మా బాపట్ల కధలు – 18
అప్పడాల అనసూయమ్మ
భావరాజు పద్మిని

రాత్రి తొమ్మిదవ్వొచ్చింది. మడత మంచం మీద పడుకుని, తన ఇంటి డాబా మీద చల్లగాలికి ఊగుతున్న కొబ్బరిచెట్లను చూడసాగారు అనసూయమ్మ గారు. పాడ్యమి చంద్రుడు కొబ్బరాకుల మాటున దోబూచులాడుతున్నాడు. చుట్టూ ఉన్న నక్షత్రాలు, ఆ వెన్నెల అమృత కిరణాల్లో తడిసి, పరవశించి, మరింతగా మెరుస్తున్నయా అనిపిస్తోంది.  డాబాపైకి ఎగబ్రాకి విరబూసిన మల్లె తీగ, ఆకాశంలో నక్షత్రాలకు దీటుగా భూమిపై వెలసిన మల్లెల తారల్లా శోభిస్తూ, పరిమళాలను వెదజల్లుతోంది.  కదిలే మబ్బుల్ని చూస్తూ నెమ్మదిగా మగత నిద్రలోకి జారుకోసాగారు ఆవిడ.
“అనసూయమ్మ గారు ! అమ్మా అనసూయమ్మ గారు !” గేటు వద్దనుంచి పిలుపు వినవచ్చింది.
“ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు?” అని ఆశ్చర్యపోతూ లేచి, డాబా పైన గేటు వైపు వెళ్లి, “ఎవరదీ?” అంటూ అడిగింది ఆవిడ, పోల్చుకోడానికి ప్రయత్నిస్తూ.
“నేనమ్మా! విష్ణుభొట్ల శ్రీనివాస మూర్తిని. ఇంత రాత్రివేళ వచ్చినందుకు మన్నించాలి. అవసరమైన పనుండి వచ్చానమ్మా. మాట్లాడాలి.” అన్నారు గేటు వద్ద నిల్చున్న పెద్దాయన. ఆయన కూడా మరో యువకుడు ఉన్నాడు.
నెమ్మదిగా మెట్లు దిగి, గేటు తాళం తీసి, వాళ్ళను లోపలకు రమ్మని కూర్చోబెట్టింది ఆవిడ. కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి, “ఆ, చెప్పండి, ఏవిటీ సంగతి?” అని అడిగింది.
“అమ్మా, ఎల్లుండి అమ్మాయి పెళ్లి. తెల్లారితే ఇంటి నిండా చుట్టాలు వచ్చి కూర్చుంటారు. అసలే పెళ్ళిళ్ళ సీజన్. మీకు తెలుసుగా, మన బాపట్లలో పెళ్ళిళ్ళ వంటలు చేసే బ్రాహ్మలు ఇద్దరు ముగ్గురు తప్ప లేరు. మేము మాట్లాడుకున్న వంటావిడ విజయలక్ష్మి గారు ఒళ్ళు బాగాలేదని, ఈపూరుపాలెంలో ఉండే తన దూరపు చుట్టం శ్యామలమ్మను పిలిపిస్తానని నమ్మకంగా చెప్పారు. పొద్దుటనుంచీ ఆవిడకి ఫోన్ చేస్తే పలకలేదని, సాయంత్రం ఆవిడకోసం మనిషిని పంపాను. వాళ్ళ పాపకు బాగోక ఆసుపత్రిలో చేర్చారట, అందుకే రావడం కుదరదని, ఇదిగో, ఇప్పుడే తిరిగి వచ్చిన ఈ కుర్రాడు చెప్పాడు.
ఎటూ కాని పరిస్థితి అయిపోయిందమ్మా. నాకు కాళ్ళూ, చేతులు ఆడడం లేదు. వేరే కులాల వంటవాళ్ళను పెడితే, అసలే ఆచారం ఎక్కువైన మగ పెళ్లి వాళ్ళు అలిగి వెళ్ళిపోతారు. పిల్ల పెళ్లి ఆగిపోతుంది. మీరు పెళ్లి వంటలు మానేసారని, వయసు మీదపడి, ఎక్కువ పని చెయ్యలేకపోతున్నారని నాకూ తెలుసు. కాని, ఈ సమయంలో మీరు తప్ప ఇంక ఎవ్వరూ ఈ గండం నుంచి మమ్మల్ని గట్టెక్కించలేరమ్మా. కూరలు తరిగి సాయం చేసేందుకు ఎలాగో ఇద్దరు కుర్రాళ్ళని పట్టుకున్నాను. కాని, సుమారు ఐదొందల మందికి పైగా పెళ్లి వంట మీరే చెయ్యాలమ్మా. మీరు డబ్బు మనిషి కాదని నాకు తెలుసు. కాని, మీరు కోరినంత తీసుకోండి, ఎలాగో నిలబడి సాయం చెయ్యండి. దయచేసి కాదనకండి,” బ్రతిమాలారు ఆయన.
