అవాల్మీక కదంబమాల-2 - అచ్చంగా తెలుగు
అవాల్మీక కదంబమాల-2
సేకరణ- మాడపాటి సీతాదేవి.

సురవరం ప్రతాపరెడ్డిగారి రామాయణం నుంచి:
1.సంపాతి రావణునిచే కొంపోబడుచున్న సీతాదేవిని తాను చూచినట్లుగ తెలుపుటయే కాక రావణుని నివాసమైన లంకలో సీత యున్నదనియు, ఆ విషయము తాను దివ్య చక్షువులతో తెలిసికొంటిననియు వివరించును.
2.మూలమున లేని భావములను నిబంధించుట -
ఋష్యశృంగుడు జన్మించినది మొదలు స్త్రీపురుష విభేదము తెలియనివాడు.నాగరికమైన యే విషయము తోడను అతనికి పరిచితి లేదు.అట్టి అతి ముగ్ధహృదయుని హృదయమునాకర్షింప సుభాషితలగు వారకాంతలు వచ్చి యాతనికి మోదకాదిభక్షములను సమర్పించి, వీనుల విందుగా గానము చేయుదురు. అంతనాతడు వారిచ్చిన మోదకములను కుచ్యములగు ఫలములనియు, గానమును మధుర స్వర వేదమనియు భావించి,వానిని గూర్చి ప్రశ్నించును. అంతేకాక యా తరుణుల వృత్త స్తనములను, హారములను, చందన చర్చలను, వారు కట్టిన మృదు వస్త్రములను చూచి, వానిని గూర్చి యమాయకముగా ఇట్లు ప్రశ్నించును -
"నాకు బోలెగావు , మీకురంబున రెండు
వలువ గుజ్జు కొమ్ము లలరుచున్న 
వలతి తులసి పూస లతి సితములు మేన 
దనర నలదినారు దావిభూతి"
" ఈ కట్టిన వల్కలములు 
మీకెంతయు లెస్స లింత మృదువులు గలవే
యే కుజముల నారలొ యివి
మాకును యి యొసగవలయుమానుగ మీరల్"
"ఈ మధుర స్వర వేదం
బేమెన్నడు వినుము మీకు నేముని సెప్పెన్
వేమరు మీతో జదివెద
నోముని వరులారా చెప్పు దొప్పుగను నాకున్"
ఋష్యశృంగుని ముగ్ధ ప్రవృత్తిని తెలియజేయు పై పద్యములందలి భావములు మూలమున కానరావు.
3.అగ్నిప్రవేశము గావించిన సీతాదేవి వర్ణనము-
అవంతయను గందదా పూవు బోడి
పావక సరసి లో బదిలమై నిలిచి
కరచరణా నన కమలంబులొప్ప
వర కుచద్వయ చక్రవాకంబులొప్ప
నవబాహువల్లరి మృణాలంబు లొప్ప
మహితలోల న్నేత్ర మత్యంబులొప్ప
సహజ రోమావళి శైవాల మెప్ప
కమలిని తెరగున కరమొప్పుచున్న 
కమలాక్షి కనుగొని
సీతమ్మ అగ్ని లో నుంచి బయటకు వచ్చినప్పుడు-నిర్మల సరోవరం లో తామరతూళ్ళలాంటి చేతులతో కమలాలు ధరించి ఉన్న లక్ష్మీదేవిలాగా వున్నది.
వసంతఋతువు నందు అంతటను నిప్పంటు కున్నదా అన్నట్లు మోదుగపూలు వికశించియున్నవి.


