బతుకు గుట్కా బండి 
కంభంపాటి రవీంద్ర 
ఉదయాన్నే టీ పెట్టి, పిల్లల్ని లేపుతూ, పాకలోంచి బయటికొచ్చింది అప్పాయమ్మ. ఇంటి ముందు మడతమంచం మీద కూర్చుని తీరిగ్గా పళ్ళు తోముకుంటూ, ఎదురుగానున్న అపార్ట్మెంట్ వేపు గుడ్లు మిటకరించి చూస్తున్న మొగుడు నూకరాజు కనిపించాడు. పైకి చూసిన అప్పాయమ్మ కి ఆ అపార్టుమెంటు రెండో ఫ్లోరు బాల్కనీ లో నైటీ వేసుకుని పళ్ళు తోము కుంటూ  అనుపమ!!,  తను ఆవిడింట్లోనే పని చేస్తుంది. 
'ఆయమ్మగారికేసి సూత్తున్నావేటి ?' అని అప్పాయమ్మ అడిగితే 'నేనేటన్నా ఆ యమ్మని అక్కడ నుంచోమని సెప్పేనేటి ?..ఆయమ్మ నుంచుంది , నాను సూత్తున్నాను' అని బదులిచ్చేడు నూకరాజు 
'నువ్వు మామూలుగా సూడ్డంనేదు ..ఆయమ్మ కేసి సూసి , గుటకలేస్తున్నావు ' 
'ఆవిడికి లేనిబ్బంది నీకెందుకేటి ?..నాను గుటకలేస్తాను.. సొల్లు కారుస్తాను '
'ఓలమ్మోలమ్మో ..నా కాపురం లో పొద్దున్నే అగ్గెట్టేసిందే నీకు పళ్ళు తోముకోడానికి ఆ ఒక్క బాల్కానీయే దొరికిందా తల్లీ ..'అంటూ అప్పాయమ్మ ఏడుపు మొదలెట్టింది. ఆ పైనున్న బాల్కనీలో పళ్ళు తోముకుంటా సెల్ఫీ తీసుకుని , ' బ్రషింగ్  మై టీత్ ఇన్ మై బాల్కనీ ఆన్ ఏ సన్నీ మార్నింగ్ ' అని స్టేటస్ అప్డేట్ చేస్తున్న అనుపమ ఆ ఏడుపు పట్టించుకోలేదు !
ఇదంతా పక్కనున్న బడ్డీ దగ్గిర బైకాపి టీ తాగుతున్న కుమారు ఆసక్తిగా చూస్తున్నాడు . 'ఓరి సచ్చినోడా ..ఆయమ్మ కేసి ఎంత కాలం నుంచి గుటకలేస్తున్నావు చెప్పు ' అని చీపురుకట్ట పట్టుకునొచ్చిన అప్పాయమ్మని 'ఆగమ్మా .. నువ్వు ఆయన్ని కొట్టడానికి ఇది సరైన స్థలమూ కాదు..టైమూ కాదు ' అని ఆపేడు కుమారు .

'నువ్వెవరు బాబూ ..నాను మా ఆయనగోరిని తిట్టుకుంటే నీకేటి ..కొట్టుకుంటే నీకేటి ' అని అప్పాయమ్మ అడిగితే , 'నేను "బతుకు గుట్కా బండి " ప్రోగ్రాము నుంచొచ్చానమ్మా ..ఇలా కొట్టుకునే మొగుడు పెళ్ళాల తో మేము టీవీ షో చేస్తాము.. మీరు మా ప్రోగ్రాములో కొట్టుకుంటే ఐదు వేలిస్తాము ' అన్నాడు కుమారు
'టీవీలోకొచ్చి కొట్టుకుంటే ఐదు వేలిస్తారా? మరి మేము రోజూ కొట్టుకుంటాము..మరి రోజూ ఐదు వేలిస్తారేటి ?'