“అర్జంటుగా పంపాల్సిన అప్పడాలు, వడియాలు ఆర్డర్ ఉందే,” అంటూ కాసేపు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయారు ఆవిడ. ఆ తర్వాత, ”సరేనండి, అప్పడాల పని మా వాళ్ళకు అప్పజెబుతాను. మీ అమ్మాయి మా అమ్మాయే అనుకుంటాను. ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికి, నాకు శ్రమైనా వస్తాను. “ అంటూ లోపలకు వెళ్లి, పెన్ను, కాగితం తెచ్చుకుని, మూడు రోజులకు ఏమేమి వండాలో వాళ్ళను అడిగి తెలుసుకుని, కావలసిన సరుకులన్నీ ఒక లిస్టు రాసిచ్చింది ఆవిడ. వంటకు తగిన ఏర్పాట్లు చెయ్యమని సూచించింది.
“మీ పెద్దమనసుకు కృతజ్ఞతలమ్మా ,” అంటూ దణ్ణం పెట్టి, వెళ్ళిపోయారు మూర్తి గారు.
మర్నాడు ఉదయమే రైలుపేట రామకృష్ణాపురంలో ఉన్న పెళ్ళివాళ్ళ ఇంటికి వెళ్ళారు అనసూయమ్మ గారు. వెళ్ళగానే బావి దగ్గర కాళ్ళు కడుక్కుని, మడి చీర దండెం మీద తడిపి ఆరేసుకుని, సరుకులన్నీ పరిశీలించి వచ్చేందుకు వసారాలోకి వెళ్ళారు. అనసూయమ్మ గారిని తమ స్వంత మనిషిలా ఆదరించి, ఆవిడ చెప్పినట్లు నడుచుకోవాలని, మూర్తి గారు ముందుగానే తనవారందరికీ చెప్పి ఉంచారు. మూర్తిగారి పెరట్లో వంటకు పెద్ద గ్యాస్ స్టవ్, సిలిండర్లు, అన్నీ సిద్ధంగా ఉంచారు. కాస్త బియ్యప్పిండి అడిగి, ముగ్గేసి, పసుపూ కుంకుమ బొట్లు స్టవ్ కి పెట్టి, మడి చీర మార్చుకుని, నుదుట విభూది రేఖలు దిద్దుకుని, వచ్చారు ఆవిడ.
“నావంట అందరికీ హితాన్ని, తృప్తిని కలిగించాలి స్వామీ !” అని వినాయకుడికీ, సూర్యనారాయణ మూర్తికి, అగ్ని దేవుడికి దణ్ణం పెట్టుకుని, పొయ్యి వెలిగించారు. ఉన్న మూడు పొయ్యిల్లో ఒక పొయ్యి మీద పాలు, ఒకదాని మీద డికాషన్ కు నీళ్ళు, మరోదాని మీద జీడిపప్పు ఉప్మా కోసం పెద్ద పాత్రను ఉంచారు. కొబ్బరి పచ్చడి, అల్లప్పచ్చడి  చేసేందుకు సమాయత్తమయ్యారు. వండేటప్పుడు వీలైనంత తక్కువ మాట్లాడుతూ, మౌనంగా నారాయణ నామ జపం చేసుకునే అలవాటు ఆవిడకి. మరో అరగంటలో అందరికీ కాఫీలు, అరిటాకుల్లో వేడి వేడి ఉప్మా, కొబ్బరి, అల్లప్పచ్చడితో వడ్డించారు. ఆ ఉప్మా, పచ్చళ్ళ రుచి అద్భుతంగా ఉండడంతో మళ్ళీ, మళ్ళీ అడిగి చుట్టాలంతా వేయించుకుని తిన్నారు. 11 గంటలకల్లా మధ్యాహ్నం భోజనాలకు బాపట్ల వంకాయ కూర, దోసకాయ పప్పు, మెంతి బద్దలు, దప్పళం సిద్ధం చేసేసారు ఆవిడ. పట్నాల నుంచి వచ్చిన చుట్టాలంతా ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప రుచి ఎరగమంటూ వెర్రెత్తిపోయారు. సాయంకాలం కాఫీలకు కాస్త సమయం ఉండడంతో లోపలి గదిలో కాసేపు నడుం వాల్చారు అనసూయమ్మ గారు. ఆసరికే మగపెళ్లి వారు విడిదింట్లో దిగబోతున్నారని ఫోన్ రావడంతో, ఆడపెళ్ళివారంతా ఎదుర్కోలు సన్నాహాలకు వెళ్తూ, పెళ్ళికూతురు చంద్రకళను అనసూయమ్మ గారికి అప్పగించి వెళ్ళారు.
