకోవాలన్నా యీ డ్రగ్సే గతి అన్నట్లు ఊదరగొట్టేసి యువతను వెంపర్లాడేలా చేస్తున్నారు. ఉత్ప్రేరకాలు(డ్రగ్స్) భగవంతుడు మనకిచ్చిన శక్తిని మించి ఏ శక్తినీ యివ్వవు. మీరే చెప్పండి. పాలను వేడి చేసి వాడుకోవటం మంచిదే! కాని అదేపనిగా మరగకాస్తే రుచి పెరుగుతుందా? కాటువాసన వచ్చి పాలు పనికిరాక పోవటమే గాక, ఉన్న పాలు కూడా పూర్తిగా ఆవిరైపోయే ప్రమాదం ఉంది. జీవితంలో మురిపాలైనా అంతే! ఈ నిజాన్ని నేటి యువత గ్రహించగలగాలి. ఇది ఒకరకమైతే, రెండో రకం వారు ఉన్నారు.శరీరానికి వ్యాయామం అవసరమే! కానీ దాన్నో ప్రదర్శనగా చేసేస్తున్నారు. సందు చివర దుకాణంనుంచి ఏదైనా వస్తువు కావాలంటే వెంటనే బైకెక్కేసి డుర్రున వెళ్ళి డుర్రున తెచ్చేస్తారు. ఫర్లాంగుదూరం నడిచి ఆ వస్తువు తెచ్చుకొంటే పెట్రోలు ఆదా, శారీరక వ్యాయామం దక్కుతుంది కదా! ఇక నగరాల్లో సిటీ బస్సులో వెళ్ళేప్పుడు స్టాపులో బస్సు దిగి యింటికి నాలుగు అడుగులు వేయాలంటే నామోషీ! సరిగా వాళ్ళ యింటి మలుపు దగ్గరే బస్సులోంచి దూకి యింటికెళ్ళాలి. అలా దూకినప్పుడు ముందుకు తూలి ముందు పళ్ళు రాలకొట్టించుకొంటేనే ఆనందం. ఇంత ఆరాటం ఉన్న మనిషి ప్రత్యేకం ఉదయాన్నే బూట్లేసుకొని, ఒక పార్కు చూసుకొని, దాని చుట్టూ పాతికసార్లు చక్కెర్లు కొడతాడు. ఉదయాన్నే వ్యాయామ ప్రదర్శన, మిగిలిన రోజంతా ఎవర్ని నాశనం చేయాలా అన్న ఆలోచన. ఫలితమేముంటుంది? ఇక ప్రపంచ యోగాదినం వస్తే చాలు. దేశంలో ఛానళ్ళన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకూ అదే గోల. అలాగాక రోజుకి యోగా కోసం ఒక గంట కేటాయించి యువతను ఉత్సాహపరచొచ్చుగా! అబ్బే! దానివల్ల రేటింగు పెరగదుగా! ప్రజానాయకులు సరేసరి. ప్రపంచ యోగాదినం నాడు ప్రాణాయామం చేస్తున్నట్లు కెమెరాల ముందు గొప్పగా నటించేస్తారు. ఆరోజు తరువాత మళ్ళీ వాళ్ళా పని చేస్తారో లేదో భగవంతుడికే తెలియాలి. అలాగని వ్యాయామానికి నేను వ్యతిరేకం గాదు. నా దృష్టిలో వ్యాయామం జీవితంలో భాగం కావాలే గాని ప్రదర్శనారోగం కాగూడదు. వీలయినప్పుడు యింటి పనులకోసం కాలినడకన దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళండి. మంగలిషాపుకి కూడా బైక్ పై వెళ్ళేంత బలహీనులు కావద్దు" 
వీధితలుపు తాళం తీసిన చప్పుడై వ్రాస్తున్న పుస్తకాన్ని బల్లపై పడేసి వీధిగదిలోకి వెళ్ళాను.
బయట తాళం తీసి యింట్లోకొస్తున్న వరాలు నన్ను చూసి " లేచారా?" అని అడిగింది.
" లేచి చాలాసేపైంది. అదిసరె! నువ్వు వాకింగ్ కి వెడుతూ నన్ను లేపేదానివిగా!" అడిగాను. 
"మొదట్లో ఆలోచన రాక అలాగే చేశాను. కానీ మీరు రాత్రి పదకొండు దాటితే గానీ పడుకోరు కదా! అలాంటి మిమ్మల్ని ఉదయం అయిదుగంటలకే నిద్ర లేపి యిబ్బంది పెడుతున్నానేమో అనిపించింది. అందుకే మిమ్మల్ని నిద్ర లేపక యింటికి తాళం వేసి వెడితే మంచిదనిపించింది. మీకేం కోపం రాలేదుగా?"
అంత గోముగా తను అడుగుతుంటే ఏం చెబుతాను? 
"అది కాదనుకో! నాకు బయటికెళ్ళే అవసరం వస్తే యిబ్బందేగా?" మెల్లిగా నసిగాను.