'రోజూ ఇవ్వమమ్మా ..ఒక జంట కి ఒక్కసారే ఇస్తాము..  అన్నట్టు మీతో పాటు ఆ ఎదురుకుండా అపార్టుమెంటావిడని కూడా పిలుస్తాము ..అప్పుడు మీరు ముగ్గురూ కలిసి కొట్టుకోవచ్చు , తిట్టుకోవచ్చు '
'సరే బాబూ.. మా ఆయన్ని ఎప్పుడు తీసుకోనొచ్చీమంటారేటి '
'సాయంత్రం మావాళ్లొచ్చి చెబుతారు.. కారు పంపుతాము ..పిల్లల్ని తీసుకురావడం మర్చిపోకండి ..ఇదిగో రెండు వేలు అడ్వాన్సు .. నా తర్వాత ఆ "రోకలి బండ " ప్రోగ్రాము వాళ్ళొస్తే ఒప్పుకోకూడదు మరి ..ముందే చెబుతున్నా'అని కుమారు వెళ్ళిపోయాడు

ఆ తర్వాత, ఎదురుకుండా అపార్టుమెంటులో ఉన్న అనుపమ ని కలిసాడు కుమార్ . టీవిలో కనబడతారనగానే ఆ అమ్మాయి ఆనందంగా ఒప్పుకుని , ఏ టైం కి రావాలో చెబితే బ్యూటీ పార్లర్ కి వెళ్లి రెడీ గా ఉంటానని చెప్పింది
' నాకొక చిన్న డౌట్ ' అంది అనుపమ 
'మొహమాటం లేకుండా అడగండి ..మాదసలే సిగ్గులేని ఛానెల్' అన్నాడు కుమారు.
'ప్రోగ్రాం పేరు బతుకు గుట్కా బండి ఏమిటి?' ఆసక్తిగా అడిగింది అనుపమ 
'ఓ అదా.. మా షో స్పాన్సర్ గుట్కా కంపెనీ వాళ్ళు, అలాగే  మా షో హోస్టుకి  కూడా బాగా గుట్కా నమిలే అలవాటు ఉంది ..సో ..బతుకు గుట్కా బండి' నవ్వుతూ చెప్పాడు కుమార్
మర్నాడు అందరూ షూటింగుకి హాజరయ్యేరు. ఆ షో హోస్టుగా సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ క్యారెక్టర్లేసి , ఇప్పుడు తల్లి పాత్రలేస్తున్నావిడ వచ్చింది . ఒక లాయరు గారు, ఓ సైకాలజిస్టు  కూడా వచ్చేరు .  
ఆ లాయరుగారు పరిచయం చేసుకుంటూ చెప్పారు, 'నేను డివోర్సు స్పెషలిస్టుని'
'డివోర్సు స్పెషలిస్టు అంటే ఎంత మందికి విడాకులిప్పించారేంటి ? ' అడిగింది అనుపమ 
'నేను డివోర్సు ఇప్పించడంలో స్పెషలిస్టుని కాదండి ..తీసుకోడంలో స్పెషలిస్టుని.. ఇంతవరకు ఏడుసార్లు తీసుకున్నాను ' అందావిడ
షూటింగు మొదలయ్యే ముందు ఉత్సాహంగా నవ్వుతూ చూస్తున్న అప్పాయమ్మ పిల్లలిద్దరినీ ఎఫక్టు  కోసం ఏడుపు మొహా లెట్టుకోమని  డైరెక్టరు చెప్పాడు 
ప్రోగ్రాం హోస్టు అప్పాయమ్మని అడిగింది, 'చెప్పమ్మా ..మీ ఆయన కేవలం ఈమె వైపే అలా చూస్తాడా ..లేకపోతే ప్రతీ ఆడదాని వంకా అలా చూస్తాడా ?'
అప్పాయమ్మ (నవ్వుతూ) :'నాకేటి తెలుసమ్మా .. ఆరోజు ఈయమ్మ వంక సూసినాడు ..రోజూ సూత్తున్నాడేమో నాకు తెల్దు '
డైరెక్టరు అరిచేడు, 'నువ్వు బాధగా మొహం పెట్టాలి ..అలా నవ్వకూడదు ..ఇప్పుడు చెప్పిందే మళ్ళీ ఏడుస్తూ చెప్పు'
అనుపమని అడిగిందా హోస్టు 'ఆ నూకరాజు మిమ్మల్ని అలా చూస్తుంటే, మీకేమీ ఇబ్బందిగా లేదా? ఎందుకతన్ని ప్రోత్సహిస్తున్నారు?..తోటి ఆడదాని కాపురంలో చిచ్చు పెట్టడానికి మనసెలా ఒప్పింది?' 
'వాట్ డిడ్ ఐ డూ ?..ఉదయం బ్రష్ చేసుకోడం తప్పా?' అని అరిచింది అనుపమ 
'కట్..ప్రోగ్రాములో ఇక్కడ బ్రేక్ వస్తుంది.. గుడ్ పెర్ఫార్మన్స్ 'అని డైరెక్టర్ అనుపమ తో అంటే, సంతోషంగా చూసిందా అమ్మాయి

బ్రేక్ టైం లో డైరెక్టరు అప్పాయమ్మ, నూకరాజు తో చెప్పాడు 'ఈ పార్టులో హోస్టుగారు మీ ఆయన్ని లాగిపెట్టి కొడతారు.. గొడవ చేయకుండా ఏడుపు మొహం పెట్టుకు చూడండి '
మళ్ళీ షూటింగు మొదలైన తర్వాత, హోస్టు అడిగింది 'నూకరాజు ..నీకు ఇద్దరు పిల్లలున్నారు  ఆడదాని వేపు అలా చూడ్డానికి సిగ్గులేదు?'