సుందర కాండము - భాస్కరరామాయణం
హనుమంతుడు సముద్రమును దాటి లంకలో ప్రవేశించిన ఘట్టమున కావించపడిన సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనలు;
నాకెంతయు ప్రియ శిష్యుం
డీ కపివరుడితను పనికి నెడగా కుండం 
బోకయుచిత మను కరణి వి
భా కరుడవు డపర శిఖరిపై కరుగుటయున్- 
సకల శాస్త్రాలు సూర్యుని దగ్గర హనుమంతుడు నేర్చెను.
పావని కి సీత వెదకం
గా విశ్వము గాని పిప ఘనతమనుడపన్
కైవడి చందురుడు వెలిగె గగనతలమునన్.
తానిక అస్తమించనిచో హనుమంతునకు రాక్షసుల దృష్ఠిలో పడకుండ లంక ప్రవేశించుట సాధ్యము కాదని తలచి సూర్యుడస్తమించినాడట.
అంత లంకయందతట క్రమముగా తమస్సులు వ్యాపించినవి. ఆ గాఢ తమస్సులలో సీతను వెతుకుట కష్టమని తలిచి యాతనికి దేవతలెత్తిన దీపమా అనునట్లు  చంద్రుడుదయించినాడట.
సూర్యాస్తమయము, చంద్రోదయము నీ విధముగా వర్ణింపబడినవి.
జానకీ వియోగ సాగరముగ్నుడై
రామచంద్రుడుండగా మనోగ్జ
భంగి నిక దగునెపద్మినీ భోగమ 
న్నట్లు గ్రుంకె నర్కు డపర జలధి-
రాముడు వియోగ సాగరమగ్నుడై యుండగా సూర్యుడు అపరసాగరమగ్నుట యుచితమేకదా.అంతేకాక రాముడు వియోగముతో బాధపడుచుండగా తాను పద్మినీ భోగమున సుఖముగా నుండుట యనుచితమని భాస్కర రామాయణమున సూర్యాస్తమయమునకు చెప్పబడిన మరో కారణము.
భాస్కర రామాయణము లో రెండింటను జాంబవంతుని బలమున క్మృత సేవనము కారణమని చెప్పబడినది.