"ఉదయాన్నే మీకు బయటికెళ్ళే అవసరాలు రావని నాకు తెలియదా? ఇక కాలకృత్యాలంటారా? టాయిలెట్ గది కూడా పడకగదిలోనే కట్టేసి, పూర్వకాలంలా దూరానికి నడిచిపోయే అవసరమే లేకుండా చేసేస్తున్నారు. అందుకే మార్నింగ్ వాక్ అంటూ ప్రత్యేక విభాగాన్ని తెరవాల్సి వస్తోంది. అయినా పెరటివైపు తలుపు ఉందిగా! దానికి తాళం వేసి మీరెళ్ళండి" వరాలి తెలివికి నీళ్ళు నమలక తప్పలేదు.
" నీ పతిభక్తికి ధన్యవాదాలు. ఆ వేసే తాళమేదో నువ్వే పెరటివైపు వేసి వెళ్ళు. చుట్టూ ప్రహారీ ఉంది గనుక ఎవరికీ తెలియదు. మరేం లేదు. పొద్దున్న మన యింటి ఎదురుగా పార్కు చుట్టూ పచార్లు చేయటానికి వచ్చినోళ్ళు, నువ్విలా నన్ను లోపల పెట్టి తాళం వేయటం చూస్తే నేను పిచ్చివాణ్ణని, అందుకే బయటకెడుతూ తాళం వేస్తున్నావని అనుకోగలరు. అదిసరే! నేనిందాకా పెరటివైపునుంచి బయటకొచ్చి పార్కు వైపు చూశాను. నువ్వు కనపడలేదు" 
" రెండురోజుల క్రితం ప్రక్కవీధి గుడిలో ప్రాణాయామం చెబుతున్నారు. అక్కడికి వెళ్తున్నాను. అందుకే కనపడలేదు" అంటూ యింట్లోకి నడిచింది. 
అర్ధాంగి ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తూంటే అరవాల్సిన అవసరం ఏముంది? ఆమె ఆరోగ్యంగా ఉంటేనే కదా నన్ను బాగా చూసుకొంటుంది. అందుకే మారుమాట్లాడక బాత్రూం వైపు నడిచాను. 
@ @ @

ఆరోజు సెలవుదినం కావటంతో బుర్రకు పదునుబెట్టి కాగితాలు ఖరాబు చేస్తున్నాను. వరాలు వీధిగదిలో కూర్చుని ఆరోజు దినపత్రిక చదువుతోంది. ఎవరో గేటు తీసుకొని వస్తున్న చప్పుడై అటు చూశాను. సుమారు ఎనభై ఏళ్ళు పైబడిన అపరిచితవ్యక్తి లోనికి వస్తున్నాడు. వరాలు చేతిలోని పత్రిక గూట్లో పడేసి అతనికి ఎదురువెళ్ళి ఆహ్వానించింది.
" అబ్బాయి ఉన్నాడమ్మా?" అంటూ లోనికొచ్చాడు.
" రండి బాబాయిగారూ!" 
నేను వెంటనే వ్రాస్తున్న కాగితాలు డ్రాయరు సొరుగులో తోసేసి మర్యాదకోసం ఎదురెళ్ళాను.
" వీరే బాబాయి మా వారు. ఏమండీ! ఈయన సుబ్బరామయ్యగారని మన వీధిలోనే ఉంటున్నారు. రోజూ ప్రాణాయామం కోసం వెళ్ళినప్పుడు గుళ్ళో కలుస్తారు. మావారు కేంద్రప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నారు బాబాయి" మా యిద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేసింది.
" ఈ పార్కుకి అవతలవైపున కళ్యాణమంటపాన్ని ఆనుకొని కనిపిస్తున్న షెడ్ చూశారా? ఆ షెడ్ మా యింట్లోదే! మా గేటు తలుపు అటువైపు ఉంది" అంటూ చూపుడు వేలితో తన యింటి ఆనవాళ్ళను చూపిస్తూ చెప్పారు.
" రండి" అంటూ హాలు లోనికి ఆహ్వానించాను. మేమిద్దరం హాలులో కూర్చుంటూండగా, వరాలు వంటింటివైపు నడిచింది.
ఏడాదిగా నగరంలో ఉంటున్నా పల్లెటూరి మర్యాదలు మరిచిపోలేదామె. అయినా మర్యాదలిచ్చిపుచ్చుకొనే తత్వాలు చిన్నప్పటినుంచి పెద్దలు నేర్పితేనే పిల్లలకొస్తాయి. ఈకాలం కొన్ని కుటుంబాల్లో అవి కనుమరుగై పోయాయి. 
" నేను నెల్లాళ్ళక్రితమే యీ ప్రాంతానికి వచ్చానయ్యా! మా రెండవ అమ్మాయి పెళ్ళి చేసినప్పుడు ఊరి మధ్యలో ఉన్న యిల్లు అమ్ముకోవలసి వచ్చింది. తరువాత కొన్నాళ్ళు వేరే ప్రాంతంలో అద్దెకున్నాను. ఈ మధ్యనే నా స్నేహితుడొకడు యీ యిల్లు చవకలో వస్తుందంటే చూసి కొనుక్కొన్నాను" 
" ఒక్కసారి వాళ్ళింటికెళ్ళానండీ! ఇల్లు కట్టి పదిహేనెళ్ళయినా గట్టిగానే ఉంది" వంటింట్లోంచి వస్తూ వరాలు చెప్పింది. 