'బావుంటే చూడ్డంలో తప్పేటండి ? ఇప్పుడు మీరు బావున్నారు ..మిమ్మల్నీ చూస్తున్నా కదండీ ' అని నూకరాజు అనేసరికి ఆ హోస్టు లేచి నూకరాజు గూబ వాయగొట్టింది
'కట్ ' అని డైరెక్టరు సంతోషంగా అరిస్తే , అప్పాయమ్మ 'ఓలమ్మ  ఓలమ్మ  ..అలా  కొట్టీసినావేటమ్మా ..' అని ఏడుస్తా నూకరాజు దగ్గిరికెళ్ళి ఓదార్చింది
ఆ తర్వాతి సెగ్మెంటు లో లాయరు అప్పాయమ్మ తో, సైకాలజిస్టు నూకరాజు, అనుపమ తో మాట్లాడారు . లాయరడిగింది 'చెప్పమ్మా ..మీ ఆయనకీ విడాకులు ఎందుకివ్వాలనుకుంటున్నావు?'
'అయ్యబాబోయ్ నాను విడాకులు ఎప్పుడడిగేనండి ?
'అంటే ..విడాకులు తీసుకోకుండానే అతన్ని వదిలేద్దామనుకుంటున్నావా?'
'ఒగ్గీటమేటండీ ? నానెప్పుడడిగీసేనేటి  ?'
'అంటే ..ఆ  మానవ మృగం తో జీవితం అలాగే గడిపేస్తావా?'
'మడిసి మంచోడే కదండీ మరి ' 
'ఆలోచించు ..ఒక ఆడదానిగా చెబుతున్నాను '
'బలెవోరండి ..ఆడినిప్పుడు ఒగ్గేస్తే , నాను , నా పిల్లలూ ఏటైపోవాలా?'
'భరణం ఇప్పిద్దాం ...ఆ మానవ మృగాన్ని ఊరికే వొదలద్దు '
'ఊరికే ఎందుకొగ్గీస్తానమ్మా ..ఆ రోజే చీపురట్టుకుని నాలుగు దులిపేద్దును ..మీ కుమారు అడ్డొచ్చీసినాడు '
'నీ ఇష్టం ..నీ మంచి కోరి చెబుతున్నాను .. కావాలంటే ఈ కేసు ఫ్రీ గా వాదిస్తాను '
'నీకో దండం తల్లే ..ఆ అపార్టుమెంటమ్మ గారికన్నా నువ్వే నా కాపురం లో అగ్గెట్టేస్తున్నావు ' అని అప్పాయమ్మ ఏడుపు మొదలెట్టేసింది 
'వెరీ గుడ్..ఎమోషన్స్ చాలా బాగా పండెయ్యి ' అనుకున్నాడు డైరెక్టరు 
ఇంతలో సైకాలజిస్టు వచ్చి సంతోషంగా చెప్పేడు 'నూకరాజు తన ఇంటి వేపు తిరిగి పళ్ళు తోముకునేలాగా కౌన్సెలింగ్ చేసాను ..అనుపమ ఉదయం నైటీ తో కాకుండా పట్టుచీర కట్టుకుని పళ్ళుతోముకునేలా ఒప్పించాను '
హోస్టుగారి మొహం పాలిపోయి ఉండడంతో , ఏమైందని డైరెక్టరు ఆవిన్నడిగితే 'ఇప్పుడే మా పనమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ..మా ఆయన దానికేసి చూసి లొట్టలేస్తున్నాడట ' అంటూ ఆ హోస్టుగారు ఏడుస్తూంటే అప్పాయమ్మ చెప్పింది 'అమ్మగోరూ ..మా పేదింటోళ్ళ గొడవలు కన్నా మీ పెద్దింటోళ్ల గొడవలు సూపిత్తే ఇంకా ఎక్కువ జనాలు సూత్తారేమో?'
'అవును మేడం ..ఆ ప్రోగ్రాముకి " బతుకు బస్టాండ్ " అనే పేరు పెట్టండి, రెడ్ బస్  లేదా అభీ బస్ వాళ్ళు స్పాన్సర్ చెయ్యొచ్చు ' ఏడుపు మొహం పెట్టుకున్న ఆ హోస్టుగారితో ఉత్సాహంగా చెప్పింది అనుపమ!
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top