లలిత పదముల మది లలిత గొలుతు - నారుమంచి వేంకట అనంతకృష్ణ
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:
నారుమంచి వేంకట అనంతకృష్ణ గారు డిసెంబర్ 1957, 27 న శ్రీ ఎన్.వి.ఎస్. శర్మ, శ్రీమతి నారుమంచి సరోజని గార్లకు వరంగల్ లో జన్మించారు. ఉస్మానియా విద్యాలయంలో పట్టభద్రులైన వీరు 23 సంవత్సరాలు భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి స్వచ్చంద విరమణ చేసారు. ఆతరువాత వారు హైదరాబాదు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టి ప్రస్తుతం అందులో కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా వీరు సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్రను వేసారు. 
వీరు ఇంతవరకు నాలుగు శతకాలను రచించి ప్రచురించారు. అవి.
1. లలిత పదముల మది లలిత గొలుతు - అమ్మవారి మీద శతకము  - 2002 లో, 2.  "వరసిద్ధి వినాయక భక్త పాలకా" వినాయకుని మీద శతకము  -2010 లో, 3.  "అనంత భాస్కర శతకం" సూర్యుని మీద శతకము 2013 లో, 4. శ్రేయస్కరా శ్రీధరా విష్ణుమూర్తి మీద శతకము   2016 లో ముద్రితాలు. ఈ శతక పరిచయ కాలం నాటికి వీరు రచించిన మరొక శతకం "ఈశా భక్తకల్పద్రుమా" ప్రచురణకు సిద్ధంగా ఉన్నది. వీరు రచించిన "గురుసహస్త్రనామ స్తోత్రం" అముద్రితం. వీరు చిత్రకవిత్వం చెప్పటంలో కూడా సిద్ధహస్తులు. వీరి వివిధ శతకాలలో ఈ చిత్రకవిత ప్రయోగాలను మనం చూడవచ్చును. 
రచనలను చేయటమే కాక భారత, భాగవత వేదాంత విషయాలపై ధార్మికోపన్యాసాలు చేయటం, వివిధ కళాశాలల్లో పాఠశాలల్లో విధ్యార్ధులకు మూర్తితత్వవికాసానికి సెమినార్లు, వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. 
ఓపిక ఉన్నంతవరకు, చేయగలినంతవరకు అమ్మ దయ ఉన్నంతవరకు వీరి ఈ సాహిత్య యజ్ఞం ఇలాగేకొనసాగాలని ప్రార్ధిస్తున్నాను.
శతక పరిచయం 
"లలిత పదముల మది లలిత గొలుతు" అనే మకుటంతో నూటఒక్క పద్యాలు గల ఈశతకం భక్తిరస ప్ర్ధానమైన శతకం. ఈ శతకంలో ప్రతిపద్యంలో జగన్మాత అయిన ఆ తల్ల్ అక్కున చేరే బిడ్డది ఆర్తి కనిపిస్తుంది. చక్కని సరళమైన అచ్చ తెలుగులో కఠిన సమాసాలు లేకుండా ఆమాతను దర్శింపచేయటంలో రచయిత తన సామర్ధ్యాన్ని చూపించారు. చిన్నిపదాలతో నిన్ను వర్ణించటం సాహసమే అంటూనే సాహసించి సఫలీకృతులయ్యారు.
చిరుపదముల గూర్ప గురుతరభావముల్
సాహసమ్ము గాదె! సాయపడవె
నీదు ముద్దు పట్టి నేననంతుడనంచు
లలిత పదముల మది లలిత గొలుతు

అక్షరములన్ని లక్షణమ్ముగ గూర్చి
అక్షరమ్ము వేడి లక్ష మార్లు
దీక్ష బూని నిన్ను సాక్షిగా భావించి
లలిత పదముల మది లలిత గొలుతు

శక్తి లేనిదే ఆ  శివునికైన ఉనికి లేదు. ఆ తల్లి సర్వాంతర్యామి. ఇదే విషయాన్ని ఎంతసరళమైన మాటల్లో చెప్పారో చూడండి.
నీదు తోడు గల్గ నీ రేని కదలిక
తనకు నీవు లేక యునికి లేదు
శవము శివము గాగ శక్తి నీ వేయంచు
లలిత పదముల మది లలిత గొలుతు

మట్టి నీవు జూడ మరి నీరు నీ రూపు
అనల మీవెయరయ ననిల మీవు
ఆకసమ్ము నీవు అంతయు నీవంచు
లలిత పదముల మది లలిత గొలుతు

పాలు జూడ వెన్న బయట కానగ రాదు
తరచి తరచి తీయ తనకు దొరకు
జీవు లందు దాగి నీవె యున్నట్లంచు
లలిత పదముల మది లలిత గొలుతు

నన్ను నేను తెలియ నిన్ను గొల్చెదనమ్మ
ఎన్న నీవె గాదె ఎందు చూడ
స్థూలమందు చూడ సూక్ష్మమీ వంచునే
లలిత పదముల మది లలిత గొలుతు

జలము నందు గాని యిల శూన్యమందైన
జడము నీవు చూడ చలము నీవు
వెదకి చూడ నీవె విశ్వమంతయునంచు
లలిత పదముల మది లలిత గొలుతు

లలితా సహస్త్రనామ ప్రభావం, ఈ క్రిందిపద్యాలలో మనకు కనిపిస్తుంది
నిత్య శుద్ధవంచు నిత్యబుద్ధాయంచు
నిర్వికల్ప వంచు నిత్యవంచు
నిత్యముక్త వంచు నిరపాయవంచునే
లలిత పదముల మది లలిత గొలుతు

భద్రమూర్తి వీవు భక్తి గమ్యవు నీవు
భక్తి వశ్యవీవు శక్తి వీవు
శాంతమూర్తి వీవు శాంభవి నీవంచు
లలిత పదముల మది లలిత గొలుతు

పురాణ కథల ప్రభావం ఉన్న ఈ క్రిందిపద్యాలు గమనించండి.
కాళిరూపు తోడ కామేశు దరిజేర
నల్ల పిల్ల యన్న నొల్ల లేక
గౌరవర్ణ మొంది గౌరివైతి వటంచు
లలిత పదముల మది లలిత గొలుతు

శివుని ముఖము చూచి చిరునవ్వు నవ్వగా
మీ నగవుల కాంతి మేను దాల్ప
మా గణపతి వెలసె మాభాగ్య మనగనే
లలిత పదముల మది లలిత గొలుతు

భర్త భస్మమైన భరియింప జాలక
నిన్ను వేడికొన్న ఖిన్న మతిని
కాపు కాచినట్టి కామసంజీవినీ
లలిత పదముల మది లలిత గొలుతు

సురలు జయముకోరి చేరి జన్నము చేయ
వారిశక్తులన్ని చేరి నంత
ఉద్భవించినట్టి యుద్దండ శక్తిని
లలిత పదముల మది లలిత గొలుతు

అచ్చతెలుగు పలుకుదళ్ళు, సామెతలు, ఈ శతకంలో అనేకం. చక్కని సరళమైన తెలుగులో ప్రతిఒక్కరికి అర్థమయ్యే విధంగా రచించిన ఈశతకం ప్రతిఒక్కరు చవతగినది. మీరు చదవండి, ఇతరులచే చదివించండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top