ఆమె చేతిలో జంతికల పళ్ళెం చూసి " ఎందుకమ్మా యివన్నీ?" అన్నాడాయన.
" తనేం ప్రత్యేకం చేయలేదండీ! సెలవురోజు యిలా చిరుతిళ్ళను నాకోసం చేస్తూంటుంది" అంటూ వరాలందించిన పళ్ళెం అందుకొన్నాను. సుబ్బరామయ్యగారు ఎందుకో కళ్ళు తుడుచుకొని జంతికముక్కని విరిపారు.
" అమ్మాయి యీకాలంలో తప్పబుట్టిందయ్యా" జంతికల్ని తిని పళ్ళెం వరాలి చేతికిస్తూ అన్నారాయన.
" నేనూ అదే అనుకొంటానండి" అంటున్న నా బనీన్ని ఆయన చూడకుండా పట్టుకొని లాగింది. నన్ను పరాయివాళ్ళ ముందు అతిగా మాట్లాడవద్దని చెప్పటానికి వరాలు ప్రయోగించే అస్త్రాల్లో అదొకటి . . .బనియన్ని పట్టి లాగటం.
"మీరు యీ ఊరిలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు?"అడిగాను.
"నేనిక్కడే పుట్టి పెరిగానయ్యా!" అన్నారు. 
"అదృష్టవంతులు. నేను పుట్టింది గోదావరి జిల్లా అయినా చదువు మాత్రం వివిధప్రాంతాల్లో నడిచింది. అందువల్ల ప్రస్తుతం నా స్నేహితులిప్పుడెవరెక్కడున్నారో కూడా తెలియదు. ఇదిగో! ప్రస్తుతం ఉద్యోగార్ధం యీ నగరానికి వచ్చి పడ్డాను. నేను ఆఫీసుకెడితే బాగానే కాలక్షేపమై పోతుంది. కానీ యీ పల్లెటూరి అమ్మాయికే పాపం యిబ్బందైపోతోంది"
"ఫరవాలేదులెండి. టి.వి. కొన్నారుగా! నచ్చిన తెలుగు సీరియళ్ళు చూసుకొంటూ మీ కన్నా బాగానే కాలక్షేపం చేస్తున్నా" అంటూ వరాలు మా యిద్దరికీ కాఫీకప్పులందించింది. 
సుబ్బరామయ్యగారు మౌనంగా కాఫీ త్రాగుతున్నారు. 
"బాబాయి! సరళ ఎలా ఉంది?" వరాలు అడిగింది.
"నువ్వు యింటికొచ్చినప్పుడు చూశావు కదమ్మా! అయినా అదేం చేస్తుందిలే! ఈ అసమర్ధుడైన తండ్రి కడుపున పుట్టినందుకు. . ."ఆయన గొంతు బొంగురుపోవటంతో చెప్పలేక ఆగిపోయారు.
"సరళ ఎవరండీ?" అర్ధం కాక అడిగాను. 
"నా రెండవ కూతురు బాబూ! నాకు యిద్దరు కొడుకులు, యిద్దరు కూతుళ్ళు. మగపిల్లలు బాగానే స్థిరపడ్డారు. పెద్ద అమ్మాయికి కూడా మంచివాడే దొరికాడు. ఒక ప్రభుత్వకంపెనీలో పని చేసి రిటైరయ్యాను. రెండేళ్ళక్రితమే యిల్లు అమ్మి సరళకు పెళ్ళి చేశాను. అయినా తన అత్తవారు అడిగినంతా వెంటనే యివ్వలేకపోయాను. ఋణం ఉంచుకోవటం మంచిది కాదని దాన్ని ఒకసారి అల్లుడు పంపేశాడు. నా భార్యది నా అంత గట్టి గుండె కాదు గనుక తన బాధ చూడలేక త్వరగా వెళ్ళి. . ."చెప్పలేక ఆగిపోయాడు. అతని కళ్ళు జలపాతాలయ్యాయి. 
భార్యాభర్తల సంబంధాలు కేవలం దానికోసమే అన్న భ్రమలో బ్రతికే యువతరానికేమి తెలుసు- స్త్రీపురుషుల్లో నిజమైన ప్రేమ వెల్లివిరిసేది వార్ధక్యంలోనే అని? 
"ఊరుకో బాబాయి! సరళ గురించి కదిపి అనవసరంగా బాధ పెట్టాను" వరాలు సంజాయిషీ అడిగింది.
"లేదమ్మా! మన కష్టాలు మరొకరికి చెప్పుకొంటేనే గుండె బరువు తగ్గుతుంది" అంటూ తన కధని కొనసాగించారు.
