శ్రీ దత్తాత్రేయ వైభవం - 8
శ్రీరామభట్ల ఆదిత్య

13. పదమూడవ గురువు - సముద్రం:
సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కేవలం ప్రకృతి ప్రకోపించినప్పుడు తప్పించి అది సంవత్సరంలో ఎక్కవ సమయం ప్రశాంతంగానే ఉంటుంది. బాగా వర్షాలు పడి నదుల్లోని ఎక్కువగా నీరు చేరినా లేదా కరువు కోరల్లో చిక్కి నదులు ఎండినా సముద్రాల్లో నీరు పెరగదు, తరగదు.
అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా కానీ మహాత్ములు చలించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటారు. అలాంటి నిశ్చలతను అలవరచుకోవాలంటాడు దత్తాత్రేయుడు. అలాగే మహాత్ముల యొక్క ఙ్ఞానాన్ని కూడా పరీక్షించలేము. ఎందుకంటే సముద్రంలో దాగిన ముత్యాలు మనకు చూడగానే కనిపిస్తాయా ? ఓపికతో వెతికితే గానీ కనిపించవు. అలాగే మహాత్ముల సాంగత్యం ఫలం చేత వారి మనఃఙ్ఞానాన్ని మనం తెలుసుకోగలము.
14. పద్నాలగవ గురువు - మిణుగురు పురుగు:
మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది. అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు. అందుకే మనిషి కూడా తన కోరకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి.....
15. పదిహేనవ గురువు - ఏనుగు:
సాధారణంగా ఏనుగును చాలా విధాలుగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా తవ్విన ఒక పెద్ద గొయ్యిని ఆకులతో ఎవరూ గర్తుపట్టకుండా కప్పివేస్తారు. ఆ తరువాత గొయ్యి వెనకాల వైపు చెక్కతో చేసిన ఒక ఆడ ఏనుగును నిల్చోబెడతారు. అటు వెళుతున్న ఏ మగ ఏనుగైనా ఆ ఆడఏనుగు బొమ్మను చూసి ఆకర్షించబడి దాని దగ్గరకు వెళదామనుకొని ముందు గొయ్య ఉందని చూసుకోకుండా దానిలో పడిపోతుంది. ఇలా అంత పెద్ద ఏనుగు కూడా కామ వాంఛ చేత పట్టుపడిపోతుంది.
అలాగే మనిషి కూడా తన కామవాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్తాడు దత్తుడు. అలా కామవాంఛలను అదుపులో పెట్టకోకపోవటం చేతనే నేటి ప్రపంచంలో ఆడ పిల్లలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలా తన వాంఛలను అదుపులో పెట్టుకోలేనివాడు తన బాగుపడడు సరికదా ఇతరులను బాగా బతకనివ్వడు. తరువాత అనేకానేక బాధలను పడతాడు.
16. పదహారవ గురువు - జింక:
మంచి సంగీతానికి జింక వశమైపోతుందంటారు. జింకను పట్టుకోవటానికి వేటగాళ్ళు మంచి సంగీతాన్ని వాయించేవారట. ఆ సంగీతము విని మైమరిచి వేటగాడికి సులువుగా దొరుకిపోతుంది. అందుకని సాధకుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే సాధకుడనే జింక అరిషడ్వర్గాలనే వేటగాడికి చిక్కుతాడు. అలా అయితే భగవన్మార్గము కోసం మళ్ళీ ఎంతో వేచి ఉండాల్సి వస్తుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే నిగ్రహం, ఓపిక, భక్తి, ఆర్తి, ప్రేమ మొదలైనవి ముఖ్యంగా పరమాత్మ పైన నమ్మకం అత్యవసరం.....
17. పదిహేడవ గురువు - చేప:
చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.
18. పద్దెనిమిదవ గురువు - వేశ్య:
దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.
తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.
పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం....
(సశేషం) 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top