అనసూయమ్మ గారు ఉదయం నుంచి గమనిస్తున్నారు. చంద్రకళలో పెళ్ళికూతురిలో ఉండాల్సిన ఉత్సాహం లేదు. ఏదో దీర్ఘాలోచనలో ఉంది. చనువు లేకుండా ఎక్కువ చొరవ తీసుకునే రకం కాదావిడ.
“అత్తయ్య, మిమ్మల్ని అప్పడాల అనసూయమ్మ అని ఎందుకు అంటారు?” అడిగింది చంద్రకళ.
“ఈ పిలుపు బాగుంది కళా! ఏముందమ్మా, నేను అప్పడాలు అమ్ముతానని, అదే నా ఇంటిపేరు చేసేసారు. సరే గాని, ఎలాగూ వరస కలిపావు కనుక, చిన్న మాట అడగనా? నువ్వేదో విషయం గురించి బెంగ పడుతున్నట్టు కనిపిస్తోంది? ఎందుకని?” కళనే సూటిగా చూస్తూ అడిగారు ఆవిడ.
“మరేం లేదత్తా, మా అత్తగారు ఆడబడుచులు కాస్త గట్టి వాళ్ళని విన్నాను. నా కాబోయే భర్త శ్రీహరికి నోట్లో నాలుక లేదని, తల్లి ఎలా చెబితే అలా తలాడిస్తాడని అంతా అంటున్నారు. ఇన్నాళ్ళు చదువు, ఉద్యోగం పేరుతో ఊరికి దూరంగా ఉండడంతో నాకూ పెద్దగా పద్ధతులు, బాధ్యతలు తెలీవు. అందుకే కొన్నేళ్లుగా పెళ్లి వాయిదా వేస్తున్నాను. కాని ఇప్పుడు తప్పలేదు. వీటన్నింటితో ఎలా నెగ్గుకోస్తానా అని బెంగగా ఉంది.” మనసులో ఉన్నమాట చెప్పేసింది కళ.
“పిచ్చి తల్లీ! ఈ మాత్రానికే బెంగ పడ్డవా? ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు. జీవితం ఏ రోజుకు ఆరోజు జీవిత చరిత్రల పుస్తకాల్లో రాసినట్టు, మనం ఊహించినట్టు జరగదు. ఈ అప్పడాల అత్తయ్యనే చూడు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, జమీందారీ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి, చివరికి అప్పడాలు అమ్ముకుని బ్రతికే దశకు చేరుకున్నా. తెలుసా?” తల కింద చెయ్యి పెట్టుకు పడుకుని, కళ వంక నవ్వుతూ చూస్తూ అంది ఆవిడ.
“ఏమిటీ? మీరు జమీందారీ కోడలా? అయితే అప్పడాలు చేసి అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మీ కధ చెబుతారా అత్తా?” ఆవిడకు దగ్గరగా జరిగి అడిగింది కళ.