"సరె! అదెలాగూ పోయింది గనుక దాని మంగళసూత్రం అమ్మి అల్లుడు బాకీ తీర్చాను. కానీ ఆ బాకీ మీద యిన్నాళ్ళకూ ఏభైవేలు వడ్డీగా లెక్కగట్టి తీసుకురమ్మని రెండునెలల క్రితమే తిరిగి పంపించేశాడు బాబూ! ఇలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు తన ఖర్మ యింతేనంటూ అది బాధపడుతూంటే తట్టుకోలేకపోతున్నాను" 
నిజమే! ఈ వ్యాపార ప్రపంచంలో ఎవరైనా తమ అస్తిత్వం కాపాడుకొందుకే పెనుగులాడుతాడు తప్ప పరాయి వాళ్ళ బాధల గురించి ఆలోచించరు. వయసులో ఉన్న సరళ కూడా మనిషే కదా! ఆమె తన భర్తతో కాపురాన్నే తప్ప, సుబ్బరామయ్య గారి బాధల గురించి ఎందుకు ఆలోచిస్తుంది? అందులో తన అక్క, అన్నలిద్దరూ హాయిగా సంసారాలు చేసుకొంటూంటే చూస్తున్న ఆమెలో, పుల్లవిరుపు ధోరణితో తండ్రిని బాధపెట్టే క్రూరత్వం చోటు చేసుకోవటంలో ఆశ్చర్యమేం లేదు. 
"అబ్బాయిలు స్థిరపడ్డారు కదా మరి వాళ్ళేం పట్టించుకోరా?" అడిగాను.
"వాళ్ళ సంసారాలేవో వాళ్ళవి. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి నా వంక తొంగిచూసే వాళ్ళ మీద ఆధారపడటం నాకిష్టం లేదు బాబూ!" 
"సరె! రేపు బాంకునుంచి ఏభైవేలు తీసి తనకి యిస్తాను. ఎల్లుండి వచ్చి తీసుకోండి" అంటున్న నన్ను తెల్లబోయి చూసింది వరాలు.
"నేను అమ్మాయి పరిచయాన్ని ఆసరా చేసుకొని డబ్బు అడగాలని రాలేదు బాబూ! ఇదిగో! నేను ఆర్ధికంగా బాగున్న రోజుల్లో నా భార్యకు చేయించిన నగయ్యా యిది.. ఈ జీవితంలో నా భార్య గుర్తుగా మిగిలినదిదే! దీన్ని దుకాణంలో అమ్మితే తిరిగి మళ్ళీ చూడలేను. అందుకే అక్కడ అమ్మటం నాకు యిష్టం లేదు. అమ్మాయి ఆప్యాయత నాకెంతో నచ్చింది. నాకిలాంటి కూతురుంటే బాగుండేది అనిపిస్తూంటూంది. అందుకే యీ నగని మీకిచ్చి డబ్బు అడగాలని వచ్చాను" అంటూ జేబులోంచి కాసులపేరు బయటకు తీశారు. 
"ఫరవాలేదండీ! మీకు డబ్బు ఉన్నప్పుడే యివ్వండి! దానికోసం మీకు ప్రాణమైన వస్తువుని యివ్వనక్కరలేదు" అన్నాను. 
"ప్రస్తుత పరిస్థితుల్లో నేను అప్పు తీర్చగలనో, లేనో! మీకు ఋణపడటం నాకిష్టం లేదు. నాకు ప్రాణమైన యీ నగ అమ్మాయి మెళ్ళో కనిపిస్తూ ఉంటే నాకు అదో సంతృప్తి. అంతేకాదు. దీన్ని ఎక్కడో షాపులో అమ్మినట్లు రసీదు పుట్టించాను. మీరెప్పుడూ మీకు కాసులపేరు అమ్మినట్లు బయటకు రానీయవద్దు" 
"రసీదు ఎందుకు బాబాయి?" వరాలు అడిగింది. 
" మావాళ్ళ సంగతి నీకు తెలీదమ్మా! ఎప్పుడైనా ఆ నగ మీ దగ్గర ఉందని తెలిస్తే గొడవలు రావచ్చు. అందుకే యిక్కడికి దూరంగా ఏదో దుకాణంలో అమ్మినట్లు రసీదు పుట్టించాను" 
ఆయన తర్కం సబబుగానే ఉంది. తరువాత చాలాసేపు కూర్చుని ఆ నగ మాకిచ్చేసి వెళ్ళిపోయారు.
"డబ్బులివ్వకుండానే నగ వదిలేసి వెళ్ళిపోయారు" అన్నాను.
"ఈ కూతురు మీద ఆయనకున్న నమ్మకం" అంటున్న వరాల్ని అదోలా చూశాను.
"ఏంటలా చూస్తారు?" 
"మరేం లేదు. ఈ ఆలోచనలో నీకేమన్నా భాగం ఉందాని?" 
"ఎంత మాటన్నారండీ! ఇప్పుడే వెళ్ళి ఆయనకి నగ యిచ్చి వచ్చేస్తా!" అని ఉక్రోషంగా కాసులపేరు తీసుకొని సుబ్బరామయ్యగారి యింటికి బయల్దేరబోయింది.
"ఏదో సరదాకి అన్నాను. ఆగు" అని వరాల్ని బలవంతంగా పట్టుకొని ఆపాను.
