తెలుగు భాష విశిష్టత - అచ్చంగా తెలుగు
తెలుగు భాష విశిష్టత
బాలాంత్రపు రమణ 


కనీసం గత వెయ్యి సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న మన తెలుగు భాష యొక్క విశిష్టత గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భాష యొక్క విశిష్టత బహుముఖాలుగా ఉంటుంది.  ఒక భాషయొక్క ఔన్నత్యాన్ని  పరిక్షించాలంటే  ఆ భాష సాహిత్యపరంగా ఎంత పరిణితి చెందింది అన్న విషయం పరిశీలించాలి.  ఆ కోణంలో చూస్తే తెలుగు భాషకి అగ్రతాంబూలం ఇవ్వచ్చు.  ఛందోబద్ధమైన పద్యం తెలుగు భాషలో పరిణితి  చెందినంతగా ఇతర భాషల్లో చెందలేదనే చెప్పచ్చు. తెలుగులో ఒక్క  పద్యంలో ఒకే అలంకారం కాకుండా  రెండు, మూడు, నాలుగు అలంకారాలు కూడా చోటు చేసుకుంటాయి.  శబ్దాలంకారాలకీ, చమత్కారాలకీ చేమకూర వేంకట కవి గారి “విజయ విలాసం”   భాషా సౌందర్యం కోసం రామరాజభూషణుని “వసుచరిత్రము”, తెలుగు భాష లాలిత్యం, సౌకుమార్యం తెలియాలంటే అల్లసాని వారి “మనుచరిత్రము”; పద గుంఫనం, విరుపుల కోసం తెనాలి వారి “పాండురంగ మాహాత్మ్యం”,  భాషా మాధుర్యం, భక్తి భావాల కోసం పోతన గారి భాగవతం ఒక సారి తిరగేస్తే  చాలు. 
తెలుగు భాషకి ఉన్న మరొక విశిష్ట  ప్రక్రియ అవధానం. ఇది తెలుగు భాషలో వికసించినంతగా మరే భాషలోనూ వికసించ లేదు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పంచ సహస్రావధానం – ఇలా విస్తరిస్తూ పోతోంది. 
తెలుగులో పదాలు అజంతాలు, అంటే అచ్చులతో అంతం అవుతాయి. అందుచేత తెలుగు వినడానికి శ్రావ్యంగా  ఉంటుంది.   మన పురాణాల్లోనూ, కావ్య-ప్రబంధాల్లోనూ వాడబడిన తెలుగు భాష ఎంత ఉత్కృష్టంగా, మహోన్నతంగా   ఉంటుందో మనందరికీ తెలిసినదే.  తెలుగులో ఒక పదానికి ఎన్నెన్నో పర్యాయ పదాలు ఉంటాయి.  ఇలా ఉండటం ఆ భాష యొక్క ఔన్నత్యానికి  నిదర్సనం.  తెనాలి రామలింగ కవి వ్రాసిన “ఉద్భాటారాధ్య చరిత్రము” అనే గ్రంథంలో “సింధు బల్లహు రీతి...”, అనే పద్యoలో  కవి పదహారు మంది శివభక్తుల పేర్లు ఉదాహరించి – వారి వలె శంభుని పూజించి బ్రతుకు ఓ రాజ చంద్రా! అన్నాడు. ఇక్కడ  “వలె” అన్న పదానికి    పదహారు పర్యాయ పదాలు చెప్పాడు.   ఇలాంటి ఉదాహరణలు మన ప్రాచీన సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి.  
తెలుగులో ద్వర్ధి కావ్యాలు అని ఉన్నాయి. అంటే ఒకే గ్రంథంలో అవే పద్యాలు రెండు కథలు చెబుతాయి.  ఉదాహరణకి  పింగళిసూరన గారి రాఘవపాండవీయం, రామరాజభూషణుని  హరిశ్చంద్ర నలోపాఖ్యానం. అలాగే  త్ర్యర్థి కావ్యాలు  ఉన్నాయి. అంటే ఒకే గ్రంథంలో మూడు కథలు.  ఉదాహరణకి  నెల్లూరు వీర రాఘవ కవి గారి యాదవరాఘవపాండవీయము. ఇలాంటి క్లిష్టమైన ప్రక్రియలు  మరే ఇతర భాషలోనూ లేవేమో.  
ఇంక పద్యాల విషయానికొస్తే ఒకే పద్యానికి, రెండు, మూడు, నాలుగు అర్థాలు మాత్రమే కాక   ఒకే పద్యానికి 64 అర్థాలు చెప్పిన సందర్భo కూడా ఉoది.  రామరాజభూషణుని “వసుచరిత్రము” లో “స్వైర విహార ధీరలగు.... అనే పద్యానికి పెద్దాపుర సంస్థానంలోన విద్వత్కవి, వైణికులు శిష్టా కృష్ణమూర్తి శాస్త్రి గారు 64 రకాల అర్థాలు చెప్పారట. 
ఇంక తెలుగులో చిత్రకవిత్వం అని ఉంది.  పద్యం మొదటి పాదం మొదలుకొని చివరిదా చదివితే ఒక అర్థం, అదే పద్యాన్ని చివరినుండి మొదటిదాకా చదివితే మరొక అర్థం వచ్చే ప్రక్రియ ఉంది. అలాగే “వికటకవి” లాగ పద్య చరణాలన్నీ  ముందునుంచి వేనుకకీ, వెనుకనుండి ముందుకీ చదివినా ఒకే లాగ ఉండే పద్యాలు కూడా ఉన్నాయి. 
పద్యమంతా ఓష్ఠ్యాలతో, అంటే పెదవులు కలుపుతూ ఉచ్ఛరించే పదాలతో   (పఫబభమ-లు)  రాయడం లేదా నిరోష్ఠ్యంగా (పఫబభమ-లు లేకుండా) రాయటం;   ఈ పద్ధతిలో కావ్యమంతా రాయటం అధ్భుతం కదా. ఈ విధంగా తెలుగు భాష ఔన్నత్యంగురించీ, విశిష్టత గురించీ ఎంతైనా చెప్పవచ్చును.
రమణ బాలాంత్రపు


సీస!! సింధు బల్లహు రీతి, శ్రీపతిపండితు మరియాద, ధూపద మాచిదేవు 
నట్లు, మహాకాళుననువున, నల్ల కల్మదబ్రహ్మ ఠేవ, గక్కయ విధమున
శూలద బ్రహ్మయ్య చొప్పున, బిబ్బ బాచన లీల, వీర నాచాంకు పోల్కి
కదిరె రేమ్మయగారి కైవడి, దేలుగేశు మసణయ్య చందాన, మాదిరాజు 

గీ!! కరణి, మోళిగ మారయ్య గతి, దెలుంగు 
బొమ్మనార్యుని వడువున, సురియ చౌడు 
పగిది, బసవేశ్వరుని మాడ్కి భక్తి యుక్తి 
శంభు బూజించి బ్రదుకు రాజన్య చంద్ర!

స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్
భోరున లాతివారు చొరబూనినచో రసభంగ మంచు నే
జేరక పూవుతీవియల చెంతన నిల్చి లతాంగి రూపు క
న్నారగ జూచి వచ్చితి నవాంబురహాంబక నీకు తెల్పగన్

No comments:

Post a Comment

Pages