“అలాగేనమ్మా, నా కధ నీలో ధైర్యాన్ని నింపుతుందనే ఆశతో చెబుతాను. మాది కలిగిన కుటుంబమే. నర్సాపురం రేవు అవతల సఖినేటిపల్లి మా ఊరు. చిన్న వయసులోనే ఓ సంబంధం చూసి, పెళ్లి చేసారు. తీరా పెళ్లయ్యాకా తెలిసింది ఏమిటంటే ఆయనకు మూర్చ రోగం ఉంది. దీనికి తోడూ జూదం, తాగుడు లాంటి వ్యసనాలు కూడా ఉన్నాయి. తల్లి పురుట్లోనే పోవడంతో మావగారి గారాబంతో ఆయన అలా తయారయ్యారు. పుట్టింట్లో చెప్పినా నా గోడు ఎవరూ పట్టించుకోలేదు, ఒకటిరెండు సార్లు అవమానించారు కూడా. పెద్ద కుటుంబాలు, ఎవరి బాధ వారిది.  ఏది ఏమైనా, ఆ ఇంట్లో ఇల్లాలిగా అడుగు పెట్టాను కనుక, ఇక మారు మాట్లాడకుండా సర్దుకున్నాను. పెళ్ళైన ఏడాదికే మావగారు పోయారు. అడ్డు చెప్పేతండ్రి కూడా లేకపోవడంతో మా ఆయన ఆగడాలు మితిమీరాయి. కొన్నాళ్ళకి ఓ కొడుకు పుట్టాడు. జూదంలో ఉన్న కాసిన్ని ఆస్తులు, డబ్బు కరిగిపోయాయి. ఊరంతా అప్పులు చెయ్యడంతో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఓ రాత్రి పంటి మీద రేవు దాటుతున్న మావారు మూర్చ వచ్చి, గోదాట్లో పడిపోయారు. గోదావరి మంచి పోటు మీద ఉండడంతో కొందరు రక్షించే ప్రయత్నం చేసినా, ఫలించలేదు. రెండు రోజులకు ఆయన శవం అంతర్వేది అన్నా చెల్లెళ్ళ గట్టు వద్ద తేలింది. పుట్టింటి వాళ్లకు కబురు పెట్టాలనిపించలేదు. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే, ఇల్లు అమ్మేసి, వాళ్ళ అప్పులు తీర్చాను. చేతిలో నెలల పసి కందుతో బాపట్లలో ఉన్న మా దూరపుబంధువు  ఇంటికి చేరాను. నా బిడ్డను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలన్నది ఒక్కటే నా ఆశయం.
మేము ఉండడానికి వారు పెరట్లో ఉన్న చిన్న గదిని ఇచ్చారు. నాకు తెలిసిన విద్య వంట ఒక్కటే. అక్కడా ఇక్కడా వంటలు చేస్తూ, కాలం గడపసాగాను. కాని, ఎవరైనా పిల్చినప్పుడే వంటకు వెళ్ళాలి, మిగతా సమయం అంతా ఖాళీనే. నికరమైన ఆదాయం కాదు, ఖర్చులకు సరిపోయేది కాదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఒకావిడ తక్కువ ఖర్చులో చెయ్యగల అప్పడాల వ్యాపారం గురించి చెప్పారు. మినప, పెసర, కారం అప్పడాలు, పిల్లల కోసం కారం లేని అప్పడాలు చేసి, మొదట్లో ఇంటింటికీ తిరిగి అమ్మేదాన్ని. మొదట్లో ఎక్కువమంది వద్దన్నా, చవగ్గా దొరకడం, రుచిగా ఉండడంతో నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంది. ఇటువైపు వేడన్నంలో నెయ్యి, అప్పడాల పిండి వేసుకుని తినే అలవాటు ఉండడంతో కలిపిన అప్పడాల పిండికి కూడా మంచి గిరాకీ ఉండేది.  కలిపినా పిండి ఉండలు కొనుక్కు వెళ్ళేవారు. కొన్నాళ్ళకు పెళ్లిళ్లకు, వేడుకలకు పెద్ద ఆర్డర్లు రాసాగాయి. అప్పడాల తయారీ మెషీన్ కొన్నాను. నాలాగే నిరాశ్రయులైన కొందరిని చేరదీసి, వారి సాయంతో అప్పడాలు తయారుచేసి, అన్న సమయానికి అందించే దాన్ని. ఓ మూడేళ్ళు గడిచాకా, మా అన్నయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చి, మా ఊరు వచ్చెయ్యమన్నాడు. తిరిగి వెళ్లి, ఒకరిమీద ఆధారపడి అవమాన పడేకంటే, అందరిలో మంచి పేరు తెచ్చుకుని, ఇక్కడే అభిమానంగా బ్రతకడం మేలనుకున్నాను. నాకిక్కడే బాగుందని, పిల్లాడు చదువుల్లో పడ్డాడని నచ్చజెప్పి పంపేసాను.   