"లేకపోతే? ఉదయాన్నే యోగాకి వచ్చినప్పుడు 'అబ్బాయిని ఒకసారి కలవాలమ్మా' అన్నారు. ఎందుకంటే చెప్పలేదు. సరె! ఈరోజు ఆయన యింట్లోనే ఉంటారని చెప్పాను. వచ్చారు. వీధి చివర దుకాణానికి అందరిలా బైకు మీద గాక పెట్రోలు ఆదా అవుతుందని పదినిమిషాలు నడిచి వెళ్ళే మీరు, ఆయనకి ఏభైవేలు ఉదారంగా యిస్తాననగానే ఆశ్చర్యపోయాను. ఆ తరువాత కదా ఆయన యీ నగని బయటకి తీసింది. సాయం చేస్తానని ముందు మీరే అని నేరం నాపై వేస్తారేం? నేను ముందే చెప్పాను 'మిమ్మల్నిది కావాలని ఏదీ తీసుకోను, మీరేది ప్రేమగా యిస్తే దానితోనే సంతృప్తి పడతానని" 
"భార్యతో ఆ మాత్రం చమత్కారాలాడకూడదా ?" అడిగాను.
"అది చమత్కారమా? సర్లెండి. నాకు మీ తత్వం అసలు బోధపడటం లేదు"
"ఏమైంది?"
"చిల్లరఖర్చులకు కూడా ఎంతో ఆలోచించే మీరు ఉన్నపాటున ఆయనకి డబ్బు ఎలా సాయంచేస్తానన్నారు?"
"చిన్నప్పటినుంచి ఆర్ధిక సమస్యలతో సతమతమైన కుటుంబం మాది. ఈరోజు దర్జాగా బ్రతికే స్థాయిలో ఉన్నాను. రేపెలాగ ఉంటుందో చెప్పలేము. అందుకే ఖర్చు విషయంలో ఆచితూచి అడుగువేయటం అలవాటైంది. దాన్ని పిసినారితనమని ఎవరనుకొన్నా నాకు అనవసరం. ఇక్కడ నేను చేసే సాయం వల్ల ఒక అమ్మాయి కాపురం నిలబడి, ఒక తండ్రికి మనశ్శాంతి లభిస్తుంది గనుక సాయం చేయాలనిపించింది. కానీ సుబ్బరామయ్యగారు మహామేధావి. ఊరికే ఎవరి సాయం పొందరు. అలాగని భార్య ప్రేమగుర్తుగా మిగిలిన నగని అమ్ముకున్నా, అది కళ్ళముందు కనిపిస్తూండాలని ఆయన కోరిక. దానికి అనుకూలమైన వ్యక్తివి, ఆయనలాంటి మనస్తత్వం కలదానివి నువ్వు కనిపించావు. రేపు దుకాణంలో యీ నగని లెక్క కట్టించు. ఏభైవేల కన్న తక్కువ ఉందనుకో! ఆయనకి సాయం చేశామనుకొందాం. ఎక్కువ ఉందనుకో! కూతురు కాపురానికి వెళ్ళిపోయాక ఆయన ఒంటరిగానే ఉంటారు గనుక ఏదో రూపంలో ఆయనకి ఆర్ధికసాయం చేద్దాం. ఆయన ఋణం మనం మాత్రం ఎందుకు ఉంచుకోవాలి? ఏమంటావ్?" అడుగుతున్న నన్ను వరాలు చుట్టుకుపోయింది. 
@ @ @ 
కూతుర్ని కాపురానికి పంపించిన సుబ్బరామయ్యగారి ఆనందాన్ని వర్ణించలేము. ఇంట్లో ఆయన ఒక్కడే ఉంటారు గనుక అప్పుడప్పుడు వరాలితో గాని, ఒంటరిగా కాని ఆయనింటికి వెళ్ళి వస్తున్నాను. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఆయన మా యింటికి వచ్చినప్పుడు మాత్రమే వరాలు మెళ్ళో కాసులపేరుని ధరించి, ఆయనకు మానసికానందాన్ని కలిగిస్తోంది. ఒకసారి ఆయనే అడిగారు "అమ్మాయి ఉదయం యోగాకొచ్చినప్పుడు నగ వేసుకోవటం లేదని". ఉదయం పూట నిర్మానుష్యవేళలో ఎవరైనా నగ కోసం దాడి చేయవచ్చన్న అనుమానంతో వేసుకోవటం లేదని వరాలు సర్ది చెప్పింది. సాధ్యమైనంతవరకూ ఆ నగ విషయం చుట్టుపక్కల తెలియకూడదనే అలా చేస్తోంది. 
ఆరునెలల తరువాత ఆఫీసులో ఉన్న నాకు వరాలు ఫోను చేసింది. బాత్రూంలో కాలు జారి పడిన సుబ్బరామయ్యగారికి తలకు దెబ్బ తగిలిందని. వెంటనే ఆఫీసుకి సెలవు పారేసి యింటికెళ్ళాను. తలకు దెబ్బ తగిలిన ఆయన్ని దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్చి ఆయన సంతానానికి ఫోనుల ద్వారా తెలియపరచాం. తలలో నరాలు చిట్లి రక్తస్రావం కావటం వల్ల ఆయన క్రమేపీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యింట్లో అనుభవించిన సమస్యల వల్ల ఆయన శరీరంలో ఎన్నో రోగాలు చోటుచేసుకొన్నాయి. సాధ్యమైనంతవరకూ ప్రయత్నించిన వైద్యులు లాభం లేదని చెప్పటంతో యింటికి తీసుకొచ్చాం. వాళ్ళ వీలుని బట్టి పిల్లలు మెల్లిమెల్లిగా యిళ్ళకు చేరుకొన్నారు. సమయానికి సాయం చేసినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళు, ఆసుపత్రి బిల్లు ఎవరు కట్టారన్నది అనవసరమనుకొన్నారు. 
