ఆత్మ - అర్థములు, అపార్థములు; ఊహలు, అపోహలు - అచ్చంగా తెలుగు

ఆత్మ - అర్థములు, అపార్థములు; ఊహలు, అపోహలు

Share This
ఆత్మ - అర్థములు, అపార్థములు; ఊహలు, అపోహలు
డా. వారణాసి రామబ్రహ్మం 

ఆత్మ అనగానే ఎన్నో వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు. మరెన్నో ఊహలు, అపోహలు. 
తాము చదివి, మననం చేసికుని అర్థం చేసికున్నవారికన్నా, ఆ నోటా, ఈ నోటా విని, వారివి, వీరివి అభిప్రాయాలు చదివి, శంకరులని, రామానుజులని, రమణులని, కీర్తి కల తత్త్వవేత్తలని, మధ్వాచార్యులను ఉటంకిస్తూ తమ తమ అపార్థాలను విరివిగా ప్రచారం చేసే, తత్త్వానుశాసనము చేసే సామాన్యులు ఎక్కువ అయిపోయారు. 
బుద్ధిమంతులైన వారు కొట్లు (ఆశ్రమములు) పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు ఇహాన్ని సాధిస్తున్నారు.
"ఆత్మ" పదము భ్రష్టు పట్టి పోయింది. ఆత్మను భూతానికి పర్యాయముగ ఎన్నో టి.వి. సీరియళ్లు వాడుకొని మనల్ని భయకంపితులను చేస్తున్నాయి కూడా. 
ఆత్మ మరణ సమయంలో ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుందని ప్రాచుర్యంలో ఉన్న వ్యాఖ్య. 
భగవద్గీతలోని 
వాసాంసి జీర్ణాని యథా విహాయ 
నవాని గృహ్ణాతి నరో-పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ

ఈ శ్లోకాన్ని దీనికి వత్తాసుగా ఉటంకిస్తూ ఉంటారు. 
శరీరం మరణిస్తున్నప్పుడు ఆత్మ మరణిస్తున్న శరీరం వదిలి మరో కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుంది, ఆశ్రయిస్తుందని, ఈ ఉటంకింపు సారాంశం.
అలా అన్వయం చేసికొని సాంఖ్య యోగంలో వచ్చే ఈ పై శ్లోకాన్ని పరిమిత జ్ఞానం కల స్వాములు, ప్రవచనకారులు, ఇతర యతీంద్రులు, ఆనందాలు, అమ్మలు, బాబాలు తమ శక్తి కొద్దీ అపార్థం చేసుకుని ఆ అసత్యాన్ని తెలిసీ తెలియక
ప్రచారం చేస్తున్నారు. ఆత్మజ్ఞానం అభాసుపాలు అవుతోంది.

భగవద్గీత ఉపనిషత్తుల తరువాతది. ఉపనిషత్తుల సారాంశాన్ని, సారాన్ని వహించినది. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయాలి.
తత్త్వశాస్త్రంలో శరీరము అంటే శరీర స్పృహ. మనిషి తనను తాను సప్తధాతు నిర్మిత పశు, పక్ష్యాది శరీరములతో భావ రూపంలో అన్వయించుకునే మాంస, రక్తం, మజ్జ ఇత్యాది సప్తధాతు నిర్మిత ఆకారము కాదు.
శరీర స్పృహ అంతరించినపుడు, వెలుగుతూ ఉండే వెలుగు ఆత్మ. జ్ఞాతృ-జ్ఞేయ రహిత జ్ఞానము. ప్రజ్ఞానము. శుద్ధ గమనిక. నిర్మల మానసము. 
ఆ విధముగా శరీరము సప్తధాతు నిర్మిత ఆకారముగా ఇక్కడ ప్రస్తావించబడ లేదు. శరీర స్పృహ భావ రూపంలో అన్వయించుకోవడమే, ఉండడమే శరీరపు పుట్టుక. భావరూపంలో మొలకెత్తిన శరీర స్పృహ అదృశ్యం అవడమే శరీరం మరణించడం. 
ఇక్కడ పరమాత్మ శరీరము అంటే; సప్తధాతు నిర్మిత పశు శరీరాన్ని గురించి మాట్లాడటం లేదు. శరీర స్పృహ, దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ శరీరము అంటే భావ శరీరం. తలపు. మన జ్ఞానం, మానసిక కార్యక్రమాలు భావమయములు. ఈ భావములు చిత్ శక్తీ మయములు.
అలా భావములలో ఆత్మ చిత్ శక్తి రూపంలో అంతర్లీనంగా ఉంటుంది. 
మనకు భావములు, ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలా మారినప్పుడు మారేది తన్మాత్ర - తెలుసుకొనబడే
విషయ శక్తీ రూపం. అంతర్లీనంగా ఉండే ఆత్మ అలాగే ఉంటుంది. భావము, తలపు, ఆలోచన మారినప్పుడు మారేది తన్మాత్ర మాత్రమే. ఇలా భావ శరీరము మారినప్పుడు అహంకార రూపం మారుతుంది. ఆత్మశక్తీ నిర్మిత భావ రూప పరిణామాన్నే మరణ, పునర్ జన్మలు అంటారు.

భావములు మారినప్పుడల్లా, లయించి, పునరుత్థానం చెందినప్పుడల్లా - వ్యక్తిత్వ స్పృహ- శరీర స్పృహ - అహంకార, మమకార, అహంభావ - మరణ, జననములు సంభవిస్తాయి. ఇవే వ్యక్తి చావు పుట్టుకలు. వీటి గురించి మాత్రమే పై శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు.
సప్తధాతు నిర్మిత శరీర మరణ, పునర్ జన్మల గురించి కాదు.
మనం ఇంగితం, స్ఫూర్తి, స్ఫురణలతో అవగాహన కొచ్చి ఆకళింపయ్యే తత్త్వమే ఆత్మ. జిజ్ఞాస, శ్రవణం, మననం, నిదిధ్యాసనలతో కూడిన ఆధ్యాత్మిక చింతన పరుని చేరుస్తుంది. హరియో, హరుడో, మరే పరతత్త్వమైనా మనల ధ్యాన రతులజేసి, జ్ఞానులజేసి, ఆధ్యాత్మిక పరమ పద సోపానమధిరోహింపజేసి పరమపదాన్ని అందుకుని 
అందు వసిస్తూ, నిరామయంగా, నిరాకులంగా గృహస్థ విధ్యుక్త ధర్మముల నిర్వర్తిస్తూ చరమ క్షణములలో పరతత్త్వ మగ్నులమై పరమాత్మ యందు లీనమై ఇక్కడ లేకుండా పోవడమే సనాతన సాంప్రదాయ ధర్మము, ఉపదేశము.

ఆత్మ చిత్ శక్తి మూలము. మన గమనిక ఆత్మయే.
ఆత్మయే మన ఎఱుక. మనకు గమనిక, ఎఱుక కలిగించే దివ్యశక్తీ కాంతియే ఆత్మ. 
సమస్త సన్మంగలాని భవంతు!
ఏతత్ సర్వం పరబ్రహ్మార్పణమస్తు!

No comments:

Post a Comment

Pages