అప్పడాల వ్యాపారం బాగా పుంజుకోవడంతో నెమ్మదిగా వంటలకు వెళ్ళడం మానేసాను.  ఊళ్ళో వాళ్లకు అవసరానికి తలలో నాలుకలా ఉంటూ సాయం చేసేదాన్ని. నెమ్మదిగా పాత బస్టాండ్ వేనకున్న కాలనీలో చిన్న డాబా కొనుక్కున్నాను. మావాడు ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి,  బ్యాంకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. అదే బాంకులో పనిచేసే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిప్పుడు హైదరాబాద్ లో హాయిగా ఉన్నారు. కాళ్ళు, చేతులూ ఆడినంతవరకూ నాకు ఆశ్రయం, గౌరవం ఇచ్చిన ఈ బాపట్ల నేల మీదే, ఒక పెద్ద చెట్టులా నిలబడుతూ, నా లాంటి మరికొందరు గూడులేని పక్షులకు ఆశ్రయమిస్తూ ఉంటాను. ఇలా నేను పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడడమే కాదు, ఇప్పటిదాకా కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పించాను. ” ఇదీ నా కధ.
“ఇప్పుడు చెప్పు కళా! నా పెళ్ళికి ముందు జమీందారీ కోడలు, కాలుమీద కాలేసుకుని బ్రతుకుతుంది, అత్తపోరు కూడా లేదు, అదృష్టవంతురాలు ”అని అందరూ అన్నారు. దిగాకా కదా లోతు తెలిసింది. అయినా బెదరకుండా, పరిస్థితులతో పోరాడి నిలిచాను. కోపంలో సంయమనం కోల్పోకపోవడం, ఇబ్బందుల్లో ధైర్యాన్ని కోల్పోకపోవడం, కొన్ని పట్టించుకోకుండా వదిలెయ్యగలగడం, అందరికీ సహాయపడడం, ఎవరినుంచి ఏమీ ఆశించకపోవడం, మనుషుల్ని క్షమించగలగడం, ఇవే జీవన సూత్రాలు. ఇవి ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనల్ని నిలబెడతాయి.
ఇంకో మాట చెప్పనా? ఒక్కోసారి వాస్తవాలు ఊహించుకున్నంత భయంకరంగా ఉండవు. తెలిసీతెలియని వాళ్ళ చెప్పుడు మాటలు విని భయపడకు. నిర్భయంగా పరిస్థితుల్ని ఎదుర్కో. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. ప్రేమించడం అంటే సుగుణాలను చూసే కాదు, ఎదుటి వారి లోపాలతో సహా, వారి ప్రపంచం మొత్తాన్ని ప్రేమించడం. కోపాలకు, పంతాలకు లొంగని మనిషి ఉంటాడేమో కాని, ప్రేమకు లొంగని ప్రాణి ఈ లోకంలోనే లేదమ్మా. నీ ప్రేమతో, సేవతో అత్తింట్లో అందరి మనసులూ గెల్చుకో. అందుకే హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ వెళ్లి, నీకోసం వేచి ఉన్న జీవితాన్ని అందుకో.” అంటూ ముగించింది ఆవిడ.
మబ్బులు వీడిన చందమామలా హాయిగా నవ్వేసిన చంద్రకళ అమాంతం వచ్చి అనసూయమ్మ గారిని హత్తుకుంది. అమోఘమైన అనసూయమ్మ గారి వంటలతో పెళ్లి వాళ్ళు మురిసిపోగా, వైభవంగా కళ పెళ్లి జరిగిపోయింది. ఏడాది తర్వాత ఆనందంగా చంటిపిల్లాడితో తనను చూసేందుకు వచ్చిన కళను మనసారా దీవించి పంపి, తృప్తిగా నిట్టూర్చారు అప్పడాల అనసూయమ్మగారు.
(బాపట్ల పట్టణం 50 ఏళ్ళుగా అప్పడాలకు ప్రసిద్ధి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాసిన కల్పిత గాధ ఇది.)


0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top