వైద్యులు చెప్పిన రెండురోజులకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఒకటి, రెండుసార్లు మేము ఆయన్ని చూడ్డానికి వెళ్ళాం.
ఆ రాత్రి వరాలు డాబా ఎక్కి షెడ్డులోనుంచి కనిపిస్తున్న వెలుతురుని చూస్తూ కూర్చుంది. ఆమెకు ఆ ఉదయం నుంచి మనసులో ఏదో అలజడిగా ఉందని చెప్పటంతో ఆఫీసు మానుకున్నాను. మనం ఆత్మీయంగా తలచిన వ్యక్తికి ఆపద సంభవించబోతున్నప్పుడు, మన మనసులో ఆందోళన కలుగుతుందన్నది సత్యం. దాన్నే సిక్త్ సెన్స్ అంటారంతా! దానికి రక్తసంబంధంతో పని లేదు. ప్రాణమిత్రులకు ఆపద కలగబోతున్నప్పుడు కూడా మనలో కలవరం కలగటం సహజం. ఆరోజంతా ఆ వ్యక్తే ఎక్కువగా గుర్తు వస్తుంటాడు. 
అర్ధరాత్రి వరకూ వరాలు అలా డాబా మీదే కూర్చుని చూస్తోంది. నిర్మానుష్యమైన రాత్రిలో పార్కులోని చెట్ల ఆకుల సవ్వడితో బాటు షెడ్డులోంచి సుబ్బరామయ్యగారి పిల్లల మాటలు వినిపిస్తున్నాయి.
నేను డాబా మీదకెళ్ళి వరాల్ని క్రిందికి రమ్మన్నాను. కానీ తనే నన్ను రమ్మన్నట్లు సైగ చేస్తే దగ్గరకెళ్ళాను. ఆమె నన్ను కూర్చోపెట్టి నా ఒళ్ళో తలపెట్టి ఏడ్చేసింది.
"వరాలూ! ఏమిటిది? చావుపుట్టుకలు సహజం. ఈ విషయం తెలిసి ఉండి మనం యింతలా అల్లాడిపోవటం మంచిది కాదు. బస్సులో కొంతదూరం కలిసి ప్రయాణిస్తాం. ప్రక్కన కూర్చున్న వాళ్ళతో ఆత్మీయంగా ఎన్నో కబుర్లు చెప్పుకొంటాం. మన స్టేజి రాగానే దిగిపోతాం. అలాగని బస్సులో ఉన్నవాళ్ళు దిగిపోయిన మన గురించి బెంగపెట్టుకొంటారా? జీవితం అంతే! మనం బ్రతికున్నంత వరకూ సుబ్బరామయ్యగారి పరిచయాన్ని ఒక మధురస్మృతిగా మన మనసులో భద్రం చేసుకోవాలే తప్ప యిలా విచలితులం కాగూడదు" అంటూండగా, ఆయన యింటినుంచి ఒక్కసారిగా జనాలు గొల్లుమన్న శబ్దం వినిపించింది. ఇక్కడ వరాలి సంగతి చెప్పనవసరం లేదు. అప్పుడే వెళ్ళి ఆయన్ని చూసి వద్దామంది. 
"మనం బంధువులం కాము. ఇప్పుడు మనం వెడితే ఆయన చావు కోసం మనం ఎదురుచూసినట్లు వాళ్ళు అపార్ధం చేసుకోవచ్చు.మనకు ఆయన బాగా చనువైనట్లు కూడా వారికి తెలియకూడదు. అందుకే రేపు ఉదయాన్నే నలుగురితో పాటు వెళ్ళి వాళ్ళను పరామర్శించి వద్దాం. పద" అని బలవంతంగా ఆమెను కిందకు తీసుకొచ్చాను. నాతో నిత్యం చతురులాడే వరాలు రాత్రంతా నిద్రపోక సుబ్బరామయ్యగారిచ్చిన నగనే చూస్తూ కన్నీళ్ళు పెట్టుకొంది. 
మరునాడు ఉదయాన్నే మేమిద్దరం ఆ వీధిలో నలుగురితో పాటు పరామర్శ చేశాం. ఆయన రెండవ కూతురు సరళని పట్టుకోవటం చూసేవాళ్ళకు చాలా కష్టమైపోయింది. తండ్రి శవం మీద పడి శోష వచ్చేలా ఏడ్చిన ఆమెను దూరంగా తీసుకెళ్ళి, నీళ్ళు తాగించి సేదతీర్చేసరికి జనాలకు తలప్రాణం తోకకొచ్చింది. నేను శ్మశానికి వెళ్ళి ఒక పెద్దమనిషిగా నాకు చేతనైన సాయం చేశాను. ఆచారం ప్రకారం అన్ని రోజులు తంతులు ముగించాక యింట్లో వస్తువుల పంపకాలు జరుపుకొంటున్నారు. వారి పంపకాల మధ్యలో పెద్దమనుషులుగా పిలిచిన యిద్దరిలో నేనూ ఉన్నాను. 