గోపీనాథ రామాయణము
కిష్కిందాకాండలో వాలి నిరపరాధినైన నన్నేల వధించితివని యడుగగా శ్రీరామచంద్రుడు, నీవు భాతృ జాయాసక్తుడవగుట వలన మహాపాతకివని నిశ్చయించి నీవంటి వానికి వధ తప్ప నితర శిక్షలు లేవని తలంచి నిన్ను వధించితి నని చెప్పెను.
ఇట్లు జరిగి యుండగా పట్టాభిషేకానంతరము తారను వశపరుచుకొనుటచే సుగ్రీవుడు కూడా భాతృ భార్యాగామిత్వరూప గలవాడయ్యె. ఉమా సంహిత లో పార్వతి శివుని ప్రశ్నించుచున్నది. ఇందువలన మాతృ తుల్యురారాలైన తారతో కాపురము చేయుట సుగ్రీవునికి మహాపాపమని స్పష్ఠ మగుచున్నది. కావున సుగ్రీవుడు గూడ వాలి వలె పాతకి యగుటచే వధ దండనార్హుడైయుండగా రాముడు పక్షపాతము గలవాడై సుగ్రీవుని జంపక వాలినేల జంపెనని యాక్షేపణము.
రామునికి లేశమైనను పక్షపాతము లేదు. సుగ్రీవుడు దోషి కాడు.తార యయోనిజురాలగుటచే దత్సంగతుడైన సుగ్రీవునికి దోషము లేదు. ఆమె అప్సరస. దేవాసుర సంగ్రామములో వాలి సుగ్రీవులిద్దరూ దేవతలకు సాయపడిరి. సముద్ర మధనప్పుడుద్భవించిన అప్సరసరలలో తార కూడా ఒకతి. ఆమెను దేవతలు వాలిసుగ్రీవులకిచ్చిరి. వాలి ఆమెను పెళ్ళాడెను. ద్గర్మతత్వ మెరిగిన రాఘవుడు సుగ్రీవుడియందు దయగలవాడై సుగ్రీవుని భార్య యగు రుమ, యోని సంభూతురాలగుటచే యామెతో సంభంధం పెట్టుకున్న వాలి పాపిష్ఠుడని నిశ్చయించి రాముడు వాలిని వధించెను.ఇది కాక మరియొక విశేషము (దేవతలకైతే తప్పు లేదు కాని ఇతరులకు చాలా దోషమట ) సోదరుడు జీవించియుండగా నతని భార్యను ముట్టగూడదు. మృతుడైన సోదరు ని భార్య పరిగ్రాహ్యురాలని వానర కుల ధర్మం.
"వానరేంద్రా! భాతృభార్యా వమర్శనంబు సుగ్రీవునికి సమానబిని యింటి వేని సుగ్రీవుండు. మాయావి బిలాంతర్గత యుద్దంబున నీ మరణము నిశ్చయించి తార యందు వర్తించె.నీవు సుగ్రీవుండు సప్రాణుండగుట యెరింగియు అతని పత్నియగు రుమ యందు వర్తించితివి. కావున నీ దోషంబునకు,సుగ్రీవుని దోషంబునకు వైష్యమంబు కలదు.అట్లగుటన్ జేసి నిన్ను వధించితిని."
2. ఉద్వాహ కాలే రతి సంప్రయోగే
ప్రాణాత్యయే సర్వ ధనాప హరే
విప్రస్య(అ)చార్ధే అప్య నృతం వదేయు:
సంచానృతా న్యాహుర పాతకాని-
అను న్యాయము నవలంబించి దశరధుడట్లు చేసె నన్న యెడల దోషము లేదు.
దశరధుడు పూర్వము కేకేయ రాజు నొద్దకు బోయి కైకేయి యను కన్యను తనకీయమని ప్రార్ధించెను. ఆమె గర్భమునందు జనించిన పుత్రునికి రాజ్య మిచ్చెదనని ప్రతిజ్ఞ చేసిన యెడల నీ యభిలాష నెర వేర్తునని కేకేయ రాజు నుడవ బంక్తిరథుండు అట్లే కానిచ్చెదనని శపధము చేసి యామెను బెండ్లాడెను. 
దశరధుడు కేవలము నీ కుమారునకు రాజ్యమెచ్చెదననియే కైకకు ప్రతిజ్ఞ చేసి ఉండలేదు. మరేమనగా సమయమందు నాకు నీవు జ్ఞాపకము చేసిన యెడల నీ పుత్రునకే రాజ్యమిత్తును. నీవు మరచిపోయిన ఎడల పాలనార్హుడైన మరియొక పుత్రునికి ధర్మ శాస్త్రమునకు విరోధము లేకుండా రాజ్య మిచ్చెదనని యే ప్రతిజ్ఞ చేసెను.అందువలన దశరధుడు తన ప్రతిజ్ఞ నతిక్రమింపలేదు. కైకయు ఈ యంశమును యుక్త సమయమందు దశరధునకు జ్ఞాపకము చేయకపోవుటచే దశరధుడీ సంగతి నాలోచించి భరతుడయోధ్యకు రాక ముందే శాస్త్ర విహితముగా రాజ్యపరిపాలానార్హుడైన రామునికి పట్టాభిషేకమొనర్ప నిశ్చయించెను. ఇందుచేతనే పట్టాభిషేక మహోత్సవ వృత్తాంతము తెలియ జేయుటకు కేకయ రాజునకు దూతల బంపలేదు. ఈ సంగతి ఉమాసమ్హిత లో పార్వతి శివుని అడుగుచున్నది. దశరధుడు రాజ్యమిచ్చెదనని ప్రతిజ్ఞ చేసి యిట్లివ్వక పోవుటచే దనృతవాది కాలేదాని పార్వతి శివునడుగగా," కైకేయి తన వివాహకాలమందే కన్యాశుల్కముగా దన పుత్రునికి రాజ్యప్రాప్తి సిద్దమై ఉండగా మరల దేవాసుర యుద్దములో దానొర్చిన యుపచారములచే బరితుష్టుడైన రాజు వలన భరతునికి రాజ్యమిప్పించెడు వరము నెట్లు కోరెనను?" మరియొక ప్రశ్న. వివాహకాలమందు దశరధుడు కైకేయికి చేసిన ప్రతిజ్ఞ బాల్యమునందు జరిగినదగుటచే తను జిరకాలాంతరిత మగుట వలనను కైకేయి ఈ సంగతి మరచి ఉండవచ్చును. తరువాత మరి కొంత కాలమునకు జరిగిన వరద్వయదానము సన్నిహితమైన దగుట వలన జిరకాలాంతరితమైన దానిని మరచి స్మృతి పధమునందు నూతనముగా నున్న వరద్వయమునే యాచించెనన్నచో దోషము లేదు. మధ్యకాలమందు జరిగిన యీ వరద్వయమును కూడా కైకేయి మరువగా మంధర జ్ఞాపకము చేసిన మీద, కైకేయి స్మృతి పదమునకు తెచ్చుకొన్నదన్నచో, బాల్యమందు జరిగిన వృత్తాంతము బొత్తిగా మరచెనన్న ఆశ్చర్యమేమున్నది. వివాహకాలమందు కైకేయి పుత్రునకు రాజ్య మెచ్చెదనని వ్రతిశృతి చేసిన దశరధుడు రామునకెట్టు పట్టము కట్టనుద్యోగించెనన్నచో, ఉద్వాహనకారే అన్న సూక్తి నుపయోగించుకున్నాడన్న మాట. ఇది రాజకీయం.