ఇంట్లోని సామనంతా ఒకచోట చేర్చారు. దగ్గర్లో ఉన్న దుకాణం నుంచి ఒక త్రాసు తెచ్చి, యింట్లో ఉన్న గిన్నెలన్నీ యిద్దరు కొడుకులకు రెండు సమాన భాగాలుగా తూచి విడిగా పెట్టారు. ఆ తూకం తూచే పెద్దమనిషి సుబ్బరామయ్యగారి చేత నీళ్ళు తాగించిన రెండవ అల్లుడే! తూకంలో కొంచెం అటూ యిటూ చేసే గిన్నెలని పక్కన పడేసి తూచిన రెండవ అల్లుడు యీనాంగా తీసుకొన్నాడు. పెద్ద అల్లుడు చెక్కకు బిగించిన స్క్రూలా చూస్తుంటే పెద్ద కూతురు గొణుక్కొంటూ కూర్చుంది. ఆ భాగాలకు రెండు నంబర్లిచ్చి ఒక పిల్లవాడి చేత లాటరీ తీయించి, దానిప్రకారం ఆయా నంబర్లోని గిన్నెలకుప్పని కొడుకులు తీసుకున్నారు . తరువాత మెల్లిగా మిక్సీ, గాసుపొయ్యి, ఫ్రిజ్ లాంటి వస్తువులని యిద్దరుకొడుకులూ ఎవరికి కావలసినవి వాళ్ళు ఎంచుకొని, వాటికి రేటుకట్టారు. ఆమొత్తాన్ని నాలుగు భాగాలు చేసి, ఆ వస్తువు తీసుకొనే వ్యక్తి మిగిలిన ముగ్గురికి(యిక్కడ మాత్రం ఆడపిల్లలను కూడా కలిపారు) వారి వాటా రేటు చెల్లించాలి. కొడుకులు తీసుకోని వస్తువుని మాత్రం ఆడపిల్లకి ఉత్తినే యిచ్చేయవచ్చు. తరువాత యింట్లో బీరువాలు, ఫర్నిచర్ వాటాలు. మగపిల్లలైతే రేటు కట్టాలి. ఆడపిల్లకు ఊరికినే యిచ్చేయవచ్చు. చలాకీగా ఉన్న రెండవ అల్లుడు తనకన్న ఎక్కువ లాగేస్తూంటే, అసలేమీ పట్టించుకోని తన భర్త తరఫున పెద్దకూతురే రంగంలోకి దిగేసింది. దానివల్ల కాసేపు అరుపులు, కేకలు, ఏడుపులు, రెండవ అల్లుడి వీరంగాలు, సుబ్బరామయ్యగారి కొడుకులు అతన్ని బ్రతిమాలటాలు, మధ్యవర్తులుగా ఉన్న మేము మధ్యలో కలగజేసుకొని వారిని విడదీయటం. . . ఆ ప్రాంతమంతా ఒక రచ్చబండలా తయారైంది.ఇంతలో పెద్దకూతురు యిల్లంతా వెతికి ఒక బాంబు పేల్చింది.
"కాసులపేరు కనపడట్లేదు"
"ఎక్కడికి పోతుందే? బీరువాల్లో సరిగా చూశావా?" పెద్దకొడుకు అడిగాడు. ఏమైందో తెలిసిన రెండవకూతురు సరళ కిమ్మనక కూర్చుంది. 
"చూశానన్నయ్యా! ఎర్రపెట్టెలో యీ కాగితం దొరికింది" అని వాడికిచ్చింది.
"ముసిలాడు సర్వనాశనం చేశాడు. సంపాదించినదంతా తగలేయటమే గాక బంగారునగని ఏభైవేలకు అమ్మేశాడా? ఇంట్లో ఎక్కడైనా ఆ మొత్తం పెట్టాడా?" 
"నాన్న సంగతి నీకు తెలియదురా అన్నయ్యా? మొదటినుంచి దానధర్మాలకు తగలేయటం ఆయనకి అలవాటేగా?" సరళ మాటలకు విస్తుపోయాను. తనని కాపురానికి పంపటానికి ఆ డబ్బు తన భర్తకి యిచ్చాడన్న విషయం బయటపడకూడదని తండ్రిమీద ఎంత పెద్ద నింద వేసింది? ఈ అమ్మాయేనా తండ్రి శవం మీద పడి శోష వచ్చేలా ఏడ్చినది? అభిమానాలు కూడా తనకి లాభం చేకూర్చే కొలమానంగా మార్చేస్తూ సంఘం ఎలా మారిపోతోంది! 
మా యింటికి వచ్చిన మొదటిరోజు వరాలి ఆప్యాయతకు ్సుబ్బరామయ్యగారు కళ్ళు ఎందుకు తుడుచుకున్నాడో నాకు అర్ధమైంది. కూతురి కాపురం దెబ్బ తింటోందని తల్లడిల్లే తండ్రిని యిలా పుల్లవిరుపు మాటలతో సరళ ఎంత హింస పెట్టిందో అప్పుడే అర్ధమైంది. కనపడకుండా పోయిన ఆ ఏభైవేల మొత్తం గురించి పిల్లలంతా సుబ్బరామయ్యగారిని పావుగంటసేపు తిట్టిపోశారు. 
"పోనీలే అన్నయ్యా! పోయిన సొమ్ము మనం నాన్నని తిట్టినంతమాత్రాన తిరిగొస్తుందా? దేనికి తగలెట్టాడో? ఆయన సొమ్ము ఆయనే తగలేసుకొన్నాడు. అప్పుడే తెలుసుంటే నలుగురం కలిసి నిలదీసేవాళ్ళం. ఇప్పుడు బీపీలు పెంచుకొని ఏం చేయగలం? వదిలేయండి" పేరుకు తగ్గట్లు ఎంతో జాణతనంగా తన భర్త ధనకాంక్షని కప్పిపుచ్చుతూ. వాతావరణాన్ని తేలికపరుస్తూ చెప్పింది సరళ. ఎవరెవరికి ఏ వస్తువులొచ్చాయో, మధ్యవర్తులుగా వెళ్ళిన నేను, ఆ కాలనీలో మరోమనిషి నాలుగు జాబితాలను తయారుచేశాక వాటిపై కొడుకులు, అల్లుళ్ళు సంతకాలు పెట్టి, మా చేత సాక్షి సంతకాలు పెట్టించారు. 
"ఇంటిసంగతి ఏం చేద్దాం బావగారూ?" రెండవ అల్లుడు అడిగాడు. 
"మాకెవరికీ యీ యింటిమీద ఆశలేదు. ఎక్కడివాళ్ళు అక్కడే సెటిలైపోయాం. దీనిపై నయాపైస పెట్టుబడి పెట్టేది లేదు. మీకెవరో కంట్రాక్టర్ తెలుసన్నారుగా! ఈ యిల్లు పడకొట్టి అంతస్తుల భవంతి(ఎపార్ట్ మెంట్స్) కట్టుకోమనండీ! మన నలుగురికీ నాలుగు వాటాలిస్తే చాలు. మా ముగ్గురికన్నా మీరే దగ్గరలో ఉంటారు గనుక అన్నీ దగ్గరుండి చేయించండి. కట్టడం పూర్తయ్యాక వచ్చి గృహప్రవేశం చేసుకొంటాం. ఆపై ఏం చేయాలన్నది తరువాత ఆలోచిద్దాం" రెండవకొడుకు చెప్పాడు. అలా సుబ్బరామయ్యగారి మరణం రెండవ అల్లుడికి లాభసాటివ్యాపారంగా మారిపోయింది.
వాటాలపంపకం, రాతకోతలు అయిపోయాక యింటికి వచ్చేశాను. అక్కడ జరిగిందంతా వరాలికి చెప్పాను
"కనిపించే ఆస్తులన్నీ పంచుకొన్నారు గానీ కనిపించని ఆయన సుగుణాల్ని వదిలేశారండీ?"
వరాలి మాటలకు నవ్వు వచ్చింది.
" ఆయన సుగుణాల్ని యీ జవరాలికి కాసులపేరుతో పాటు ఎప్పుడో అమ్మేశారు" అన్నాను.
" ఎవరి పిల్లలైనా అంతేనా?" అడిగింది.
" అది మన తలవ్రాతను బట్టి ఉంటుంది. ఏం? మనకి పిల్లలొద్దంటావా ఏమిటి? భార్యాభర్తల అనురాగానికి కొలమానాలు సంతానం. మారుతున్న సమాజంలో పిల్లల అభిమానాలు కూడా మారిపోతున్నాయి. అలాగని పిల్లలే వద్దనుకొంటే ఎలా? ' ఆస్తినిడిన తండ్రి యస్తిక కాశిలో, పేదతండ్రిదైన పెద్దచెరువె , యిచ్చినంత ఫలమె యిలలోన దక్కేది, సోద్దెమిదియె గనర! సోమనాధ" అని వెనకటికి ఓ కవి చెప్పాడు. జీవితమంతా ఆర్ధికసమస్యలతో సతమతమైన సుబ్బరామయ్యగారు చిన్నప్పుడు పిల్లల ఆశలపై నీరు చల్లి ఉండవచ్చు. అది వారి మనసులలో నాటుకుపోయి ఉండవచ్చు. ఇది వ్యాపారప్రపంచం తల్లీ! కన్నబిడ్డలైనా ప్రతీది తూకం తూచి మనకు విలువ కడతారు. ఇంతకూ మనకు పిల్లలొద్దంటావా?" చిలిపిగా అడిగాను.
వరాలు సిగ్గుపడుతూ " పొండి" అంటూ ప్రక్కగదిలోకి తప్పుకొంది.
" రండి అనకుండా పొండి అంటోందేంటి?" అనుకొంటూ టి.వి.పెట్టాను. 
" ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అంటున్న ఘంటసాల గానం, హార్మోనియం వాయిస్తూ రేలంగి అడుక్కోవటం చూడగానే బుర్రలో లైట్ వెలిగింది. వెంటనే టి.వి. కట్టేసి వరాలున్న గదిలోకి దూరాను.
& & &

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top