ఆధ్యాత్మ రామాయణము
బ్రహ్మాండ పురాణం లో భాగము ప్రాస్పోసోక్తము.ఈ రామాయణమును మహదేవుడు పార్వతి కి చెప్పినట్లు కలదు.
పాయస విభాగము వాల్మీకి రామాయణమున దశరధుడే మువ్వురు రాణులకు పంచినట్లు కలదు. ఇందు దశరధుడు కౌసల్య, కైకేయి ల కు మాత్రమే చెరి సగము పంచి ఇచ్చినట్లును , వారి వారి భాగములల్లో చెరి సగము వారు సుమిత్రకు ఇచ్చినట్లు కలదు.
వసిష్ఠ ఋష్య జ్గాభ్యామును జ్ఞాత దదౌహుని
కౌసల్యాయైన కైకేయ్యై అర్ధ మర్ధం ప్రయత్నిత:
తత సుమిత్రా సంప్రాప్తా జిగృధ్ను: పౌత్రి కంచరుం
కౌసల్యాతు స్వభాగార్ధందదౌతస్యైముదాన్వితా
కైకేయీచ స్వాభార్ధన్ దదౌ ప్రీతి సమన్వితా.
బాలకాండ
తృతీయ సర్గ
గ్రంధారంబముననే రావణుడు బ్రహ్మ కడకేగి తనకు మృత్యువు ఎట్లు కలుగునని ప్రశ్నించును. బ్రహ్మ కౌసల్యా దశరధుల కుమారుడైన శ్రీమన్నారాయణుడు రామనామ లక్షతుడు నిన్ను సంహరించునని చెప్పును.
కౌసల్యాదశరధుల వివాహమునకు విఘ్నము కావించుటకై రావణుడు కౌసల్య ను ఒక మందసమున నుంచి సముద్రమున విడుచును.
ఆ మందసము దశరధునకు లభింపగా ఆమెనాతడు గాంధర్వ విధిని వివాహమాడును. వారిని సంహరిప నెంచిన రావణుని బ్రహ్మ వారించును.
ధుంధుభి అను గంధర్వ కన్య మంధరగా జన్మించును.
సీత తురంగమునెక్కి ఆడునట్లు శివ ధనస్సు నెక్కి ఆడుచుండును.
రాముడు ధనస్సును నెక్కిడినట్లైన, పదునాలుగు వత్సరములు వనవసము చేయుదునని సీత మొక్కుకొనును.
సీత రత్నములుగా రావణునకు లభించును.రత్నములు పెట్టలో పెట్టగా బాలిక రూపముతో కాననగును.ఆ భరిణను పారవైచుటకై మండోదరి త్వర పెట్టును.
ఆ బాలికామణి మండోదరి తో నీ భర్తను సంహరింప తిరిగి వత్తును అనును.
సీత నాగేటి చాలులో కాక బ్రాహ్మణునకు పాతులో దొరుకును.
(మరిన్ని రామాయణాల విశేషాలు వచ్చే నెలలో )

No comments:

Post a Comment

Pages